కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (1వ భాగం)

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (1వ భాగం)

 మీకు తెలిసిన అమ్మాయి/అబ్బాయి ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీకున్న ఏదైనా అనారోగ్యం లేక లోపం వల్ల మీ వయసులో ఉన్న ఇతరులు చేయగలిగిన కొన్ని పనులు మీరు చేయలేకపోతున్నారా?

 అలాగైతే మీరు కొన్నిసార్లు నిరుత్సాహపడడం సహజమే. అయితే మీ బాధను తగ్గించే రెండు మంచి విషయాలను బైబిలు చెప్తుంది.

  •   మిమ్మల్ని సృష్టించిన యెహోవా దేవునికి మీ పరిస్థితి ఏంటో తెలుసు. అంతేకాదు “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు.”—1 పేతురు 5:7.

  •   అనారోగ్యం అస్సలు లేకుండా చేయడమే యెహోవా దేవుని ఉద్దేశం. మీరు ఈ విషయాన్ని బైబిల్లో యెషయా 33:24, ప్రకటన 21:1-4లో చదవొచ్చు.

 అనారోగ్యంతో బాధపడే చాలామంది యౌవనులు దేవుని మీద ఆయన మాట మీద ఉన్న నమ్మకం వల్ల దాన్ని తట్టుకొని జీవించగలుగుతున్నారు. నాలుగు ఉదాహరణలు గమనించండి.

 యామీ

 నాకు పదకొండేళ్లు వచ్చేసరికి ఎక్కడికైనా వెళ్లాలంటే చక్రాల కుర్చీ అవసరమయ్యేది. తేలిగ్గా ఉండే వస్తువులను ఎత్తడం లాంటి చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోయేదాన్ని.

 ఐదేళ్లు ఉన్నప్పుడు నాకు మస్క్యులర్‌ డిస్‌ట్రొఫీ అనే జబ్బు బయటపడింది. శరీరంలో కండంతా మెల్లమెల్లగా కరిగిపోవడం ఆ జబ్బు లక్షణం. దాని వల్ల నేను ఏ పనీ చేయలేను. నా తోటివాళ్లలా పనులేవీ చేయలేకపోతున్నానని కొన్నిసార్లు నిరుత్సాహపడతాను. కానీ మా అమ్మానాన్నలు, మా సంఘంలోని వాళ్లు నాకు శారీరకంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తారు. నేను పూర్తికాల సేవ చేస్తున్నాను. ఆసక్తి చూపించే వాళ్లకు బైబిలు స్టడీలు చేయడానికి వెళ్తున్నప్పుడు తరచూ తోటి క్రైస్తవులు నాకు తోడుగా వస్తారు.

 ఏ రోజు చింతలు ఆ రోజే ఉంటాయి అని యేసు చెప్పాడు. (మత్తయి 6:34) కాబట్టి నేను రేపటి గురించి చింత పడకుండా ఏ రోజు గురించి ఆ రోజే ఆలోచిస్తాను. నిజ జీవితంలో చేరుకోగలిగే, సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుంటాను. దేవుని కొత్త లోకంలో “వాస్తవమైన జీవితం” కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నన్ను మెల్లమెల్లగా బలహీనం చేసే ఈ జబ్బు ఉండదు.—1 తిమోతి 6:19.

 ఆలోచించండి: “సాధించగల లక్ష్యాలను పెట్టుకోవడం” వల్ల యామీకి మంచి ప్రయోజనం కలిగింది. ఆమెలా మీరు ఏమి చేయవచ్చు?—1 కొరింథీయులు 9:26.

 మాటో

 నాకు ఆరేళ్ల వయసున్నప్పుడు నా వెన్నుపూస భాగమంతా చాలా నొప్పిగా ఉండేది. ఎదుగుతున్న వయసు కాబట్టి ఆ నొప్పులు వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. కానీ ఒక సంవత్సరం తర్వాత నాకు వెన్నుపూస దగ్గర ట్యూమర్‌ ఉన్నట్లు గుర్తించారు.

 నాకు ఆపరేషన్‌ చేశారు కానీ ట్యూమర్‌లో 40 శాతం మాత్రమే తీసేయగలిగారు. ఆ తర్వాత రెండు నెలలు తిరిగే సరికి ట్యూమర్‌ మళ్లీ యథాస్థాయికి పెరిగిపోయింది. అప్పటి నుండి నేను చాలా పరీక్షలు, ట్రీట్‌మెంట్లు చేయించుకున్నాను. అవేవి ఫలించక చాలా నిరుత్సాహపడ్డాను.

