కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 42

యెహోవాకు యథార్థంగా ఉండేవాళ్లు సంతోషంగా ఉంటారు

యెహోవాకు యథార్థంగా ఉండేవాళ్లు సంతోషంగా ఉంటారు

“యథార్థంగా ఉంటూ, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్లు సంతోషంగా ఉంటారు.”కీర్త. 119:1, అధస్సూచి.

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఈ ఆర్టికల్‌లో. . . a

యెహోవా సర్వాధిపత్యానికి విశ్వసనీయంగా ఉన్నందుకు జైలు శిక్ష ఎదుర్కొన్న లేదా ఎదుర్కొంటున్న ధైర్యం గల కొంతమంది సహోదర సహోదరీలు (1-2 పేరాలు చూడండి)

1-2. (ఎ) కొన్ని ప్రభుత్వాలు దేవుని ప్రజల్ని ఎలా వ్యతిరేకించాయి? అయినా దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? (బి) హింస ఎదురైనా సంతోషంగా ఉండడం ఎలా సాధ్యం? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం గురించి చెప్పండి.)

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30 కన్నా ఎక్కువ దేశాల్లో మన పనిపై ఆంక్షలు లేదా నిషేధం ఉంది. కొన్ని దేశాల్లో అధికారులు మన సహోదర సహోదరీల్ని జైల్లో వేశారు. వాళ్లు ఏం తప్పు చేశారు? యెహోవా దృష్టిలో అయితే వాళ్లు ఏ తప్పూ చేయలేదు. వాళ్లు కేవలం బైబిలు చదివి, అధ్యయనం చేశారు, తమ నమ్మకాల గురించి ఇతరులతో పంచుకున్నారు, తోటి విశ్వాసులతో కలిసి మీటింగ్స్‌కి వెళ్లారు. అంతేకాదు రాజకీయాల్లో తలదూర్చకుండా ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనా ఈ నమ్మకమైన సేవకులు యెహోవాను విడిచిపెట్టకుండా, ఆయన్ని అంటిపెట్టుకుని యథార్థంగా ఉన్నారు. b దానివల్ల వాళ్లు సంతోషంగా ఉన్నారు.

2 ఎంతో ధైర్యం చూపించిన అలాంటి సహోదర సహోదరీల ఫోటోలు చూసినప్పుడు, వాళ్లు సంతోషంతో నవ్వుతూ ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. యథార్థంగా ఉన్నందుకు వాళ్లను చూసి యెహోవా సంతోషిస్తున్నాడని వాళ్లకు తెలుసు కాబట్టే, వాళ్లు అలా ఉన్నారు. (1 దిన. 29:17ఎ) యేసు ఇలా చెప్పాడు: “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు . . . మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి.”—మత్త. 5:10-12.

అపొస్తలుల ఆదర్శం

నేడు కోర్టుల్లో తమ నమ్మకాల గురించి మాట్లాడే క్రైస్తవులకు పేతురు, యోహానులు మంచి ఆదర్శం ఉంచారు (3-4 పేరాలు చూడండి)

3. అపొస్తలుల కార్యాలు 4:19, 20 ప్రకారం, వ్యతిరేకత ఎదురైనప్పుడు మొదటి శతాబ్దంలోని అపొస్తలులు ఏం చేశారు? ఎందుకు?

3 నేడు మన సహోదర సహోదరీలు, మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఎదుర్కొన్న లాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. యేసు గురించి ప్రకటించినందుకు అపొస్తలులు తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు. “యేసు పేరున ఏమీ మాట్లాడవద్దని” యూదుల మహాసభ వాళ్లను పదేపదే హెచ్చరించింది. (అపొ. 4:18; 5:27, 28, 40) మరి అపొస్తలులు ఏం చేశారు? (అపొస్తలుల కార్యాలు 4:19, 20 చదవండి.) ఆ అధికారుల కన్నా ఎక్కువ అధికారం ఉన్న వ్యక్తి ప్రజలకు క్రీస్తు గురించి “ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని” చెప్పాడని వాళ్లకు తెలుసు. (అపొ. 10:42) కాబట్టి పేతురు, యోహానులు అపొస్తలుల తరఫున ధైర్యంగా మాట్లాడారు. తాము ఆ అధికారుల కన్నా దేవునికే లోబడతామని, యేసు గురించి ప్రకటించడం ఆపమని చెప్పారు. ఒకవిధంగా వాళ్లు ఆ అధికారుల్ని ఇలా ప్రశ్నించారు: ‘దేవునికన్నా మీకే ఎక్కువ అధికారం ఉందని అనుకుంటున్నారా?’

