యువత అడిగే ప్రశ్నలు
నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (2వ భాగం)
రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
కొంతమందిలో అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు బయటకు కనిపిస్తే, ఇంకొంతమందికి బయటకు కనిపించకుండా లోపలినుండే కృంగదీస్తాయి.
కొన్ని ఆరోగ్య సమస్యలు “తాత్కాలికంగా” అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి, కానీ కొన్ని మాత్రం వచ్చాయంటే “ఎప్పటికీ” మనతోనే ఉంటూ ప్రతీరోజు మనకు సమస్యలు తెచ్చిపెడతాయి.
కొన్నిటిని నయం చేసుకోవచ్చు లేదా తట్టుకోవచ్చు, కానీ కొన్ని మాత్రం రోజురోజుకీ ఎక్కువవుతూ ఒక్కోసారి ప్రాణానికే ముప్పుగా మారవచ్చు.
ఇక్కడ చెప్పిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలను యువత ఎదుర్కొంటున్నారు. అలాంటి సమస్యలున్న నలుగురి గురించి మీరు ఈ ఆర్టికల్‌లో చదవుతారు. మీకు కూడా ఏదైనా అనారోగ్యం ఉంటే వాళ్ల మాటలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి.
గెనాయెల్
నేను అన్ని పనులూ చేయలేనన్న విషయం నన్ను బాగా బాధపెడుతుంది. నాకు చాలా పనులు చేయాలని ఉంటుంది కానీ, ప్రతీరోజు నేను నా పరిస్థితికి తగ్గట్టు నడుచుకోవాల్సిందే.
నా మెదడు ఇచ్చే సమాచారం శరీరానికి సరిగ్గా అందదు. నాకున్న ఈ సమస్యను మోటర్-న్యూరోమస్కులర్ డిజార్డర్ అంటారు. తల నుంచి పాదాల వరకూ నా శరీరంలోని వివిధ భాగాలు కొన్నిసార్లు వణుకుతాయి లేదా అస్సలు పనిచేయవు. కదలడం, మాట్లాడడం, చదవడం, రాయడం, ఇతరులు మాట్లాడేవాటిని అర్థం చేసుకోవడం లాంటి అందరూ చేసే పనులు కూడా నాకు కష్టంగా ఉంటాయి. పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మా సంఘపెద్దలు నాతో కూడా ప్రార్థన చేస్తారు. అలా వాళ్లు ప్రార్థన చేసిన వెంటనే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది.
నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా యెహోవా దేవుడు నన్ను ఎప్పుడూ కాపాడతాడని నాకు అనిపిస్తుంది. అనారోగ్యం కారణంగా నేను ఆయన్ని పూర్తిగా సేవించకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. త్వరలోనే యెహోవా దేవుడు భూమిని పరదైసుగా మారుస్తాడని, ఇక బాధలే ఉండవని బైబిలు మాటిస్తుంది. దీని గురించి ఇతరులు నేర్చుకునేలా సహాయం చేయడమే నా ముందున్న లక్ష్యం.—ప్రకటన 21:1-4.
ఆలోచించండి: గెనాయెల్‌లాగే మీరు కూడా ఇతరులపట్ల మీకున్న కనికరాన్ని ఏయే విధాలుగా చూపించవచ్చు?—1 కొరింథీయులు 10:24.
జాకరీ
16 ఏళ్లు ఉన్నప్పుడు నాకొక తీవ్రమైన మెదడు క్యాన్సర్ వచ్చింది. నేను ఇక ఎనిమిది నెలలే బ్రతుకుతానని డాక్టర్లు చెప్పారు. అప్పటినుండి నేను ప్రాణాలతో ఉండడానికి పెద్ద పోరాటమే చేస్తున్నాను.
