యేసు ఎందుకు చనిపోయాడు?
బైబిలు ఇచ్చే జవాబు
మనుషులు పాపక్షమాపణను, శాశ్వత జీవితాన్ని పొందడం కోసం యేసు చనిపోయాడు. (రోమీయులు 6:23; ఎఫెసీయులు 1:7) అంతేకాదు ఆయన చనిపోవడం ద్వారా, ఒక మనిషి అత్యంత తీవ్రమైన కష్టాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉండగలడని నిరూపించాడు.—హెబ్రీయులు 4:15.
ఒక్క మనిషి చనిపోవడం వల్ల అవన్నీ ఎలా సాధ్యమౌతాయో పరిశీలిద్దాం.
యేసు చనిపోవడం వల్ల “మన పాపాలు క్షమించబడ్డాయి.”—కొలొస్సయులు 1:14.
మొట్టమొదటి మనిషి అయిన ఆదాము ఏ పాపం లేకుండా పరిపూర్ణంగా సృష్టించబడ్డాడు. కానీ అతను దేవునికి అవిధేయత చూపించాడు. ఆ అవిధేయత లేదా పాపం, అతని సంతానమంతటి మీద ప్రభావం చూపించింది. ‘ఒక్క మనిషి అవిధేయత ద్వారా అనేకులు పాపులయ్యారని’ బైబిలు చెప్తుంది.—రోమీయులు 5:19.
యేసు కూడా పరిపూర్ణుడే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. కాబట్టి మన పాపాల కోసం “ప్రాయశ్చిత్త బలిని” అర్పించడానికి ఆయన అర్హుడు. (1 యోహాను 2:2; అధస్సూచి) ఆదాము చూపించిన అవిధేయత వల్ల మానవజాతి మొత్తానికి పాపం అనే మరక అంటుకుంది. యేసు మరణం ఆ మరకలను పూర్తిగా తుడిచేస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే, ఆదాము మానవజాతిని పాపానికి అమ్మేస్తే, యేసు ఇష్టపూర్వకంగా చనిపోవడం ద్వారా వాళ్లను కొనుక్కున్నాడు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు.”—1 యోహాను 2:1.
‘తనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని’ యేసు చనిపోయాడు.—యోహాను 3:16.
ఆదాము నిరంతరం జీవించేలా సృష్టించబడినప్పటికీ, పాపం చేయడం వల్ల అతనికి మరణశిక్ష పడింది. ఆదాము ద్వారా “పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”—రోమీయులు 5:12.
దీనికి భిన్నంగా, యేసు మరణం ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ల పాపపు మరకల్ని తుడిచేయడమే కాకుండా, మరణశిక్షను కూడా రద్దు చేసింది. బైబిలు ఇలా చెప్తుంది: “పాపం మరణంతో కలిసి రాజుగా ఏలినట్టే, నీతి ద్వారా అపారదయ రాజుగా ఏలాలని దేవుడు అలా చేశాడు; ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవితం పొందాలన్నది దేవుని ఉద్దేశం.”—రోమీయులు 5:21.
నిజమే, మనుషులు ఈ రోజుల్లో ఎక్కువకాలం జీవించట్లేదు. అయితే నీతిమంతులకు శాశ్వత జీవితం ఇస్తానని, చనిపోయిన వాళ్లను పునరుత్థానం చేస్తానని, వాళ్లు కూడా యేసు త్యాగపూరిత మరణం ద్వారా ప్రయోజనం పొందుతారని దేవుడు మాటిస్తున్నాడు.—కీర్తన 37:29; 1 కొరింథీయులు 15:22.
యేసు “చనిపోయేంతగా లోబడడం” ద్వారా, ఎలాంటి కష్టాలు లేదా శోధనలు వచ్చినా మనుషులు దేవునికి నమ్మకంగా ఉండగలరని నిరూపించాడు.—ఫిలిప్పీయులు 2:8.
పరిపూర్ణ మేదస్సు, శరీరం ఉన్నా, ఆదాము తనదికాని దాని కోసం ఆశపడి దేవునికి అవిధేయత చూపించాడు. (ఆదికాండము 2:16, 17; 3:6) తర్వాత దేవుని ప్రధాన శత్రువైన సాతాను, ఏ మనిషైనా స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తాడనీ, ప్రాణం మీదకు వస్తే ఏదైనా చేస్తాడనీ ఆరోపించాడు. (యోబు 2:4) కానీ పరిపూర్ణ మనిషైన యేసు అవమానకరమైన, బాధాకరమైన మరణాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా దేవునికి లోబడ్డాడు, ఆయనకు విశ్వసనీయంగా ఉన్నాడు. (హెబ్రీయులు 7:26) ఆ విధంగా, ఎలాంటి కష్టాలు లేదా శోధనలు వచ్చినా మనుషులు దేవునికి నమ్మకంగా ఉండగలరని యేసు తిరుగులేని విధంగా నిరూపించాడు.
