అధ్యయన ఆర్టికల్ 44
బైబిల్ని అన్ని కోణాల నుండి పరిశీలించండి
“వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంత అనేది పూర్తిగా గ్రహించండి.”—ఎఫె. 3:18.
పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. బైబిల్ని ఎలా లోతుగా చదివి, అధ్యయనం చేయవచ్చో ఉదాహరణతో చెప్పండి.
మీరు ఒక ఇంటిని కొనాలనుకుంటున్నట్టు ఊహించుకోండి. అలా కొనాలని అనుకున్నప్పుడు మీరేం చూస్తారు? ఆ ఇంటి ఫోటోను చూసి కొనేస్తారా? కొనరు కదా. మీరు స్వయంగా ఆ ఇంటికి వెళ్లి, ప్రతీ అంగుళం పరిశీలిస్తారు. గదులన్నీ తిరిగి, సదుపాయాలు ఎలా ఉన్నాయో చూస్తారు. అంతేకాదు, ఆ ఇంటిని కట్టడానికి ఏయే సామాన్లు వాడారో, ఎంతెంత వాడారో తెలుసుకుంటారు. నిజమే, మీ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ముందు ప్రతీ చిన్న వివరాన్ని తెలుసుకుంటారు.
2 బైబిల్ని చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు కూడా మనం అదే పని చేయవచ్చు. ఒక ఫ్రొఫెసర్ బైబిల్లో ఉన్న సందేశాన్ని “ఎత్తయిన కోటలు, లోతైన పునాదులు ఉన్న విశాలమైన భవనంతో పోల్చాడు.” మరి, బైబిల్లో ఉన్న విషయాలు బాగా తెలుసుకోవాలంటే మనమేం చేయాలి? దాన్ని గబగబా చదివేస్తే అందులో ఉన్న పైపైన విషయాలే అంటే “దేవుని సందేశాల గురించిన ప్రాథమిక బోధల్ని” మాత్రమే తెలుసుకోగలుగుతాం. (హెబ్రీ. 5:12) దానికి బదులు, ఒక ఇంటిని ఎలాగైతే పరిశీలిస్తామో బైబిల్లో ఉన్న వివరాలు కూడా “లోపలికి” వెళ్లి చూడాలి. దానికోసం బైబిల్లో ఉన్న వేర్వేరు విషయాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు ఏయే సత్యాల్ని నమ్ముతున్నారు అనేదే కాదు ఎందుకు నమ్ముతున్నారో కూడా తెలుసుకోవాలి.
3. అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు ఏం చేయమని చెప్పాడు? ఎందుకు? (ఎఫెసీయులు 3:14-19)
3 బైబిల్లో ఉన్న ప్రతీ వివరాన్ని అర్థం చేసుకోవాలంటే మనం లోతైన సత్యాల్ని తెలుసుకోవాలి. అపొస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయమని తన తోటి బ్రదర్స్-సిస్టర్స్‌కి చెప్పాడు. అలా వాళ్లు సత్యం “వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు” తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్నప్పుడు వాళ్ల విశ్వాసం “వేళ్లూనుకున్న చెట్టులా” స్థిరంగా ఉంటుంది. (ఎఫెసీయులు 3:14-19 చదవండి.) మనం కూడా అదే చేయాలి. అయితే, ఇప్పుడు దేవుని వాక్యం లోపలికి వెళ్లి, దాని అర్థాన్ని స్పష్టంగా ఎలా చూడవచ్చో తెలుసుకుందాం.
లోతైన బైబిలు సత్యాల్ని అన్వేషించండి
4. యెహోవాకు దగ్గరవ్వడానికి మనమేం చేయవచ్చు? ఉదాహరణలు చెప్పండి.
4 క్రైస్తవులుగా మనం బైబిల్లో ఉన్న పైపైన విషయాలు తెలుసుకుని తృప్తిపడం. దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం “లోతైన విషయాల్ని” తెలుసుకోవాలని పరితపిస్తాం. (1 కొరిం. 2:9, 10) దానికోసం, యెహోవాకు మిమ్మల్ని దగ్గర చేసే వ్యక్తిగత అధ్యయన ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టవచ్చు. అలా చేయడానికి కొన్ని ఐడియాలు ఏంటంటే, యెహోవా తన ప్రాచీనకాల సేవకుల మీద ఎలా ప్రేమ చూపించాడో, ఇప్పుడు ఆయన మీమీద ప్రేమ చూపిస్తున్నాడని అదెలా నిరూపిస్తుందో తెలుసుకోండి. అలాగే ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడానికి యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడో, దానికీ మన మీటింగ్స్‌కీ ఎలాంటి పోలికలు ఉన్నాయో తెలుసుకోండి. అంతేకాదు, యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో, పరిచర్యలో ఏయే ప్రవచనాలు నెరవేర్చాడో లోతుగా పరిశీలించండి.
