యువత అడిగే ప్రశ్నలు
నేను బాప్తిస్మం తీసుకోవాలా?—3వ భాగం: బాప్తిస్మం తీసుకోకుండా ఏది నన్ను అడ్డుకుంటుంది?
యెహోవాకు సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచిస్తే మీకు కంగారుగా ఉంటుందా? మీ భయాలు పోగొట్టుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
ఈ ఆర్టికల్‌లో ...
బాప్తిస్మం తీసుకున్నాక ఏదైనా పెద్ద తప్పు చేస్తానేమో.
మీ భయానికి కారణం: బహుశా ఘోరమైన తప్పు చేసి సంఘం నుండి బహిష్కరించబడిన వాళ్లు ఎవరైనా మీకు తెలిసి ఉండవచ్చు. (1 కొరింథీయులు 5:11-13) మీకూ అలాగే జరుగుతుందని మీరు భయపడుతుండవచ్చు.
“బాప్తిస్మం తీసుకోవడం గురించి మొదటిసారి ఆలోచించినప్పుడు, ఒకవేళ నేను బాప్తిస్మం తీసుకున్నాక ఏదైనా పెద్ద తప్పు చేస్తే ఎలా అని చాలా భయమేసింది. అప్పుడు మా అమ్మానాన్నలకు ఎంత అవమానం అనిపిస్తుందో నాకు తెలుసు.”—రెబెకా.
ముఖ్య లేఖనం: “దుష్టుడు తన మార్గాన్ని, చెడ్డవాడు తన ఆలోచనల్ని విడిచిపెట్టాలి; అతను యెహోవా దగ్గరికి తిరిగి రావాలి, ఆయన అతని మీద కరుణ చూపిస్తాడు, మన దేవుని దగ్గరికి తిరిగొస్తే, ఆయన అధికంగా క్షమిస్తాడు.”—యెషయా 55:7.
దీని గురించి ఆలోచించండి: తప్పుచేసి పశ్చాత్తాపం చూపించని వాళ్లను సంఘం నుండి బహిష్కరిస్తారనేది నిజమే, కానీ వినయంతో పశ్చాత్తాపపడి క్రమశిక్షణను స్వీకరించేవాళ్ల మీద యెహోవా కరుణ చూపిస్తాడు.—కీర్తన 103:13, 14; 2 కొరింథీయులు 7:11.
అంతేకాదు, ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి: దేవుని సహాయం తీసుకుంటే, తప్పు చేయాలనే ఆలోచనను మీరు ఎదిరించగలరు. (1 కొరింథీయులు 10:13) ఎంతైనా, మీరు ఏం చేస్తారనేది ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలోనా? వేరేవాళ్ల చేతిలోనా?
“బాప్తిస్మం తీసుకున్నాక ఘోరమైన పాపం చేస్తానేమో అని నేను భయపడ్డాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, బాప్తిస్మం తీసుకోకపోతేనే నేను తప్పు చేసినట్టు అవుతుంది. రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ నేను ఈ రోజు చేయాల్సింది చేయకుండా ఉండకూడదు.”—కారెన్.
ఒక్క మాటలో: ఘోరమైన తప్పులు చేయకూడదని మీరు నిర్ణయించుకుంటే, యెహోవా సేవకుల్లో ఎక్కువమందిలా మీరు కూడా వాటికి దూరంగా ఉండవచ్చు.—ఫిలిప్పీయులు 2:12.
ఇంకా సహాయం కావాలా? “తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?” అనే ఆర్టికల్ చూడండి.
బాప్తిస్మం తర్వాత వచ్చే బాధ్యతల్ని సరిగ్గా చేయలేనేమో.
మీ భయానికి కారణం: ఎక్కువగా యెహోవా సేవ చేయడం కోసం కుటుంబాన్ని, స్నేహితుల్ని విడిచి దూర ప్రాంతానికి వెళ్లిన యౌవనులు మీకు తెలిసివుండవచ్చు. మీరు కూడా అలాగే సేవచేయాలని ఇతరులు ఆశిస్తారని మీరు భయపడుతుండవచ్చు.
“బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు ఎక్కువ సేవావకాశాలు పొందడానికి అర్హులౌతారు, అయితే వాటిని స్వీకరించడానికి కొంతమంది ముందుకు రారు, లేదా వాళ్ల పరిస్థితులు అందుకు అనుమతించవు.”—మారీ.
