బహుమానంగా 19,000 ఫ్లైట్ టికెట్లు
2013, జూలై నెలలో యెహోవాసాక్షుల పరిపాలక సభ, మిషనరీలకు అలాగే విదేశాల్లో ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తున్నవాళ్లకు ఓ ఉత్తరాన్ని పంపింది. అది వాళ్లను ఆనందంలో ముంచెత్తింది. ఇంతకీ ఆ ఉత్తరంలో, విదేశాల్లో ప్రత్యేక పూర్తికాలసేవ చేస్తున్నవాళ్లు 2014వ సంవత్సరంలో అలాగే 2015 సంవత్సరం మొదట్లో జరిగే ప్రాదేశిక సమావేశాలకు, అంతర్జాతీయ సమావేశాలకు హాజరుకావడానికి ఓ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆ ఏర్పాటును చేసింది కేవలం వాళ్లు సమావేశాలకు హాజరయ్యేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమేకాదు. వాళ్లు అక్కడున్న తమ కుటుంబసభ్యులతో లేదా స్నేహితులతో సమయం గడపేందుకు వీలుగా పరిపాలక సభ ఆ ఏర్పాటు చేసింది. అయితే పూర్తికాల సేవకులు తమ దేశానికి వెళ్లడానికి, మళ్లీ తిరిగి రావడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్లను సంస్థే ఏర్పాటు చేస్తుందని ఆ ఉత్తరంలో తెలిపారు.
గతంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారుగానీ ఇది మాత్రం వాటికన్నా ప్రత్యేకమైనది. టికెట్లను బుక్ చేసేందుకు టీచింగ్ కమిటీ అధ్వర్యంలో వరల్డ్ హెడ్‌క్వార్టర్స్ ట్రావెల్ (WHQ) అనే ఓ కొత్త డిపార్టమెంట్ ఏర్పడింది.
ఈ ఉత్తరం అందుకోగానే తమకు టికెట్లు కావాలనే ప్రతిపాదనలు WHQ ట్రావెల్‌కు వెల్లువలా వచ్చాయి. 2014 జనవరికల్లా ఆ ప్రతిపాదనలు WHQ ట్రావెల్‌ను ఉప్పెనలా ముంచెత్తాయి. ఈ ట్రావెల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్లు ఏ ఫ్లైట్లు ఖాళీ ఉన్నాయో చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక పూర్తికాల సేవకులందరికీ టికెట్లు బుక్ చేశారు.
అయితే కొంతమందికి టికెట్లు బుక్ చేయడం కాస్త కష్టమైంది. ఉదాహరణకు, కొంతమంది ఐస్లాండ్లోని రాక్యెవీక్ నుండి బొలీవియాలోని కోచాబాంబాకు వెళ్లడానికి టికెట్లు కావాలని అడిగారు. మరికొంతమంది న్యూ కలెడోనియాలోని నూమా నుండి మడగాస్కర్‌లోని అంటనానారివోకు వెళ్లాలని కోరారు. ఇంకొందరు పాపువా న్యూగినిలోని పోర్ట్ మోర్జబీ నుండి అమెరికాలోని వాషింగ్టన్‌లోని సీటల్‌కు వెళ్లడానికి టికెట్లు కావాలని అడిగారు. మరికొందరు బుర్కీనా ఫాసోలోని ఓగాడోగో నుండి కెనడాలోని విన్నిపెగ్‌కు వెళ్లాలనుకున్నారు.
ఇలా వచ్చిన 19,000 ప్రతిపాదనలకు WHQ ట్రావెల్ బృందం ఫ్లైట్ టికెట్లను బుక్ చేసింది. కేవలం ఈ ఏర్పాటు కోసమే వేర్వేరు సంఘాలు పంపించిన విరాళాలతో, 176 దేశాల్లో ఉన్న దాదాపు 4,500 మందికి ఫ్లైట్ టికెట్లు కొని పంపారు.
