కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 34

బైబిలు ప్రవచనాల నుండి నేర్చుకోండి

బైబిలు ప్రవచనాల నుండి నేర్చుకోండి

“లోతైన అవగాహన ఉన్నవాళ్లు అర్థం చేసుకుంటారు.”దాని. 12:10.

పాట 98 లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

ఈ ఆర్టికల్‌లో . . . a

1. మనం ఏ విషయాన్ని అర్థం చేసుకుంటే బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయడానికి ఇష్టపడతాం?

 “బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయడమంటే నాకు చాలా ఇష్టం” అని బెన్‌ అనే బ్రదర్‌ చెప్తున్నాడు. మీకు అలాగే అనిపిస్తుందా? లేదా అవి అర్థం చేసుకోవడం కష్టమని, బోర్‌ కొడతాయని అనిపిస్తుందా? అయితే, బైబిలు ప్రవచనాల్ని దేవుడు ఎందుకు రాయించాడో అర్థం చేసుకుంటే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 ఈ ఆర్టికల్‌లో, బైబిలు ప్రవచనాల్ని ఎందుకు అధ్యయనం చేయాలో మాత్రమే కాదు ఎలా అధ్యయనం చేయాలో కూడా చూస్తాం. అలాగే దానియేలు పుస్తకంలో ఉన్న రెండు ప్రవచనాల్ని పరిశీలించి, వాటిని అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకొచ్చే ప్రయోజనం ఏంటో చూస్తాం.

బైబిలు ప్రవచనాల్ని ఎందుకు అధ్యయనం చేయాలి?

3. బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి?

3 మనం బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవాలంటే సహాయం అడగాలి. ఈ ఉదాహరణ గమనించండి. మీరు తెలియని ఒక కొత్త ప్రాంతానికి వెళ్లారనుకోండి. మీకు అక్కడంతా కొత్తగా అనిపిస్తుంది. కానీ మీతోపాటు వచ్చిన ఫ్రెండ్‌కి ఆ ప్రాంతమంతా కొట్టినపిండి. మీరు ఎక్కడ ఉన్నారో, ఏ రూట్‌ ఎటు తీసుకెళ్తుందో అతనికి బాగా తెలుసు. అతను మీతోపాటు వచ్చినందుకు మీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు కదా! అదేవిధంగా, మనం ఏ కాలంలో జీవిస్తున్నామో యెహోవాకు బాగా తెలుసు. మన జీవితంలో రాబోయే ప్రతీ మలుపు ఆయనకు తెలుసు. కాబట్టి బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవాలంటే, మనం వినయంగా ఆయన సహాయం అడగాలి.—దాని. 2:28; 2 పేతు. 1:19, 20.

బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేస్తే భవిష్యత్తులో జరిగే సంఘటనల కోసం సిద్ధంగా ఉంటాం (4వ పేరా చూడండి)

4. యెహోవా బైబిలు ప్రవచనాల్ని ఎందుకు రాయించాడు? (యిర్మీయా 29:11) (చిత్రం కూడా చూడండి.)

4 సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పూలబాటలా ఉండాలని కోరుకుంటారు. యెహోవా కూడా తన పిల్లలైన మన విషయంలో అదే కోరుకుంటున్నాడు. (యిర్మీయా 29:11 చదవండి.) అయితే పిల్లల భవిష్యత్తు ఏంటో తల్లిదండ్రులకు తెలీదు. కానీ మన భవిష్యత్తు ఏంటో యెహోవాకు పూర్తిగా తెలుసు. మనం కూడా భవిష్యత్తులో జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకునేలా ఆయన బైబిల్లో కొన్ని ప్రవచనాల్ని రాయించాడు. (యెష. 46:10) నిజానికి బైబిలు ప్రవచనాలు, మన పరలోక తండ్రి మనకు ప్రేమతో ఇచ్చిన బహుమతి లాంటివి. అయితే బైబిలు ప్రవచనాలు నిజమౌతాయనే నమ్మకంతో మీరు ఎందుకు ఉండొచ్చు?

5. మాక్స్‌ నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?

