5వ భాగం
మ్యాజిక్, మంత్రాలు, క్షుద్రవిద్య గురించిన సత్యం
1. మ్యాజిక్‌ను, మంత్రాల్ని, క్షుద్రవిద్యను ప్రజలు ఎంతగా నమ్ముతున్నారు?
“ఆఫ్రికాలో ప్రజలు మ్యాజిక్‌ను నమ్ముతారా అనే ప్రశ్న అసలు అడగనక్కర్లేదు. ఎందుకంటే, అక్కడ దాదాపు అన్నిరకాల ప్రజలు దాన్ని నమ్ముతారు” అని ఆఫ్రికన్ ట్రెడిషనల్ రెలీజియన్ అనే పుస్తకం చెప్తుంది. మ్యాజిక్‌ను, మంత్రాల్ని, క్షుద్రవిద్యను నమ్మేవాళ్లలో బాగా చదువుకున్నవాళ్లు ఉన్నారు, అస్సలు చదువుకోనివాళ్లూ ఉన్నారు. అలాగే అటు ఇస్లాం మతపెద్దలు, ఇటు చర్చీ పెద్దలు కూడా వాటిని నమ్ముతున్నారు.
2. మ్యాజిక్ శక్తులు ఎక్కడ నుండి వస్తాయని చాలామంది నమ్ముతారు?
2 ఆఫ్రికాలో చాలామంది ప్రజలు మానవాతీత శక్తి ఏదో ఉందని, దాన్ని దేవుడు అదుపు చేస్తున్నాడని నమ్ముతారు. చనిపోయినవాళ్ల ఆత్మలు ఆ శక్తిని ఉపయోగించగలవని వాళ్లు అనుకుంటారు. కొంతమంది మనుషులకు కూడా దాన్ని ఉపయోగించడం తెలుసని వాళ్లు నమ్ముతారు. మంచి చేయడానికి ఉపయోగిస్తే దాన్ని వైట్ మ్యాజిక్ అని, చెడు చేయడానికి ఉపయోగిస్తే దాన్ని బ్లాక్ మ్యాజిక్ అని అంటారు.
3. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? దాని గురించి ప్రజలు ఏం నమ్ముతారు?
3 బ్లాక్ మ్యాజిక్ అనేది, మనకు గిట్టనివాళ్ల మీద ఉపయోగించేది. బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్లకు గబ్బిళాలను, పక్షుల్ని, ఈగల్ని, జంతువుల్ని ఇతరుల మీదకు ఉసిగొల్పే శక్తి ఉంటుందని ప్రజలు నమ్ముతారు. అంతేకాదు గొడవలకు, పిల్లలు పుట్టకపోవడానికి, రోగాలకు, ఆఖరికి మరణానికి కూడా కారణం బ్లాక్ మ్యాజిక్కే అని చాలామంది నమ్ముతారు.
4. మంత్రగత్తెల గురించి చాలామంది ఏం నమ్ముతున్నారు? గతంలో మంత్రవిద్య అభ్యసించి దాన్ని మానేసినవాళ్లు ఏమని చెప్తున్నారు?
4 క్షుద్రవిద్య లేదా మంత్రవిద్య కూడా అలాంటిదే. మంత్రగత్తెలు రాత్రిపూట వాళ్ల శరీరాల్ని వదిలేసి, ఎగురుకుంటూ వేరే మంత్రగత్తెల్ని కలవడానికి వెళ్తారని లేదా ప్రజలకు హాని చేస్తారని చాలామంది నమ్ముతారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు గానీ, గతంలో మంత్రవిద్య అభ్యసించి దాన్ని మానేసిన కొంతమంది మాత్రం అలా చెప్తున్నారు. ఉదాహరణకు, గతంలో మంత్రవిద్య అభ్యసించినవాళ్లు (ఎక్కువ శాతంమంది టీనేజీ అమ్మాయిలే) ఇలా చెప్పారని ఒక ఆఫ్రికా పత్రికలో వచ్చింది: “నేను యాక్సిడెంట్ల ద్వారా 150 మందిని చంపాను.” “నేను ఐదుగురు పిల్లల్ని వాళ్ల రక్తమంతా తాగేసి చంపేశాను.” “నా ప్రేమ ఒప్పుకోలేదని నేను ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ని చంపేశాను.”