4. అపొస్తలుల కార్యాలు 5:27-29 ప్రకారం, నిజ క్రైస్తవులందరికీ అపొస్తలులు ఎలా ఆదర్శంగా ఉన్నారు? మనం వాళ్లలా ఎలా ఉండవచ్చు?

4 “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అని అనడం ద్వారా అపొస్తలులు మంచి ఆదర్శం ఉంచారు. అప్పటి నుండి నిజ క్రైస్తవులందరూ వాళ్ల ఆదర్శాన్ని పాటిస్తున్నారు. (అపొస్తలుల కార్యాలు 5:27-29 చదవండి.) యథార్థంగా ఉన్నందుకు అపొస్తలుల్ని కొట్టారు. అయినా వాళ్లు “యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.” అలాగే మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.—అపొ. 5:40-42.

5. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి?

5 అపొస్తలులు ఉంచిన ఆదర్శాన్ని పరిశీలించినప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఉదాహరణకు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఒకవైపు మనుషులకు కాకుండా దేవునికి లోబడుతూనే, మరోవైపు “పై అధికారాలకు” కూడా ఎలా లోబడగలరు? (రోమా. 13:1) అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు మనం ‘ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడుతూనే’ మహోన్నత అధికారి అయిన దేవునికి యథార్థంగా ఎలా ఉండవచ్చు?—తీతు 3:1.

“పై అధికారాలు”

6. (ఎ) రోమీయులు 13:1 లో ఉన్న “పై అధికారాలు” అనే మాట ఎవర్ని సూచిస్తుంది? వాళ్లతో మనం ఎలా ఉండాలి? (బి) మానవ పరిపాలకులకు ఎంత అధికారం ఉంది?

6 రోమీయులు 13:1 చదవండి. ఈ వచనంలోని “పై అధికారాలు” అనే మాట, వేరేవాళ్లను ఆజ్ఞాపించే అధికారం ఉన్న మానవ పరిపాలకుల్ని సూచిస్తుంది. అలాంటి అధికారం ఉన్న వాళ్లకు క్రైస్తవులు లోబడాలి. ఈ పరిపాలకులు చట్టాల్ని అమలు చేస్తూ, శాంతి భద్రతల్ని కాపాడతారు. అంతేకాదు కొన్నిసార్లు యెహోవా ప్రజల తరఫున మాట్లాడి, వాళ్లను సంరక్షిస్తారు. (ప్రక. 12:16) కాబట్టి పరిపాలకులు కోరినట్టే మనం పన్నులు కట్టాలి, వాళ్లకు భయపడాలి, వాళ్లను గౌరవించాలి. (రోమా. 13:7) అయితే యెహోవా అనుమతితోనే వాళ్లకు ఆ అధికారం వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా యేసే స్పష్టం చేశాడు. రోమా అధిపతైన పొంతి పిలాతు యేసును విచారణ చేస్తున్నప్పుడు, ఆయన్ని విడుదల చేసే లేదా మరణశిక్ష వేసే అధికారం తనకుందని అన్నాడు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “పైనుండి ఇవ్వబడివుంటే తప్ప నా మీద నీకు అసలు ఎలాంటి అధికారమూ ఉండదు.” (యోహా. 19:11) పిలాతు లాగే నేడున్న పరిపాలకులకు, రాజకీయ నాయకులకు పూర్తి అధికారంలేదు.

7. మానవ పరిపాలకులకు ఎలాంటి సందర్భాల్లో మనం లోబడం? ఆ అధికారులు ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

7 దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా లేనంతవరకు, క్రైస్తవులు ప్రభుత్వ నియమాలకు లోబడాలి. కానీ దేవుడు చేయవద్దన్న దాన్ని చేయమని చెప్పినప్పుడు, లేదా దేవుడు చేయమన్న దాన్ని చేయవద్దని చెప్పినప్పుడు వాళ్లకు లోబడం. ఉదాహరణకు యువకుల్ని సైన్యంలో చేరమని వాళ్లు అనవచ్చు. c మన బైబిల్ని, ప్రచురణల్ని నిషేధించవచ్చు. అలాగే ప్రకటించవద్దని, మీటింగ్స్‌కి వెళ్లొద్దని మనకు చెప్పవచ్చు. క్రైస్తవుల్ని హింసిస్తూ, పరిపాలకులు తమ అధికారాన్ని తప్పుగా ఉపయోగించినప్పుడు వాళ్లు దేవునికి లెక్క అప్పజెప్పాలి. యెహోవా వాళ్లు చేస్తున్న ప్రతీ పనిని గమనిస్తున్నాడు.—ప్రసం. 5:8.