యేసు మరణం గురించిన ప్రశ్నలు
మనుషుల్ని విడిపించడానికి యేసు ఎందుకు అంతగా బాధపడి చనిపోవాల్సివచ్చింది? దేవుడే మరణశిక్షను రద్దు చేస్తే సరిపోయేది కదా?
“పాపంవల్ల వచ్చే జీతం మరణం” అని దేవుడు నియమం పెట్టాడు. (రోమీయులు 6:23) ఆ నియమాన్ని ఆదాముకు తెలియజేస్తూ, తనకు అవిధేయత చూపిస్తే మరణశిక్ష పడుతుందని దేవుడు చెప్పాడు. (ఆదికాండము 3:3) ఆదాము పాపం చేసినప్పుడు, “అబద్ధమాడలేని దేవుడు” తన మాట నిలబెట్టుకున్నాడు. (తీతు 1:2) అలా ఆదాము పాపాన్నే కాదు, దానివల్ల వచ్చే జీతాన్ని అంటే మరణాన్ని కూడా తన సంతానానికి వారసత్వంగా ఇచ్చాడు.
పాపం వల్ల మనుషులు మరణశిక్షకు అర్హులైనప్పటికీ, దేవుడు వాళ్లపట్ల “అపారదయ” చూపించాడు. (ఎఫెసీయులు 1:7) వాళ్లను విడిపించడానికి పరిపూర్ణుడైన యేసును పంపించాడు. ఆ ఏర్పాటు ద్వారా అటు న్యాయాన్ని, ఇటు కనికరాన్ని అత్యున్నత స్థాయిలో చూపించాడు.
యేసు ఎప్పుడు చనిపోయాడు?
యేసు యూదుల పస్కా పండుగ రోజున, సూర్యోదయం నుండి తొమ్మిదో గంటకు అంటే మధ్యాహ్నం “దాదాపు మూడింటికి” చనిపోయాడు. (మార్కు 15:33-37, అధస్సూచి) ఆధునిక క్యాలెండర్ ప్రకారం అది సా.శ. 33 ఏప్రిల్ 1, శుక్రవారం.
యేసు ఎక్కడ చనిపోయాడు?
యేసును “కపాల స్థలం” అని పిలవబడిన చోట వేలాడదీశారు. “హీబ్రూ భాషలో దాన్ని గొల్గొతా అని పిలుస్తారు.” (యోహాను 19:17, 18) యేసు రోజుల్లో, ఆ స్థలం యెరూషలేము “నగర ద్వారం బయట” ఉండేది. (హెబ్రీయులు 13:12) బహుశా ఆ స్థలం ఒక కొండ మీద ఉండి ఉండొచ్చు. అందుకే, యేసును వేలాడదీయడాన్ని కొంతమంది “దూరంలో నిలబడి” చూశారని బైబిలు చెప్తుంది. (మార్కు 15:40) అయితే ప్రస్తుతం అది ఎక్కడ ఉందో మనకు ఖచ్చితంగా తెలీదు.
యేసు ఎలా చనిపోయాడు?
యేసు సిలువ మీద చనిపోయాడని చాలామంది నమ్ముతారు. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు.” (1 పేతురు 2:24, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యేసు దేని మీద మరణించాడో చెప్పడానికి బైబిలు రచయితలు స్టౌరస్, క్సైలోస్ అనే రెండు గ్రీకు పదాలు ఉపయోగించారు. ఆ పదాలు, నిలువుగా ఉన్న ఒక కొయ్యను లేదా దుంగను సూచిస్తున్నాయని చాలామంది విద్వాంసులు చెప్తున్నారు.
యేసు మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?
యూదులు ప్రతీ సంవత్సరం జరుపుకునే పస్కా పండుగ రోజు రాత్రి, యేసు తన అనుచరులతో ఒక ఆచరణ ప్రారంభించి, ఇలా ఆజ్ఞాపించాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” (1 కొరింథీయులు 11:24) కొన్ని గంటల తర్వాత ఆయన చంపబడ్డాడు.
బైబిలు రచయితలు, యేసును పస్కా రోజున అర్పించే గొర్రెపిల్లతో పోల్చారు. (1 కొరింథీయులు 5:7) ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందారని పస్కా ఆచరణ గుర్తు చేసేది. అదేవిధంగా, క్రైస్తవులు పాపమరణాల నుండి విడుదల పొందారని యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ గుర్తు చేస్తుంది. ప్రతీ సంవత్సరం పస్కాను చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నీసాను 14న జరుపుకునేవాళ్లు; అదేవిధంగా తొలి క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణను సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రజలు, ప్రతీ సంవత్సరం నీసాను 14 ఏ తేదీన వస్తుందో ఆ రోజున యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.