కంటెంట్‌కు వెళ్లు

ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా?

ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా?

బైబిలు ఇచ్చే జవాబు

 ఏ మనిషీ దేవుణ్ణి చూడలేదు. (నిర్గమకాండము 33:20; యోహాను 1:18; 1 యోహాను 4:12) దేవుడు ఆత్మప్రాణి అని బైబిలు చెప్తుంది కాబట్టి ఆయన్ని మనం కళ్లతో చూడలేం.—యోహాను 4:24; 1 తిమోతి 1:17.

 కానీ దేవదూతలు మాత్రం దేవుణ్ణి చూడగలరు ఎందుకంటే వాళ్లు కూడా ఆత్మ ప్రాణులే కాబట్టి. (మత్తయి 18:10) వాళ్లేకాదు, చనిపోయి మళ్లీ బ్రతికి ఆత్మ శరీరంతో పరలోకానికి వెళ్లే మనుషులు కూడా దేవుణ్ణి చూడగలుగుతారు.—ఫిలిప్పీయులు 3:20, 21; 1 యోహాను 3:2.

మరి దేవున్ని ఇప్పుడు ఎలా చూడవచ్చు?

 బైబిలు తరచుగా, ఏదైన ఒక విషయాన్ని అర్థంచేసుకోవడాన్ని సూచించడానికి చూడడం వంటి పదాల్ని ఉపయోగిస్తుంది. (యెషయా 6:10; యిర్మీయా 5:21; యోహాను 9:39-41) ఈ రకంగా చూస్తే, ఒక వ్యక్తి విశ్వాసంతో దేవుణ్ణి తెలుసుకొని, ఆయన లక్షణాలను అర్థం చేసుకున్నప్పుడు ‘తన మనోనేత్రాలతో’ దేవుణ్ణి ఇప్పుడు చూడగలుగుతాడు. (ఎఫెసీయులు 1:17, 18) అలాంటి విశ్వాసాన్ని క్రమేణా ఎలా పెంచుకోవచ్చో బైబిలు వివరిస్తోంది.

  •   దేవుని సృష్టిని చూసి ప్రేమ, ఉదారత, జ్ఞానం, శక్తి వంటి ఆయన లక్షణాలను తెలుసుకోండి. (రోమీయులు 1:20) దేవుని సృష్టి కార్యాలను గుర్తుచేసిన తర్వాత నమ్మకస్థుడైన యోబుకు దేవుడు తన కళ్లముందే ఉన్నట్టు అనిపించింది.—యోబు 42:5.

  •   బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా దేవుణ్ణి తెలుసుకోండి. “ఆయనను [దేవుణ్ణి] వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును” అని బైబిలు హామీ ఇస్తోంది.—1 దినవృత్తాంతములు 28:9; కీర్తన 119:2; యోహాను 17:3.

  •   యేసు జీవితం గురించి నేర్చుకోవడం ద్వారా దేవుని గురించి తెలుసుకోండి. యేసు తన తండ్రైన యెహోవా లక్షణాలను పరిపూర్ణంగా ప్రతిబింబించాడు కాబట్టి ఆయన ఇలా చెప్పగలిగాడు, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.”—యోహాను 14:9.

  •   దేవునికి ఇష్టమైన విధంగా జీవిస్తూ ఆయన మీకు ఎలా సహాయం చేస్తాడో చూడండి. యేసు ఇలా చెప్పాడు, “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.” పైన చెప్పుకున్నట్లు దేవుడు ఇష్టపడే విధంగా జీవించే వాళ్లలో కొంతమంది చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తారు, అక్కడ వాళ్లు దేవుణ్ణి చూస్తారు.—మత్తయి 5:8; కీర్తన 11:7.

మోషే, అబ్రాహాము, మరితరులు తమ కళ్లతో దేవుణ్ణి చూడలేదా?