8. యెహోవాకు, “పై అధికారాలకు” తేడా ఏంటి?

8 “పై అధికారాలు” అనే మాట వాళ్లకు “ఎక్కువ అధికారం లేదా ఉన్నత అధికారం” ఉందని సూచిస్తుంది. కానీ వాళ్లకు “పూర్తి అధికారం” ఉందని దానర్థం కాదు. బైబిలు మానవ ప్రభుత్వాల్ని “పై అధికారాలు” అని పిలుస్తుంది. అయితే వాళ్లకన్నా ఎక్కువ అధికారం, అన్నిటి మీద పూర్తి అధికారం ఉన్న మహోన్నతుడు ఉన్నాడని కూడా బైబిలు చెప్తుంది. బైబిలు యెహోవా గురించి మాట్లాడుతూ చాలాసార్లు ఆయన్ని “మహోన్నత దేవుడు” అని పిలిచింది.—దాని. 7:18, 22, 25, 27.

“మహోన్నత దేవుడు”

9. దానియేలు ప్రవక్త దర్శనాల్లో ఏం చూశాడు?

9 మానవ ప్రభుత్వాల కన్నా యెహోవాకు చాలా ఎక్కువ అధికారం ఉందని, దానియేలు ప్రవక్త చూసిన దర్శనాలు స్పష్టం చేస్తున్నాయి. దానియేలు మొదట్లో నాలుగు పెద్ద మృగాల్ని చూశాడు. అవి ఒకప్పటి ప్రపంచ ఆధిపత్యాలైన బబులోను, మాదీయ-పారసీక, గ్రీసు, రోముల్ని అలాగే ఇప్పుడున్న ఆంగ్లో-అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి. (దాని. 7:1-3, 17) తర్వాత దానియేలు, పరలోకంలో సింహాసనం మీద యెహోవా దేవుడు కూర్చుని ఉండడం చూశాడు. (దాని. 7:9, 10) దానియేలు ఆ తర్వాత దర్శనంలో చూసినవి నేడున్న పరిపాలకులకు ఒక హెచ్చరికగా ఉన్నాయి.

10. దానియేలు 7:13, 14, 27 ప్రకారం, భూమిని పరిపాలించే అధికారం యెహోవా ఎవరికి ఇస్తాడు? దాన్నిబట్టి ఏం స్పష్టమౌతుంది?

10 దానియేలు 7:13, 14, 27 చదవండి. దేవుడు మానవ ప్రభుత్వాలకు ఉన్న అధికారం అంతా తీసేసి మరింత అర్హతగల వాళ్లకు, శక్తిగల వాళ్లకు దాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? “మానవ కుమారునిలా ఉన్న ఒకాయన” అంటే యేసుక్రీస్తుకు, అలాగే “మహోన్నత దేవుని పవిత్రులకు” అంటే 1,44,000 మందికి ఇస్తాడు. వాళ్లు “నిరంతరం, అవును యుగయుగాలు” పరిపాలిస్తారు. (దాని. 7:18) అలా చేసే అధికారం యెహోవాకు మాత్రమే ఉంది కాబట్టి, ఆయనే “మహోన్నత దేవుడు” అని స్పష్టమౌతుంది.

11. దేశాల మీద యెహోవాకు ఉన్న అధికారం గురించి దానియేలు ఇంకా ఏమన్నాడు?

11 దానియేలు దర్శనంలో చూసిన విషయాలు, అంతకుముందు ఆయన అన్నమాటలకు సరిగ్గా సరిపోతాయి. పరలోక దేవుడు “రాజుల్ని దించేస్తాడు, నియమిస్తాడు” అని ఆయన అన్నాడు. అంతేకాదు, “మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడని, ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాడని” కూడా ఆయన అన్నాడు. (దాని. 2:19-21; 4:17) యెహోవా దేవుడు రాజుల్ని దించేయడం, వేరేవాళ్లను నియమించడం ఎప్పుడైనా జరిగిందా? జరిగింది.

యెహోవా, బెల్షస్సరు నుండి రాజ్యాన్ని తీసేసి మాదీయులకు, పారసీకులకు ఇచ్చాడు (12వ పేరా చూడండి)

12. యెహోవా, గతంలో రాజుల్ని తమ అధికారం నుండి తీసేసిన ఉదాహరణ చెప్పండి. (చిత్రం చూడండి.)

