స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి
“యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.” —2 కొరిం. 3:17.
1, 2. (ఎ) అపొస్తలుడైన పౌలు కాలంలో ప్రజలు ఎందుకు ఎక్కువగా బానిసత్వం, స్వేచ్ఛ గురించి చర్చించుకునేవాళ్లు? (బి) నిజమైన స్వేచ్ఛకు మూలం ఎవరని పౌలు చెప్పాడు?
రోమా సామ్రాజ్యంలోని ప్రజలు తమ రాజ్య నియమాలను బట్టి, న్యాయ వ్యవస్థను బట్టి, తమకున్న స్వేచ్ఛను బట్టి ఎంతో గర్వపడేవాళ్లు. తొలి క్రైస్తవులు ఆ సామ్రాజ్యంలోనే జీవించారు. బానిసలు చేసిన కష్టాన్నిబట్టే అప్పట్లో ఆ సామ్రాజ్యం శక్తివంతంగా తయారైంది. ఒకానొక సమయంలో రోమా సామ్రాజ్యంలోని ప్రతీ ముగ్గురిలో ఒకరు బానిసగా ఉండేవాళ్లు. కాబట్టి సామాన్య ప్రజలు అలాగే క్రైస్తవులు బానిసత్వం, స్వేచ్ఛ గురించే ఎక్కువగా చర్చించుకునేవాళ్లు.
2 అపొస్తలుడైన పౌలు స్వేచ్ఛ గురించే తరచుగా రాశాడు. ఆయన కాలంలో స్వేచ్ఛ లేకపోవడం ప్రపంచ సమస్యగా ఉండేది. చాలామంది ఆ సమస్యను తామే పరిష్కరించాలని కోరుకునేవాళ్లు కానీ పౌలు అలా కోరుకోలేదు. బదులుగా పౌలు, ఆయన తోటి క్రైస్తవులు మాత్రం దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రజలకు బోధించడానికి, యేసుక్రీస్తు విమోచన క్రయధనానికి ఉన్న విలువను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కృషిచేశారు. నిజమైన స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుందో పౌలు తన తోటి క్రైస్తవులకు చెప్పాడు. ఆయనిలా రాశాడు, “యెహోవా అదృశ్య వ్యక్తి. యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.”—2 కొరిం. 3:17.
3, 4. (ఎ) రెండవ కొరింథీయులు 3:17 లోని మాటలను చెప్పడానికి ముందు పౌలు దేనిగురించి చర్చించాడు? (బి) యెహోవా నుండి వచ్చే స్వేచ్ఛను పొందాలంటే మనమేమి చేయాలి?
3 పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో మోషే గురించి ప్రస్తావిస్తూ, యెహోవా దూత సముఖము నుండి సీనాయి పర్వతం దిగివచ్చినప్పుడు మోషే ముఖం ప్రకాశించిందని చెప్పాడు. ఇశ్రాయేలీయులు మోషేను చూసి భయపడడంతో ఆయన తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. (నిర్గ. 34:29, 30, 33; 2 కొరిం. 3:7, 13) పౌలు ఇలా వివరించాడు, “కానీ ఓ వ్యక్తి మారి యెహోవా ఆరాధకుడైనప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది.” (2 కొరిం. 3:16) దానర్థమేమిటి?
4 సమస్తాన్ని సృష్టించిన యెహోవాకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఉందని ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నాం. కాబట్టి యెహోవా సన్నిధిలో అలాగే “యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది” అనడం సరైనది. అయితే, మనకు ఆ స్వేచ్ఛ కావాలంటే యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివుండాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, విషయాలను కేవలం మనుషుల దృష్టితో చూశారేగానీ, యెహోవా దృష్టితో చూడలేదు. ఒకవిధంగా వాళ్లు తమ మనసులకు, హృదయాలకు ముసుగు వేసుకున్నారు. తమకు దొరికిన కొత్త స్వేచ్ఛను సొంత కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించాలనుకున్నారు.—హెబ్రీ. 3:8-10.
