చదువు విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏంటి?
చదువు విషయంలో మా అభిప్రాయాలు బైబిలు ప్రమాణాల ఆధారంగా ఉంటాయి. దేవుని ప్రమాణాలను ఎలా పాటించాలో ప్రతి సాక్షి తన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయించుకుంటాడు, కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. a
చదువు చాలా ముఖ్యం
చదువు ప్రజలకు “జ్ఞానమును వివేచనను” పెంచుకునేలా సహాయం చేస్తుంది, ఆ లక్షణాల గురించి బైబిలు చాలా గొప్పగా చెప్తుంది. (సామెతలు 2:10, 11; 3:21, 22) ఇంకా, యేసు తను చెప్పిన విషయాలను ఇతరులకు బోధించే వాళ్లుగా ఉండమని తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 28:19, 20) అందుకే, మా సభ్యులకు మంచి విద్యను అభ్యసించమని అంటే చదవడం, రాయడం, చక్కగా సంభాషించడం నేర్చుకునేలా, b ఇతర మతాలకు, సంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానం పెంచుకునేలా ప్రోత్సహిస్తాం, ఆ విషయంలో వాళ్లకు సహాయం చేస్తాము.—1 కొరింథీయులు 9:20-22; 1 తిమోతి 4:13.
ప్రభుత్వాలు కూడా చదువు ఎంత ముఖ్యమో గుర్తిస్తాయి అందుకే పిల్లలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించాలని తరచుగా కోరతాయి. అలాంటి చట్టాలకు మేము ఈ మాటలకు అనుగుణంగా లోబడతాం: “ప్రతీ ఒక్కరు పై అధికారాలకు [ప్రభుత్వాలకు] లోబడి ఉండాలి.” (రోమీయులు 13:1) అంతేకాదు, మేము మా పిల్లలను స్కూలుకు వెళ్లమని, స్కూల్లో కష్టపడి చదవమని ప్రోత్సహిస్తాం. ఏదో కాస్త కష్ట పడితే చాలు అని అనుకోం. c దేవుని వాక్యం చెప్తున్నట్లుగా: “మీరు ఏమి చేసినా, మనుషుల కోసం చేస్తున్నట్టు చేయకండి, యెహోవా కోసం చేస్తున్నట్టు మీ శక్తి మేరకు మనస్ఫూర్తిగా చేయండి.”—కొలొస్సయులు 3:23.
చదువు మన కుటుంబానికి కావాల్సినవి సమకూర్చడానికి సహాయం చేస్తుంది. బైబిలు ప్రకారం, “ఎవరైనా సొంతవాళ్లకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కావాల్సినవి సమకూర్చకపోతే, అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే; అలాంటి వ్యక్తి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.” (1 తిమోతి 5:8) మన కుటుంబాలకు మద్దతివ్వాలనే పవిత్ర బాధ్యతలను నెరవేర్చడానికి లౌకిక విద్య సహాయం చేస్తుంది. ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా చెప్తున్నట్లు, విద్య ముఖ్య ఉద్దేశం “ప్రజలు సమాజంలో మంచి సభ్యులుగా అవడానికి సహాయం చేయడం . . . ఈ ఆర్థిక వ్యవస్థలో పనిదారులుగా చేయడం.” నైపుణ్యంగల, చక్కగా చదువుకున్న అతను నైపుణ్యం లేని, ప్రాథమిక విద్య కూడా లేని వాళ్లకంటే ఎక్కువగా కుటుంబానికి కావాల్సిన వాటిని సమకూర్చడానికి సిద్ధంగా ఉంటాడు, ఆధారపడదగిన వాడిగా ఉంటాడు.—సామెతలు 22:29.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక జీవితంలో సమర్థులుగా ఉండడానికి అవసరమయ్యే వాటిని సమకూర్చి పెట్టాలి, అందుకు పిల్లలకు మంచి చదువు చెప్పించడం చాలా సహాయం చేస్తుంది. (2 కొరింథీయులు 12:14) వాళ్ల పిల్లలకు, వాళ్లు నివసించే ప్రాంతంలో చదువు ఉచితం కాకపోయినా, చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోయినా లేదా స్థానిక కట్టుబాట్లకు విరుద్ధంగా ఉన్నా స్కూలుకు పంపి కనీస విద్యను ఇప్పించమని మేము తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాం. d మేము వాళ్ల పిల్లల చదువు విషయంలో తమ వంతుగా ఏమి చేయవచ్చో తల్లిదండ్రులకు ఉపయోగపడే సలహాలు కూడా ఇస్తాము. e
చదువును సరైన దృష్టితో చూడాలి
మేము చదువుకోవడానికి ఉన్న అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తాం. బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) 10వ తరగతి తర్వాత చదువుకోవడానికి ముందున్న అవకాశాలు ఏంటి, ఆ విద్యకు ఎంత డబ్బు అవసరమౌతుంది, ఆ విద్య చదివితే వచ్చే ప్రయోజనాలు ఏంటి? లాంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మనం ఈ సూత్రాన్ని పాటించవచ్చు. ఉదాహరణకు, వృత్తిపర విద్య తీసుకుంటే (vocational training) మనం పెట్టిన సమయానికి తగిన మంచి విలువ ఉంటుంది.
