యువత అడిగే ప్రశ్నలు
మమ్మీడాడీ పెట్టిన రూల్‌ని బ్రేక్ చేశాను—ఇప్పుడెలా?
దాదాపు ప్రతీ ఇంట్లో అమ్మానాన్నలు రూల్స్ పెడతారు. ఉదాహరణకు, ఏ టైంకి ఇంటికి రావాలి, ఫోన్ ఎంతసేపు చూడాలి, వేరేవాళ్లతో ఎలా ప్రవర్తించాలి లాంటివి.
మీ మమ్మీడాడీ పెట్టిన ఏదైనా రూల్‌ని మీరు బ్రేక్ చేశారా? అయితే, జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరుగానీ, పరిస్థితి ఇంకా ఘోరంగా అవ్వకుండా ఉండడానికి మీరు ఏదోకటి చేయవచ్చు. మీరు ఏం చేయవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
ఏం చేయకూడదు?
ఒకవేళ మీరు రూల్ బ్రేక్ చేసినట్టు మీ మమ్మీడాడీకి తెలీకపోతే, ఆ విషయాన్ని అక్కడికక్కడే కప్పిపెట్టేయాలని మీకు అనిపించవచ్చు.
ఒకవేళ మీరు రూల్ బ్రేక్ చేశారని మీ మమ్మీడాడీకి తెలిస్తే, సాకులు చెప్పాలని లేదా దాన్ని వేరేవాళ్ల మీదికి తోసేయాలని మీకు అనిపించవచ్చు.
ఆ రెండూ మంచివి కావు. ఎందుకు? ఎందుకంటే, జరిగినదాన్ని కప్పిపెట్టేసినా లేదా కుంటిసాకులు చెప్పినా మీకు ఇంకా చిన్నతనం పోలేదని, మీరు ఇంకా ఎదగాలని మీ మమ్మీడాడీకి అనిపిస్తుంది.
“అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏదోకరోజు నిజం బయటకు వస్తుంది. ఆరోజు మమ్మీడాడీలకు నిజం తెలిసి ఇచ్చే పనిష్మెంట్ కన్నా, ఇప్పుడే నిజం ఒప్పేసుకుంటే వచ్చే పనిష్మెంట్ తక్కువ.”—డయానా.
ఏం చేస్తే బాగుంటుంది?
తప్పు ఒప్పేసుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు.” (సామెతలు 28:13) మీరు పర్ఫెక్ట్గా ఉండలేరని మీ మమ్మీడాడీకి తెలుసు. కానీ, మీరు నిజాయితీగా ఉండాలని వాళ్లు కోరుకుంటారు.
“మీరు నిజం చెప్పేస్తే, మీ మమ్మీడాడీ మిమ్మల్ని క్షమించడానికి ఎక్కువ సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు.”—ఒలీవియా.
సారీ చెప్పండి. బైబిలు ఇలా చెప్తుంది: “వినయం … ధరించుకోండి.” (1 పేతురు 5:5, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) సారీ చెప్పాలన్నా, సాకులు వెతుక్కోకుండా ఉండాలన్నా వినయం కావాలి.
“అస్తమానం సాకులు చెప్తూ ఉండేవాళ్లకు మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. పోనుపోను వాళ్లు తప్పులు చేసినా, వాళ్లకు పెద్దగా ఏం అనిపించదు.”—హెథర్.
ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘క్రమశిక్షణను స్వీకరించండి.’ (సామెతలు 8:33) మీ మమ్మీడాడీ ఏ పనిష్మెంట్ ఇచ్చినా గొణుక్కోకుండా దాన్ని తీసుకోండి.
“ఎంత గొణిగితే పనిష్మెంట్ అంతెక్కువ అవుతుంది. కాబట్టి పోయినదాని గురించి వదిలేసి, మీ మమ్మీడాడీ ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోండి.”—జేసన్.
నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉన్న పాత వ్యక్తిత్వాన్ని వదిలేయండి.’ (ఎఫెసీయులు 4:22) మంచిగా ప్రవర్తిస్తూ, మీ మమ్మీడాడీ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నించండి.
“మీరు మంచిగా ప్రవర్తిస్తూ అంతకుముందు చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఉంటే, మెల్లమెల్లగా మీ మమ్మీడాడీ మిమ్మల్ని నమ్మడం మొదలుపెడతారు.”—కరెన్.
సలహా: మీరు నమ్మకస్థులని నిరూపించుకోవడానికి, కావాలంటే ఇంకో అడుగు ముందుకు వేయండి. ఉదాహరణకు, ఈసారి ఎప్పుడైనా మీరు బయటికి వెళ్తే, మీకు లేటు అవ్వకపోయినా గానీ ఎన్నింటికి ఇంటికి వస్తారో మీ మమ్మీడాడీకి ఫోన్ చేసి చెప్పండి. అలా చేయడం వల్ల, “నేను మళ్లీ మీ నమ్మకాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను” అని మీరు చెప్పకనే చెప్తారు.