5. మీ వ్యక్తిగత అధ్యయనంలో ఏ అంశాన్ని పరిశీలించాలని అనుకుంటున్నారు?
5 రీసర్చ్ బాగా చేయడానికి ఇష్టపడే కొంతమంది, వాళ్లు ఏ విషయాలు రీసర్చ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారో చెప్పారు. వాళ్లు చెప్పిన విషయాలు, “ బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి కొన్ని చిట్కాలు” అనే బాక్సులో మీరు చూడవచ్చు. యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకంలో ఈ విషయాల్ని మీరు పరిశీలించినప్పుడు, అధ్యయనం చేయడాన్ని మరింత ఇష్టపడతారు. బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మీ విశ్వాసం బలపడుతుంది. అలాగే “దేవుని గురించిన జ్ఞానం” దొరుకుతుంది. (సామె. 2:4, 5) ఇప్పుడు మనం తవ్వి వెలికి తీయగల కొన్ని లోతైన బైబిలు సత్యాల గురించి పరిశీలిద్దాం.
దేవుని సంకల్పం గురించి లోతుగా ఆలోచించండి
6. (ఎ) ప్రణాళికకు, సంకల్పానికి మధ్య తేడా ఏంటి? (బి) మనుషుల విషయంలో, భూమి విషయంలో యెహోవాకు “నిత్య సంకల్పం” ఉందని ఎందుకు చెప్పవచ్చు? (ఎఫెసీయులు 3:11)
6 ఉదాహరణకు, దేవుని సంకల్పం గురించి బైబిలు ఏం చెప్తుందో పరిశీలించండి. సాధారణంగా ప్రణాళికకు, సంకల్పానికి చాలా తేడా ఉంటుంది. ప్రణాళిక ఉంటే ఒక గమ్యస్థానాన్ని ఎంచుకొని, దాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్టమైన దారిని ఎంచుకుంటాం. అయితే ఆ దారిలో ఏదైనా అడ్డొస్తే మనం మన గమ్యాన్ని చేరుకోలేకపోవచ్చు. కానీ సంకల్పం ఉంటే, మనం మన గమ్యాన్ని మనసులో ఉంచుకొని ఎలాగైనాసరే అక్కడికి చేరుకోవాలని అనుకుంటాం. ఒకవేళ మన దారిలో ఏదైనా అడ్డొస్తే, ఆ దారిని మార్చుకోనైనా సరే మన గమ్యాన్ని చేరుకుంటాం. యెహోవా బైబిల్లో తన ‘నిత్య సంకల్పాన్ని’ క్రమక్రమంగా చెప్తూ వచ్చినందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! (ఎఫె. 3:11) ఆయన ఆరు నూరైనా నూరు ఆరైనా తన సంకల్పాన్ని సాధిస్తాడు. ఎందుకంటే ఆయన “ప్రతీది తన సంకల్పం కోసం తయారుచేశాడు.” (సామె. 16:4) అంతేకాదు, ఆయన చేసినవన్నీ ఎప్పటికీ నిలిచివుంటాయి. ఇంతకీ యెహోవా సంకల్పం ఏంటి? ఆయన దాన్ని సాధించడానికి ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నాడు?
7. ఆదాముహవ్వలు ఎదురుతిరిగిన తర్వాత యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు? (మత్తయి 25:34)
7 దేవుడు మనుషుల విషయంలో తన సంకల్పం ఏంటో ఆదాముహవ్వలకు చెప్పాడు. వాళ్లు ‘పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపాలని, దాన్ని లోబర్చుకోవాలని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలాలని’ ఆయన చెప్పాడు. (ఆది. 1:28) కానీ, ఆదాముహవ్వలు ఎదురు తిరిగినప్పుడు మనుషులందరికీ పాపం చుట్టుకుంది. అంతమాత్రాన యెహోవా సంకల్పం అక్కడితో ఆగిపోలేదు. దాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన వెంటనే మనుషుల విషయంలో, భూమి విషయంలో తన మొట్టమొదటి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక రాజ్యాన్ని పరలోకంలో స్థాపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. (మత్తయి 25:34 చదవండి.) అందుకే, ఆయన అనుకున్న సమయంలో మనుషుల మీద ప్రేమతో తన ఒక్కగానొక్క కొడుకును భూమ్మీదకు పంపించాడు. అలా యేసు ఈ భూమ్మీదకు వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రజలకు బోధించాడు. పాపం, మరణం నుండి వాళ్లను విడిపించడానికి తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశాడు. ఆ తర్వాత యేసు పరలోకంలో దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడానికి పునరుత్థానమయ్యాడు. అయితే, ఇక్కడితో అయిపోలేదు. యెహోవా సంకల్పం గురించి ఆలోచించడానికి ఇంకా చాలావుంది.
