క్విబెక్ సంజ్ఞా భాష అనువాదం వల్ల ప్రయోజనాలు
తూర్పు కెనడాకు చెందిన ఫ్రెంచ్ భాషా ప్రాంతాల్లోని బధిరుల్లో ఎక్కువమంది క్విబెక్ సంజ్ఞా భాషను (LSQ) ఉపయోగిస్తారు. a అక్కడ కేవలం 6,000 మంది బధిరులే ఉన్నారు కాబట్టి, LSQ భాషలో కొన్ని ప్రచురణలే అందుబాటులో ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్న విషయాలు అర్థంచేసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి LSQ భాషలో హై-క్వాలిటీ ప్రచురణల్ని ఉచితంగా అందుబాటులోకి తేవాలని ఈమధ్య కాలంలో యెహోవాసాక్షులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
అనువదించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎందుకు ప్రాముఖ్యమైనవో అర్థం చేసుకోవడానికి, మార్సెల్ అనుభవాన్ని గమనించండి. అతను 1941లో, కెనడా ప్రాంతమైన క్విబెక్‌లో పుట్టాడు. రెండేళ్ల వయసులో మొదడువాపు వల్ల అతని వినికిడి శక్తి పోయింది. మార్సెల్ ఇలా అంటున్నాడు: “తొమ్మిదేళ్ల వయసులో నేను బధిరుల పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాను, అక్కడ నేను LSQ నేర్చుకున్నాను. అప్పట్లో ప్రాథమిక సంజ్ఞా భాష నేర్పించడానికి కొన్ని పుస్తకాలు ఉన్నా, సంజ్ఞా భాషలో ప్రచురణలు మాత్రం లేవు.”
LSQ భాషలో ప్రచురణలు తయారుచేయడం ఎందుకు ప్రాముఖ్యం? మార్సెల్ ఇలా చెప్తున్నాడు: “అర్థంకాని భాషతో ఇబ్బంది పడడం కన్నా, తమకు పూర్తిగా అర్థమయ్యే భాషలో సమాచారం ఉన్నప్పుడు బధిరులు సంతోషిస్తారు. LSQ భాషలో ప్రచురణలు లేకపోతే, మాట్లాడే భాషల మీద మేము ఆధారపడాల్సి ఉంటుంది—దానివల్ల మేము ఎంతో కోల్పోతాం!”
LSQ భాషను ఉపయోగించే మార్సెల్ కోసం, అలాగే మిగతా బధిరుల ప్రయోజనం కోసం 2005లో యెహోవాసాక్షులు తమ మొదటి LSQ భాషా ప్రచురణను విడుదల చేశారు. ఈమధ్యే వాళ్లు క్విబెక్‌లోని మాంట్రియల్‌లో ఉన్న తమ అనువాద కార్యాలయాన్ని విస్తరించారు. అందులో ఇప్పుడు ఏడుగురు పూర్తికాల సేవకులు, 12 కన్నా ఎక్కువమంది పార్ట్-టైం సేవకులు పనిచేస్తున్నారు. వాళ్లు మూడు అనువాద గుంపులుగా పనిచేస్తున్నారు, LSQ వీడియోలు తయారుచేయడానికి వాళ్లకు అక్కడే రెండు ప్రొఫెషనల్ స్టూడియోలు కూడా ఉన్నాయి.
LSQ భాషను ఉపయోగించేవాళ్లు యెహోవాసాక్షుల ప్రచురణల నాణ్యతను ఎంతో మెచ్చుకుంటారు. అసోసీయేసీయోన్ డే సుర్ డ లెస్ట్రీ b సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ స్టేఫన్ జాక్ ఇలా అంటున్నాడు: “వాళ్లు ప్రచురణల్ని చక్కగా తయారుచేస్తారని నేను గమనించాను. సంజ్ఞలు చాలా స్పష్టంగా ఉంటాయి, ముఖకవళికలు చక్కగా ఉంటాయి. అంతేకాదు, వీడియో ప్రోగ్రామ్‌లలో ఉన్నవాళ్లు పద్ధతిగా బట్టలు వేసుకుంటారు.”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ప్రతీవారం జరుపుకునే కూటాల్లో కావలికోట పత్రికను ఉపయోగిస్తారు. క్విబెక్‌లో ఐదు LSQ సంఘాలు, రెండు LSQ గ్రూపులు ఉన్నాయి. అందులో జరిగే కూటాలకు 220 మంది యెహోవాసాక్షులు, ఇతరులు హాజరౌతారు. వాళ్లకోసం ఇప్పుడు కావలికోట LSQ భాషలో కూడా అందుబాటులో ఉంది. c అంతేకాదు యెహోవాసాక్షులు రానురాను ఎక్కువ సంఖ్యలో LSQ భాష వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రచురిస్తున్నారు, వాటిలో ప్రోత్సహించే బైబిలు ఆధారిత పాటలు కూడా ఉన్నాయి.
LSQ భాషలో ఎక్కువ ప్రచురణలు ఉండడం చూసి మార్సెల్ చాలా సంతోషిస్తున్నాడు. ముఖ్యంగా యెహోవాసాక్షులు తయారుచేసిన వాటిని అతను ఎంతో విలువైనవిగా ఎంచుతున్నాడు. అతను ఇలా అంటున్నాడు: “jw.orgలో ఎన్నో LSQ భాషా వీడియోలు ఉండడాన్ని చూడడం గొప్ప ఆశీర్వాదం. నా భాషలో ఇంత సమాచారం ఉండడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది!”
a ఎక్కువగా ఉపయోగించే అమెరికన్ సంజ్ఞా భాషతో LSQకి (ఇది దాని ఫ్రెంచ్ పేరు నుండి, అంటే లాంగ్ డే సీన్య కెబెక్‌వాజ్ నుండి వచ్చింది) కొన్ని పోలికలు ఉన్నా, ఇది ఒక ప్రత్యేకమైన సంజ్ఞా భాష.
b క్విబెక్‌లో ఉన్న బధిరులకు సంబంధించిన ఒక చారిటీ సంస్థ.
c కావలికోట అధ్యయన ప్రతి 2017 జనవరి నుండి LSQ భాషలో కూడా వస్తోంది.