ఒకరినొకరు “ఇంకా ఎక్కువగా” ప్రోత్సహించుకోండి
“ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం. ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా అవన్నీ చేద్దాం.”—హెబ్రీ. 10:24, 25.
1. ఒకరినొకరు “ఇంకా ఎక్కువగా” ప్రోత్సహించుకోవాలని అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు ఎందుకు చెప్పాడు?
అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలోని హీబ్రూ క్రైస్తవులకు ఈ సలహా ఇచ్చాడు, “ప్రేమ చూపించడానికి, మంచిపనులు చేయడానికి పురికొల్పుకునేలా మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయడం కొందరికి అలవాటు, మనం మాత్రం అలా మానకుండా ఉందాం; ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం. ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా అవన్నీ చేద్దాం.” (హెబ్రీ. 10:24, 25) ఒకరినొకరు “ఇంకా ఎక్కువగా” ప్రోత్సహించుకోవాలని పౌలు ఎందుకు చెప్పాడో ఆ సహోదరులకు మొదట్లో అర్థమైవుండకపోవచ్చు. కానీ ఐదు సంవత్సరాలు గడవకముందే దానికిగల కారణం వాళ్లకు అర్థమైవుంటుంది. ఎందుకంటే, యెరూషలేముకు యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గరపడింది. కాబట్టి యేసు చెప్పినట్లు ఆ నగరాన్ని విడిచి పారిపోవాలని వాళ్లు గుర్తించారు. (అపొ. 2:19, 20; లూకా 21:20-22) క్రీ.శ. 70లో రోమన్లు యెరూషలేమును నాశనం చేసినప్పుడు యెహోవా తీర్పు రోజు వచ్చింది.
2. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం గురించి ఇప్పుడు మరింత ఎక్కువగా ఎందుకు ఆలోచించాలి?
2 నేడు మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. ‘గొప్పదైన, ఎంతో భక్తిపూర్వక భయం కలిగించేదైన’ యెహోవా దినం దగ్గర్లో ఉంది. (యోవే. 2:11, NW) “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది” అని జెఫన్యా ప్రవక్త చెప్పిన మాటలు మన కాలానికి కూడా సరిపోతాయి. (జెఫ. 1:14) అందుకే “ప్రేమ చూపించడానికి, మంచి పనులు చేయడానికి పురికొల్పుకునేలా మనం ఒకరి గురించి ఒకరం శ్రద్ధ తీసుకుందాం.” (హెబ్రీ. 10:24, అధస్సూచి) మన సహోదరసహోదరీలకు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలంటే వాళ్లపట్ల మరింత శ్రద్ధ చూపించాలి.
ఎవరికి ప్రోత్సాహం అవసరం?
3. ప్రోత్సాహం గురించి అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.” (సామె. 12:25) మనందరికీ ఏదోక సమయంలో ప్రోత్సాహం అవసరమౌతుంది. ఇతరుల్ని ప్రోత్సహించేవాళ్లకు కూడా ప్రోత్సాహం అవసరమని పౌలు స్పష్టంగా చెప్పాడు. రోములోని తోటి సహోదరులకు ఆయనిలా రాశాడు, “మిమ్మల్ని చూడాలని ఎంతో తపించిపోతున్నాను. మీరు స్థిరపడేలా దేవునికి సంబంధించిన ఓ వరాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను; ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే నా కోరిక.” (రోమా. 1:11, 12) దీన్నిబట్టి అపొస్తలుడైన పౌలుకు కూడా కొన్నిసార్లు ప్రోత్సాహం అవసరమైందని అర్థమౌతుంది.—రోమీయులు 15:30-32 చదవండి.
4, 5. మనం ఎవరెవరిని ప్రోత్సహించాలి? ఎందుకు?