5 స్కూల్లో బైబిలు అంటే ఏమాత్రం గౌరవంలేని ప్రజల మధ్య మన పిల్లలు ఉంటున్నారు. వాళ్ల మాటలు, పనులు మన యౌవనుల మనసులో బైబిలు మీద అనుమానాలు పుట్టించవచ్చు. మాక్స్‌ అనే బ్రదర్‌ అనుభవాన్ని గమనించండి. అతను ఇలా అంటున్నాడు: “నేను టీనేజీలో ఉన్నప్పుడు మా అమ్మానాన్న నిజమైన మతం గురించి నేర్పిస్తున్నారా? అసలు బైబిల్ని దేవుడే రాయించాడా? అనే అనుమానాలు నాకు మొదలయ్యాయి.” మరి మాక్స్‌ వాళ్ల అమ్మానాన్న ఏం చేశారు? “నా గురించి వాళ్లు కంగారుపడినా, నన్ను కోప్పడలేదు” అని అతను చెప్పాడు. మాక్స్‌ వాళ్ల అమ్మానాన్న అతని ప్రశ్నలన్నిటికీ బైబిలు నుండి జవాబు ఇచ్చారు. దాంతోపాటు మాక్స్‌ కూడా ఒక పని చేశాడు. అతను ఇలా చెప్పాడు: “నేను వ్యక్తిగతంగా బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేశాను. అంతేకాదు నేను నేర్చుకున్న విషయాల్ని సంఘంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడేవాణ్ణి. ఆ తర్వాత నుండి బైబిల్ని దేవుడే రాయించాడని నాకు నమ్మకం కుదిరింది.”

6. మీకు అనుమానాలు ఉంటే ఏం చేయాలి? ఎందుకు?

6 మాక్స్‌లాగే బైబిల్లో ఉన్నది సత్యమా కాదా అనే అనుమానం మీకు వస్తే, అది పెద్ద పాపం ఏమీ కాదు. కానీ దానిగురించి వెంటనే ఏదోకటి చేయాలి. అనుమానం తుప్పు లాంటిది. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే విలువైనదాన్ని నాశనం చేస్తుంది. మీ విశ్వాసానికి పట్టిన “తుప్పు” కూడా వదలాలంటే ఇలా ప్రశ్నించుకోవాలి: ‘భవిష్యత్తు గురించి బైబిలు చెప్పేది నేను నమ్ముతున్నానా?’ ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతుంటే ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనాల గురించి మీరు అధ్యయనం చేయాలి. దాన్నెలా చేయవచ్చు?

బైబిలు ప్రవచనాల్ని ఎలా అధ్యయనం చేయాలి?

దానియేలులాగే యెహోవా మీద నమ్మకాన్ని పెంచుకోవాలంటే బైబిలు ప్రవచనాల్ని వినయంతో, పైపైన కాకుండా విషయాల్ని లోతుగా, సరైన ఉద్దేశంతో అధ్యయనం చేయాలి (7వ పేరా చూడండి)

7. ప్రవచనాల్ని ఎలా అధ్యయనం చేయాలో దానియేలు ఎలా చేసి చూపించాడు? (దానియేలు 12:10) (చిత్రం కూడా చూడండి.)

7 ప్రవచనాల్ని ఎలా అధ్యయనం చేయాలో దానియేలు చేసి చూపించాడు. అతను సత్యం తెలుసుకోవాలనే సరైన ఉద్దేశంతో ప్రవచనాల్ని అధ్యయనం చేశాడు. అంతేకాదు దానియేలు వినయస్థుడు. యెహోవాకు దగ్గరగా ఉండి తనకు లోబడేవాళ్లకు, ప్రవచనాల్ని అర్థం చేసుకునే తెలివిని ఇస్తాడని అతను నమ్మాడు. (దాని. 2:27, 28; దానియేలు 12:10 చదవండి.) సహాయం కోసం యెహోవా వైపు చూడడం ద్వారా దానియేలు వినయం ఉందని చూపించాడు. (దాని. 2:18) అలాగే దానియేలు పైపైన కాకుండా విషయాల్ని లోతుగా పరిశీలించాడు. తనకు అందుబాటులో ఉన్న లేఖనాలన్నిటినీ పరిశోధించాడు. (యిర్మీ. 25:11, 12; దాని. 9:2) మరి దానియేలులాగే మీరేం చేయవచ్చు?

