అధ్యయన ఆర్టికల్ 40
‘అంత్యదినాల’ చివర్లో ఎక్కువ సేవచేయండి
‘స్థిరంగా, నిలకడగా ఉండండి. ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి.’—1 కొరిం. 15:58.
పాట 58 శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం
ఈ ఆర్టికల్లో . . . a
1. మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని ఎలా ఖచ్చితంగా చెప్పవచ్చు?
మీరు 1914 తర్వాత పుట్టారా? అలాగైతే, మీ జీవితమంతా ఈ వ్యవస్థ “చివరి రోజుల్లో” గడిపారు. (2 తిమో. 3:1) ఈ చివరి రోజుల్లో ఏ సంఘటనలు జరుగుతాయని యేసు చెప్పాడో వాటి గురించి మనందరం విన్నాం. అవేంటంటే యుద్ధాలు, ఆహారకొరతలు, భూకంపాలు, పెద్దపెద్ద అంటువ్యాధులు, చెడుతనం పెరిగిపోవడం, యెహోవా ప్రజలు హింసించబడడం. (మత్త. 24:3, 7-9, 12; లూకా 21:10-12) అంతేకాదు, చివరి రోజుల్లో ఎలాంటి ప్రజలు ఉంటారో అపొస్తలుడైన పౌలు ముందే చెప్పాడు. అలాంటి ప్రజలు ఉండడం మనం ఇప్పుడు చూస్తున్నాం. (“ నేడు ఇలాంటి ప్రజలు ఉన్నారు” అనే బాక్సు చూడండి.) మనం ‘అంత్యదినాల’ చివర్లో ఉన్నామని యెహోవా ఆరాధకులమైన మనకు ఖచ్చితంగా తెలుసు.—మీకా 4:1.
2. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి?
2 అయితే, 1914 నుండి ఇప్పటివరకు చాలా ఏళ్లు గడిచిపోయాయి, అంటే మనం ‘అంత్యదినాల’ చివర్లో జీవిస్తున్నామని అర్థం. అంతం చాలా దగ్గర్లో ఉంది కాబట్టి మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి: ‘అంత్యదినాల’ చివర్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? వాటికోసం ఎదురుచూస్తుండగా మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
‘అంత్యదినాల’ చివర్లో ఏం జరుగుతుంది?
3. మొదటి థెస్సలొనీకయులు 5:1-3 లో ఉన్న ప్రవచనం ప్రకారం, దేశాలు ఏ ప్రకటన చేస్తాయి?
3 మొదటి థెస్సలొనీకయులు 5:1-3 చదవండి. పౌలు “యెహోవా రోజు” గురించి చెప్పాడు. ఈ లేఖనంలో ఆ మాట ఒక కాల వ్యవధిని సూచిస్తుంది. అది, “మహాబబులోను” మీద అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధమతాల మీద జరిగే దాడితో మొదలై, హార్మెగిద్దోన్తో ముగుస్తుంది. (ప్రక. 16:14, 16; 17:5) యెహోవా “రోజు” మొదలవ్వడానికి కాస్త ముందు, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు ప్రకటన చేస్తాయి (కొన్ని అనువాదాల్లో “శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని ఉంది.) కొన్నిసార్లు లోక పరిపాలకులు, దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి మాటలు ఉపయోగిస్తుంటారు. b అయితే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు” అని బైబిలు చెప్తున్న ప్రకటన అలాంటిది కాదు. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రకటన వచ్చినప్పుడు, పరిపాలకులు ఈ లోకాన్ని మరింత సురక్షితంగా చేశారని ప్రజలు అనుకుంటారు. కానీ అప్పుడే “మహాశ్రమ” మొదలౌతుంది ‘హఠాత్తుగా నాశనం’ వస్తుంది.—మత్త. 24:21.
4. (ఎ)“అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన గురించి మనకు ఏమేం తెలీదు? (బి) దాని గురించి మనకు ఏం తెలుసు?