ట్యూమర్ల కారణంగా నా శరీరంలో కుడి భాగం మొత్తం అస్సలు పనిచేసేది కాదు. నేను నడవలేనందువల్ల ఎక్కడికి వెళ్లాలన్నా నాకు సహాయం అవసరమయ్యేది. అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు నాతోపాటు ఇంటిదగ్గర ఉండాల్సి వచ్చేది.
నా జబ్బు పెరిగేకొద్దీ ఇతరులతో స్పష్టంగా మాట్లాడలేకపోయేవాణ్ణి. నేను వాటర్‌స్కీయింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ లాంటి ఆటల్ని చాలా ఉత్సాహంగా ఆడేవాణ్ణి. అంతేకాదు యెహోవాసాక్షిగా క్రైస్తవ పరిచర్య కూడా అంతే ఉత్సాహంగా చేసేవాణ్ణి. బాగా ఇష్టపడేవాటిని చేయలేకపోతుంటే కలిగే బాధ ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు.
యెషయా 57:15 లోని మాటలు నాకు చాలా ప్రోత్సాహంగా అనిపిస్తాయి, ఎందుకంటే ‘నలిగినవారి ప్రాణమును’ యెహోవా దేవుడు సేదదీరుస్తాడని, ఆయనకు నేనంటే శ్రద్ధ ఉందని ఆ మాటలు నాకు భరోసానిస్తాయి. అలాగే నేను మళ్లీ నడవగలనని, మంచి ఆరోగ్యంతో ఆయన్ని సేవించగలనని కూడా యెషయా 35:6 లో యెహోవా మాటిస్తున్నాడు.
కొన్నిసార్లు అనారోగ్యంతో పోరాడడం నాకు చాలా కష్టంగా అనిపించినా, యెహోవా తోడున్నాడనే భరోసా నాకు ఉంది. కృంగిపోతున్నా, ప్రాణం పోతుందేమోనని భయం వేసినా ప్రార్థన ద్వారా నేను ఏ సమయంలోనైనా ఆయనతో మాట్లాడవచ్చు. యెహోవా ప్రేమను పొందకుండా నన్ను ఏదీ అడ్డుకోలేదు.—రోమీయులు 8:39.
18 ఏళ్ల వయసులో, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన రెండు నెలలకే జాకరీ చనిపోయాడు. భూపరదైసులో మళ్లీ పునరుత్థానం చేస్తానని దేవుడు ఇచ్చిన మాటను చివరివరకూ బలంగా నమ్మాడు.
ఆలోచించండి: జాకరీలాగే మీరు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రార్థన ఎలా సహాయం చేయగలదు?
అనాయీస్
నేను పుట్టిన కొద్ది రోజులకే నా మెదడులో రక్తం గడ్డ కట్టింది. అది నా శరీరం అంతటి మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. మరిముఖ్యంగా నా కాళ్లమీద.
ఇప్పుడు నేను చేతికర్రల సహాయంతో కాస్త దూరం నడవగలను కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం చెక్రాలకుర్చీ కావల్సిందే. నా కండరాలు బిగిసుకుపోయినందువల్ల, రాయడం లాంటి పనులు నాకు చాలా కష్టం.
ఈ పరిస్థితి నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసింది. దీనికి తోడు నా చికిత్స ఒక సవాలుగా మారింది. నాకు గుర్తున్నంతవరకూ వారానికి చాలాసార్లు నాకు ఫిజియోథెరపీ చేసేవాళ్లు. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు మొదటిసారిగా ఒక పెద్ద సర్జరీ చేశారు. ఆ తర్వాత మరో మూడు సర్జరీలు కూడా చేశారు. కానీ చివరి రెండు సర్జరీలు బాగా బాధపెట్టాయి ఎందుకంటే సర్జరీ పూర్తయి కోలుకునేటప్పుడు మూడు నెలలపాటు నేను ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
మా కుటుంబమంతా నాకు చాలా సహాయం చేశారు. మేమందరం కలిసి సంతోషంగా నవ్వుకుంటాం. కృంగిపోతున్న సమయంలో ఇది నాకు ఊరటనిస్తుంది. నాఅంతట నేనే రెడీ అవ్వలేను కాబట్టి మా అమ్మ, చెల్లెళ్లు నన్ను చక్కగా తయారు చేసేవాళ్లు. ఎత్తు చెప్పులు వేసుకోలేనందుకు నేను బాధపడేదాన్ని. కానీ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక్కసారి వాటిని వేసుకోగలిగాను. కాకపోతే ఆ ఎత్తుచెప్పుల్ని నా చేతులకు వేసుకొని నేలమీద పాకుతూ అలా చేశాను. దానికి మేమందరం చాలా నవ్వుకున్నాం.