ఈ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక పూర్తికాల సేవకులందరూ చాలా సంతోషించారు. మిషనరీ సేవ చేస్తున్న ఓ జంట ఇలా రాసింది, “ఈ రోజు మేము తిరిగి మా నియామకాన్ని కొనసాగించడానికి సౌత్ఈస్ట్ ఆసియాకు వెళ్తున్నాం. మేము ఐదు సంవత్సరాల తర్వాత మా సొంత దేశమైన ఇంగ్లాండ్‌కు వెళ్లి మా కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాం. ఈ ఏర్పాటు చేసిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. మీరు ఈ ఏర్పాటు చేయకపోయుంటే మేము అసలు మా దేశానికి వెళ్లగలిగేవాళ్లమే కాదు. కాబట్టి ఈ ఏర్పాటు చేసినవాళ్లందరికీ మేము గుండె లోతుల్లో నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.”
పరాగ్వేలో మిషనరీగా సేవ చేస్తున్న ఓ సహోదరుడు ఇలా రాశాడు, “అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యే అవకాశం కల్పించినందుకు నేనూ, నా భార్య మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము 2011లో, అమెరికాలోని మన ప్రధాన కార్యాలయాన్ని చూడడానికి వెళ్లాలనే ప్రణాళికను వేసుకున్నాం. దానికోసం కొంచెం డబ్బును కూడా దాచిపెట్టుకున్నాం. కానీ ఆ సంవత్సరం జూన్ నెలలో, పరగ్వేలోని సంజ్ఞా భాషా సంఘాలను సందర్శించమనే ఆహ్వానం మాకు వచ్చింది. దానికోసం మేము చాలా దూరం ప్రయాణించాలి. కాబట్టి బాగా ఆలోచించాక అమెరికా వెళ్లాలనే మా ఆలోచనను వాయిదా వేసుకుని, మేము దాచుకున్న డబ్బులతో మా కొత్త నియమకాన్ని మరింత బాగా చేసేందుకు సహాయపడేలా ఓ కారును కొనుక్కున్నాం. తర్వాత అంతర్జాతీయ సమావేశానికి రమ్మని ఆహ్వానిస్తూ మాకు ఉత్తరం వచ్చింది. అలా మా కల నిజమైంది. యెహోవా మంచితనానికి, ఆయన మాపట్ల చూపించిన ప్రేమకు మేము చాలా రుణపడివున్నాం.”
“మేము ఓ పెద్ద థ్యాంక్స్ చెప్పడానికి ఈ చిన్న ఈ-మెయిల్‌ను పంపిస్తున్నాం. మాకందరికీ ఇన్ని టికెట్లు బుక్ చేయడానికి మీరందరూ ఎంత శ్రమ పడ్డారో, ఎంత సమయాన్ని డబ్బును ఖర్చు చేశారో మేము అర్థం చేసుకోగలం. మీరు పడిన కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నిటికన్నా మించి యెహోవా సంస్థ చూపించిన ఉదారత వల్లే మేము మా స్వదేశానికి వెళ్లి అంతర్జాతీయ సమావేశానికి హాజరవ్వగలిగాం, కుటుంబసభ్యులతో స్నేహితులతో సమయం గడపగలిగాం. ఇందుకు మీకు చాలా కృతజ్ఞతలు” అని మలావీ నుండి ఓ జంట సందేశాన్ని పంపింది.
WHQ ట్రావెల్లో పని చేసిన సహోదరులు తమ పనిలో చాలా సంతోషించారు. ఆ పనిలో భాగం వహించిన మిలావీ ఇలా చెప్పింది, “మిషనరీలు తమ సొంత దేశానికి వెళ్లి తమ కుటుంబసభ్యులను, స్నేహితులను కలుసుకోవడానికి సహాయం చేయడం చాలా అద్భుతంగా అనిపించింది.” ఆ పనిలో సహాయం చేసిన డోరీస్ ఇలా చెప్పింది, “విదేశాల్లో ప్రత్యేక పూర్తికాలసేవ చేస్తున్న వాళ్లపట్ల సంస్థ చూపిస్తున్న అపారమైన ప్రేమను అర్థంచేసుకోవడానికి నాకు ఈ పని సహాయం చేసింది.” ఆ డిపార్ట్మెంట్ ఓవర్సీర్ రాడ్నీ ఇలా అన్నాడు, “ఈ ఏర్పాటుకు నా వంతు సహాయాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది.”
తమ సొంతవాళ్లకు దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి పనిచేస్తున్న తమ సహోదరసహోదరీల కోసం విరాళాలు ఇచ్చే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులందరూ ఆనందించారు.