ముఖ్య లేఖనం: “ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గలతీయులు 6:4.
దీని గురించి ఆలోచించండి: ఇతరులతో పోల్చుకునే బదులు, మార్కు 12:30 లో ఉన్న ఈ మాటల మీద మనసుపెట్టండి: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో … ప్రేమించాలి.”
యెహోవాను మీ నిండు హృదయంతో సేవించాలి కానీ వేరేవాళ్ల నిండు హృదయంతో కాదు. మీకు యెహోవా మీద నిజంగా ప్రేమ ఉంటే, మీ పూర్తి సామర్థ్యంతో ఆయన సేవ చేయడానికి మార్గాలు కనిపిస్తాయి.
“బాప్తిస్మం జాగ్రత్తగా వేయాల్సిన అడుగే కానీ పెద్ద భారం మాత్రం కాదు. మీకు మంచి స్నేహితులు ఉంటే, వాళ్లు మీకు సహాయం చేస్తారు. మెల్లమెల్లగా బాధ్యతల్ని తీసుకోవడం వల్ల నిజానికి మీ సంతోషం ఎక్కువౌతుంది. బాప్తిస్మాన్ని దూరం పెడితే మీకు మీరే హాని చేసుకుంటారు.”—జూలియా.
ఒక్క మాటలో: యెహోవా మీపై చూపించిన ప్రేమ విషయంలో కృతజ్ఞత పెంచుకోండి. అప్పుడు, మీ పూర్తి సామర్థ్యంతో ఆయన్ని సేవించాలని మీరు కోరుకుంటారు.—1 యోహాను 4:19.
ఇంకా సహాయం కావాలా? “నేనెంత బాధ్యతగా ఉన్నాను?” అనే ఆర్టికల్ చూడండి.
యెహోవాకు సేవచేసే అర్హత నాకు లేదేమో.
మీ భయానికి కారణం: యెహోవా విశ్వంలో అందరికన్నా గొప్పవాడు; ఆయనతో పోలిస్తే మనుషులు ఏమాత్రం లెక్కలోకి రారు! అసలు మీరు ఉన్నారనే విషయమైనా యెహోవాకు తెలుసో లేదో అని మీకు అనిపించవచ్చు.
“మా అమ్మానాన్నలు యెహోవాసాక్షులు; కాబట్టి యెహోవాతో స్నేహం నాకు కేవలం ‘వారసత్వంగా’ వచ్చిందేమో, ఆయన నన్ను స్వయంగా ఆకర్షించలేదేమో అనిపించేది.”—నాటలీ.
ముఖ్య లేఖనం: “నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు.”—యోహాను 6:44.
దీని గురించి ఆలోచించండి: మీరు బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నారు అంటేనే, మీరు తనకు ఇంకా దగ్గరి స్నేహితులు అయ్యేలా యెహోవా మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడని అర్థం. మీరు ఆ ఆహ్వానానికి స్పందించడం సరైన పని, కాదంటారా?
తను ఆకర్షించేవాళ్లు ఎలా ఉండాలో నిర్ణయించేది యెహోవాయే తప్ప మీరో ఇతరులో కాదు. ఆయన వాక్యం మీకు ఇలా హామీ ఇస్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, … ఆయన మీకు దగ్గరౌతాడు.”—యాకోబు 4:8.
“మీకు యెహోవా గురించి తెలుసు, ఆయనకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. కాబట్టి ఆయన సేవచేసే అర్హత మీకు లేదని ఒకవేళ మీ మనసు చెప్తే, యెహోవా దానికి ఒప్పుకోవట్లేదు అని గుర్తుంచుకోండి. యెహోవా ఎప్పుడూ కరెక్ట్.”—సెలీనా.
ఒక్క మాటలో: బాప్తిస్మం కోసం బైబిలు చెప్తున్న అర్హతల్ని మీరు చేరుకుంటే, యెహోవాను ఆరాధించే అర్హత మీకు ఉన్నట్టే. పైగా మీ ఆరాధన పొందడానికి ఆయన అర్హుడు.—ప్రకటన 4:11.
ఇంకా సహాయం కావాలా? “నేను ఎందుకు ప్రార్థించాలి?” అనే ఆర్టికల్ చూడండి.