8. (ఎ) బైబిలు ముఖ్యాంశం ఏంటి? (బి) ఎఫెసీయులు 1:8-11 ప్రకారం, యెహోవా అంతిమ సంకల్పం ఏంటి? (కవర్ పేజీ మీదున్న చిత్రం చూడండి.)
8 క్రీస్తు పరిపాలించే రాజ్యం ద్వారా భూమి విషయంలో తనకున్న సంకల్పాన్ని నెరవేరుస్తూ, యెహోవా తన పేరును మహిమపర్చుకోవడమే బైబిలు ముఖ్యాంశం. యెహోవా తన సంకల్పాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఏం జరిగినా సరే, ఆయన దాన్ని నెరవేర్చి తీరతాడు. (యెష. 46:10, 11, అధస్సూచీలు; హెబ్రీ. 6:17, 18) భూమంతా పరదైసుగా మారి, ఆదాముహవ్వల పిల్లలు పరిపూర్ణులై, నీతిమంతులై “శాశ్వతకాలం” జీవించే సమయం ఇంకెంతో దూరంలో లేదు. (కీర్త. 22:26) యెహోవా అక్కడితో ఆగిపోడు. ఆయన మనసులో ఇంకా పెద్ద సంకల్పం ఉంది. పరలోకంలో అలాగే భూమ్మీదున్న తన సేవకులందర్నీ ఐక్యం చేయడమే తన అంతిమ సంకల్పం! అప్పుడు, తన పరిపాలనకు నమ్మకంగా లోబడే ప్రతీఒక్కరి గుండె ఆయన కోసమే కొట్టుకుంటుంది. (ఎఫెసీయులు 1:8-11 చదవండి.) యెహోవా తన సంకల్పాన్ని అద్భుతంగా నెరవేర్చడం చూస్తుంటే మీకు ఆశ్చర్యంగా లేదా?
మీ భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించండి
9. బైబిలు చదవడం ద్వారా మన భవిష్యత్తును ఎంతవరకు చూడవచ్చు?
9 యెహోవా ఏదెను తోటలో చెప్పిన ప్రవచనాన్ని గమనించండి. ఆ ప్రవచనం ఆదికాండం 3:15లో ఉంది. b ఆయన సంకల్పం నెరవేరే క్రమంలో ఏయే సంఘటనలు జరుగుతాయో ఆ లేఖనంలో ఉంది. అయితే, అవన్నీ అప్పటికప్పుడు జరిగేవి కాదుగానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగే సంఘటనలు. అందులో అబ్రాహాముకు పిల్లలు పుట్టడం, ఆ వంశం నుండే క్రీస్తు రావడం ఉంది. (ఆది. 22:15-) ఆ తర్వాత, ఆ ప్రవచనంలోని మొదటి భాగం అంటే యేసును మడిమె మీద కొట్టడం క్రీ.శ. 33లో జరిగింది. ( 18అపొ. 3:13-15) ఆ ప్రవచనంలోని చివరి సంఘటన, అంటే సాతాను తలను చితక్కొట్టడం క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన చివర్లో జరుగుతుంది. (ప్రక. 20:7-10) అయితే సాతాను వ్యవస్థకు, యెహోవా సంస్థకు మధ్యవున్న శత్రుత్వం ముగుస్తున్నప్పుడు ఏయే సంఘటనలు జరుగుతాయో కూడా బైబిలు చెప్తుంది.
10. (ఎ) త్వరలో ఏ సంఘటనలు జరుగుతాయి? (బి) దానికోసం మనమెలా సిద్ధపడవచ్చు? (అధస్సూచి చూడండి.)