నా జీవితం ఎలా ఉండాలి, నేనేం చేయాలి అనే విషయాల్ని నా అనారోగ్యం ఆధారంగా నిర్ణయించుకోను. నేను కొత్త భాషలు నేర్చుకుంటాను. నేను మంచు మీద జారుతూ ఆడుకోలేను కాబట్టి దానికి బదులు ఈత కొడతాను. ఒక యెహోవాసాక్షిగా పరిచర్య చేయడానికి బయటకు వెళ్లి, నా నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చాలా శ్రద్ధగా వింటున్నారని నాకు అనిపిస్తుంది.
నాకు ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదని మా అమ్మానాన్నలు నాకు మొదట్లోనే చెప్పారు. అప్పటినుండి యెహోవా మీద, నా బాధతో సహా ఇప్పుడున్న బాధలన్నిటినీ తీసేస్తానని ఆయన ఇచ్చిన మాట మీద, నాకు నేనే బలమైన నమ్మకాన్ని పెంచుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఇది నాకు శక్తినిస్తుంది.—ప్రకటన 21:3, 4.
ఆలోచించండి: “మీ అనారోగ్యం ఆధారంగా మీ జీవితాన్ని నిర్ణయించకోకండి.” అనాయీస్‌లాగే మీరు కూడా దీన్ని ఏయే విధాలుగా చేయవచ్చు?
జూల్యానా
నా శరీరంలో వ్యాధిని తట్టుకునే శక్తికి సంబంధించి ఒక ఘోరమైన జబ్బుంది. నా గుండె, ఊపిరితిత్తులు, రక్తాన్ని కూడా అది పాడుచేయగలదు. దానివల్ల ఇప్పటికే నా కిడ్నీలు పాడైపోయాయి.
నాకు పదేళ్లు ఉన్నప్పుడు లూపస్ అనే జబ్బు వచ్చింది. దానివల్ల నొప్పులు, తీవ్రమైన నీరసం ఉండేవి. నా మూడ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో నాకే తెలిసేది కాదు. అప్పుడప్పుడూ నేను ఎందుకూ పనికిరానని నాకు అనిపించేది.
నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఒక యెహోవాసాక్షి మా ఇంటికి వచ్చారు. “నీకు తోడైయున్నాను భయపడకుము . . . . నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని యెషయా 41:9, 10 లో యెహోవా చెప్తున్న మాటలు ఆమె నాకు చదివి వినిపించింది. ఇక అప్పుడే నేను యెహోవాసాక్షులతో కలిసి బైబిలు చదవడం మొదలుపెట్టాను. ఎనిమిది ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ్ల నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా సేవిస్తూ, అనారోగ్యం నా జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేయకుండా చూసుకున్నాను. యెహోవా నాకు “మహత్తరశక్తి” ఇచ్చాడని అనిపిస్తుంది. అందువల్ల నేను కృంగిపోకుండా భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించగలుగుతున్నాను.—2 కొరింథీయులు 4:7 (విత్ర గ్రంథము, కతోలిక అనువాదము).
ఆలోచించండి: జూల్యానాలాగే మీరు కూడా మంచి ఆశతో జీవించడానికి యెషయా 41:9, 10 మీకెలా సహాయం చేయగలదు?