ఆధ్యాత్మిక విద్యకు లౌకిక విద్య కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. లౌకిక విద్యలా కాకుండా, బైబిలు ఆధారిత ఆధ్యాత్మిక విద్య ప్రాణాలను రక్షించే దేవుని జ్ఞానాన్ని ఇస్తుంది. (యోహాను 17:3) అది మనకు నైతిక విలువలను కూడా నేర్పిస్తుంది అంటే “నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.” (సామెతలు 2:9) అపొస్తలుడైన పౌలు ఇప్పుడు మనం చూస్తున్న యూనివర్సిటీ విద్య లాంటి విద్యనే తీసుకున్నాడు, అయితే ఆయన క్రీస్తుయేసు గురించిన జ్ఞానాన్ని “సాటిలేని జ్ఞానం” అని చెప్పాడు. (ఫిలిప్పీయులు 3:8; అపొస్తలుల కార్యాలు 22:3) అదేవిధంగా నేడు కూడా, ఎంతోమంది యెహోవాసాక్షులు అలాంటి ఉన్నత విద్యను చేశారు, కానీ ఆధ్యాత్మిక విద్యకు అంతకన్నా ఎక్కువ విలువ ఉందని వాళ్లు నమ్ముతారు. f
ఉన్నత విద్య నైతిక, ఆధ్యాత్మిక ప్రమాదాలకు నడిపించవచ్చు
బైబిలు సామెత ఇలా చెప్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును.” (సామెతలు 22:3) కొన్ని యూనివర్సిటీల్లో లేదా అలాంటి ఉన్నత విద్యను నేర్పించే సెంటర్‌లలో నైతిక, ఆధ్యాత్మిక ప్రమాదాలకు నడిపించే వాతావరణం ఉంటుందని యెహోవాసాక్షులు భావిస్తున్నారు. ఆ కారణం వల్ల సాక్షులు వాళ్లు గానీ వాళ్ల పిల్లలు గానీ అలాంటి ఊబిలో కూరుకుపోకుండా ఉండేలా నిర్ణయించుకున్నారు. ఉన్నత విద్యను నేర్పించే సెంటర్‌లలో ఈ క్రింద ఉన్న తప్పుడు ఆలోచనలు ప్రోత్సహించే అవకాశం ఉందని వాళ్లు భావిస్తారు:
అపోహ: డబ్బు సంతోషాన్ని, భద్రతను తీసుకొస్తుంది
ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఉద్యోగాలు పొందడానికి ఖచ్చితమైన దారి ఉన్నత విద్యేనని ఎక్కువగా చెప్తారు, అందుకే చాలామంది విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికే యూనివర్సిటీలకు వెళ్తారు. డబ్బు సంతోషాన్ని, భద్రతను తీసుకొస్తుందని కొంతమంది అనుకుంటారు, కానీ బైబిలు అలాంటి ఆలోచన వ్యర్థమైనదని చెప్తుంది. (ప్రసంగి 5:10) మరి ముఖ్యంగా, బైబిలు ఇంకా ఇలా చెప్తుంది, “డబ్బు మీద మోజు అన్నిరకాల హానికరమైన విషయాలకు మూలం,” కొన్నిసార్లు అది విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. (1 తిమోతి 6:10) యెహోవాసాక్షులు “సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి” అనే ఉచ్చులో పడకుండా ఉండడానికి శాయశక్తులా కృషి చేస్తారు.—మత్తయి 13:22.
అపోహ: ఉన్నత విద్య చదివితే వచ్చే ప్రతిష్ఠ, హోదా అందరూ కోరుకోవాలి
ఉదాహరణకు, ఇంతకుముందు జార్జియాకు ప్రధానమంత్రిగా ఉన్న నీక గిలారీ అతని దేశంలో సాధారణంగా ఉన్న అభిప్రాయం గురించి ఇలా రాశాడు: “జార్జియాలో యూనివర్సిటీ డిగ్రీ దాదాపు ఒక హోదాకు గుర్తుగా ఉంది. . . . [ఒకప్పుడు,] యువకులు డిగ్రీని పొందకపోతే వాళ్లు కుటుంబానికి అవమానంగా ఉండేవాళ్లు.” g దీనికి భిన్నంగా, బైబిలు ఈ లోకంలో ప్రముఖులుగా ఉండవద్దని హెచ్చరిస్తుంది. యేసు కాలంలో ఉన్న ఘనతను కోరుకునే మత నాయకుల గురించి ఆయన ఇలా చెప్పాడు: “ఒకరినుండి ఒకరు మహిమను కోరుకుంటున్నారు; అలాంటప్పుడు మీరు నన్నెలా నమ్ముతారు?” (యోహాను 5:44) యూనివర్సిటీ వాతావరణం గర్వాన్ని పెంచి పోషిస్తుంది, అది దేవునికి అసహ్యం.—సామెతలు 6:16, 17; 1 పేతురు 5:5.
