కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?

“సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, మీరు తెలివితక్కువ వాళ్లనీ మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన అర్థంలేని నమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారనీ లేదా అలా నమ్మేలా మతమే మీ మనసు మార్చేసిందనీ ప్రజలు అనుకోవచ్చు.”—జనెట్‌.

 మీకూ జనెట్‌లాగే అనిపిస్తోందా? అలాగైతే, సృష్టికర్త ఉన్నాడని నమ్మడం సరైనదా కాదా అని మీకు అనిపించవచ్చు? ఏదేమైనా ఇతరులు మన గురించి ‘వీళ్లకు ఏమీ తెలియదు’ అని అనుకోవడం మనలో ఎవ్వరికీ ఇష్టముండదు. మరి మీకు ఏది సహాయం చేయగలదు?

 నమ్మకపోవడానికి గల కారణాలు

 1. సృష్టికర్త ఉన్నాడని నమ్మితే, మీరు సైన్స్‌ను నమ్మట్లేదని ప్రజలు అనుకుంటారు.

 “ప్రపంచం పనిచేస్తున్న విధానాన్ని వివరించలేని బద్దకస్థులే సృష్టికర్తను నమ్ముతారని మా టీచర్‌ చెప్పారు.”—మరీయ.

 మీరు తెలుసుకోవాల్సినది: అలా మాట్లాడేవాళ్లకు నిజాలు తెలియవు. పేరుపొందిన శాస్త్రవేత్తలైన గెలీలియో, ఐజక్‌ న్యూటన్‌ సృష్టికర్త ఉన్నాడని నమ్మారు. అలా నమ్మడం వల్ల సైన్స్‌ మీద వాళ్ల ఇష్టమేమీ తగ్గిపోలేదు. అదేవిధంగా సైన్స్‌ను, దేవున్ని రెండింటినీ నమ్ముతున్న శాస్త్రవేత్తలు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు.

 ఇలా చేసి చూడండి: “explains her faith” లేదా “explains his faith” అనే పదబంధాలను కొటేషన్స్‌తో సహా కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీలోని సెర్చ్‌ బాక్సులో టైప్‌ చేయండి. దానిలో మెడిసిన్‌, సైన్స్‌ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లు సృష్టికర్త ఉన్నాడని ఒప్పుకుంటూ చెప్తున్న అనుభవాలను మీరు చూడవచ్చు. వాళ్లు ఆ ముగింపుకు రావడానికి ఏది సహాయం చేసిందో గమనించండి.

 ఒక్కమాటలో: సృష్టికర్త ఉన్నాడని మీరు నమ్మినంత మాత్రాన, సైన్స్‌ మీద మీకున్న నమ్మకం పోదు. నిజానికి, ప్రకృతి గురించి ఎక్కువగా నేర్చుకునేకొద్దీ సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం మీలో బలపడుతుంది.—రోమీయులు 1:20.

2. సృష్టి గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాన్ని ఒకవేళ మీరు నమ్మితే, మీకు మతపిచ్చి పట్టుకుందని ప్రజలు అనుకుంటారు.

 “సృష్టికర్త ఉన్నాడని నమ్మడం చాలామందికి వెర్రితనంలా అనిపిస్తుంది. ఆదికాండములో ఉన్న వృత్తాంతం కేవలం ఒక కథ మాత్రమే అని వాళ్లు అనుకుంటారు.”—జ్యాస్‌మన్‌.

 మీరు తెలుసుకోవాల్సినది: సృష్టి గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకు, కొంతమంది సృష్టివాదులు, దేవుడు భూమిని సృష్టించి కొంతకాలమే అయ్యిందని వాదిస్తారు లేదా దేవుడు ఈ సృష్టిని 24 గంటలు ఉండే ఆరు రోజుల్లో చేశాడని వాదిస్తారు. కానీ వీటిని బైబిలు సమర్థించట్లేదు.

  •   ఆదికాండము 1:1 లో ఇలా ఉంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” ఈ విషయం, భూమి లక్షల కోట్ల ఏళ్ల నాటిదని సైన్స్‌ చెప్తున్న దానికి విరుద్ధంగా లేదు.

  •   ఆదికాండములో ఉపయోగించిన ‘దినం’ అనే పదం ఎక్కువ కాలాన్ని సూచించవచ్చు. నిజానికి, ఆదికాండము 2:4 లో ఆరు సృష్టి దినాలనూ ఒకే ‘దినం’ అని బైబిలు వర్ణించింది.

 ఒక్కమాటలో: సృష్టి గురించి బైబిల్లో ఉన్నవి సైన్స్‌ చెప్తున్న దానితో ఏకీభవిస్తున్నాయి.