5. వైట్ మ్యాజిక్ అంటే ఏంటి? దాన్నెలా ఉపయోగిస్తారు?
5 కీడు జరగకుండా కాపాడడానికి ఉపయోగించేదే వైట్ మ్యాజిక్ అని ప్రజలు నమ్ముతారు. వైట్ మ్యాజిక్‌ను ఉపయోగించేవాళ్లు మంత్రతంత్రాలకు సంబంధించిన ఉంగరాల్ని లేదా కడియాల్ని పెట్టుకుంటారు. కీడు జరగకుండా కాపాడే మందును తాగుతారు లేదా ఒంటికి రాసుకుంటారు. కీడు జరగకుండా కాపాడే వస్తువుల్ని వాళ్లు తమ ఇంట్లో గానీ, నేలలో గానీ దాచిపెడతారు. ఖురాన్ లేదా బైబిలు నుండి తీసుకున్న మాటలున్న తాయెత్తుల్ని వాళ్లు కట్టుకుంటారు.
అబద్ధాలు, మోసం
6. సాతాను, అతని చెడ్డదూతలు ఏం చేయగలరు? వాళ్ల శక్తిని మనం ఎలా అంచనా వేయాలి?
6 సాతాను, అతని చెడ్డదూతలు మనుషులకు చాలా ప్రమాదకరమైన శత్రువులు. వాళ్లు మనుషుల ఆలోచనల్ని, జీవితాల్ని ప్రభావితం చేయగలరు. అలాగే మనుషుల్లోకి, జంతువుల్లోకి ప్రవేశించి వాళ్లను అదుపు చేయగలరు. (మత్తయి 12:43-45) అయితే, వాళ్ల శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు, అలాగని మరీ ఎక్కువ అంచనా కూడా వేయకూడదు.
7. సాతాను మనల్ని ఏమని నమ్మించాలి అనుకుంటున్నాడు? ఒక ఉదాహరణ చెప్పండి.
7 సాతాను మోసం చేయడంలో దిట్ట. అతను ప్రజల్ని భ్రమపెట్టి తనకు ఎక్కువ శక్తి ఉందని చూపించుకోవాలి అనుకుంటున్నాడు. కానీ, నిజానికి అతనికి అంత లేదు. ఉదాహరణకు: ఈమధ్య ఒక ఆఫ్రికా దేశంలో, సైనికులు శత్రువుల్ని భయపెట్టడానికి సౌండ్ పరికరాల్ని ఉపయోగించారు. యుద్ధం మొదలుపెట్టే ముందు, సైనికులు తమ దగ్గర పెద్దపెద్ద యుద్ధ యంత్రాలు ఉన్నట్టు, ఆయుధాలు ఉన్నట్టు ఆడియో రికార్డింగ్‌లు వినిపించేవాళ్లు. శత్రువులు అది విని, అవతలివాళ్ల దగ్గర ఎన్నో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని దడుచుకోవాలని వాళ్ల ఉద్దేశం. అదేవిధంగా, సాతాను తనకు అనంతమైన శక్తి ఉందని ప్రజల్ని నమ్మించాలి అనుకుంటున్నాడు. ప్రజల్ని భయపెట్టి, యెహోవా ఇష్టం కాకుండా తన ఇష్టం చేపించాలన్నదే అతని ఉద్దేశం. సాతాను ప్రజల్ని నమ్మించాలని అనుకుంటున్న మూడు అబద్ధాలేంటో ఇప్పుడు చూద్దాం.
8. సాతాను నమ్మించే ఒక అబద్ధం ఏంటి?
8 సాతాను నమ్మించే ఒక అబద్ధం ఏంటంటే: ఏదీ కారణం లేకుండా జరగదు; కీడు జరిగిందంటే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి పనే అయ్యుంటుంది, అది నేరుగా గానీ మ్యాజిక్ ద్వారా గానీ. ఉదాహరణకు, ఒక పిల్లవాడు మలేరియా వచ్చి చనిపోయాడు అనుకుందాం. దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుందని ఆ పిల్లవాడి తల్లికి తెలిసి ఉండవచ్చు. కానీ, దోమను పంపించి ఆ పిల్లవాడిని కుట్టేలా ఎవరో చేతబడి చేశారని ఆమె అనుకోవచ్చు.
9. ప్రతీ సమస్యకు సాతానే కారణం కాదని బైబిలు ఎలా చూపిస్తుంది?
