దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో యెహోవాసాక్షులు ఎందుకు పాల్గొనరు?
యెహోవాసాక్షులు అన్ని ప్రభుత్వాల్ని, జాతీయ చిహ్నాలను గౌరవిస్తారు. సాధారణంగా చాలామంది ప్రజలు తమ దేశభక్తిని చాటుకుంటూ ప్రతిజ్ఞ చేస్తారు, జెండా వందనం చేస్తారు, లేదా జాతీయ గీతం పాడతారు.
అయితే యెహోవాసాక్షులైన మేము, అలాంటి వాటికి దూరంగా ఉంటాం; ఎందుకంటే అవి బైబిలు చెప్తున్నవాటికి విరుద్ధంగా ఉన్నాయని నమ్ముతాం. కానీ వేరేవాళ్ల నమ్మకాల్ని మాత్రం మేం గౌరవిస్తాం, మా నమ్మకాల్ని కూడా ఇతరులు గౌరవించినప్పుడు సంతోషిస్తాం.
ఈ ఆర్టికల్‌లో ఏం ఉన్నాయంటే:
మా నిర్ణయానికి కారణమైన బైబిలు సూత్రాలు ఏంటి?
కిందున్న ఈ రెండు ముఖ్యమైన బైబిలు సూత్రాలే దానికి కారణం:
మన ఆరాధనకు దేవుడు మాత్రమే అర్హుడు. “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి” అని బైబిలు చెప్తోంది. (లూకా 4:8) కానీ ప్రతిజ్ఞల్లో, జాతీయ గీతాల్లో ఉండే పదాలు, తమ దేశాన్నే అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తామని మాటిస్తున్నట్లు ఉంటాయి. అందుకే యెహోవాసాక్షులు అలాంటివాటికి దూరంగా ఉంటారు.
విగ్రహారాధన చేయొద్దని కూడా బైబిలు చెప్తుంది. అయితే, జెండా వందనం చేయడం ఒక విగ్రహాన్ని పూజించడంతో సమానమని మాకనిపిస్తుంది. (1 కొరింథీయులు 10:14) నిజానికి జాతీయ జెండాలు మతపరమైన చిహ్నాలని కొంతమంది చరిత్రకారులు అంటారు. “దేశభక్తి ఒక మతం లాంటిదైతే, జెండా ఆ మతానికి ముఖ్య చిహ్నం, ఆరాధనా వస్తువు” అని చరిత్రకారుడైన కార్ల్‌టన్ జె. హెచ్ హేస్ అన్నారు. a మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల గురించి డానియెల్ పి. మాన్నిక్స్ అనే రచయిత ఇలా అన్నారు: ’అప్పటి క్రైస్తవులు [రోమా] చక్రవర్తిని కాపాడుతూ ఉండే అదృశ్య శక్తికి బలి అర్పించడానికి ఇష్టపడలేదు. మనకాలంలో కొంతమంది జెండా వందనం చేయడానికి ఇష్టపడకపోవడం కూడా అలాంటిదే.’ b
మేం జెండా వందనం చేయకపోయినా జెండాను గౌరవిస్తాం. జెండాను పాడుచేయడం, కాల్చడం, ఏవిధంగానైనా దాన్ని అవమానించడం లాంటివి అస్సలు చేయం. జెండానే కాదు, ఏ జాతీయ చిహ్నాన్నీ అవమానించం.
దేవుని ముందు మనుషులందరూ సమానమే. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) ‘దేవుడు ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడని’ బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యాలు 17:26) కాబట్టి ఒక జాతి ప్రజల్ని గానీ, ఒక దేశ ప్రజల్ని గానీ మిగతావాళ్ల కన్నా గొప్పవాళ్లుగా చూడడం సరైనది కాదని మేం నమ్ముతాం. పుట్టి, పెరిగిన దేశంతో సంబంధం లేకుండా ప్రజలందర్నీ ఒకేలా గౌరవిస్తాం.—1 పేతురు 2:17.
ఇలాంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని చట్టం కోరితే ఏం చేస్తాం?
యెహోవాసాక్షులైన మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. ప్రభుత్వాలు ’దేవుని ఏర్పాటని,’ ఆయన అనుమతి ఉండడం వల్లే అవి పరిపాలిస్తున్నాయని మేం నమ్ముతాం. (రోమీయులు 13:1-7) ప్రభుత్వాధికారుల మాటను క్రైస్తవులందరూ వినాలని కూడా నమ్ముతాం.—లూకా 20:25.
ఒకవేళ, దేవుడు వద్దని చెప్తున్న ఏదైనా పనిని చేయమని చట్టం కోరితే అప్పుడేంటి? కొన్ని సందర్భాల్లో, ఫలానా చట్టంలో మార్పు చేయమని ప్రభుత్వానికి విన్నపం చేసుకునే అవకాశం ఉంటుంది. c మార్పు చేసే అవకాశం లేని పరిస్థితుల్లో, ’మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదని’ గుర్తుంచుకుంటాం.—అపొస్తలుల కార్యాలు 5:29.
యెహోవాసాక్షులు సామాజికపరంగా లేదా రాజకీయపరంగా ఎవరి వైపైనా ఉన్నారా?
లేదు. యెహోవాసాక్షులైన మేము సామాజికపరంగా లేదా రాజకీయపరంగా ఎవరి వైపూ ఉండం. నిజమే, మేం ప్రతిజ్ఞలు గానీ, జెండా వందనం గానీ చేయము, జాతీయ గీతం పాడము; దానర్థం మేము రాజకీయపరంగా విప్లవాత్మక మార్పుల కోసం పోరాడతామని కాదు. మేం నమ్మే బైబిలు బోధలకు అవి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టే వాటికి దూరంగా ఉంటాం.
a ఎస్సేస్ ఆన్ నేషనలిజమ్, 107-108 పేజీలు.
b ద వే ఆఫ్ గ్లాడియేటర్, 212వ పేజీ.
c ఉదాహరణకు, “75 ఏళ్ల క్రితం ధైర్యంగా మనస్సాక్షిని బట్టి నిర్ణయం తీసుకున్నవాళ్ల పక్షాన సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు!” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్ చూడండి.