2014 వార్షిక కూటం రిపోర్టు
100 ఏళ్ల రాజ్యపాలన!
2014 అక్టోబరు 4న జరిగిన వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా 130వ వార్షిక కూటానికి సుమారు 19,000 మంది వచ్చారు. ఆ కూటం అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న జెర్సీ నగరంలోని యెహోవాసాక్షుల సమావేశ హాలులో జరిగింది. ఆ కార్యక్రమాన్ని వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా చూసేలా వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు మార్క్ సాండర్సన్ ఆ కార్యక్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు. మెస్సీయ రాజ్య పరిపాలన ఈ సంవత్సరంతో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి దాన్ని గుర్తుచేసుకుంటూ జరుపుకుంటున్న ఈ కూటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తన ప్రారంభ మాటల్లో చెప్పారు.
మెస్సీయ రాజ్యం ఈ 100 ఏళ్లలో సాధించిన మూడు ముఖ్యమైన విషయాల గురించి సహోదరుడు సాండర్సన్ మాట్లాడారు:
ప్రపంచవ్యాప్త ప్రకటనా పని. యెహోవా ఆశీర్వాదంతో, ఆయన ప్రజలు రాజ్యసువార్తను అందరికీ తెలియజేయడానికి అలుపెరుగకుండా కష్టపడ్డారు. 1914 నాటికి కొన్ని వేలల్లో ఉన్న మన ప్రచారకుల సంఖ్య, 2014 సేవా సంవత్సరానికల్లా 80 లక్షలకన్నా ఎక్కువమందికి చేరింది. యెహోవా ఇక చాలు పని పూర్తైందని చెప్పే వరకూ మనం ఉత్సాహంగా ప్రకటిస్తూనే ఉంటాం.
ఆ రాజ్య పౌరులు ఓ గుంపుగా పొందే రక్షణ. మతనాయకులు, రాజకీయ నాయకులు యెహోవాసాక్షులపై తీవ్ర వ్యతిరేకత తెచ్చారు. ఆఖరికి వాళ్లను నామరూపాల్లేకుండా చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ యెహోవా తన ఆరాధికులను ఓ గుంపుగా కాపాడాడు. యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టులో, యూరోపియన్ మానవ హక్కుల కోర్టులతోపాటు ఇతర కోర్టుల్లో వేసిన ఎన్నో కేసులను మనం గెలిచాం. ఈ రోజువరకు కూడా యెహోవా మనల్ని శ్రద్ధగా చూసుకుంటూనే ఉన్నాడనడానికి మనం సాధించిన ఆ విజయాలే రుజువులు.
అన్నిరకాల ప్రజలను ఐక్యం చేస్తుంది. వివిధ నేపథ్యాలు, జాతులు, భాషలకు చెందిన ప్రజల్ని దేవుని రాజ్యం ఒక్కటి చేసింది. అంతేకాదు వాళ్లకు ఎదురయ్యే కష్టాల సుడిగుండాలను దాటుకొని, ఐక్యంగా యెహోవాను ఆరాధించడానికి ఆ రాజ్యం వాళ్లకు సహాయం చేసింది. “ఇది యెహోవా దేవుడు మాత్రమే సాధించగల ఓ అద్భుతం” అని సహోదరుడు సాండర్సన్ అన్నారు. ఈ చారిత్రక వార్షిక కూటానికి హాజరయ్యే అవకాశం, అక్కడికి వచ్చినవాళ్లందరికీ దొరికిన గొప్ప గౌరవమనే విషయాన్ని సహోదరుడు పదేపదే చెప్పారు.
యెహోవా స్నేహితులవ్వండి వీడియోలు.
గత రెండేళ్లగా పిల్లల కోసం వస్తున్న వీడియోలను మనం ఎంతో ఆనందిస్తున్నాం. అవే మన కార్యక్రమంలోని తర్వాతి అంశం. మొదట, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది పిల్లలను ఇంటర్వ్యూ చేసిన వీడియోను సహోదరుడు సాండర్సన్ చూపించారు. ఈ రెండేళ్లల్లో వచ్చిన వీడియోల ద్వారా నేర్చుకున్న విషయాల గురించి పిల్లలు ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం చూసి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.