12 మానవ పరిపాలకుల మీద తనకు అధికారం ఉందని యెహోవా చాలాసార్లు చూపించాడు. ఈ మూడు ఉదాహరణల గురించి ఆలోచించండి. ఐగుప్తు రాజైన ఫరో, ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకుని, యెహోవా ఎన్నిసార్లు అడిగినా వాళ్లను విడుదల చేయలేదు. అప్పుడు యెహోవా వాళ్లను విడిపించి, ఫరోను ఎర్రసముద్రంలో ముంచేశాడు. (నిర్గ. 14:26-28; కీర్త. 136:15) బబులోను రాజైన బెల్షస్సరు, ఒక విందు ఏర్పాటుచేసి ‘పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు.’ అతను యెహోవాను కాకుండా ‘వెండితో, బంగారంతో చేసిన దేవుళ్లను స్తుతించాడు.’ (దాని. 5:22, 23) దేవుడు అతని గర్వాన్ని అణిచేశాడు, “ఆ రాత్రే” బెల్షస్సరు చనిపోయాడు. అతని రాజ్యం మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడింది. (దాని. 5:28, 30, 31) పాలస్తీనా రాజైన హేరోదు అగ్రిప్ప I అపొస్తలుడైన యాకోబును చంపించాడు. అలాగే, అపొస్తలుడైన పేతురును కూడా జైల్లో వేసి చంపేయాలని అనుకున్నాడు. కానీ యెహోవా అలా జరగనివ్వలేదు. “యెహోవా దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు,” దాంతో అతను చనిపోయాడు.—అపొ. 12:1-5, 21-23.

13. పరిపాలకుల గుంపుల్ని యెహోవా ఓడించిన ఉదాహరణ చెప్పండి.

13 పరిపాలకుల గుంపుల మీద కూడా తనకు అధికారం ఉందని యెహోవా చూపించాడు. యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేస్తూ 31 మంది కనాను రాజుల్ని ఓడించి, వాళ్లకు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. (యెహో. 11:4-6, 20; 12:1, 7, 24) అలాగే సిరియా రాజైన బెన్హదదు 32 మంది రాజులతో కలిసి ఇశ్రాయేలీయుల మీదికి వచ్చినప్పుడు, వాళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేశాడు.—1 రాజు. 20:1, 26-29.

14-15. (ఎ) నెబుకద్నెజరు, దర్యావేషు రాజులు యెహోవా సర్వాధిపత్యం గురించి ఏమన్నారు? (బి) యెహోవా గురించి, ఆయన ప్రజల గురించి కీర్తనకర్త ఏమన్నాడు?

14 కేవలం ఒకటి రెండుసార్లు కాదు, తాను మహోన్నతుడినని యెహోవా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు మనుషుల స్తుతికి యెహోవాయే అర్హుడని వినయంగా ఒప్పుకునే బదులు, ‘తన సొంత శక్తి, బలం, ఘనత, వైభవాల గురించి’ గొప్పలు చెప్పుకున్నాడు. అప్పుడు యెహోవా అతనికి పిచ్చిపట్టేలా చేశాడు. నెబుకద్నెజరు కోలుకున్న తర్వాత సర్వోన్నతున్ని స్తుతిస్తూ, “ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది” అని ఒప్పుకున్నాడు. ‘ఆయన్ని ఆపగలిగే వాళ్లు ఎవ్వరూ లేరు’ అని కూడా అతను అన్నాడు. (దాని. 4:30, 33-35) ఒక సందర్భంలో దానియేలు యథార్థత పరీక్షించబడింది. అప్పుడు, యెహోవా దానియేలును సింహాల గుహ నుండి కాపాడాడు. ఆ సమయంలో, దర్యావేషు రాజు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ‘ప్రజలు దానియేలు సేవించే దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన జీవంగల దేవుడు, ఆయన శాశ్వతకాలం ఉంటాడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు, ఆయన సర్వాధిపత్యం నిరంతరం ఉంటుంది.’—దాని. 6:7-10, 19-22, 26, 27, అధస్సూచి.

15 కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా దేశాల కుట్రల్ని భగ్నం చేశాడు; దేశదేశాల ప్రజల ప్రణాళికల్ని పాడు చేశాడు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “యెహోవా దేవునిగా ఉన్న దేశం, తన సొత్తుగా ఆయన ఎంచుకున్న ప్రజలు సంతోషంగా ఉంటారు.” (కీర్త. 33:10, 12) యెహోవాకు యథార్థంగా ఉండడానికి అది చాలా మంచి కారణం కదా!

చివరి యుద్ధం

దేశాల గుంపు యెహోవా పరలోక సైన్యాలకు సాటిరాదు (16-17 పేరాలు చూడండి)

16. “మహాశ్రమ” సమయంలో మనం ఏ ధైర్యంతో ఉండవచ్చు? ఎందుకు? (చిత్రం చూడండి.)