అపోహ: తప్పొప్పుల విషయంలో ప్రతి ఒక్కరు సొంత ప్రమాణాలు పెట్టుకోవాలి
యెహోవాసాక్షులు తప్పొప్పుల విషయంలో దేవుని ప్రమాణాలను అంగీకరిస్తారు. (యెషయా 5:20) అయితే, జర్నల్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఎడ్యుకేషన్‌లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ ప్రకారం, యూనివర్సిటీల్లో తోటివాళ్ల ఒత్తిడి వల్ల చాలామంది విద్యార్థులు “తప్పొప్పుల విషయంలో వాళ్లకు తెలిసిన ప్రమాణాలకు పూర్తి వేరుగా నిర్ణయాలు తీసుకుంటారు.” h బైబిల్లో ఉన్న ఒక సూత్రానికి ఈ పరిస్థితి సరిగ్గా సరిపోతుంది: “చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి.” (1 కొరింథీయులు 15:33) యూనివర్సిటీ వాతావరణంలో దేవుడు ఖండించిన అలవాట్లను అంటే త్రాగుబోతుతనం, డ్రగ్స్ తీసుకోవడం, వివాహితులు కాని వాళ్ల మధ్య శారీరక సంబంధాలు వంటివి సర్వసాధారణం, ఇంకా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు కూడా.—1 కొరింథీయులు 6:9, 10; 2 కొరింథీయులు 7:1.
అపోహ: ప్రపంచం మెరుగవ్వడానికి శ్రేష్ఠమైన మార్గం ఉన్నత విద్య
చాలామంది ఉన్నత విద్యను డబ్బు సంపాదించడానికి, హోదా కోసం, చెడు విలాసాల కోసం కాదుగాని, వాళ్లనీ ప్రపంచాన్నీ మెరుగుపర్చడానికి అభ్యసిస్తారని మేము గుర్తిస్తాం. ఇవి ఉన్నతమైన లక్ష్యాలే కానీ యెహోవాసాక్షులు వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. యేసులా, మేము కూడా దేవుని రాజ్యమే మంచి ప్రపంచాన్ని తీసుకొస్తుందని ఎదురుచూస్తాం. (మత్తయి 6:9, 10) అయితే, ఆ రాజ్యం ప్రపంచ సమస్యలను పరిష్కరించాలని మేము ఊరికే ఎదురు చూస్తూ ఉండం. కానీ యేసులా, “రాజ్యం గురించిన” మంచివార్తను భూమి మీద ఉన్న అందరికీ చెప్తాం, ప్రతి సంవత్సరం లక్షలమందికి తమ జీవితాలను మెరుగుపర్చుకునేలా సహాయం చేస్తుంటాం. i—మత్తయి 24:14.
a ఇంట్లో నివసిస్తున్న యువ సాక్షులు విద్య విషయంలో దేవుని నియమాలకు అడ్డు రానంత వరకు తమ తల్లిదండ్రుల అభిప్రాయాలను వింటారు.—కొలొస్సయులు 3:20.
b అందుకు మేము చదువు నేర్పించే సహాయకాలను అంటే చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండి (ఆంగ్లం) లాంటి పుస్తకాలను 1,11,00,000 కంటే ఎక్కువ కాపీలు ప్రచురించాం. ప్రపంచవ్యాప్తంగా 120 భాషల్లో చదువు నేర్పించే తరగతులను నిర్వహించాము. 2003 నుండి 2017 మధ్యకాలంలో 70,000 మందికి చదవడం, రాయడం నేర్పించాం.
c “నేను చదువు మధ్యలో మానేయాలా?” అనే ఆర్టికల్ చూడండి.
d ఉదాహరణకు, మేము వాళ్ల కొడుకులను, కూతుళ్లను స్కూలుకు పంపమని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాం. 2003 మార్చి 15 కావలికోటలో వచ్చిన “నా పిల్లలు స్కూలుకు వెళ్ళాలా?” అనే ఆర్టికల్ చూడండి.
e “మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా ఎలా సహాయం చేయవచ్చు?” అనే ఆర్టికల్ చూడండి.
f jw.org వెబ్‌సైట్‌లో “జీవారంభం గురించి అభిప్రాయాలు” అనే సెక్షన్ చూడండి.
g Practical Economics: Economic Transformation and Government Reform in Georgia 2004—2012, 170వ పేజీ.
h వాల్యూమ్ 61, నం. 1, ఏప్రిల్ 2017, 72వ పేజీ.
i jw.orgలో దేవుని వాక్యానికి, రాజ్య సందేశానికి ఎంత శక్తి ఉందో తెలిపే నిజ జీవిత ఉదాహరణల కోసం “బైబిలు జీవితాల్ని మారుస్తుంది” అనే సెక్షన్ చూడండి.