ఆ తర్వాత “యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు” అనే అంశంతో పిల్లల కోసం వచ్చిన మరో కొత్త వీడియోను చూపించారు. ఆ 12 నిమిషాల వీడియోలో ఒక ఇశ్రాయేలు బాలిక నయమాను భార్యతో యెహోవా గురించి ధైర్యంగా చెప్పిన బైబిలు వృత్తాంతాన్ని కళ్లకుకట్టినట్టు చూపించారు. (2 రాజులు 5:1-14) ఆ వీడియోను 2014, అక్టోబరు 6 సోమవారం jw.org వెబ్‌సైట్‌లో పెట్టారు. అది 20 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది.
JW లాంగ్వేజ్.
డిజిటల్ డివైజ్‌ల కోసం తయారుచేసిన ఈ కొత్త అప్లికేషన్ గురించి సహోదరుడు సాండర్సన్ చెప్పారు. మరింత ఎక్కువ పరిచర్య చేయడానికి కొత్త భాష నేర్చుకోవాలనుకునే యెహోవాసాక్షులకు అది ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్‌లో 18 భాషల్లో 4,000 పదాలు, చిన్నచిన్న వాక్యాలు కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని పదాలను, వాక్యాలను పరిచర్యలో ఎలా మాట్లాడాలో నేర్పించే విషయాలతో పాటు ఇతర ఫీచర్స్‌ను కూడా దీనిలో అదనంగా చేర్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
JW బ్రాడ్‌కాస్టింగ్.
యెహోవాసాక్షులు సమర్పిస్తున్న ఓ కొత్త ఇంటర్నెట్ టీవీ స్టేషన్ గురించి విని ఆ కూటానికి హాజరైనవాళ్లు చాలా ఆనందించారు. అయితే, ఇది ఒక ప్రయోగమే కాబట్టి కేవలం ఇంగ్లీషులోనే దీన్ని మొదలుపెట్టారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న బ్రూక్లిన్‌లో మన ప్రధాన కార్యలయంలో దీన్ని ప్రారంభించారు. ఈ స్టేషన్ నుండే మన వీడియోలు, సంగీతం, నాటకరూపంలో సాగే బైబిలు పఠనం వంటివి ప్రసారమౌతాయి. దానితోపాటు ప్రతీ నెల పరిపాలక సభ సభ్యుడు లేదా పరిపాలక సభకు సంబంధించిన కమిటీలకు సహాయకులుగా ఉన్నవాళ్లు ఇచ్చే ప్రసంగం కూడా ఉంటుంది.
ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయో మొదటిగా ఒక వీడియోను సహోదరుడు సాండర్సన్ పరిచయం చేశారు. ఆ వీడియోలో ఈ కొత్త టీవీ స్టేషన్‌న్ని తయారుచేయడం వెనుక ఎంత పనిజరిగిందో చూపించారు, దానిలో పరిపాలక సభ సభ్యుడు సహోదరుడు స్టీఫెన్ లెట్ మాట్లాడారు. 2014, అక్టోబరు 6న JW ప్రత్యక్ష ప్రసారం మొదలైంది, దీన్ని tv.dan124.comలో మనం చూడవచ్చు.
““100 ఏళ్లు దాటిన రాజ్యపాలన.”
మన పరిచర్య క్రమక్రమంగా విస్తరించి, మెరుగవ్వడానికి దేవుని రాజ్యం ఎలా సహాయం చేసిందో ఓ వీడియో ద్వారా చూపించారు. ఆ వీడియోకి వ్యాఖ్యాతగా పరిపాలక సభ సభ్యుడు సహోదరుడు సామ్యూల్ హెర్డ్ ఉన్నారు. యెహోవాసాక్షుల చరిత్ర గురించి ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్న సాక్షులు చెప్పిన విషయాలను, పునర్నటనలను, వాళ్ల అనుభవాలను ఆ వీడియోలో ప్రదర్శించారు. ముఖ్యంగా “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” తయారుచేసిన విధానం, దాన్ని ఎక్కువమంది ప్రజలకు ఏవిధంగా ప్రదర్శించారో చూపించారు. అంతేకాదు, ఫోనోగ్రాఫ్‌లు, సాక్ష్యపు కార్డులు, సమాచార ప్రదర్శనలు, సౌండ్ కార్లు, పరిచర్య కోసం శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలలు గురించి కూడా ఆ వీడియోలో చూపించారు.