4 “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు. అయితే ఇంకొన్ని విషయాలు తెలీదు. ఉదాహరణకు, లోక పరిపాలకులు ఆ ప్రకటన ఎందుకు చేయాలనుకుంటారో, ఆ ప్రకటన ఎలా చేస్తారో మనకు తెలీదు. అది ఒకే ముఖ్యమైన ప్రకటనలా వస్తుందో లేదా వరుస ప్రకటనల రూపంలో వస్తుందో మనకు తెలీదు. అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు. అదేంటంటే, ఆ ప్రకటన వచ్చినప్పుడు మనం మోసపోయి ఈ లోక పరిపాలకులు ప్రపంచ శాంతిని తీసుకురాగలరు అని నమ్మకూడదు. బదులుగా, బైబిలు చెప్తున్నట్టు మనం ఆ ప్రకటన కోసం కనిపెట్టుకొని ఉండాలి. అది “యెహోవా రోజు” మొదలవ్వబోతుంది అనడానికి ఒక సంకేతం!
5. మొదటి థెస్సలొనీకయులు 5:4-6 ప్రకారం, “యెహోవా రోజు” కోసం సిద్ధంగా ఉండాలంటే మనమేం చేయాలి?
5 మొదటి థెస్సలొనీకయులు 5:4-6 చదవండి. “యెహోవా రోజు” కోసం సిద్ధంగా ఉండాలంటే మనమేం చేయాలో పౌలు చెప్పాడు. మనం ‘ఇతరుల్లా నిద్రపోకూడదు;’ “మెలకువగా,” అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు, మనం లోక రాజకీయ విషయాల్లో తలదూర్చకుండా, ఎవరి పక్షం వహించకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అలాంటి విషయాల్లో భాగం వహిస్తే, మనం ఈ “లోకానికి చెందిన వాళ్లం” అవుతాం. (యోహా. 15:19) దేవుని రాజ్యం మాత్రమే ప్రపంచ శాంతి తీసుకొస్తుందని మనకు తెలుసు.
6. ఇతరులకు మనం ఏ సహాయం చేయాలి? ఎందుకు?
6 మనం మెలకువగా ఉండడమే కాదు ఇతరుల్ని కూడా నిద్రలేపాలి. అంటే లోకంలో జరగబోయే సంఘటనల గురించి బైబిలు ముందే చెప్పిన విషయాలు తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయాలి. ఎందుకంటే, ఒక్కసారి మహాశ్రమ మొదలైతే ఇక ప్రజలకు యెహోవా వైపు తిరిగే అవకాశం ఉండదు. అందుకే, మనం ఇప్పుడే ప్రకటనా పని చేయడం చాలా ప్రాముఖ్యం! c
ప్రకటనా పని ఎక్కువగా చేయండి
7. మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
7 ఆ “రోజు” మొదలవ్వడానికి మిగిలివున్న కొంచెం సమయంలో, మనం ప్రకటనా పని ఎక్కువగా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై” ఉండేలా చూసుకోవాలి. (1 కొరిం. 15:58) మనం చేసే పని గురించి యేసు ముందే చెప్పాడు. చివరి రోజుల్లో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి చెప్తున్నప్పుడు, “ముందు అన్ని దేశాల్లో మంచివార్త ప్రకటించబడాలి” అని కూడా ఆయన చెప్పాడు. (మార్కు 13:4, 8, 10; మత్త. 24:14) ఒక్కసారి ఆలోచించండి, మీరు పరిచర్యకు వెళ్లిన ప్రతీసారి ఆ బైబిలు ప్రవచన నెరవేర్పులో భాగం వహిస్తున్నట్టే.
8. రాజ్య ప్రకటనా పని ఎలా ముందుకు సాగుతోంది?
8 రాజ్య ప్రకటనా పని ఎలా ముందుకు సాగుతోంది? ప్రతీ సంవత్సరం ఎంతోమంది మంచివార్త వింటున్నారు. ఉదాహరణకు, చివరి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాజ్య ప్రచారకుల సంఖ్య ఎలా పెరిగిందో గమనించండి. 1914లో, మొత్తం 43 దేశాల్లో 5,155 మంది ప్రచారకులు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు, 240 దేశాల్లో దాదాపు 85 లక్షలమంది ప్రచారకులు ఉన్నారు! అయితే మన ప్రకటనా పని ఇంకా పూర్తికాలేదు. దేవుని రాజ్యమే మనుషుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందనే వార్తను మనం ప్రకటిస్తూనే ఉండాలి.—కీర్త. 145:11-13.
9. మనం రాజ్య సందేశాన్ని ఎందుకు ప్రకటిస్తూనే ఉండాలి?
