బైబిలు వచనాల వివరణ
ఫిలిప్పీయులు 4:13—“క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను”
“నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13, కొత్త లోక అనువాదం.
“నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.“—ఫిలిప్పీయులు 4:13, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
ఫిలిప్పీయులు 4:13 అర్థమేంటి?
అపొస్తలుడైన పౌలు రాసిన ఆ మాటలు, దేవున్ని ఆరాధించేవాళ్లు ఆయన ఇష్టాన్ని చేయడానికి కావల్సిన బలాన్ని పొందుతారని వాళ్లకు హామీ ఇస్తున్నాయి.
కొన్ని బైబిలు అనువాదాలు పౌలుకు శక్తిని ఇచ్చింది క్రీస్తు అని చెప్తున్నాయి. అయితే అతి ప్రాచీన గ్రీకు చేతి రాతప్రతుల్లో “క్రీస్తు” అనే మాట కనిపించదు. అందుకే చాలా ఆధునిక అనువాదాల్లో “నన్ను బలపరుస్తూ ఉన్నవాని” (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం), “నన్ను బలపరచువాని” (పరిశుద్ధ గ్రంథము) అని ఉంటుంది. మరి పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
సందర్భాన్ని పరిశీలిస్తే, పౌలు దేవుని గురించి మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. (ఫిలిప్పీయులు 4:6, 7, 10) ఇదే ఉత్తరంలో, కొంచెం ముందు పౌలు ఫిలిప్పీయులకు ఇలా రాశాడు: ‘తనకు ఇష్టమైనవి చేసే శక్తిని ఇచ్చి దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు.’ (ఫిలిప్పీయులు 2:13) అలాగే 2 కొరింథీయులు 4:7 లో తన పరిచర్యను పూర్తిచేయడానికి శక్తిని ఇచ్చింది దేవుడే అని పౌలు రాశాడు. (2 తిమోతి 1:8 తో పోల్చండి.) కాబట్టి పౌలు, తనకు ‘శక్తిని ఇస్తాడు’ అని చెప్పింది దేవుని గురించే అని నమ్మడానికి మంచి కారణాలే ఉన్నాయి.
మరి తాను పొందే శక్తితో “ఏదైనా చేయగలను” అని పౌలు అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ పౌలు, తాను దేవుని ఇష్టం చేస్తున్నప్పుడు తనకు ఎదురయ్యే రకరకాల పరిస్థితులు గురించి మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది. తాను కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా, దేవుడు తనను చూసుకుంటాడని పౌలు ఆయనమీదే భారం వేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నాసరే సంతృప్తితో ఉండడం పౌలు నేర్చుకున్నాడు.—2 కొరింథీయులు 11:23-27; ఫిలిప్పీయులు 4:11.
పౌలు మాటలు ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులకు ధైర్యాన్నిస్తాయి. కష్టాల్ని భరించడానికి, దేవుని ఇష్టాన్ని చేయడానికి కావల్సిన శక్తిని ఆయన వాళ్లకు ఇస్తాడు. తన చురుకైన శక్తి అంటే పవిత్రశక్తి ద్వారా, తోటి ఆరాధకుల ద్వారా, తన వాక్యమైన బైబిలు ద్వారా దేవుడు వాళ్లకు బలాన్ని ఇస్తాడు.—లూకా 11:13; అపొస్తలుల కార్యాలు 14:21, 22; హెబ్రీయులు 4:12.
ఫిలిప్పీయులు 4:13 సందర్భం
ఈ వచనం, పౌలు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు రాసిన ఉత్తరం ముగింపు మాటల్లో భాగం. ఈ మాటల్ని అతను దాదాపు క్రీ.శ. 60-61 లో, అంటే రోములో మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు. కొంతకాలం పాటు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు అపొస్తలుడైన పౌలుకు వస్తుపరంగా సహాయం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు వాళ్లు పౌలుకు కావాల్సినవి ఉండేలా ఆయనకు కానుకలు పంపిస్తున్నారు.—ఫిలిప్పీయులు 4:10, 14.
పౌలు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు చూపిస్తున్న ఉదారస్ఫూర్తిని ఆప్యాయంగా మెచ్చుకుని తనకు కావాల్సినవి తన దగ్గర ఉన్నాయని వాళ్లకు భరోసా ఇచ్చాడు. (ఫిలిప్పీయులు 4:18) అలాగే, క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఈ రహస్యాన్ని వాళ్లతో పంచుకున్నాడు: దేవుడు చేసే సహాయం మీద ఆధారపడితే క్రైస్తవులందరూ, వాళ్లకు డబ్బు ఉన్నా-లేకపోయినా నిజమైన సంతృప్తిని పొందవచ్చు.—ఫిలిప్పీయులు 4:12.