దేవుని రాజ్యం ఈ 100 ఏళ్లలో సాధించిన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? దేవుని రాజ్యం సాధించిన విజయాల గురించి ఆలోచించడం వల్ల, ఆ రాజ్యం మనకు మరింత నిజమైనదిగా అనిపిస్తుంది. అలాగే అది భవిష్యత్తులో నెరవేర్చే విషయాల గురించి ఇంకా ఎక్కువగా ఎదురుచూస్తాం.
ఆరాధన కోసం పాటలు.
పరిపాలక సభ సభ్యుడు డేవిడ్ స్ప్లేన్, యిహోవాకు కీర్తనలు పాడదాం అనే పాటల పుస్తకాన్ని రివైజ్ చేయాలనుకుంటున్నారని చెప్పినప్పుడు అక్కడ హాజరైనవాళ్లందరూ చాలా సంతోషించారు. ఆ పాటల పుస్తకం అట్టను నూతనలోక అనువాదం బైబిల్ కవర్‌ను తయారుచేయడానికి ఉపయోగించిన మెటీరియల్‌తోనే తయారుచేస్తారని, పుస్తకం పేజీల అంచులు వెండి రంగులో ఉంటాయని చెప్పారు. అట్ట కోసం ఇంత నాణ్యమైన మెటీరియల్‌ను ఉపయోగించడం, సంగీతానికి మన ఆరాధనలో ఎంత గౌరవమైన స్థానం ఉందో చూపిస్తుంది.
పాటల పుస్తకంలో మరికొన్ని కొత్త పాటల్ని చేరుస్తున్నట్లు సహోదరుడు స్ప్లేన్ చెప్పారు. అయితే ఆ కొత్తపాటలు పాడడానికి రివైజ్ చేసిన పాటల పుస్తకాన్ని ముద్రించే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఆ పాటలు సిద్ధమైన తర్వాత వాటిని jw.orgలో పెడతారు.
ఈ కూటానికి ముందు వారంలో కొంతమంది బెతెల్ సభ్యులు, కొత్త పాటలలో మూడింటిని ప్రాక్టీసు చేసి వార్షిక కూటంలో పాడారు. “రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!” అనే కొత్తపాటను సహోదరుడు స్ప్లేన్ వాళ్లతో పాడించారు. దేవుని రాజ్య పాలన 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక పాటను కూర్చారు. ఆ పాటను బెతెల్ కుటుంబసభ్యుల బృందం పాడి వినిపించిన తర్వాత, అక్కడ హాజరైనవాళ్లు కూడా తమ గొంతు కలిపారు. దాని తర్వాత “మాకు ధైర్యాన్నివ్వు” అనే అంశమున్న మరో కొత్త పాటను కూడా పాడారు.
ఇంటర్వ్యూ.
పరిపాలక సభ సభ్యుడు గెరిట్ లోష్, బెతెల్‌లో కొన్ని పదుల సంవత్సరాలుగా పనిచేస్తున్న మూడు జంటలను ఇంటర్వ్యూ చేసిన రికార్డింగులను చూపించారు. దేవుని ప్రజలు ముందుకెళ్తున్నారనడానికి రుజువుగా, ఈ సంవత్సరాలన్నిటిలో వాళ్లు చూసిన ఎన్నో మార్పుల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సంస్థలో కొన్ని మార్పులు జరుగుతాయని బైబిలు ముందే చెప్పిందని తెలుపుతూ సహోదరుడు లోష్ అక్కడున్న వాళ్లందరినీ యెహోవా సంస్థతో ముందుకు సాగమని ప్రోత్సహించారు.—యెషయా 60:17.
“పోలికలు లేదా సాదృశ్యాలు.”
ఈ ప్రసంగాన్ని సహోదరుడు స్ప్లేన్ ఇచ్చారు. దీనిలో, ఈ మధ్యకాలంలో మన ప్రచురణల్లో అంతకుముందులా పోలికలు లేదా సాదృశ్యాల గురించి ఎందుకు ప్రస్తావించడంలేదో వివరించారు.