9 రాజ్య ప్రకటనా పని అయిపోయిందని యెహోవా చెప్పే వరకు అది జరుగుతూనే ఉంటుంది. ప్రజలు యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తును తెలుసుకోవడానికి ఇంకా ఎంత సమయం మిగిలివుంది? (యోహా. 17:3) అది మనకు తెలీదు. అయితే మహాశ్రమ మొదలయ్యే వరకు, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లందరూ” మంచివార్తకు స్పందించవచ్చు. (అపొ. 13:48) మరి సమయం మించిపోకముందే వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?
10. ప్రజలకు సత్యం నేర్పించడానికి యెహోవా మనకు ఏం ఇస్తున్నాడు?
10 ప్రజలకు సత్యం నేర్పించడానికి మనకు కావల్సిన వాటన్నిటినీ యెహోవా తన సంస్థ ద్వారా ఇస్తున్నాడు. ఉదాహరణకు, వారం మధ్యలో జరిగే మీటింగ్ ద్వారా మనం ప్రతీవారం శిక్షణ పొందుతున్నాం. ప్రజల్ని మొదటిసారి కలిసినప్పుడు, రిటన్ విజిట్ చేసినప్పుడు ఏం మాట్లాడాలో, బైబిల్ స్టడీలు ఎలా చేయాలో ఆ మీటింగ్లో నేర్చుకుంటున్నాం. అంతేకాదు, యెహోవా సంస్థ బోధనా పనిముట్లు కూడా ఇచ్చింది. వాటి ద్వారా మనం ఈ విషయాలు నేర్చుకుంటాం:
-
ప్రజలతో సంభాషణ మొదలుపెట్టడం,
-
ఆసక్తి కలిగించేలా మాట్లాడడం,
-
ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే కోరిక కలిగేలా చేయడం,
-
బైబిల్ స్టడీల్లో సత్యం బోధించడం,
-
ఆసక్తి ఉన్నవాళ్లను మన వెబ్సైట్ చూడమని, రాజ్యమందిరానికి రమ్మని ఆహ్వానించడం.
అయితే, మన దగ్గర ఈ పనిముట్లు ఉంటే సరిపోదు, వాటిని ఉపయోగించాలి. d ఉదాహరణకు, ఆసక్తి చూపించినవాళ్లకు ఒక కరపత్రం గానీ పత్రిక గానీ ఇస్తే, మీరు తిరిగి కలిసేలోపు వాళ్లు దాన్ని చదువుకుంటారు. ప్రతీనెల రాజ్య ప్రకటనా పనిలో వీలైనంత ఎక్కువగా భాగం వహించడం మనలో ప్రతీ ఒక్కరి బాధ్యత.
11. ఆన్లైన్ బైబిల్ స్టడీ లెసన్స్ సెక్షన్ని ఎందుకు తయారుచేశారు?
11 ప్రజలు సత్యం తెలుసుకోవడానికి యెహోవా సహాయం చేసే ఇంకో విధానం jw.org® వెబ్సైట్లోని ఆన్లైన్ బైబిల్ స్టడీ లెసన్స్. e వీటిని ఎందుకు తయారుచేశారు? ప్రతీనెల, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేలమంది బైబిలు లెసన్స్ గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ప్రజలకు దేవుని వాక్యంలో ఉన్న సత్యాల్ని పరిచయం చేయడానికి మన వెబ్ సైట్లోని లెసన్స్ సహాయం చేస్తాయి. బహుశా మనం కలిసేవాళ్లలో కొంతమంది బైబిలు స్టడీని ఒప్పుకోవడానికి వెనకాడవచ్చు. అలాంటప్పుడు, మన వెబ్సైట్లో ఉన్న ఈ సెక్షన్ని చూపించండి లేదా ఈ లెసన్స్కు నడిపించే లింక్ని పంపించండి. వీలైతే, ఈ సెక్షన్ని వాళ్లకు అర్థమయ్యే భాషలో చూపించవచ్చు.
12. ఒకవ్యక్తి ఆన్లైన్ బైబిల్ స్టడీ లెసన్స్ నుండి ఏమేం నేర్చుకోవచ్చు?
