ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?
బైబిలు ఇచ్చే జవాబు
చేస్తాయి. ఈ కిందవున్న నాలుగు బైబిలు సూత్రాలు, మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో మీకు సహాయం చేస్తాయి:
ఖర్చుల గురించి ముందే ఆలోచించుకోండి. “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.” (సామెతలు 21:5) మార్కెట్లో కనిపించే ప్రతీదీ కొనేయడానికి తొందరపడకండి. మీకు ఏమి అవసరం, వాటికోసం నిజంగా ఎంత ఖర్చుపెట్టగలరు అనేవి ఆలోచించుకుని బడ్జెట్ వేసుకోండి. అంతకుమించి ఖర్చు పెట్టకండి.
అనవసరమైన అప్పులు చేయకండి. “అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.” (సామెతలు 22:7) మీకు ఇప్పటికే అప్పు ఉంటే, మీరు దాన్ని తీర్చలేకపోతుంటే, మీకు అప్పిచ్చినవాళ్లతో మాట్లాడి అప్పు తీర్చడానికి వేరే విధానాలు ఏమైనా కుదురుతాయేమో తెలుసుకోండి. పట్టుదలగా ప్రయత్నించండి. సామెతలు 6:1-5 వచనాల్లోని వ్యక్తి చూపించాల్సిన వైఖరినే మీరూ చూపించండి. అక్కడ ఇలా ఉంది: “నీవు త్వరపడి వెళ్లి … నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.” మీరు మొదటిసారి అడిగినప్పుడు ఒప్పుకోకపోయినా వదలకండి, మళ్లీమళ్లీ అడుగుతూనే ఉండండి.
డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. “ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.” (సామెతలు 28:22, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) అసూయ, అత్యాశ ఆర్థిక పతనానికి దారితీస్తాయి. అంతేకాదు, ఆధ్యాత్మిక విషయాల్ని హరించేస్తాయి.
ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి. “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:7, 8) సంతోషాన్ని, సంతృప్తిని డబ్బుతో కొనలేం. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్నవాళ్లలో కొంతమంది దగ్గర పెద్దగా డబ్బు లేదు. కానీ వాళ్ల దగ్గర ఉన్నదల్లా ఇంట్లోవాళ్ల ప్రేమ, స్నేహితుల ప్రేమ, దేవునితో స్నేహం.—సామెతలు 15:17; 1 పేతురు 5:6, 7.