8. కొంతమంది ఏ ఉద్దేశంతో బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయాలనుకుంటారు? కానీ మనం ఏ ఉద్దేశంతో చేయాలి?

8 మీ ఉద్దేశాల్ని పరిశీలించుకోండి. సత్యం తెలుసుకోవాలన్న బలమైన కోరిక వల్లే మీరు బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయాలనుకుంటున్నారా? అలాగైతే, యెహోవా మీకు సహాయం చేస్తాడు. (యోహా. 4:23, 24; 14:16, 17) అయితే కొంతమంది ఎందుకు ప్రవచనాల్ని అధ్యయనం చేయాలనుకుంటారు? ఒకవేళ బైబిల్ని దేవుడు రాయించకపోతే ఇక తమకు నచ్చినట్టు చేయవచ్చని, తప్పొప్పుల గురించి తమ సొంత ప్రమాణాల్ని పాటించవచ్చని వాళ్లు అనుకుంటారు. అందుకే దానికి సంబంధించిన ఆధారాల కోసం వాళ్లు బైబిల్లో వెతుకుతారు. కానీ బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయడానికి మనకు సరైన ఉద్దేశాలు ఉండాలి. దాంతోపాటు ప్రవచనాల్ని అర్థం చేసుకోవడానికి మనకు ఇంకో ముఖ్యమైన లక్షణం కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం.

9. బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవడానికి మనకు ఏ లక్షణం కావాలి? వివరించండి.

9 వినయం. వినయం ఉన్నవాళ్లకు సహాయం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (యాకో. 4:6) కాబట్టి బైబిలు ప్రవచనాల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని మనం యెహోవాను అడగాలి. అంతేకాదు మనకు వినయం ఉంటే, సరైన సమయంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇవ్వడానికి యెహోవా ఉపయోగించుకుంటున్న పరిపాలక సభ సహాయం తీసుకుంటాం. (లూకా 12:42) మనం బైబిలు సత్యాల్ని అర్థం చేసుకునేలా యెహోవా కేవలం పరిపాలక సభ ద్వారా మాత్రమే సహాయం చేస్తాడని చెప్పగలం. ఎందుకంటే ఆయన అన్నీ క్రమపద్ధతిగా చేసే దేవుడు.—1 కొరిం. 14:33; ఎఫె. 4:4-6.

10. ఎస్తేర్‌ నుండి మీరేం నేర్చుకున్నారు?

10 పైపైన కాకుండా విషయాల్ని లోతుగా పరిశీలించండి. ముందుగా, మీకు బాగా ఆసక్తిగా ఉన్న ప్రవచనం ఎంచుకుని దానిగురించి పరిశోధన చేయండి. ఎస్తేర్‌ అనే సిస్టర్‌ అదే చేసింది. ఆమె మెస్సీయ గురించిన ప్రవచనాల గురించి అధ్యయనం చేయాలనుకుంది. ఆమె ఇలా అంటుంది: “యేసు పుట్టడానికి చాలాకాలం ముందే ఆయన గురించి ప్రవచనాల్లో ఉన్నాయని అనడానికి రుజువుల్ని వెదకడం 15 ఏళ్ల వయసులో మొదలుపెట్టాను.” ఆమె మృత సముద్రపు గ్రంథపు చుట్టల గురించి చదివిన తర్వాత ఇలా ఒప్పుకుంటుంది: “క్రీస్తు పుట్టడానికి చాలాకాలం ముందే అందులో ఉన్న కొన్ని ప్రవచనాలు రాయబడ్డాయంటే వాటన్నిటినీ దేవుడే చెప్పాడని అర్థమౌతుంది.” ఎస్తేర్‌ ఇలా ఒప్పుకుంటుంది: “నేను వీటిని అర్థం చేసుకోవడానికి చాలాసార్లు చదవాల్సి వచ్చింది.” కానీ ఆమె అలా చదివినందుకు ఫలితం దక్కింది. బైబిలు ప్రవచనాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత ఆమె ఇలా అంటుంది: “బైబిలు చెప్పేవి నిజమని ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది.”

11. బైబిలు ప్రవచనాల్ని పరిశీలించినప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి?