 కొన్నిసార్లు ఆ ట్యూమర్‌ వల్ల నా ఒళ్లంతా, మరిముఖ్యంగా నా వెన్నుపూస, ఛాతి భాగంలో కత్తి పెట్టి పొడుస్తున్నట్లు అనిపించేది. కానీ ఆ అనారోగ్యం నన్ను మింగేయకుండా చూసుకున్నాను. ఇతరులు కూడా చాలా తీవ్రమైన బాధలను సహించారని, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్లు ఎక్కువగా కృంగిపోలేదని గుర్తుచేసుకున్నాను. ఏదోఒకరోజు ఇచ్చిన మాట ప్రకారం యెహోవా ఈ బాధలన్నిటినీ తీసేస్తాడు. ఈ నమ్మకమే నేను కూడా వాళ్లలాగే కృంగిపోకుండా ఉండడానికి నాకు బాగా సహాయం చేసింది.—ప్రకటన 21:4.

 ఆలోచించండి: బాధలన్నిటినీ తీసేస్తానని యెహోవా మాటిచ్చాడు. దీని గురించి ఆలోచిస్తూ మాటో తన బాధల్ని సహించగలిగాడు. మరి ఈ ఆలోచన మీకెలా సహాయం చేయగలదు?—యెషయా 65:17.

 బ్రూనా

 నా జబ్బు లక్షణాలేవీ పైకి కనిపించకపోయేసరికి కొంతమంది నేను బద్ధకస్థురాల్ని అనుకునేవాళ్లు. ఇంటి పనులు, చదువుకోవడం, ఆఖరికి మంచం మీద నుంచి లేవడం కూడా,నాకు కష్టంగా ఉండేది.

 నాకు పదహారేళ్లు ఉన్నప్పుడు మల్టిపుల్‌ క్లెరోసిస్‌ అనే జబ్బు వచ్చింది. ఆ జబ్బు క్రమేణా పెరుగుతూ శరీరాన్ని బలహీనపరుస్తుంది. దాని వల్ల నేను పని చేయలేకపోవడమే కాదు నా ఆసక్తికి తగ్గట్టుగా క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోయేదాన్ని. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని 1 పేతురు 5:7 చెప్తున్న మాటల్ని పదేపదే చదివేదాన్ని. యెహోవా మనలో ప్రతీ ఒక్కళ్లనీ పట్టించుకుంటాడనే ఆలోచన, నాకెంతో బలాన్ని ఇస్తుంది. నేను ఈ రోజు వరకూ అలాగే బలాన్ని పొందుతున్నాను.

 ఆలోచించండి: బ్రూనాలాగే మీ చింతలన్నీ యెహోవా మీద వేయడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందవచ్చు?—కీర్తన 55:22.

 ఆండ్రే

 కొంతమంది నన్ను 10 ఏళ్ల పిల్లాడిలా చూస్తారు. నేను వాళ్లను తప్పుపట్టను, ఎందుకంటే చూడడానికి నేను అలాగే ఉంటాను.

 నాకు రెండేళ్లు ఉన్నప్పుడు చాలా కొద్దిమందికే వచ్చే ఒక విధమైన క్యాన్సర్‌ నాకు వచ్చింది. అది నా వెన్నుపూసలో మొదలై మెదడు వరకూ పాకింది. డాక్టర్లు ఆ జబ్బునైతే నయం చేయగలిగారు గానీ నా ఎదుగుదల మాత్రం ఆగిపోయింది. ఇప్పుడు నా ఎత్తు 4 అడుగుల 6 అంగుళాలు. నాకు 18 ఏళ్లు అని చెప్పినప్పుడు చాలామంది నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు.

 క్రైస్తవ సంఘంలో నన్ను చాలా గౌరవంగా చూస్తారు. నేను స్కూలుకు వెళ్లేటప్పుడు నాతో ఉన్న పిల్లలు జోకులు వేసి నన్ను అల్లరి చేసినట్టు ఇక్కడ చేయరు. నా పరిస్థితి గురించి నేను బాధపడను, ఎందుకంటే ఏ మనిషి జీవితంలోనైనా జరిగే అత్యంత గొప్ప సంగతి నాకూ జరిగింది. నేను యెహోవా గురించి తెలుసుకున్నాను. నేను ఏ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా యెహోవా నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని నాకు తెలుసు. యెహోవా మాటిచ్చిన ఆ అద్భుతమైన కొత్త లోకం గురించి ఆలోచించినప్పుడు నేను నా పరిస్థితి గురించి ఎక్కువగా బాధపడను.—యెషయా 33:24.

 ఆలోచించండి: ఆండ్రే చెప్తునట్టు యెహోవాను తెలుసుకోవడం ఎందుకు, “ఓ మనిషి జీవితంలో జరిగే అత్యంత గొప్ప సంగతి”?—యోహాను 17:3.