బైబిల్లో ఉన్న కొంతమంది నమ్మకమైన స్త్రీ పురుషులు, మనకాలంలోని నమ్మకమైన క్రైస్తవుల గుంపుకు సూచనగా ఉన్నారని గతంలో మన ప్రచురణలు చెప్పేవి. అదేవిధంగా కొన్ని బైబిలు వృత్తాంతాలను, మనకాలంలో ఉన్న దేవుని ప్రజల గురించి చెప్పిన ప్రవచనాలని అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా, అటువంటి పోలికల గురించి ఎక్కువ నేర్చుకోవడం ఆసక్తిగా అనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలంలో వస్తున్న మన ప్రచురణల్లో పోలికలు లేదా సాదృశ్యాల గురించి ఎందుకు అంత ఎక్కువగా ప్రస్తావించడం లేదు?
కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని సంఘటనలు కొందరికి లేదా మరింత గొప్పవాటికి సూచనగా ఉన్నాయని లేఖనాలు చెప్తున్నాయి. పోలికలు లేదా సాదృశ్యాల గురించి బైబిలు స్పష్టంగా చూపించినప్పుడు మనం సంతోషంగా ఒప్పుకుంటాం. “కానీ బైబిలు మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా మౌనంగా ఉంటాం” అని సహోదరుడు స్ప్లేన్ చెప్పారు. ప్రతీ వృత్తాంతానికి వేరే ఏదో అర్థం ఉందని మనం అనుకోకూడదు. పైగా పోలికలు లేదా సాదృశ్యాల గురించి వాటి నెరవేర్పుల గురించి వెతకుతూ ఎక్కువ సమయం గడిపేస్తే, ఆ వృత్తాంతాలు మనకు నేర్పించే విలువైన పాఠాలను మనం తెలుసుకోలేం. మనం పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లమైన లేదా భూమ్మీద నిత్యం జీవించేవాళ్లమైనా మనకు రోజువారి జీవితంలో ఉపయోగపడే ఎన్నో విలువైన పాఠాలను బైబిలు వృత్తాంతాల మనకు నేర్పిస్తాయి.—రోమా 15:4. a
“‘మీరు మెలకువగా ఉంటారా’?”
అనే అంశమున్న ఈ ప్రసంగాన్ని సహోదరుడు లెట్ ఇచ్చారు. యేసు చెప్పిన పదిమంది కన్యల ఉపమానం విషయంలో మన అవగాహనను మార్చుకోవడానికి ఈ ప్రసంగం సహాయం చేసింది. (మత్తయి 25:1-13) ఇప్పుడు ఆ ఉపమానాన్ని మనం ఇలా అర్థం చేసుకుంటాం, పెళ్లికుమారుడు యేసును సూచిస్తున్నాడు, పదిమంది కన్యకలు యేసు అభిషిక్త అనుచరులను సూచిస్తున్నారు. (లూకా 5:34, 35; 2 కొరింథియులు 11:2) ఆ ఉపమానం చివరి రోజులకు సంబంధించినది. ఆ ఉపమాన నెరవేర్పు మహాశ్రమల కాలంలో ముగుస్తుంది. ఐదుమంది బుద్ధిలేని కన్యకల గురించి వివరించినప్పుడు, తన అభిషిక్త శిష్యుల్లో చాలామంది చివరివరకు నమ్మకంగా ఉండలేరని, వాళ్ల స్థానంలో వేరేవాళ్లను అభిషేకించాల్సి ఉంటుందని యేసు చెప్పడం లేదు. బదులుగా, ఆయన ఓ శక్తివంతమైన హెచ్చరికను ఇస్తున్నాడు. కన్యకల్లో ఐదుమంది బుద్ధిగా ఉండి, మరో ఐదుమంది బుద్ధిలేకుండా ఉన్నట్టు, ప్రతీ అభిషిక్తుడికి రెండు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా, మెలకువగా ఉండాలో లేదా మధ్యలో పక్కకి తొలగిపోవాలో నిర్ణయించుకునే అవకాశం ప్రతీ అభిషిక్త క్రైస్తవునికి ఉందని యేసు ఆ ఉపమానం ద్వారా చెప్తున్నాడు.