11 ఇప్పటికే నెరవేరిన కొన్ని బైబిలు ప్రవచనాల్ని పరిశీలించినప్పుడు యెహోవా మీద, ఆయన మనల్ని నడిపిస్తున్న విధానం మీద చెక్కుచెదరని నమ్మకాన్ని పెంచుకుంటాం. అంతేకాదు ఇప్పుడు మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా, భవిష్యత్తు మీద ఆశతో జీవించడానికి బైబిలు ప్రవచనాలు మనకు సహాయం చేస్తాయి. మన కళ్లముందు నెరవేరుతున్న రెండు దానియేలు ప్రవచనాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. వాటిని అర్థం చేసుకుంటే మనం తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

ఇనుము బంకమట్టి కలిసివున్న పాదాల గురించి ఎందుకు తెలుసుకోవాలి?

12. “ఇనుము మెత్తని బంకమట్టితో కలిసి” ఉన్న పాదాలు దేన్ని సూచిస్తున్నాయి? (దానియేలు 2:41-43)

12 దానియేలు 2:41-43 చదవండి. నెబుకద్నెజరు రాజుకు కలలో కనిపించిన భారీ ప్రతిమ పాదాలు “ఇనుము మెత్తని బంకమట్టితో” కలిసి ఉన్నాయి. దానియేలు పుస్తకంలో ఉన్న ఈ ప్రవచనాన్ని, ప్రకటన పుస్తకంలో ఉన్న మిగతా ప్రవచనాలతో పోల్చి చూసినప్పుడు పాదాలు మన కాలంలోని ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రపంచాధిపత్యం గురించి దానియేలు ఇలా చెప్పాడు: “ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా మరో విషయంలో బలహీనంగా ఉంటుంది.” ఎందుకు అది ఒకింత బలహీనంగా ఉంటుంది? ఎందుకంటే బంకమట్టి సూచిస్తున్న సామాన్య ప్రజలు, ఆ ప్రపంచాధిపత్యం ఇనుములాంటి శక్తితో పనిచేయకుండా దాని బలాన్ని తగ్గిస్తారు. b

13. భారీ ప్రతిమకు సంబంధించిన ప్రవచనాన్ని అర్థంచేసుకుంటే ఏ ముఖ్యమైన సత్యాల్ని తెలుసుకుంటాం?

13 భారీ ప్రతిమ గురించి దానియేలు చెప్పిన వివరాలు, ముఖ్యంగా పాదాలకు సంబంధించి అతను చెప్పిన వివరాలు కొన్ని ముఖ్యమైన సత్యాల్ని నేర్పిస్తున్నాయి. మొదటిది, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం కొన్ని విధాలుగా దానికి ఉన్న బలాన్ని చూపించింది. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం గెలవడంలో అది ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే ఆ ప్రపంచాధిపత్యానికి బలం తగ్గిపోయింది. అమెరికా అలాగే బ్రిటన్‌ దేశాల్లో ఉన్న పౌరుల అంతర్గత కలహాల వల్ల దానికున్న శక్తి ఇంకా తగ్గుతూ పోతుంది. రెండోది, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యమే చివరి ప్రపంచాధిపత్యం. కొన్ని దేశాలు అప్పుడప్పుడు ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యానికి సవాలు విసిరి దాన్ని వ్యతిరేకించినా, దాని స్థానాన్ని మాత్రం తీసుకోవు. ఎందుకంటే దేవుని రాజ్యానికి సూచనగా ఉన్న ఆ “రాయి” ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తున్న పాదాల్ని ఢీకొట్టి, వాటిని నలగ్గొడుతుంది. దాంతో మానవ పరిపాలన ముగుస్తుంది, దేవుని రాజ్య పరిపాలన మొదలౌతుంది.—దాని. 2:34, 35, 44, 45.

14. ఇనుము బంకమట్టి కలిసి ఉన్న పాదాల ప్రవచనం నిజమనే నమ్మకం కుదిరిందని మీరెలా చూపిస్తారు?