10 బైబిలు ముందే చెప్పిన ఈ ఆసక్తికరమైన సంఘటనల గురించి ఆలోచించండి. ముందుగా దేశాలు “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన చేస్తాయి. (1 థెస్స. 5:2, 3) అప్పుడు “హఠాత్తుగా” దేశాలు అబద్ధమతం మీద దాడి చేయడంతో మహాశ్రమ మొదలౌతుంది. (ప్రక. 17:16) ఆ తర్వాత “మానవ కుమారుడు శక్తితో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం” చూసేలా ఆకాశంలో సూచనలు కనిపించవచ్చు. (మత్త. 24:30) అప్పుడు యేసు, మనుషుల్ని గొర్రెలుగా-మేకలుగా తీర్పు తీరుస్తాడు. (మత్త. 25:31-33, 46) అయితే, ఇదంతా జరుగుతున్నప్పుడు సాతాను ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చోడు గానీ, దేవుని ప్రజల మీద ద్వేషంతో వాళ్ల మీద దాడి చేసేలా, “మాగోగు దేశం వాడైన గోగు” అని పిలవబడే దేశాల గుంపును రెచ్చగొడతాడు. (యెహె. 38:2, 10, 11) అయితే, మహాశ్రమ మొదలైన తర్వాత ఏదోక సమయంలో అభిషిక్త క్రైస్తవుల్లో మిగిలినవాళ్లు పరలోకానికి సమకూర్చబడతారు. వాళ్లు క్రీస్తు అలాగే తన పరలోక సైన్యంతో కలిసి హార్‌మెగిద్దోన్ యుద్ధంలో పాల్గొంటారు. దాంతో మహాశ్రమకు తెరపడుతుంది. c (మత్త. 24:31; ప్రక. 16:14, 16) ఆ తర్వాత ఈ భూమ్మీద క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన మొదలౌతుంది.—ప్రక. 20:6.
11. శాశ్వత జీవితం గురించి ఆలోచించినప్పుడు మీకేం అనిపిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)
11 ఇప్పుడు, ఒకసారి మన భవిష్యత్తును ఇంకాస్త ముందుకెళ్లి చూద్దాం. సృష్టికర్త, “నిరంతరం జీవించడమనే ఆలోచనను కూడా [మన] హృదయంలో పెట్టాడు” అని బైబిలు చెప్తుంది. (ప్రసం. 3:11) దీన్నిబట్టి మీ ఆయుష్షు, యెహోవాతో మీకు ఉన్న బంధం ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి. యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలో, 319వ పేజీలో మన ఆసక్తికి ఆయువు పోసే ఈ మాటలున్నాయి: ‘వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు జీవించిన తర్వాత యెహోవా దేవుని గురించి మనకు ఇప్పుడు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ తెలుసుకుంటూనే ఉంటాం. అయినాసరే, నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఇంకా చాలాచాలా ఉంటాయి. పరదైసులో మన జీవితం ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుందో మన కలలో కూడా ఊహించలేం. అన్నిటికన్నా మించి, మనం యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతూనే ఉంటాం.’ అయితే, ఈలోపు బైబిల్ని అధ్యయనం చేస్తుండగా మనం ఇంకా ఏయే విషయాల్ని అన్వేషించవచ్చు?
ఎత్తయిన పరలోకానికి తొంగి చూడండి
12. మనం ఎత్తయిన పరలోకానికి ఎలా తొంగి చూడవచ్చు? ఒక ఉదాహరణ ఇవ్వండి.
12 యెహోవా నివసించే “అత్యున్నత” స్థలం గురించి బైబిలు కొన్ని వివరాలు చెప్తుంది. (యెష. 33:5) అలాగే యెహోవా గురించి, ఆయన సంస్థలోని పరలోక భాగం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. (యెష. 6:1-4; దాని. 7:9, 10; ప్రక. 4:1-6) ఉదాహరణకు, యెహెజ్కేలు ‘ఆకాశం తెరుచుకుని, దేవుని దర్శనాలు’ చూసినప్పుడు చెప్పిన అద్భుతమైన విషయాల్ని మనం బైబిల్లో చదవచ్చు.—యెహె. 1:1.
13. హెబ్రీయులు 4:14-16 ప్రకారం, పరలోకంలో యేసు పాత్ర గురించి మీకేది బాగా నచ్చింది?