 కొన్ని వృత్తాంతాలను చదివినప్పుడు మనుషులు దేవుణ్ణి నిజంగా చూశారని బైబిలు చెప్తున్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే వాటి సందర్భాల్ని చూస్తే దేవుని తరఫున దేవదూత మాట్లాడినట్టు లేదా దేవుడు దర్శనం ద్వారా కనబడినట్లు ఉంటుంది.

 దేవదూతలు.

పూర్వకాలాల్లో, మనుషుల దగ్గరకు వెళ్లి తన తరఫున మాట్లాడడానికి దేవుడు దేవదూతలను పంపించేవాడు. (కీర్తన 103:20) ఉదాహరణకు, ఒకసారి మండుతున్న పొదనుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. అప్పుడు, “దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు” అని బైబిలు చెప్తుంది. (నిర్గమకాండము 3:4, 6, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టూ-రీడ్‌ వర్షన్‌) అక్కడ మోషే దేవుణ్ణి చూడలేదు కానీ నిజానికి ఆయన చూసింది ‘యెహోవా దూతనని’ ఆ సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు.—నిర్గమకాండము 3:2.

 అదేవిధంగా, “యెహోవా మోషేతో ముఖాముఖిగా” మాట్లాడాడని బైబిలు చెప్తున్నప్పుడు దానర్థం దేవుడు మోషేతో సొంత మనిషితో మాట్లాడినట్లు మాట్లాడాడు అని. (నిర్గమకాండము 4:10, 11; 33:11) మోషే నిజంగా దేవుని ముఖం చూడలేదు. ఎందుకంటే ఆయన దేవుని నుండి పొందిన సమాచారం “మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా” పొందాడు. (గలతీయులు 3:19; అపొస్తలుల కార్యములు 7:53) అయినా, మోషేకు దేవుని మీద ఎంత బలమైన విశ్వాసం ఉందంటే, మోషేను “అదృశ్యుడైనవానిని చూచుచున్న” వ్యక్తిగా బైబిలు వర్ణిస్తోంది.—హెబ్రీయులు 11:27.

 దేవుడు మోషేతో మాట్లాడినట్లుగానే అబ్రాహాముతో కూడా దేవదూతల ద్వారా మాట్లాడాడు. నిజమే, మనం బైబిల్ని మామూలుగా చదివినప్పుడు, అబ్రాహాము నిజంగా దేవుణ్ణి చూశాడని అనిపిస్తుంది. (ఆదికాండము 18:1, 33) కానీ లేఖనాల్లో సందర్భాన్ని చూస్తే, అబ్రాహాము దగ్గరకు వచ్చిన “ముగ్గురు మనుష్యులు” దేవుడు పంపిన దూతలని చెప్పవచ్చు. వాళ్లు దేవుని తరఫున మాట్లాడడానికి వచ్చారని అబ్రాహాము గుర్తించాడు. అందుకే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా యెహోవాతోనే మాట్లాడుతున్నట్లు సంబోధించాడు.—ఆదికాండము 18:2, 3, 22, 32; 19:1.

 దర్శనాలు.

దర్శనాలు ద్వారా కూడా దేవుడు మనుషులకు కనిపించాడు. ఉదాహరణకు మోషే, ఇతర ఇశ్రాయేలీయులు “ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి” అని బైబిలు అంటున్నప్పుడు వాళ్లు దేవుణ్ణి దర్శనం ద్వారా చూశారని అర్థం. (నిర్గమకాండము 24:9-11) అదేవిధంగా, ప్రవక్తలు యెహోవాను చూశారని బైబిల్లో కొన్నిచోట్ల ఉంది. (యెషయా 6:1; దానియేలు 7:9; ఆమోసు 9:1) వాటివాటి సందర్భాలను బట్టి చూస్తే, వాళ్లకు దేవుడు నిజంగా కాదుగానీ దర్శనం ద్వారా కనిపించాడని చెప్పవచ్చు.—యెషయా 1:1; దానియేలు 7:2; ఆమోసు 1:1.