14 దానియేలు చెప్పిన ఇనుము బంకమట్టి కలిసి ఉన్న పాదాల ప్రవచనం నిజమనే నమ్మకం మీకు కుదిరిందా? అలాగైతే, ఆ నమ్మకం మీ జీవిత విధానంలో కనిపిస్తుంది. నాశనమయ్యే ఈ లోకంలో ఎక్కువ డబ్బు సంపాదించి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించరు. (లూకా 12:16-21; 1 యోహా. 2:15-17) అంతేకాదు ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకుంటే, ప్రకటించే-బోధించే పని ఎంత ప్రాముఖ్యమో తెలుసుకుంటారు. (మత్త. 6:33; 28:18-20) ఈ ప్రవచనాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని రాజ్యం మనుషుల పరిపాలనకు ఒక ముగింపు చుక్క పెడుతుందని నమ్ముతున్నట్టు నా నిర్ణయాలు చూపిస్తున్నాయా?’

“ఉత్తర రాజు,” “దక్షిణ రాజు” గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

15. ప్రస్తుతం “ఉత్తర రాజు,” “దక్షిణ రాజు” ఎవరు? (దానియేలు 11:40)

15 దానియేలు 11:40 చదవండి. దానియేలు 11వ అధ్యాయం, ఇద్దరు రాజులు లేదా రాజకీయ శక్తుల గురించి మాట్లాడుతుంది. వాళ్లు ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ఒకరితోఒకరు పోరాడుతూ ఉంటారు. ఈ ప్రవచనాన్ని, బైబిల్లో ఉన్న ఇతర ప్రవచనాలతో పోల్చి చూసినప్పుడు రష్యా, దానికి మద్దతిచ్చే దేశాలు “ఉత్తర రాజు” అని, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం “దక్షిణ రాజు” అని గుర్తుపట్టవచ్చు. c

“ఉత్తర రాజు,” “దక్షిణ రాజు” మధ్య జరిగే పోరాటం బైబిలు ప్రవచన నెరవేర్పని గుర్తించినప్పుడు మన విశ్వాసాన్ని బలపర్చుకుంటాం, అనవసరంగా కంగారుపడకుండా ఉంటాం (16-18 పేరాలు చూడండి)

16. “ఉత్తర రాజు” పరిపాలన కిందున్న దేవుని ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు?

16 “ఉత్తర రాజు” తన పరిపాలన కిందున్న దేవుని ప్రజల్ని హింసిస్తున్నాడు. విశ్వాసం కారణంగా కొంతమంది సాక్షుల్ని కొట్టారు, జైల్లో వేశారు. అయితే అది మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ని భయపెట్టే బదులు వాళ్ల విశ్వాసాన్ని బలపర్చాయి. ఎందుకంటే దేవుని ప్రజల మీదికి హింసలు వస్తాయని, దానియేలు చెప్పిన ప్రవచనం నెరవేరుతుందని వాళ్లకు తెలుసు. d (దాని. 11:41) అది తెలుసుకోవడం మన నిరీక్షణను బలంగా ఉంచుకోవడానికి, మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.

17. “దక్షిణ రాజు” పరిపాలన కిందున్న దేవుని ప్రజలు ఎలాంటి కష్టాలుపడ్డారు?

17 గతంలో యెహోవా ప్రజల మీద “దక్షిణ రాజు” నేరుగా దాడి చేశాడు. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధంలో పాల్గొననందుకు చాలామంది బ్రదర్స్‌ని జైల్లో వేశారు. సాక్షుల పిల్లల్ని స్కూల్లో నుండి గెంటేశారు. అయితే ఈ మధ్య కాలంలో, ఆ రాజు పరిపాలన కిందున్న యెహోవా సేవకులకు తమ విశ్వసనీయతకు సంబంధించి కంటికి కనిపించని పరీక్షలు వచ్చాయి. ఉదాహరణకు ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో, ఫలానా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఒక క్రైస్తవుడికి అనిపించే అవకాశం ఉంది. బహుశా అతను ఓటేసేంత దూరం వెళ్లకపోయినా, ఫలానా పార్టీ మంచిదని లేదా ఫలానా అభ్యర్థి గెలిస్తే బాగుండని మనసులో లేదా హృదయంలో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కేవలం మన పనుల్లోనే కాదు మన ఆలోచనల్లో, హృదయాల్లో కూడా ఎవ్వరి పక్షాన ఉండకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యం.—యోహా. 15:18, 19; 18:36.

18. ఇద్దరు రాజుల మధ్య జరిగే పోరాటానికి మనం ఎలా స్పందిస్తాం? (చిత్రం కూడా చూడండి.)