9 కొన్ని సమస్యలకు సాతానే కారణమైనా, ప్రతీ సమస్యకు సాతానే కారణం అని అనుకోవడం సరైనది కాదు. ఎందుకంటే, బైబిలు ఇలా చెప్తుంది: “వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు, బలవంతులు అన్నిసార్లూ యుద్ధంలో గెలవరు, తెలివిగలవాళ్లకు అన్నిసార్లూ ఆహారం దొరకదు, మేధావులకు అన్నివేళలా సంపదలు ఉండవు, జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు; ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి.” (ప్రసంగి 9:11) పరుగు పందెంలో ఒక వ్యక్తి అందరికంటే వేగంగా పరిగెడుతుండవచ్చు, కానీ అతను గెలవకపోవచ్చు. ఎందుకంటే, కొన్ని “అనుకోని సంఘటనల” వల్ల అతను ఓడిపోవచ్చు. ఉదాహరణకు అతను కింద పడిపోవచ్చు, నీరసించిపోవచ్చు, లేదా కండరం పట్టేయవచ్చు. ఇవి ఎవరికైనా జరగవచ్చు. అంతేగానీ ఇవన్నీ సాతాను వల్లో చేతబడి వల్లో జరిగాయనుకోవడం తప్పు; కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అంతే.
10. మంత్రగత్తెల గురించి సాతాను ఏం చెప్తున్నాడు? అది అబద్ధమని మనకెలా తెలుసు?
10 సాతాను నమ్మించే రెండో అబద్ధం ఏంటంటే: మంత్రగత్తెలు రాత్రిపూట తమ శరీరాలు విడిచి వేరే మంత్రగత్తెల్ని కలవడానికి వెళ్తారు. లేదా తమ బారినపడినవాళ్లను చంపడానికి లేదా వాళ్ల రక్తం తాగడానికి వెళ్తారు. కానీ ఆలోచించండి: ‘అదెలా సాధ్యం? మంత్రగత్తెలు వాళ్ల శరీరాల్ని విడిచి ఎలా వెళ్లగలరు?’ మనం ముందటి పాఠాల్లో నేర్చుకున్నట్టు, మనిషి శరీరం నుండి వేరైపోయే ఆత్మ అంటూ ఏదీ లేదు.
11. మంత్రగత్తెలు వాళ్ల శరీరాల్ని విడిచి బయటికి వెళ్లలేరని మనకు ఎలా తెలుసు? దాన్ని మీరు నమ్ముతున్నారా?
11 మన శరీరాన్ని విడిచి బయటికి వెళ్లే ఆత్మ అంటూ ఏదీ ఉండదు. అది మంచి చేయడానికైనా, చెడు చేయడానికైనా సరే. కాబట్టి, మంత్రగత్తెలు శరీరాల్ని విడిచి బయటికి వెళ్లలేరు. వాళ్లు చేశామని చెప్పుకుంటున్నవి గానీ, లేదా చేశామని అనుకుంటున్నవి గానీ నిజంగా వాళ్లు చేయలేదు.
12. తాము చేయనిది చేసినట్టు నమ్మేలా సాతాను ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు?
12 కొంతమంది మంత్రగత్తెలేమో మేము అలా చేశాం, ఇలా చేశామని చెప్తున్నారు కదా. మరి దాని సంగతేంటి? ప్రజలు తాము చేయనిది చేసినట్టు భ్రమపడేలా సాతాను నమ్మించగలడు. కలల ద్వారా తాము విననిది విన్నట్టు, చూడనిది చూసినట్టు, చేయనిది చేసినట్టు ఊహించుకునేలా సాతాను ప్రజల్ని నమ్మించగలడు. ఈ విధంగా ప్రజల్ని యెహోవా నుండి దూరం చేయడం, బైబిలు చెప్పేది తప్పని నమ్మించడం సాతాను ఉద్దేశం.
13. (ఎ) వైట్ మ్యాజిక్ మంచిదేనా? (బి) మ్యాజిక్ గురించి బైబిలు ఏం చెప్తుంది?
