ప్రీస్టులు తమతో కఠినంగా ప్రవర్తించినా యెహోవాసాక్షులు ప్రశాంతంగా ఉన్నారు
అర్మేనియాలో ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవచేస్తున్న ఆర్టర్, ఒక యెహోవాసాక్షుల సంఘానికి వెళ్లాడు. అప్పటివరకు ఆ సంఘంలోని వాళ్లు, కార్టుల్ని ఉపయోగించి బైబిలు ప్రచురణల్ని అందించే బహిరంగ సాక్ష్యంలో పాల్గొనలేదని అతనికి తెలిసింది. ఆ పద్ధతిలో సాక్ష్యమిచ్చేలా వాళ్లను ప్రోత్సహించడానికి ఆర్టర్, అతని భార్య ఆనా, జీరైర్ అనే సహోదరుడు ఒక చిన్న పట్టణంలో కార్ట్ పెట్టారు. వాళ్లు ఆ కార్ట్ను చాలామంది నడిచేచోట పెట్టారు.
దాని పక్క నుండి వెళ్తున్నవాళ్లు వెంటనే ఆసక్తి చూపించి, ప్రచురణలు తీసుకున్నారు. అయితే, యెహోవాసాక్షులు అంటే గిట్టనివాళ్లు కూడా దాన్ని చూశారు. ఇద్దరు ప్రీస్టులు కార్ట్ దగ్గరికి వచ్చారు, వాళ్లలో ఒకతను అసలేమీ మాట్లాడకుండా కోపంగా కార్ట్ను తన్నేశాడు. తర్వాత అతను ఆర్టర్ను చెంపదెబ్బ కొట్టాడు, దాంతో అతని కళ్లద్దాలు కింద పడిపోయాయి. ఆర్టర్, ఆనా, జీరైర్ వాళ్లను శాంతపర్చడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ల కోపం తగ్గలేదు. ఆ ప్రీస్టులు కార్ట్ను కాళ్లతో తొక్కారు, దాంతో ప్రచురణలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తర్వాత వాళ్లను తిట్టి, బెదిరించి, అక్కడినుండి వెళ్లిపోయారు.
ఆర్టర్, ఆనా, జీరైర్ కంప్లెయింట్ రాసివ్వడానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వాళ్లు జరిగింది వివరించి, అక్కడున్న పోలీసు అధికారులతో, మిగతా సిబ్బందితో బైబిలు గురించి క్లుప్తంగా మాట్లాడారు. తర్వాత వాళ్ల ముగ్గుర్ని పోలీసు ఉన్నతాధికారి దగ్గరికి తీసుకెళ్లారు. అతను కేవలం ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే చాలా బలంగా, దృఢంగా ఉన్న ఆర్టర్ తనను చెంపదెబ్బ కొట్టిన ప్రీస్టును తిరిగి కొట్టకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో అతను ఆ కేసు గురించిన వివరాలు అడగడం ఆపేసి, సాక్షుల నమ్మకాల గురించి అడగడం మొదలుపెట్టాడు. అలా నాలుగు గంటలు వాళ్లు ఆ అధికారితో చర్చించారు! వాళ్లు చెప్పిన విషయాలు అతనికి నచ్చాయి. అతను వాళ్లతో, “మీ మతం చాలా గొప్పది! నాకు కూడా మీ మతంలో చేరాలని ఉంది!” అన్నాడు.
తర్వాతి రోజు, ఆర్టర్ మళ్లీ బహిరంగ సాక్ష్యం మొదలుపెట్టాడు. అప్పుడు, ముందురోజు జరిగినదాన్ని గమనించిన ఒకతను ఆర్టర్ దగ్గరికి వచ్చి, ప్రీస్టులతో గొడవకు దిగకుండా ప్రశాంతంగా ఉన్నందుకు అతన్ని మెచ్చుకున్నాడు. జరిగినదాన్ని చూసిన తర్వాత నాకు ఆ ప్రీస్టుల మీద గౌరవం పోయింది అని కూడా అతను చెప్పాడు.
ఆ రోజు సాయంత్రం పోలీసు ఉన్నతాధికారి ఆర్టర్ను మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. అయితే కేసు గురించి చర్చించే బదులు, బైబిలు గురించి మరిన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ చర్చలో మరో ఇద్దరు పోలీసులు కూడా పాల్గొన్నారు.
తర్వాతి రోజు, ఆర్టర్ మళ్లీ ఆ పోలీసు ఉన్నతాధికారిని కలిశాడు, ఈసారి కొన్ని బైబిలు వీడియోలు చూపించాడు. అధికారి ఆ వీడియోలు చూడడానికి మిగతా పోలీసుల్ని కూడా పిలిచాడు.
ప్రీస్టుల ప్రవర్తన కారణంగా, ఆ సహోదరులు మొదటిసారిగా చాలామంది పోలీసులకు బైబిలు గురించి సాక్ష్యం ఇచ్చారు. దానివల్ల పోలీసులకు యెహోవాసాక్షుల మీద మంచి అభిప్రాయం ఏర్పడింది.