12 మన ఆన్లైన్ బైబిల్ స్టడీ లెసన్స్ ఈ అంశాల్ని చర్చిస్తాయి: “బైబిలు, బైబిలు రచయిత,” “బైబిల్లోని ముఖ్యమైన వ్యక్తులు,” అలాగే “జీవితంలో ఆశను నింపే బైబిలు సందేశం.” వాటిని అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ విషయాలు నేర్చుకుంటారు:
-
బైబిలు మనకెలా సహాయం చేస్తుంది
-
యెహోవా, యేసు, దేవదూతలు ఎవరు
-
దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు
-
బాధలు, చెడుతనం ఎందుకు ఉన్నాయి
ఈ లెసన్స్ ఇంకా ఏం చర్చిస్తాయంటే, యెహోవా . . .
-
బాధల్ని, మరణాన్ని ఎలా తీసేస్తాడు,
-
చనిపోయినవాళ్లను ఎలా మళ్లీ బ్రతికిస్తాడు,
-
అసమర్థమైన మానవ ప్రభుత్వాల స్థానంలో తన రాజ్యాన్ని ఎలా తెస్తాడు.
13. ఆన్లైన్ లెసన్స్, బైబిలు స్టడీ ఏర్పాటు స్థానంలో వచ్చాయా? వివరించండి.
13 ఆన్లైన్ లెసన్స్, బైబిలు స్టడీ ఏర్పాటు స్థానంలో వచ్చినవి కావు. శిష్యుల్ని చేసే గొప్ప అవకాశాన్ని యేసు మనకిచ్చాడు. ఆసక్తి ఉన్నవాళ్లు ఇంటర్నెట్లో ఆన్లైన్ లెసన్స్ని అధ్యయనం చేస్తారని, నేర్చుకునే వాటిని ఇష్టపడతారని, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటారని ఆశిస్తున్నాం. బహుశా వాటిని అధ్యయనం చేసే వ్యక్తి బైబిలు స్టడీకి కూడా ఒప్పుకోవచ్చు. అందుకే ప్రతీ లెసన్ చివర్లో, ఒక యెహోవాసాక్షితో కలిసి బైబిలు స్టడీ తీసుకోవడం కోసం రిక్వెస్టు చేసుకునే లింక్ కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు సగటున 230 కన్నా ఎక్కువమంది, బైబిలు స్టడీ కావాలని మన వెబ్సైట్ ద్వారా రిక్వెస్టు చేస్తున్నారు. అలా నేరుగా కలిసి బైబిలు స్టడీ చేయడం చాలా ప్రాముఖ్యం!
శిష్యుల్ని చేయడానికి కృషి చేస్తూనే ఉండండి
14. మత్తయి 28:19, 20 లో ఉన్న యేసు నిర్దేశాల ప్రకారం, మనం ఏం చేయడానికి శాయశక్తులా కృషిచేస్తాం? ఎందుకు?
14 మత్తయి 28:19, 20 చదవండి. మనం బైబిలు స్టడీలు నిర్వహిస్తున్నప్పుడు ‘శిష్యుల్ని చేయడానికి, యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించడానికి’ శాయశక్తులా కృషి చేయాలి. యెహోవా సేవ చేయాలని నిర్ణయించుకోవడం, ఆయన రాజ్యానికి మద్దతివ్వడం ఎంత ప్రాముఖ్యమో ప్రజలు అర్థంచేసుకునేలా మనం సహాయం చేయాలి. అంటే ప్రజలు నేర్చుకున్నవి పాటించేలా, యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా మనం ప్రోత్సహించాలి. అప్పుడు మాత్రమే వాళ్లు యెహోవా రోజున కాపాడబడతారు.—1 పేతు. 3:21.
15. ఏం చేయడానికి మనకు సమయం లేదు? ఎందుకు?
15 పైపేరాల్లో ప్రస్తావించినట్లు, ఈ వ్యవస్థ అంతం అవ్వడానికి చాలా తక్కువ సమయం మిగిలివుంది. కాబట్టి, తమ జీవితంలో మార్పులు చేసుకుని, యెహోవా సేవకులు అవ్వాలనే కోరిక లేనివాళ్లతో బైబిలు స్టడీ కొనసాగించడానికి మనకు సమయం లేదు. (1 కొరిం. 9:26) మన పని అత్యవసరమైనది! దేవుని రాజ్య సందేశం వినాల్సిన ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి సమయం మించిపోకముందే మనం ప్రకటించాలి.