ప్రతీ వృత్తాంతానికి దేనికో సూచనగా ఉందని ఎలా అయితే అనుకోకూడదో అదేవిధంగా ఉపమానంలోని ప్రతీ విషయానికి ఏదో అర్థం ఉందని కూడా అనుకోకూడదు. దానికి బదులు, ఆ ఉపమానంలో మనకు ఉపయోగపడే పాఠాలు ఏమున్నాయో గ్రహించడానికి మనం ప్రయత్నించాలి. మనం అభిషిక్తులమైనా లేదా వేరే గొర్రెలమైనా మన వెలుగును తేజోవంతంగా ప్రకాశించి, ‘మెలకువగా’ ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. (యెహాను 10:16; మార్కు 13:37; మత్తయి 5:16) మన కోసం వేరేవాళ్లు నమ్మకంగా ఉండలేరు. మనలో ప్రతీ ఒక్కరం “జీవమును కోరుకొని” ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటూ, పరిచర్యలో చురుగ్గా ఉండాలి.—ద్వితియోపదేశకాండం 30:19.
“తలాంతుల ఉపమానం.”
ఈ ఉపమానాన్ని అర్థంచేసుకోవడంలో వచ్చిన మార్పును గురించి పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్ ప్రసంగించారు. (మత్తయి 25:14-30) కొత్త అవగాహన ఏమిటంటే, యజమానుడు (యేసు) తన దాసులకు (భూమ్మీదున్న తన అభిషిక్త అనుచరులకు) ఆయన భవిష్యత్తులో వచ్చినప్పుడు వాళ్లను పరలోకానికి పునరుత్థానం చేయడం ద్వారా వాళ్లకు బహుమానాన్ని ఇస్తాడు. ‘సోమరియైన చెడ్డ దాసుడి’ గురించి మాట్లాడినప్పుడు, అభిషిక్త అనుచరుల్లో చాలామంది నమ్మకంగా ఉండరని యేసు చెప్పడం లేదు. బదులుగా, చెడ్డ దాసునిలా అవ్వకూడదంటే మెలకువగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తన అభిషిక్త అనుచరుల్ని హెచ్చరిస్తున్నాడు.
ఈ ఉపమానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ ఉపమానంలోని యజమానుడు తన దాసులకు ఆస్తిని అప్పగించాడు. అదేవిధంగా, యేసు కూడా ప్రకటించి శిష్యులను చేసే అమూల్యమైన బాధ్యతను యేసు తన అనుచరులకు అప్పగించాడు. మన పరిస్థితులకు తగ్గట్టు ఆ ప్రకటనా పనిని మనందరం ఉత్సాహంగా చేయాలని ఆయన కోరుతున్నాడు. ఆ కూటానికి హాజరైనవాళ్లలో, రాజ్య పనుల్లో ఆసక్తిగా భాగం వహిస్తున్న వాళ్లందర్నీ సహోదరుడు మారిస్ మెచ్చుకున్నారు.
దేవుని ప్రజలపై త్వరలోనే ఎవరు దాడిచేస్తారు?
ఆ కార్యక్రమంలోని చివరి ప్రసంగం అదే. ఆసక్తికరమైన ఆ ప్రసంగాన్ని పరిపాలక సభ సభ్యుడు జెఫ్రీ జాక్సన్ ఇచ్చారు. మాగోగువాడైన గోగు దేవుని ప్రజలమీద భవిష్యత్తులో చేసే దాడి గురించి సహోదరుడు జాక్సన్ వివరించారు.—యెహెజ్కేలు 38:14-23.
