యువత అడిగే ప్రశ్నలు
హోమోసెక్సువాలిటీ తప్పా?
“నేను పెరిగి పెద్దవాడిని అవుతుండగా నాకు ఎదురైన ఒక పెద్ద సమస్య ఏమిటంటే, అబ్బాయిలకు ఆకర్షితుడిని అవ్వడం. ఒక వయసులో అలా అనిపిస్తుంది, తర్వాత పోతుందిలే అనుకునేవాణ్ణి. కానీ ఆ భావాలు ఇప్పటికీ నన్ను వేధిస్తున్నాయి.”—డేవిడ్, 23.
డేవిడ్ ఒక క్రైస్తవుడు, అతను దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునే అబ్బాయి. కానీ ఒక వైపు తనలాంటి అబ్బాయిలకు ఆకర్షితుడౌతూ దేవున్ని సంతోషపెట్టగలడా? హోమోసెక్సువాలిటీ లేదా స్వలింగ సంపర్కం గురించి యెహోవా అభిప్రాయమేంటి?
బైబిలు ఏమి చెప్తోంది?
సంస్కృతిని బట్టి, కాలాన్ని బట్టి హోమోసెక్సువాలిటీ గురించి ప్రజల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ క్రైస్తవులు, ప్రజల అభిప్రాయాల్ని బట్టి తమ అభిప్రాయాల్ని మార్చుకోరు. అంతేకాదు క్రైస్తవులు ప్రతీ బోధను నమ్ముతూ “గాలికి అటూఇటూ కొట్టుకుపోయే” వాళ్లుగా ఉండరు. (ఎఫెసీయులు 4:14) బదులుగా వాళ్లు హోమోసెక్సువాలిటీ గురించి (ఆ మాటకొస్తే, వేరే ఏ విషయం గురించైనా సరే) బైబిలు ఏం చెప్తుందో పరిశీలించి, అది చెప్తున్నట్లు ప్రవర్తిస్తారు.
హోమోసెక్సువాలిటీ గురించి బైబిలు స్పష్టంగా ఇలా చెప్పింది:
“స్త్రీతో పడుకున్నట్టు పురుషునితో పడుకోకూడదు.”—లేవీయకాండం 18:22.
“దేవుడు వాళ్లను నీచమైన లైంగిక వాంఛకు అప్పగించాడు, వాళ్లలో స్త్రీలు సహజమైన లైంగిక సంబంధాలు వదిలేసి అసహజమైన లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు.”—రోమీయులు 1:26.
“మోసపోకండి. లైంగిక పాపం చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు, ఆడంగివాళ్లు, స్వలింగ సంపర్కులైన పురుషులు, దొంగలు, అత్యాశపరులు, తాగుబోతులు, తిట్టేవాళ్లు, దోచుకునేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.”—1 కొరింథీయులు 6:9, 10.
నిజానికి దేవుని ప్రమాణాల్ని మనుషులందరూ పాటించాలి, అది అసహజ లైంగిక వాంఛలు ఉన్నవాళ్లైనా సరే, లేనివాళ్లైనా సరే. దేవుడు ఇష్టపడని ఏదైనా పని చేయాలనే కోరిక గల ప్రతీఒక్కరు ఆత్మనిగ్రహం చూపించాలి.—కొలొస్సయులు 3:5.
అంటే దానర్థం?
దానర్థం బైబిలు హోమోసెక్సువల్స్ని ద్వేషించమని చెప్తోందా?
లేదు. నిజానికి బైబిలు ఎవ్వరినీ ద్వేషించమని చెప్పడం లేదు. అది హోమోసెక్సువల్స్ అయినా, కాకపోయినా. బదులుగా ఎవ్వరు ఎలా ప్రవర్తించినా, “అందరితో శాంతిగా ఉండడానికి ... శాయశక్తులా కృషిచేయండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (హెబ్రీయులు 12:14) కాబట్టి హోమోసెక్సువల్స్ని ఏడిపించడం, వాళ్లపై ద్వేషాన్ని వెళ్లగక్కడం, లేదా వాళ్లకు హాని కలిగించే ఇంకేమైనా చేయడం తప్పు.