18 బైబిలు ప్రవచనాల మీద ఏమాత్రం నమ్మకం లేని ప్రజలు ‘దక్షిణ రాజుకు,’ ‘ఉత్తర రాజుకు’ మధ్య “పోరాటం” జరుగుతున్నప్పుడు చాలా కంగారుపడతారు. (దాని. 11:40) ఎందుకంటే ఈ భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి కావాల్సినన్ని ఆయుధాలు, బాంబులు ఆ ఇద్దరి రాజుల దగ్గర ఉన్నాయి. కానీ భూమంతటినీ నాశనం చేయడానికి యెహోవా వాళ్లను అనుమతించడని మనకు తెలుసు. (యెష. 45:18) కాబట్టి “ఉత్తర రాజు,” “దక్షిణ రాజు” మధ్య జరిగే పోరాటం మనల్ని కంగారు పెట్టదుగానీ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, అలాగే ఈ వ్యవస్థ నాశనం దగ్గర్లోనే ఉందని నిరూపిస్తుంది.

ప్రవచనాల మీద మనసు పెడుతూ ఉండండి

19. బైబిలు ప్రవచనాల గురించి మనం ఏ విషయం గుర్తించాలి?

19 కొన్ని బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరతాయో మనకు తెలీదు. దానియేలు ప్రవక్తకు కూడా తాను రాసిన ప్రతీ విషయం అర్థంకాలేదు. (దాని. 12:8, 9) అయితే ఒక ప్రవచనం మనకు అర్థం కానంత మాత్రాన అది నిజమవ్వదని కాదు. గతంలోలాగే యెహోవా మనం తెలుసుకోవాల్సిన వాటిని సరైన సమయంలో మనకు తెలియజేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—ఆమో. 3:7.

20. త్వరలోనే ఏ బైబిలు ప్రవచనాలు నెరవేరతాయి? అప్పటివరకు మనం ఏం చేస్తూ ఉండాలి?

20 “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన జరుగుతుంది. (1 థెస్స. 5:3) తర్వాత ఈ లోక రాజకీయ శక్తులు అబద్ధమతం మీద దాడిచేసి, దాన్ని నాశనం చేస్తాయి. (ప్రక. 17:16, 17) ఆ తర్వాత అవి దేవుని ప్రజల మీద దాడి చేస్తాయి. (యెహె. 38:18, 19) ఈ సంఘటనలన్నీ చివరి యుద్ధమైన హార్‌మెగిద్దోన్‌కు నడిపిస్తాయి. (ప్రక. 16:14, 16) ఇవన్నీ అతి త్వరలోనే జరుగుతాయి అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అప్పటివరకు బైబిలు ప్రవచనాల మీద మనసుపెట్టడం ద్వారా, అలా మనసుపెట్టేలా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మన ప్రేమగల పరలోక తండ్రి మీద కృతజ్ఞత ఉందని చూపిస్తూ ఉందాం.

పాట 95 వెలుగు అంతకంతకూ ఎక్కువౌతుంది

a ఈ లోకంలో పరిస్థితులు కారు చీకటిగా మారినా మన భవిష్యత్తు కాంతిరేకలా వెలిగిపోతుందనే నమ్మకంతో ఉండవచ్చు. ఆ నమ్మకం మనకు రావాలంటే బైబిలు ప్రవచనాల్ని అధ్యయనం చేయాలి. అయితే బైబిలు ప్రవచనాల్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలో కొన్ని కారణాల్ని ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే దానియేలు రాసిన రెండు ప్రవచనాల్ని పరిశీలించి, వాటిని అర్థం చేసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చూస్తాం.

b 2012, జూన్‌ 15 కావలికోట పత్రికలోని “‘త్వరలో సంభవింపనైయున్న’ వాటిని యెహోవా బయలుపర్చాడు” అనే ఆర్టికల్‌లో 7-9 పేరాలు చూడండి.

c 2020, మే కావలికోట పత్రికలోని “నేడు ‘ఉత్తర రాజు’ ఎవరు?” అనే ఆర్టికల్‌లో 3-4 పేరాలు చూడండి.

d 2020, మే కావలికోట పత్రికలోని “నేడు ‘ఉత్తర రాజు’ ఎవరు?” అనే ఆర్టికల్‌లో 7-9 పేరాలు చూడండి.