గతంలో, గోగు అనేది సాతాను పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత అతనికి వచ్చిన మరో పేరని మనం అర్థం చేసుకున్నాం. కానీ ఆ వివరణ వల్ల తలెత్తే ఎన్నో ప్రాముఖ్యమైన ప్రశ్నల గురించి సహోదరుడు జాక్సన్ చర్చించారు. ఉదాహరణకు, గోగు ఓడిపోయినప్పుడు, యోహావా ఆయన్ని “నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా” ఇస్తాడని ప్రవచించాడు. (యెహెజ్కేలు 39:4) అంతేకాదు, “గోగును అతని సైన్యమంతటిని” పాతిపెట్టడానికి భూమ్మీద ఒక స్థలం ఇవ్వబడుతుందని కూడా యెహోవా ప్రవచించాడు. (యెహెజ్కేలు 39:11) కానీ ఇవ్వన్నీ ఓ ఆత్మప్రాణి విషయంలో ఎలా జరుగుతాయి? సాతాను అగాధములో 1,000 సంవత్సరాలు పడద్రోయబడతాడు గానీ అతన్ని ఆహారంగా వేయడం లేదా పాతిపెట్టడం జరగదు. (ప్రకటన 20:1, 2) అంతేకాదు, 1,000 సంవత్సరాల చివర్లో సాతాను అగాధం నుండి విడుదలై, ‘భూమి నలుదిశలయందుండు జనులను, గోగు మాగోగు అనువారిని మోసం’ చేయడానికి బయలుదేరతాడు. (ప్రకటన 20:7, 8) ఒకవేళ సాతానే గోగు అయితే, వాడు తనను తాను మోసం చేసుకోలేడు అనే విషయం స్పష్టం.
కాబట్టి యెహెజ్కేలు ప్రవచనంలో ఉన్న మాగోగువాడైన గోగు సాతానును కాదుగానీ భవిష్యత్తులో దేవుని ప్రజలపై దాడిచేసే కొన్ని దేశాల గుంపును సూచిస్తోందని సహోదరుడు జాక్సన్ వివరించారు. బహుశా, గోగు చేసే దాడి “ఉత్తరదేశపు రాజు,” “భూరాజులు” చేసే దాడిలాంటిదే కావచ్చు.—దానియేలు 11:40, 44, 45; ప్రకటన 17:12-14; 19:19.
“ఉత్తరదేశాపు రాజు,” ఎవర్ని సూచిస్తున్నాడు? అది మనం వేచిచూడాల్సిందే. ఏదేమైనా, భవిష్యత్తులో ఈ సంఘటనలన్నీ నెరవేరే సమయం దగ్గరపడే కొద్దీ మన అవగాహనలో వస్తున్న మార్పులను చూస్తుంటే మన విశ్వాసం మరింత బలపడుతుంది. దేవుని ప్రజల మీద జరగబోయే దాడి గురించి మనం భయపడం ఎందుకంటే మాగోగువాడైన గోగు దాడి చేసినప్పుడు అతడు ఓడిపోతాడు, పూర్తిగా నాశనమౌతాడు గానీ దేవుని ప్రజలు మాత్రం నిరంతరం జీవిస్తారని మనకు తెలుసు. b
ముగింపు.
ఇప్పుడు నూతనలోక అనువాదం పాకెట్-సైజ్ బైబిల్ అందుబాటులో ఉందని సహోదరుడు సాండర్సన్ ప్రకటించారు. అంతేకాదు బైబిల్ని ఆడియో రూపంలో కూడా తయారు చేస్తున్నారు. ఆ రికార్డింగులో ఒక్కో బైబిలు పాత్రను ఒక్కొక్కరు చదివారు. మత్తయి పుస్తకం నుండి ఉండే ఈ రికార్డింగులను కొన్ని రోజుల తర్వాత jw.orgలో పెడతారు.
2015వ సంవత్సరం వార్షికవచనం కీర్తన 106:1, “యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి” అని కూడా సహోదరుడు సాండర్సన్ ప్రకటించారు. మనం ప్రతిరోజు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పే అవకాశాల కోసం వెదకాలని ఆయన ప్రోత్సహించారు.
మూడో కొత్త పాట అయిన “యెహోవా నీ పేరు” అనే అద్భుతుమైన పాటను ఈ కూటం ముగింపు పాటగా ఎన్నుకున్నారు. బెతెల్ కుటుంబ బృందం వేదిక మీద ఈ పాటను పాడుతుండగా ఏడుగురు పరిపాలక సభ సభ్యులు కూడా వాళ్లతో గొంతు కలిపారు. అలాగే ఆ కూటానికి వచ్చిన వాళ్లందరూ కూడా ఆ పాట పాడారు. చరిత్రలో నిలిచిపోయే ఈ కూటానికి ఇది నిజంగా ఓ చక్కని ముగింపు.