13 మూడో అబద్ధం ఏంటంటే: వైట్ మ్యాజిక్ మంచిదే, ఎందుకంటే అది బ్లాక్ మ్యాజిక్ వల్ల కలిగే కీడు నుండి మనల్ని కాపాడుతుంది. కానీ బైబిలు బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అని తేడాలేమీ చెప్పట్లేదు. అన్నిరకాల మ్యాజిక్ తప్పే అని చెప్తుంది. మ్యాజిక్ గురించి, దాన్ని చేసేవాళ్ల గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏ నియమాలు ఇచ్చాడో గమనించండి:
-
“మీరు … ఇంద్రజాలం చేయకూడదు.”—లేవీయకాండం 19:26.
-
“చనిపోయినవాళ్లను సంప్రదించే లేదా భవిష్యత్తు చెప్పే ఏ పురుషుడినైనా, స్త్రీనైనా ఖచ్చితంగా చంపేయాలి.”—లేవీయకాండం 20:27.
-
“ఇలాంటివాళ్లు నీ మధ్య ఉండకూడదు: … ఇంద్రజాలం చేసేవాడు, శకునాలు చూసేవాడు, మంత్రగాడు, మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, చనిపోయినవాళ్లతో మాట్లాడేవాణ్ణి … సంప్రదించేవాడు.”—ద్వితీయోపదేశకాండం 18:10-14.
14. మ్యాజిక్ చేయకూడదని యెహోవా ఎందుకు చెప్పాడు?
14 యెహోవా పెట్టిన నియమాలు, తన ప్రజలు మ్యాజిక్ చేయకూడదని ఆయన కోరుకుంటున్నట్టు స్పష్టంగా చూపించాయి. యెహోవా తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే వాళ్లు మూఢనమ్మకాలకు-భయానికి బానిసలు అవ్వకూడదని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆ నియమాలు ఇచ్చాడు. అంతేకాదు, తన ప్రజలు చెడ్డదూతల చేత పీడించబడకూడదనే ఉద్దేశంతో కూడా ఆయన ఆ నియమాలు ఇచ్చాడు.
15. సాతాను కంటే యెహోవా ఎక్కువ శక్తిమంతుడని బైబిలు ఎలా చెప్తుంది?
15 సాతాను-అతని చెడ్డదూతలు ఏం చేయగలరు, ఏం చేయలేరు అనే విషయాల గురించి బైబిలు పూసగుచ్చినట్లు చెప్పట్లేదు గానీ, యెహోవా వాళ్లకంటే చాలా శక్తిమంతుడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, యెహోవా సాతానును పరలోకం నుండి గెంటేశాడు. (ప్రకటన 12:9) అంతేకాదు, యోబును పరీక్షించడానికి సాతాను యెహోవా దగ్గర అనుమతి తీసుకున్నాడు. అలాగే, యోబును చంపకూడదని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సాతాను లోబడ్డాడని గమనించండి.—యోబు 2:4-6.
16. మనం రక్షణ కోసం ఎవరివైపు చూడాలి?
16 సామెతలు 18:10 ఇలా చెప్తుంది: “యెహోవా పేరు బలమైన బురుజు. నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు.” కాబట్టి, మనం రక్షణ కోసం యెహోవా వైపు చూడాలి. దేవుని సేవకులు సాతాను, అతని చెడ్డదూతలు చేసే కీడు నుండి తమను కాపాడుకోవడానికి తాయెత్తుల వైపు, భూతవైద్యుడు ఇచ్చే మందుల వైపు చూడరు. అలాగే, మంత్రగాళ్లు తమమీద ప్రయోగించే మంత్రాలకు వాళ్లు భయపడరు. బదులుగా, దేవుని సేవకులు బైబిలు చెప్తున్న ఈ మాటల్ని నమ్ముతారు: “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించడానికి యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి.”—2 దినవృత్తాంతాలు 16:9.
17. యాకోబు 4:7 మనకు ఏ అభయాన్ని ఇస్తుంది? అయితే మనం ఏం చేయాలి?
17 మీరు యెహోవాను సేవిస్తుంటే, ఈ మాటల మీద మీరు కూడా నమ్మకం ఉంచవచ్చు. యాకోబు 4:7 ఇలా చెప్తుంది: “మీరు దేవునికి లోబడివుండండి; అపవాదిని ఎదిరించండి, అప్పుడు అతను మీ దగ్గర నుండి పారిపోతాడు.” మీరు నిజమైన దేవుణ్ణి అంటే యెహోవాను ఆరాధిస్తూ ఆయనకు లోబడివుంటే, ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడనే నమ్మకంతో ఉండవచ్చు.