 మీ నమ్మకాల గురించి ఆలోచించండి

 సృష్టికర్త ఉన్నాడని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. బదులుగా దానికి బలమైన ఆధారాలు ఉంటాయి. ఈ కింది విషయాలను పరిశీలించండి:

 మీ జీవితంలో మీరు చూసే ప్రతీ వస్తువు వెనక దాన్ని తయారుచేసిన ఓ వ్యక్తి ఉన్నాడని మీకు అర్థమౌతుంది. ఉదాహరణకు, ఒక కెమెరాను, విమానాన్ని, లేదా ఇంటిని చూసినప్పుడు దాన్ని ఎవరో ఒకరు తయారు చేశారని అనుకుంటారు. కాబట్టి మీరు మనిషి కన్నును, ఆకాశంలో పక్షిని లేదా భూగ్రహాన్ని చూసినప్పుడు వాటిని కూడా ఎవరో ఒకరు చేసి ఉంటారని ఎందుకు ఆలోచించరు?

 ఆలోచించండి: ఇంజనీర్లు తరచూ సృష్టిని గమనిస్తూ వాళ్లు కనిపెట్టిన వస్తువులకు మెరుగులు దిద్దుతుంటారు. పైగా ఇతరులు తమ పనిని గుర్తించాలని వాళ్లు కోరుకుంటారు. కొత్తవాటిని కనిపెడుతున్న మనుషుల్ని గుర్తిస్తున్నారు కానీ అంతకన్నా అద్భుతమైన వాటిని సృష్టించిన సృష్టికర్తను ఎవ్వరూ గుర్తించడం లేదు. అది ఎంతవరకు కరెక్ట్‌?

విమానాన్ని ఎవరోఒకరు తయారుచేసి ఉంటారు కానీ పక్షిని ఎవ్వరూ తయారుచేసి ఉండరని అనుకోవడం సరైనదేనా?

 రుజువును పరిశీలించడానికి మీకు సహాయం చేసే ప్రచురణలు

 సృష్టిలో కనిపిస్తున్న రుజువును పరిశీలించడం ద్వారా సృష్టికర్త ఉన్నాడనే నమ్మకాన్ని మరింత బలపర్చుకోవచ్చు.

 ఇలా చేసి చూడండి: కొటేషన్స్‌తో సహా “was it designed?” లేదా “సృష్టిలో అద్భుతాలు” అని కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీలోని సెర్చ్‌ బాక్సులో టైప్‌ చేయండి. ఆ శీర్షికతో వచ్చిన ఆర్టికల్స్‌లో మీకు నచ్చినవాటిని ఎంచుకోండి. ప్రతీ ఆర్టికల్‌లో సృష్టికి సంబంధించిన ఏ ప్రత్యేకత గురించి చర్చించారో గుర్తించండి. దాన్నిబట్టి సృష్టికర్త ఉన్నాడని మీరు ఎలా నమ్మవచ్చో చూడండి.

 మరింత పరిశీలించండి: ఈ కిందున్న బ్రోషుర్లను ఉపయోగించి సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువులను మరింత వివరంగా పరిశీలించండి.

  •  Was Life Created? (జీవం సృష్టించబడిందా?)

    •   ప్రాణులు జీవించడానికి అనువుగా ఉండేలా భూమి సరైన స్థానంలో ఉంచబడింది. అంతేకాదు జీవరాశి పోషణకు అవసరమైన ప్రతీదీ భూమిపై ఉంది.—4-10 పేజీలు చూడండి.

    •   సృష్టిలోని అద్భుతమైన డిజైన్‌లు.—11-17 పేజీలు చూడండి.

    •   బైబిల్లో ఆదికాండము అనే పుస్తకంలో సృష్టిని చేసిన విధానం గురించి ఉన్న విషయాలు సైన్స్‌తో పొందికగా ఉన్నాయి.—24-28 పేజీలు చూడండి.

  •  The Origin of Life—Five Questions Worth Asking (జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు)

    •   జీవంలేని పదార్థం నుండి జీవం దానంతటదే పుట్టి ఉండదు.—4-7 పేజీలు చూడండి.

    •   ప్రాణులు ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటవే తయారవ్వలేవు, వాటి నిర్మాణం చాలా సంక్లిష్టమైనది.—8-12 పేజీలు చూడండి.

    •   DNAలోని సమాచారాన్ని ఉంచగల సామర్థ్యం ఆధునిక టెక్నాలజీ కన్నా చాలా గొప్పది.—13-21 పేజీలు చూడండి.

    •   జీవ ప్రాణులన్నీ ఒకే మూలం నుండి రాలేదు. చాలా రకాల జంతువులు వేరే వాటినుండి క్రమేణా రాలేదని తవ్వకాల్లో దొరికిన శిలాజాలు నిరూపిస్తున్నాయి.—22-29 పేజీలు.

 “ఈ ప్రకృతి అంటే భూమ్మీదున్న జంతువుల నుండి విశ్వం వరకు, అలాగే విశ్వంలో ఉన్న క్రమం చూస్తుంటే దేవుడు ఉన్నాడనే నమ్మకం నాకు కలుగుతుంది.”—థామస్‌.