మతం మార్చుకోమని యెహోవాసాక్షులు ప్రజల్ని బలవంతపెడతారా?
లేదు. మేము అలా చేయం. “మతం మార్చుకోమని ప్రజల్ని బలవంతపెట్టడం తప్పు” అని మేం ముఖ్యంగా ఉపయోగించే కావలికోట అనే పత్రికలో చెప్పాం. a మేము వేరేవాళ్లను ఎందుకు అలా బలవంతపెట్టమంటే:
తాను బోధించేవాటిని అంగీకరించమని యేసు ప్రజల్ని ఎప్పుడూ బలవంతపెట్టలేదు. తన బోధల్ని కేవలం కొద్దిమందే అంగీకరిస్తారని ఆయనకు ముందే తెలుసు. (మత్తయి 7:13, 14) ఆయన మాటలకు కొంతమంది ఇబ్బందిపడి వెళ్లిపోయినప్పుడు యేసు వాళ్లని వెళ్లిపోనిచ్చాడేగానీ ఉండమని బలవంతం చేయలేదు.—యోహాను 6:60-62, 66-68.
తమ నమ్మకాల్ని మార్చుకోమని ఇతరుల్ని బలవంతపెట్టొద్దని యేసు తన శిష్యులకు నేర్పించాడు. అంతేకాదు, ఇష్టంలేకపోయినా రాజ్యసువార్తను అంగీకరించమని ప్రజల్ని బలవంతపెట్టే బదులు రాజ్యసువార్తను అంగీకరించే ప్రజల కోసం వెతకమని ఆయన చెప్పాడు.—మత్తయి 10:7, 11-14.
బలవంతంగా మతం మార్చడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసే ఆరాధనను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.—ద్వితీయోపదేశకాండము 6:4, 5; మత్తయి 22:37, 38.
మేము చేస్తున్నది మతప్రచారమా?
బైబిలు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, మేము “బహిరంగముగాను, ఇంటింటను” ప్రకటిస్తూ “భూదిగంతముల వరకు” బైబిలు సందేశాన్ని తెలియజేస్తామనే మాట నిజమే. (అపొస్తలుల కార్యములు 1:8; 10:42; 20:20) కానీ మొదటి శతాబ్దంలోని క్రైస్తవులపై నింద వేసినట్లే మా మీద కూడా మతప్రచారం చేస్తున్నారనే నిందను అన్యాయంగా వేస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 18:12, 13) కానీ ఆ నిందలన్నీ పచ్చి అబద్ధాలు. మేం మా నమ్మాకాలను ఎవ్వరిపైనా బలవంతంగా రుద్దము. కానీ మంచి నిర్ణయం తీసుకునేంత జ్ఞానం పెంచుకునే అవకాశం ప్రజలకు ఉండాలని మేం నమ్ముతాం.
ఇష్టంలేకపోయినా మతం మార్చుకోమని మేం ప్రజల్ని బలవంతపెట్టం. లేదా మతం అనే ముసుగులో రాజకీయ పనులు చేయం. అంతేకాదు మా మతంలో కొత్త సభ్యులను చేర్చుకోవాలనే ఉద్దేశంతో, మా మతంలో చేరితే మీకు ఇన్ని లాభాలు ఉంటాయని ఎవ్వరికీ మాయమాటలు చెప్పం. కానీ కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేస్తూ క్రీస్తుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. b
ఓ వ్యక్తికి మతం మార్చుకునే హక్కు ఉంటుందా?
ఉంటుంది, మతం మార్చకునే హక్కు ప్రజలకు ఉందని బైబిలు చెప్తోంది. తమ కుటుంబసభ్యులు పాటిస్తున్న మతాన్ని విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని సొంతంగా నిర్ణయించుకున్న ఎంతోమంది ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అబ్రాహాము, రూతు, ఏథెన్సులోని కొంతమంది ప్రజలు, అపొస్తలుడైన పౌలు ఆ కోవకు చెందినవాళ్లే. అలాంటి వాళ్లు ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. (యెహోషువ 24:2; రూతు 1:14-16; అపొస్తలుల కార్యములు 17:22, 30-34; గలతీయులు 1:14, 23) దానితోపాటు, దేవుడు ఇష్టపడే ఆరాధనను విడిచిపెట్టాలనే తెలివితక్కువ నిర్ణయాన్ని తీసుకునే హక్కు కూడా ఓ వ్యక్తికి ఉంటుందని బైబిలు చెప్తోంది.—1 యోహాను 2:19.
యునివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ప్రజలకు మతం మార్చకునే హక్కు ఉంది. దాన్నే అమెరికా “ద ఫౌండేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా” అని పిలుస్తోంది. ఆ ప్రకటన ప్రకారం, ప్రతీఒక్కరికీ “తమ మతాన్ని లేదా నమ్మకాల్ని మార్చుకునే స్వేచ్ఛ” అలాగే మతానికి సంబంధించిన లేదా వేరే ఏదైనా “సమాచారాన్ని లేక సలహాల్ని వెతికే, తీసుకునే, ప్రచారం చేసే” హక్కు ఉంది. c అంతేకాదు, ఈ హక్కులతోపాటు తమ నమ్మకాల్ని పాటించే విషయంలో అలాగే ఇష్టంలేని నమ్మకాల్ని తిరస్కరించే విషయంలో ఇతరులకున్న హక్కును గౌరవించాలని కూడా ఆ ప్రకటన చెప్తుంది.
మతం మార్చుకుంటే కుటుంబ సంప్రదాయాల పట్ల లేదా ఆచారాల పట్ల గౌరవం లేనట్లా?
అలా ఏమీ కాదు. ఏ మతానికి చెందినవాళ్లనైనా గౌరవించాలని బైబిలు చెప్తుంది. (1 పేతురు 2:17) దానితోపాటు తల్లిదండ్రులను గౌరవించాలని బైబిలు ఇస్తున్న ఆజ్ఞను యెహోవాసాక్షులు పాటిస్తారు. ఒకవేళ వాళ్ల అమ్మానాన్నలు వేరే మతస్థులైనా సాక్షులు ఆ ఆజ్ఞను పాటిస్తారు.—ఎఫెసీయులు 6:2, 3.
అయినాసరే, బైబిలు చెప్తున్నదాన్ని అందరూ ఒప్పుకోరు. జాంబియాలో పెరిగిన ఓ మహిళ ఏం అంటుందంటే, “మా ఆచారం ప్రకారం, మతం మార్చుకోవడమంటే ... నమ్మకద్రోహం చేసినట్లే. కుటుంబాన్ని, ఆ మతానికి చెందినవాళ్లని మోసంచేసినట్లే.” ఈ మహిళ టీనేజీలో ఉన్నప్పుడు ఈ సమస్యని ఎదుర్కొంది. ఎందుకంటే ఆమె అప్పుడు యెహోవాసాక్షులతో కలిసి బైబిలు స్టడీ చేసేది, కొంతకాలం తర్వాత ఆమె యెహోవాసాక్షిగా మారాలనుకుంది. ఆమె ఇలా చెప్తోంది, “నా నిర్ణయం నచ్చలేదని, నేను వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని మా అమ్మానాన్నలు మాటిమాటికి అనేవాళ్లు. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే వాళ్లు నా నిర్ణయాన్ని ఒప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ... నా మతాచారాలకు బదులు యెహోవాకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నంత మాత్రాన నా కుటుంబానికి నమ్మకద్రోహం చేసినట్లుకాదు.” d
a కావలికోట జనవరి 1, 2002 సంచిక 12వ పేజీలోని 15వ పేరా చూడండి.
b ఉదాహరణకు, సుమారు సా.శ. 785లో, సాక్సొనిలోని ప్రజలు ఎవరైతే బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులుగా మారడానికి ఒప్పుకోరో వాళ్లందర్నీ చంపేయమని షార్లిమాన్ అనే రాజు ఓ ఆజ్ఞ జారీ చేశాడు. అంతేకాదు పవిత్ర రోమా సామ్రాజ్యం అని పిలువబడిన దేశంలో, ఒకరితో ఒకరు పోరాడుకుంటున్న వర్గంవాళ్లు సా.శ. 1555లో పీస్ ఆఫ్ ఆగ్స్‌బర్గ్ అనే ఓ శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం, ప్రతీ ప్రాంతాన్ని పరిపాలించే పాలకుడు రోమన్ క్యాథలిక్ గానీ లూథరన్ గానీ అయ్యుండాలి. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ తమ పాలకుని మతంలోకి మారాలి. ఒకవేళ అలా మారడానికి ఎవరైనా ఇష్టపడకపోతే వాళ్లు ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వలస వెళ్లిపోవాలి.
c ఇలాంటి హక్కుల గురించి ఆఫ్రికా దేశం తయారు చేసిన చట్టంలో, ద అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్‌లో, ద 2004 అరబ్ చార్టర్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో, ద ASEANలో (అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్) హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్‌లో, ద యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో, ద ఇంటర్నేషనల్ కవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్‌లో కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి హక్కుల్ని తమ ప్రజలకు ఇచ్చామని చెప్పుకుంటున్న దేశాలు వాటిని అమలు చేసే విషయంలో వేర్వేరుగా ఉన్నాయి.
d బైబిల్లో సత్య దేవుని పేరు యెహోవా అని ఉంది.