4 నేడు, నమ్మకమైన పయినీర్లు వంటి పూర్తికాల సేవకుల్ని మనం ప్రోత్సహించవచ్చు. వాళ్లలో చాలామంది ఎన్నో త్యాగాలు చేశారు. మిషనరీలు, బెతెల్ కుటుంబ సభ్యులు, ప్రాంతీయ పర్యవేక్షకులు అలాగే వాళ్ల భార్యలు, రిమోట్ ట్రాన్స్‌లేషన్ ఆఫీస్‌లలో పనిచేసేవాళ్లు కూడా యెహోవా సేవ ఎక్కువగా చేయడం కోసం త్యాగాలు చేశారు. కాబట్టి మనం వాళ్లందర్నీ ప్రోత్సహించాలి. వాళ్లనే కాదు పూర్తికాల సేవలో కొనసాగాలనే కోరిక ఉన్నప్పటికీ ఏదైనా కారణం వల్ల ఆ సేవను ఆపేసిన ఎంతోమందిని కూడా ప్రోత్సహించాలి. అది వాళ్లకు ఎంతో సంతోషాన్నిస్తుంది.
5 ఇంకెవరిని కూడా మనం ప్రోత్సహించవచ్చు? యెహోవాకు లోబడుతూ, “ప్రభువును అనుసరించే వ్యక్తినే” పెళ్లిచేసుకోవాలనే మాటకు కట్టుబడి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఎంతోమంది సహోదరసహోదరీలను మనం ప్రోత్సహించవచ్చు. (1 కొరిం. 7:39) కష్టపడి పనిచేసే భార్యలను భర్తలు తమ మాటలతో ప్రోత్సహించవచ్చు. (సామె. 31:28, 29, 31) హింసలు లేదా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న క్రైస్తవుల్ని కూడా ప్రోత్సహించవచ్చు. (2 థెస్స. 1:3-5) ఈ నమ్మకమైన సహోదరసహోదరీలందరికీ యెహోవా, యేసు ఊరటను ఇస్తారు.—2 థెస్సలొనీకయులు 2:16, 17 చదవండి.
సంఘపెద్దలు మనల్ని ప్రోత్సహిస్తారు
6. సంఘపెద్దల పాత్ర గురించి యెషయా 32:1, 2 లో ఏమి నేర్చుకోవచ్చు?
6 యెషయా 32:1, 2 చదవండి. మనం కష్టకాలాల్లో జీవిస్తున్నాం కాబట్టి త్వరగా బాధపడే, నిరుత్సాహపడే అవకాశం ఉంది. మనల్ని ప్రోత్సహించడానికి యేసుక్రీస్తు తన అభిషిక్త సహోదరుల్ని అలాగే వేరే గొర్రెల్లోని నమ్మకమైన ‘అధికారుల్ని’ ఉపయోగిస్తున్నాడు. ఈ సంఘపెద్దలు మన విశ్వాసం మీద “యజమానులు” కాదుగానీ మన “సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లు.” మనం సంతోషంగా ఉండడానికి, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి సహాయం చేయాలని వాళ్లు కోరుకుంటారు.—2 కొరిం. 1:24.
7, 8. సంఘపెద్దలు ఇతరుల్ని ఎలా ప్రోత్సహించవచ్చు?
7 సంఘపెద్దలు అపొస్తలుడైన పౌలును ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ తోటి సహోదరుల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. హింసలు అనుభవిస్తున్న థెస్సలోనికలోని క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు, “మీ మీద ఎంతో ఆప్యాయతతో, మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పాలని మాత్రమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం, మీరంటే మాకు చాలా ఇష్టం.”—1 థెస్స. 2:8.