13 పరలోకంలో రాజుగా, మనల్ని అర్థంచేసుకునే ప్రధానయాజకుడిగా యేసుకున్న పాత్ర గురించి కూడా ఆలోచించండి. ఆయన ద్వారా మనకు సరిగ్గా “అవసరమైనప్పుడు కరుణను, అపారదయను . . . అనుగ్రహించే దేవుని సింహాసనం దగ్గరికి” ధైర్యంగా వెళ్లి ప్రార్థించగలుగుతున్నాం. (హెబ్రీయులు 4:14-16 చదవండి.) కాబట్టి యెహోవా అలాగే యేసు పరలోకం నుండి మనకోసం ఏం చేశారో, ఏం చేస్తున్నారో సూర్యుడు అస్తమించక ముందే కనీసం ఒక్కసారైనా ఆలోచించాలి. వాళ్లు చూపించిన ప్రేమ మన హృదయ లోతుల్లోకి వెళ్లి ఆయన సేవ చేయాలని, ఆయన్ని ఆరాధించాలనే తపనను మనలో పెంచాలి.—2 కొరిం. 5:14, 15.
14. యెహోవా అలాగే యేసు చేసినవాటికి కృతజ్ఞత ఉందని మనమెలా చూపించవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)
14 యెహోవా అలాగే యేసు చేసినవాటికి కృతజ్ఞత ఉందని మనం ఎలా చూపించవచ్చు? ఒక విధానం ఏంటంటే, ప్రజల్ని యెహోవాకు సాక్షులుగా, యేసుకు శిష్యులుగా చేయడం ద్వారా అలా చేయవచ్చు. (మత్త. 28:19, 20) అపొస్తలుడైన పౌలు దేవుని మీద, క్రీస్తు మీద కృతజ్ఞత ఉందని చూపించడానికి అదే చేశాడు. “అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని” రక్షించబడాలనేదే యెహోవా ఇష్టమని పౌలుకు తెలుసు. (1 తిమో. 2:3, 4) అందుకే ఆయన “ఎలాగైనాసరే కొందర్ని రక్షించాలనే ఉద్దేశంతో” వీలైనంత ఎక్కువమందికి ప్రకటించడానికి శాయశక్తులా కృషిచేశాడు.—1 కొరిం. 9:22, 23.
దేవుని వాక్యం లోలోతుల్లోకి వెళ్తే సంతోషం మీ సొంతం
15. కీర్తన 1:2 ప్రకారం, మనకేది సంతోషాన్నిస్తుంది?
15 “యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ” దాన్ని “పగలూ రాత్రీ” ధ్యానించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు, విజయాన్ని సొంతం చేసుకుంటాడు అని కీర్తనకర్త సరిగ్గానే చెప్పాడు. (కీర్త. 1:1-3) స్టడీస్ ఇన్ ద సామ్స్ అనే పుస్తకంలో బైబిలు అనువాదకుడైన జోసఫ్ రోథర్హామ్ ఆ లేఖనం గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఒకవ్యక్తి దేవుని నిర్దేశం తీసుకోవడంలో ఎంత ఆనందిస్తాడంటే అతను దానికోసం వెదుకుతాడు, నేర్చుకుంటాడు, చాలా సమయం తీసుకుని ఆలోచిస్తాడు. అంతేకాదు, బైబిలు చదవకుండా అతనికి ఒక రోజు గడిచిందంటే, ఆ రోజు వృథా అయినట్టే.” కాబట్టి బైబిల్లో ఉన్న ఆసక్తికరమైన వివరాల్ని చదివి, అవి ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఆలోచించినప్పుడు బైబిలు అధ్యయనం చేయడాన్ని మీరు ఇష్టపడతారు. ఇలా బైబిల్ని అన్ని కోణాల నుండి పరిశీలించడం ఎంత సంతోషంగా ఉంటుందో కదా!
16. తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
16 యెహోవా తన వాక్యమైన బైబిల్లో మనకు నేర్పించే ఆసక్తికరమైన సత్యాలు మనం అర్థం చేసుకోలేనంత కష్టమైనవి కావు. అయితే, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో చెప్పిన ఒక లోతైన సత్యం గురించి, అంటే యెహోవా ఆధ్యాత్మిక ఆలయం గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీరు తప్పకుండా సంతోషిస్తారు.
పాట 94 దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత
a బైబిల్ని అధ్యయనం చేయడం మనకు ఆనందంగా ఉంటుంది. అలా అధ్యయనం చేసినప్పుడు మన పరలోక తండ్రికి చాలా దగ్గరౌతాం. అయితే బైబిలు “వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు” ఎలా తెలుసుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
b 2022, జూలై కావలికోట సంచికలోని “మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనం” అనే ఆర్టికల్ చూడండి.
c త్వరలో జరగబోయే ఆసక్తికరమైన సంఘటనలకు ఎలా సిద్ధపడవచ్చో తెలుసుకోవడానికి దేవుని రాజ్యం పరిపాలిస్తోంది! పుస్తకంలో 230వ పేజీ చూడండి.