అబద్ధమతానికి పూర్తిగా దూరంగా ఉండండి
16. ప్రకటన 18:2, 4, 5, 8 ప్రకారం, మనందరం ఏం చేయాలి? (అధస్సూచి కూడా చూడండి.)
16 ప్రకటన 18:2, 4, 5, 8 చదవండి. యెహోవా తన ఆరాధకుల నుండి ఇంకా ఏం కోరుతున్నాడో ఈ వచనాల్లో ఉంది. నిజ క్రైస్తవులందరూ మహాబబులోనుతో ఎలాంటి సంబంధం లేకుండా చూసుకోవాలి. సత్యం తెలుసుకోకముందు, ఒక బైబిలు విద్యార్థి అబద్ధమతంలో సభ్యునిగా ఉండివుండవచ్చు. బహుశా ఆ సంస్థ నిర్వహించే మతపరమైన సేవల్లో, కార్యక్రమాల్లో పాల్గొని ఉండవచ్చు. లేదా అలాంటి ఒక సంస్థకు చందాలు ఇచ్చివుండవచ్చు. అయితే ఆ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అయ్యేముందు, అతను అబద్ధమతానికి సంబంధించిన ప్రతీదానితో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలి. మహాబబులోనుకు సంబంధించిన ఏదైనా చర్చిలో లేదా సంస్థలో అతను సభ్యునిగా ఉంటే, దానికి రాజీనామా చేయాలి లేదా ఒక ఉత్తరం రాసి తన సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలి. f
17. ఒక క్రైస్తవుడు ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు? ఎందుకు?
17 ఒక నిజ క్రైస్తవుడు తన ఉద్యోగంలో భాగంగా మహాబబులోనుకు సంబంధించిన దేనిలోనూ పని చేయకూడదు. (2 కొరిం. 6:14-17) ఉదాహరణకు ఆయన, చర్చిలో ఉద్యోగం చేయకూడదు. అంతేకాదు, ఒకవేళ వేరేవాళ్లు ఆయన్ని పనిలో పెట్టుకుని, అబద్ధ ఆరాధనను ప్రోత్సహించే భవనాల్లో పని చేయమంటే, ఆయన అక్కడ ఎక్కువ పని చేయకూడదు. ఒకవేళ ఆయనకు సొంత వ్యాపారం ఉంటే, మహాబబులోనుతో సంబంధం ఉన్న దేనిలో కూడా పని చేయడానికి ఒప్పుకోడు లేదా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోడు. ఇలాంటి విషయాల్లో మనం ఎందుకంత ఖచ్చితంగా ఉంటాం? ఎందుకంటే, దేవుని దృష్టిలో అపవిత్రంగా ఉన్న మత సంస్థలు చేసే పనుల్లో, పాపాల్లో మనం పాలుపంచుకోవాలని కోరుకోం.—యెష. 52:11. g
18. ఒక సహోదరుడు ఉద్యోగం విషయంలో బైబిలు ప్రమాణాలకు ఎలా కట్టుబడి ఉన్నాడు?
18 కొన్ని సంవత్సరాల క్రితం, సొంతగా వ్యాపారం చేసుకుంటున్న ఒక సంఘపెద్ద ఉదాహరణ గమనించండి. ఒక కాంట్రాక్టర్ ఆయన దగ్గరకు వచ్చి, ఆయన ఉంటున్న పట్టణంలోని చర్చిలో కొంత వడ్రంగి పని చేయమని అడిగాడు. ఆ సహోదరుడు చర్చీల్లో పని చేయనని అంతకుముందు చాలాసార్లు చెప్పాడని కాంట్రాక్టర్కు తెలుసు. కానీ ఈసారి ఆ పని చేయడానికి అతనికి ఎవ్వరూ దొరకలేదు. అయినప్పటికీ, మన సహోదరుడు బైబిలు ప్రమాణాలకు కట్టుబడి, ఆ పనికి ఒప్పుకోలేదు. తర్వాతి వారం, ఆ చర్చికి సిలువ బిగిస్తున్న వేరే వడ్రంగి ఫోటోను స్థానిక వార్తాపత్రికలో వేశారు. ఒకవేళ ఆ సహోదరుడు తన ప్రమాణాల విషయంలో రాజీపడివుంటే, వార్తాపత్రికలో ఆయన ఫోటో వచ్చేది. అప్పుడు తోటి సహోదరసహోదరీల దగ్గర ఆయనకు ఎంత చెడ్డపేరు వచ్చేదో ఆలోచించండి! అంతేకాదు అది చూసి యెహోవా ఎలా భావించేవాడో ఆలోచించండి.