8 అదేవిధంగా సంఘపెద్దలు తమ మాటల ద్వారా ఇతరుల్ని ఎంతగానో ప్రోత్సహించవచ్చు. కానీ అది మాత్రమే సరిపోతుందా? ఎఫెసులోని పెద్దలకు పౌలు ఇలా చెప్పాడు, “బలహీనంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలని, ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనసులో ఉంచుకోవాలని అన్ని విషయాల్లో మీకు చూపించాను. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: ‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.’” (అపొ. 20:35) పౌలు తన సహోదరులతో ఇలా అన్నాడు, “నాకున్నవన్నీ సంతోషంగా మీకోసం ఖర్చుపెడతాను, నా సర్వస్వం ధారపోస్తాను.” పౌలు వాళ్లకోసం చేయగలిగినదంతా చేస్తానని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించాడు. (2 కొరిం. 12:15) అదేవిధంగా సంఘపెద్దలు తమ మాటల ద్వారానే కాదు, పనుల ద్వారా కూడా ఇతరుల్ని ప్రోత్సహించాలి, ఊరటనివ్వాలి. అలా చేసినప్పుడు మనపట్ల వాళ్లకు నిజమైన శ్రద్ధ ఉందని తెలుస్తుంది.—1 కొరిం. 14:3.
9. సంఘపెద్దలు సలహాల్ని ప్రోత్సాహకరంగా ఎలా ఇవ్వవచ్చు?
9 సహోదరుల్ని బలపర్చడానికి సంఘపెద్దలు సలహాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. సలహాల్ని ప్రోత్సాహకరంగా ఎలా ఇవ్వవచ్చో వాళ్లు బైబిలు నుండి నేర్చుకోవచ్చు. పునరుత్థానమైన యేసు ఆసియా మైనరులోని సంఘాలకు సలహా ఇచ్చిన విధానం నుండి సంఘపెద్దలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఎఫెసు, పెర్గము, తుయతైర సంఘాలను గద్దిస్తూ సలహా ఇవ్వాల్సి వచ్చింది. కానీ అలా సలహా ఇచ్చే ముందు వాళ్లు చేస్తున్న మంచి పనులన్నిటినీ మెచ్చుకున్నాడు. (ప్రక. 2:1-5, 12, 13, 18, 19) లవొదికయలోని సంఘానికి యేసు ఇలా చెప్పాడు, “నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను, వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను. కాబట్టి దేవుని సేవలో నీకు ఉత్సాహం ఉందని చూపించు, పశ్చాత్తాపపడు.” (ప్రక. 3:19) సలహాలు ఇస్తున్నప్పుడు సంఘపెద్దలు యేసుక్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తారు.
కేవలం సంఘపెద్దలే ఇతరుల్ని ప్రోత్సహించాలా?
10. మనలో ప్రతీఒక్కరం ఒకరినొకరు ఎలా బలపర్చుకోవచ్చు?
10 ఇతరుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేవలం సంఘపెద్దలకే కాదు అందరికీ ఉంది. “వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి” అని పౌలు క్రైస్తవులందరికీ సలహా ఇచ్చాడు. (ఎఫె. 4:29) ఇతరులు ఏ అవసరంలో ఉన్నారో మనలో ప్రతీఒక్కరికి తెలుసుండాలి, అప్పుడే వాళ్లకు సహాయం చేయగలుగుతాం. పౌలు హీబ్రూ క్రైస్తవులకు ఇలా రాశాడు, “బలహీనమైన చేతుల్ని, బలంలేని మోకాళ్లను బలపర్చండి; మీ పాదాల కిందవున్న దారుల్ని చదును చేసుకుంటూ ఉండండి; అప్పుడు బెణికిన కీలు ఊడిపోదు కానీ బాగౌతుంది.” (హెబ్రీ. 12:12, 13) మనందరం, ఆఖరికి పిల్లలు కూడా మాటల ద్వారా ఇతరుల్ని బలపర్చవచ్చు, ప్రోత్సహించవచ్చు.
11. కృంగుదలకు గురైన మమతకు ఏది సహాయం చేసింది?