16 గతంలో యెహోవా ఏం చేశాడో మనం తెలుసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో యెహోవా ఏం చేస్తాడు? రాబోయే “మహాశ్రమ” సమయంలో తన నమ్మకమైన సేవకుల్ని యెహోవా ఖచ్చితంగా కాపాడతాడనే ధైర్యంతో మనం ఉండవచ్చు. (మత్త. 24:21; దాని. 12:1) మాగోగు వాడైన గోగు, అంటే దేశాల గుంపు ప్రపంచవ్యాప్తంగా యెహోవాకు నమ్మకంగా ఉన్నవాళ్ల మీద దాడిచేసినప్పుడు, ఆయన మనల్ని కాపాడతాడు. ఈ దేశాల గుంపులో, ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాలు ఉన్నా, అవి మహోన్నత దేవునికి, ఆయన పరలోక సైన్యానికి సాటిరావు. యెహోవా ఇలా మాటిస్తున్నాడు: “నేను అనేక జనాల కళ్లముందు ఖచ్చితంగా నన్ను నేను మహిమపర్చుకుంటాను, పవిత్రపర్చుకుంటాను, నన్ను నేను తెలియజేసుకుంటాను; అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.”—యెహె. 38:14-16, 23; కీర్త. 46:10.

17. భూమ్మీదున్న రాజులకు, అలాగే యెహోవాకు యథార్థంగా ఉన్నవాళ్లకు త్వరలో ఏం జరుగుతుందని బైబిలు చెప్తుంది?

17 గోగు దాడి చివరి యుద్ధమైన హార్‌మెగిద్దోన్‌కు నడిపిస్తుంది. అప్పుడు యెహోవా “భూమంతటా ఉన్న రాజుల్ని” నాశనం చేస్తాడు. (ప్రక. 16:14, 16; 19:19-21) ఆ తర్వాత “నిజాయితీపరులే భూమ్మీద నివసిస్తారు, యథార్థవంతులే అందులో ఉండిపోతారు.”—సామె. 2:21, అధస్సూచి.

మన యథార్థతను కాపాడుకోవాలి

18. చాలామంది నిజ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఎందుకు? (దానియేలు 3:28)

18 వందల సంవత్సరాలుగా ఎంతోమంది నిజ క్రైస్తవులు సర్వాధిపతైన యెహోవా మీద ప్రేమతో తమ స్వేచ్ఛను, చివరికి ప్రాణాల్ని కూడా పణంగా పెడుతున్నారు. ఈ క్రైస్తవులు, తమ మహోన్నత దేవునికి యథార్థంగా ఉండాలని నిర్ణయించుకున్న ముగ్గురు హెబ్రీ యువకుల్లా ఉన్నారు. ఆ యువకుల్ని యెహోవా అగ్నిగుండం నుండి కాపాడాడు.—దానియేలు 3:28 చదవండి.

19. యెహోవా తన ప్రజలకు దేన్నిబట్టి తీర్పుతీరుస్తాడు? కాబట్టి మనం ఎలా జీవించాలి?

19 దేవునికి యథార్థంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో చెప్తూ, కీర్తనకర్త అయిన దావీదు ఇలా అన్నాడు: “దేశాల ప్రజలకు యెహోవా తీర్పు తీరుస్తాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చు.” (కీర్త. 7:8) ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నా యథార్థత, నా నిజాయితీ నన్ను కాపాడాలి.” (కీర్త. 25:21) ఏం జరిగినాసరే యెహోవాకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండడం కన్నా గొప్ప జీవితం ఇంకొకటి లేదు! అలా జీవిస్తే మనం కూడా కీర్తనకర్తలా ఇలా అంటాం: “యథార్థంగా ఉంటూ, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్లు సంతోషంగా ఉంటారు.”—కీర్త. 119:1, అధస్సూచి.

పాట 122 స్థిరంగా, నిలకడగా ఉందాం!

a క్రైస్తవులు పై అధికారాలకు, అంటే లోక ప్రభుత్వాలకు లోబడాలని బైబిలు చెప్తుంది. కానీ కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు యెహోవాను, ఆయన సేవకుల్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి మానవ పరిపాలకులకు లోబడుతూనే యెహోవాకు యథార్థంగా ఎలా ఉండవచ్చు?

b పదాల వివరణ: యెహోవాకు యథార్థంగా ఉండడం అంటే, ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా రాజీపడకుండా యెహోవాకు, ఆయన సర్వాధిపత్యానికి విశ్వసనీయంగా ఉండడం.