అంటే అబ్బాయిలు అబ్బాయిల్ని, అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చనే లాంటి చట్టాల్ని క్రైస్తవులు వ్యతిరేకించాలని దానర్థమా?
పెళ్లి అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక్కటవ్వడం, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణమని బైబిలు చెప్తోంది. (మత్తయి 19:4-6) అయితే హోమోసెక్సువల్స్ గురించిన చర్చ రాజకీయాంశంగా మారింది. క్రైస్తవులు రాజకీయాల్లో తలదూర్చకూడదని బైబిలు చెప్తోంది. (యోహాను 18:36) కాబట్టి హోమోసెక్సువల్ పెళ్లి లేదా అలాంటి ప్రవర్తన గురించి ప్రభుత్వం ఇచ్చిన నియమాల్ని క్రైస్తవులు వ్యాప్తి చేయరు, వ్యతిరేకించరు.
ఒకవేళ . . . ?
ఒకవేళ ఎవరైనా హోమోసెక్సువల్స్ అయితే? వాళ్లు మారగలరా?
మారగలరు. మొదటి శతాబ్దంలోని కొంతమంది మారారు కూడా. హోమోసెక్సువల్స్ దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు అని చెప్పాక బైబిలు ఇలా చెప్తోంది, “మీలో కొందరు ఒకప్పుడు అలాంటివాళ్లే.”—1 కొరింథీయులు 6:11.
అంటే, హోమోసెక్సువాలిటీకి దూరంగా ఉన్నవాళ్లకు, తర్వాత ఎప్పుడూ అలాంటి అసహజ కోరిక మళ్లీ కలగలేదని దానర్థమా? కాదు. బైబిలు ఇలా చెప్తోంది, “కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి. ఆ వ్యక్తిత్వం ... సరైన జ్ఞానంతో అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది.” (కొలొస్సయులు 3:10) మార్పు అనేది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది.
దేవుని ప్రమాణాల్ని పాటించాలనుకునే వ్యక్తిలో హోమోసెక్సువల్ కోరికలు ఇంకా కలుగుతుంటే అప్పుడేంటి?
ఎలాంటి తప్పుడు కోరిక కలిగినా, దాని గురించి ఆలోచించకుండా లేదా దాని ప్రకారం ప్రవర్తించకుండా జాగ్రత్తపడవచ్చు. ఎలా? బైబిలు ఇలా చెప్తోంది, “పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీర కోరికల ప్రకారం ప్రవర్తించరు.”—గలతీయులు 5:16.
ఈ వచనాన్ని గమనిస్తే, శరీర కోరికలు కలుగవు అని బైబిలు చెప్పట్లేదు. బదులుగా ప్రతీరోజు బైబిలు చదవడం, ప్రార్థన చేసుకోవడం వంటి మంచి అలవాట్లు ఉండడం వల్ల ఒక వ్యక్తికి శరీర కోరికలతో పోరాడడానికి కావాల్సిన శక్తి వస్తుంది.
ఈ వచనం చెప్పేది నిజమని, మనం ముందు మాట్లాడుకున్న డేవిడ్ రుచిచూసి తెలుసుకున్నాడు. ముఖ్యంగా అతని మనసులో జరుగుతున్న సంఘర్షణ గురించి తన అమ్మానాన్నలతో మాట్లాడిన తర్వాత అతనికి ఆ కోరికతో పోరాడడం తేలికైంది. డేవిడ్ ఇలా చెప్తున్నాడు, “నా భుజాల మీద నుండి ఏదో పెద్ద భారం దించేసినట్లు అనిపించింది. ఇంత ఆలస్యంగా కాకుండా ఇంకా ముందే మా అమ్మానాన్నలకు ఈ విషయం గురించి చెప్పివుంటే నా టీనేజీని ఆనందించి ఉండేవాణ్ణి.”
మనం యెహోవా ప్రమాణాలకు కట్టుబడివుంటే ఎంతో సంతోషంగా ఉంటాం. యెహోవా ప్రమాణాలు “న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి; ... వాటిని పాటించడం వల్ల గొప్ప ప్రతిఫలం కలుగుతుంది” అని మనం నమ్ముతాం.—కీర్తన 19:8, 11.