11 మమత a అనే సహోదరి కొంతకాలంపాటు కృంగుదలకు గురైంది. ఆమె ఇలా రాసింది, “ఒకరోజు నేను ప్రోత్సాహం కోసం ప్రార్థించిన కాసేపటికి, ఒక పెద్ద వయసు సహోదరిని కలిశాను. నాకు సరిగ్గా అవసరమైన ప్రేమను, దయను ఆమె చూపించింది. పైగా తను కూడా నాలాంటి సమస్యనే ఎదుర్కొన్నానని చెప్పింది. అప్పుడు నేను ఒంటరి దాన్ని కాననీ, నాలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లు కూడా ఉన్నారనీ అనిపించింది.” నిజానికి ఆమె మాటలు మమతకు ఎంత సహాయం చేశాయో ఆ పెద్ద వయసు సహోదరికి తెలిసుండకపోవచ్చు.
12, 13. ఫిలిప్పీయులు 2:1-4 వచనాల్లోని సలహాను మనమెలా పాటించవచ్చు?
12 పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఇలా రాశాడు, “మీరు క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారు; ప్రేమతో ఇతరుల్ని ప్రోత్సహించి, వాళ్లకు ఊరటనిస్తున్నారు; మీకు వాళ్ల మీద శ్రద్ధ, వాత్సల్యం, కనికరం ఉన్నాయి. కాబట్టి మీకందరికీ ఒకే ఆలోచన ఉందని, ఒకే రకమైన ప్రేమ ఉందని, మీరు పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉన్నారని, మీకు ఒకే మనసు ఉందని చూపిస్తూ నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. గొడవలకు దిగే మనస్తత్వాన్ని, అహాన్ని చూపించకండి. వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి. మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలి. 2:1-4.
13 మనం ఒకరికొకరం సహాయం చేసుకునే మార్గాల కోసం చూడాలి. మనం తోటి సహోదరసహోదరీలకు ‘ప్రేమతో ఊరటనివ్వవచ్చు,’ “క్రీస్తుతో ఐక్యంగా” ఉన్నట్లు చూపించవచ్చు, వాత్సల్యంతో, కనికరంతో ప్రోత్సహించవచ్చు.
ప్రోత్సహించడానికి కొన్ని మార్గాలు
14. ప్రోత్సహించడానికి ఒక మార్గమేమిటి?
14 గతంలో మనం ప్రోత్సహించినవాళ్లు ఇప్పుడు యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగుతున్నారని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “నా పిల్లలు సత్యానికి తగ్గట్టు జీవిస్తున్నారని వినడం కన్నా సంతోషకరమైన విషయం నాకు ఇంకొకటి లేదు.” (3 యోహా. 4) ఎన్నో ఏళ్ల క్రితం తమ దగ్గర సత్యం నేర్చుకున్నవాళ్లు ఇప్పుడు యెహోవా సేవను నమ్మకంగా చేస్తున్నారని, బహుశా పయినీరు సేవ కూడా చేస్తున్నారని తెలిసినప్పుడు ఎంతోమంది పయినీర్లు సంతోషించారు. ఒకవేళ ఎవరైనా పయినీర్లు నిరుత్సాహపడితే గతంలో వాళ్లు చేసిన మంచి పనుల్ని గుర్తుచేసి ప్రోత్సహించవచ్చు.
15. యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తున్నవాళ్లను ప్రోత్సహించడానికి మనమేమి చేయవచ్చు?
15 సంఘాల్ని సందర్శించిన తర్వాత సహోదరసహోదరీలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చే కార్డులు తమనెంతో ప్రోత్సహించాయని చాలామంది ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు చెప్పారు. యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్న సంఘపెద్దలు, మిషనరీలు, పయినీర్లు అలాగే బెతెల్ కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రోత్సాహమే పొందుతారు. అవును, కృతజ్ఞతలు చెప్పడం ద్వారా వాళ్లను ఎంతో ప్రోత్సహించిన వాళ్లమౌతాం.
మనందరం ఇతరులకు ఎలా ప్రోత్సాహకరంగా ఉండవచ్చు?
16. ఇతరుల్ని ప్రోత్సహించడం కష్టంగా ఉంటే ఏమి చేయవచ్చు?