మనం ఏం నేర్చుకున్నాం?
19-20. (ఎ) మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? (బి) మనం ఇంకా ఏం నేర్చుకోవాలి?
19 బైబిల్లో ముందే చెప్పినట్లు, త్వరలో ఈ లోకంలో జరగబోయే ముఖ్యమైన సంఘటన ఏంటంటే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు ప్రకటన చేయడం. యెహోవా మనకు బోధించిన దాన్నిబట్టి దేశాలు నిజమైన, శాశ్వతమైన శాంతిని తీసుకురాలేవని మనకు తెలుసు. దేశాలు ఆ ప్రకటన చేశాక, హఠాత్తుగా నాశనం రావడానికి ముందు మనం ఏం చేయాలి? మనం రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో, ఎక్కువమందిని శిష్యుల్ని చేయడంలో బిజీగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అదేసమయంలో, మనం అబద్ధమతానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అంటే, అలాంటి వాటిలో మనకు సభ్యత్వం ఉండకూడదు, అలాగే మహాబబులోనుతో సంబంధం ఉన్న వేటిలోనూ ఉద్యోగం చేయకూడదు.
20 ‘అంత్యదినాల’ చివర్లో మరికొన్ని సంఘటనలు జరుగుతాయి. మనం ఇంకొన్ని పనులు కూడా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఏంటా పనులు? రాబోయే రోజుల్లో ఎదురయ్యే ప్రతీదానికి మనమెలా సిద్ధపడవచ్చు? ఈ ప్రశ్నల గురించి తర్వాతి ఆర్టికల్లో పరిశీలిస్తాం.
పాట 71 యెహోవా సైన్యం మనం!
a త్వరలోనే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు ప్రకటన చేస్తాయని మనం ఎదురుచూస్తున్నాం. ఆ ప్రకటన, మహాశ్రమ మొదలవ్వబోతుంది అనడానికి సంకేతంగా ఉంటుంది. ఈలోగా మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? ఈ ఆర్టికల్లో దానికి జవాబు తెలుసుకుంటాం.
b ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి “అంతర్జాతీయ శాంతిభద్రతలు కాపాడుతుందని” దాని వెబ్సైట్లో చెప్పుకుంటుంది.
c ఈ సంచికలో వచ్చిన, “దేవుని తీర్పులు—అమలు చేయడానికి ముందు సరిపడా సమయం ఇస్తాడా?” అనే ఆర్టికల్ చూడండి.
d బోధనా పనిముట్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, 2018 అక్టోబరు కావలికోటలో వచ్చిన “సత్యాన్ని బోధించండి” అనే ఆర్టికల్ చూడండి.
e ఈ లెసన్స్ ప్రస్తుతం ఇంగ్లీష్, పోర్చుగీస్ భాషల్లో ఉన్నాయి, భవిష్యత్తులో మరిన్ని భాషల్లో అందుబాటులోకి వస్తాయి.
f అబద్ధమతంతో సంబంధం ఉన్న యూత్ క్యాంపులు లాంటి సంస్థలకు, అవి ఏర్పాటు చేసే రకరకాల ఉల్లాస కార్యక్రమాలకు కూడా మనం దూరంగా ఉండాలి. యువతీయువకుల కోసం ఏర్పడిన అలాంటి ఎన్నో సంస్థలు మతానికి సంబంధించినవి కావని చెప్పుకున్నా, అవి మతపరమైన సిద్ధాంతాల్ని, లక్ష్యాల్ని ప్రోత్సహిస్తాయి.
g మత సంస్థల్లో ఉద్యోగం చేయడం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి 1999, ఏప్రిల్ 15 కావలికోటలో వచ్చిన “పాఠకుల ప్రశ్నలు” చూడండి.
h చిత్రాల వివరణ: “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన గురించి టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాఫీ షాపులోని కస్టమర్లు. ప్రీచింగ్ మధ్యలో విరామం తీసుకుంటున్న దంపతులు ఆ ప్రకటనను చూసి మోసపోవట్లేదు.