16 ఇతరుల్ని ప్రోత్సహించడం అంత కష్టమైన పనికాదు. కానీ మీరు ప్రోత్సాహకరంగా మాట్లాడలేరని అనిపిస్తే ఏమి చేయవచ్చు? దీన్ని ప్రయత్నించండి. ఎవరినైనా కలిసినప్పుడు వాళ్లను చూసి చిరునవ్వు చిందించండి. ఒకవేళ వాళ్లు స్పందించకపోతే, వాళ్లు ఏదో సమస్యతో బాధపడుతున్నారని, వాళ్లకు ప్రోత్సాహం అవసరమని అర్థం. వాళ్లు చెప్పేది వినడం ద్వారా మీరు ఊరటను ఇవ్వవచ్చు.—యాకో. 1:19.
17. ఒక యువ సహోదరునికి ఏది ప్రోత్సాహాన్ని ఇచ్చింది?
17 హర్ష అనే యువకుని అనుభవాన్ని పరిశీలించండి. తన కుటుంబ సభ్యుల్లో చాలామంది ముఖ్యంగా సంఘపెద్దగా సేవచేస్తున్న వాళ్ల నాన్న యెహోవాను ఆరాధించడం ఆపేసినప్పుడు హర్ష చాలా నిరుత్సాహపడ్డాడు. హర్ష బాధగా ఉండడం గమనించిన ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు అతన్ని కాఫీ షాపుకు తీసుకెళ్లాడు. హర్ష చెప్పిందంతా ఆయన శ్రద్ధగా విన్నాడు. తన కుటుంబం తిరిగి సత్యంలోకి రావడానికి ఏకైక మార్గమేమిటంటే, తాను నమ్మకంగా యెహోవా సేవచేయడమే అని హర్ష గుర్తించాడు. 46వ కీర్తన, జెఫన్యా 3:17 అలాగే మార్కు 10:29, 30 వంటి లేఖనాల నుండి కూడా హర్ష ఎంతో ప్రోత్సాహం పొందాడు.
18. (ఎ) ప్రోత్సాహం గురించి రాజైన సొలొమోను ఏమి రాశాడు? (బి) అపొస్తలుడైన పౌలు ఏ సలహా ఇచ్చాడు?
18 మమత, హర్ష అనుభవాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనలో ఎవరమైనా సరే ఒక సహోదరునికి లేదా సహోదరికి కావాల్సిన ఊరటను, ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. రాజైన సొలొమోను ఇలా రాశాడు, ‘సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది! మెరిసే కళ్లు హృదయానికి సంతోషాన్నిస్తాయి; మంచి కబురు ఎముకలకు బలాన్నిస్తుంది.’ (సామె. 15:23, 30, NW) నిరుత్సాహంలో లేదా బాధలో ఉన్నవాళ్లు ఎవరైనా మీకు తెలుసా? మరి వాళ్లకు కావలికోట నుండిగానీ వెబ్‌సైట్ నుండిగానీ ఏదైనా సమాచారం చదివి వినిపించగలరా? అంతేకాదు కలిసి రాజ్యగీతాలు పాడడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పౌలు చెప్పాడు. ఆయనిలా రాశాడు: “కీర్తనలతో, స్తుతిగీతాలతో, కృతజ్ఞత ఉట్టిపడే ఆరాధనా గీతాలతో ఒకరికొకరు బోధించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, అలాగే మీ హృదయాల్లో యెహోవాకు పాటలు పాడండి.”—కొలొ. 3:16; అపొ. 16:25.
19. ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం ఎందుకు మరింత ప్రాముఖ్యమౌతుంది? మనమేమి చేయాలి?
19 యెహోవా రోజు దగ్గరపడేకొద్దీ మనందరం ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం మరింత ప్రాముఖ్యం. (హెబ్రీ. 10:25) పౌలు సలహాను పాటిస్తే మనం సంతోషంగా ఉంటాం. ఆయనిలా చెప్పాడు, “మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.”—1 థెస్స. 5:11.
a అసలు పేర్లు కావు.