5. (ఎ) యెహోవా పవిత్రశక్తి ఎలాంటి స్వేచ్ఛనిస్తుంది? (బి) ఒకరు బానిసగా లేదా ఖైదీగా ఉన్నప్పటికీ యెహోవా ఇచ్చే స్వేచ్ఛను పొందవచ్చని ఎలా చెప్పవచ్చు? (సి) మనం ఏ రెండు ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
5 బానిసత్వం నుండి విడుదల కన్నా యెహోవా పవిత్రశక్తి ఇచ్చే స్వేచ్ఛ గొప్పది. ఆ గొప్ప స్వేచ్ఛను మనుషులు ఎప్పటికీ ఇవ్వలేరు. అది మనల్ని పాపమరణాల బానిసత్వం నుండి అలాగే అబద్ధ ఆరాధన, దాని ఆచారాలకు సంబంధించిన బంధకాల నుండి విడుదల చేస్తుంది. (రోమా. 6:23; 8:2) అది ఎంత అద్భుతమైన స్వేచ్ఛో కదా! బానిసగా లేదా ఖైదీగా ఉన్న వ్యక్తి కూడా ఈ స్వేచ్ఛను అనుభవించవచ్చు. (ఆది. 39:20-23) ఆ మాటలు నిజమనడానికి సహోదరుడు ఎరిక్ ఫ్రాస్ట్ అలాగే సహోదరుడు హాస్ట్ హెన్షల్ అనుభవాలే రుజువు. వాళ్లు దేవుని మీద విశ్వాసం ఉంచినందుకు చాలా ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు అయినప్పటికీ, యెహోవా ఇచ్చే స్వేచ్ఛను అనుభవించారు. అప్పుడు వాళ్లకు ఎదురైన అనుభవాలను JW బ్రాడ్‌కాస్టింగ్‌లో మీరు చూడవచ్చు. (వాటిని ఇంటర్వ్యూలు, అనుభవాలు > పరీక్షల్ని సహించడం కింద చూడండి.) అయితే మనం ఈ రెండు ప్రశ్నలకు జవాబులు పరిశీలిస్తాం: మనకున్న స్వేచ్ఛను విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు? మన స్వేచ్ఛను తెలివిగా ఎలా ఉపయోగించవచ్చు?
దేవుడిచ్చే స్వేచ్ఛ ఎంతో విలువైనది
6. యెహోవా ఇచ్చిన స్వేచ్ఛ పట్ల ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించలేదని ఎలా చెప్పవచ్చు?
6 ఎవరైనా మనకు ఖరీదైన బహుమతి ఇస్తే వాళ్లకు ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. కానీ ఇశ్రాయేలీయులు తమకు స్వేచ్ఛనిచ్చిన యెహోవాకు కృతజ్ఞత చూపించలేదు. ఐగుప్తు నుండి విడుదలైన కొన్ని నెలలకే ఒకప్పుడు తిన్న ఆహారం కోసం విలవిలలాడారు. యెహోవా ఇచ్చిన మన్నాతో వాళ్లు తృప్తిపడలేదు. తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోవాలని కూడా అనుకున్నారు. తనను ఆరాధించడానికి యెహోవా ఇచ్చిన స్వేచ్ఛ కన్నా ‘చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలే’ ఇశ్రాయేలీయులకు ముఖ్యమైపోయాయి. వాళ్లను చూసి యెహోవాకు కోపం రావడంలో ఆశ్చర్యంలేదు. (సంఖ్యా. 11:5, 6, 10; 14:3, 4) ఇది మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది.
7. రెండవ కొరింథీయులు 6:1లో క్రైస్తవులకు ఇచ్చిన సలహాను పౌలు స్వయంగా ఎలా పాటించాడు? మనం కూడా ఎలా పాటించవచ్చు?
7 యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు స్వేచ్ఛనిచ్చాడు. దానిపట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించవద్దని పౌలు క్రైస్తవులందర్నీ హెచ్చరించాడు. (2 కొరింథీయులు 6:1 చదవండి.) అపరిపూర్ణుడైన పౌలు పాపమరణాలకు బానిసగా ఉన్నాడు. ఆ విషయం ఆయన్ని చాలా బాధపెట్టింది. అయినప్పటికీ ఆయనిలా అన్నాడు, “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!” ఆయన ఎందుకలా అన్నాడు? పౌలు తోటి క్రైస్తవులకు ఇలా వివరించాడు, “క్రీస్తుయేసు ద్వారా జీవాన్నిచ్చే పవిత్రశక్తి నియమం పాపమరణాల నియమం నుండి మిమ్మల్ని విడుదల చేసింది.” (రోమా. 7:24, 25; 8:2) పౌలులాగే మనం కూడా, యెహోవా మనల్ని పాపమరణాల బానిసత్వం నుండి విడిపించాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. యేసు విమోచన క్రయధనం వల్ల మనం దేవున్ని స్వచ్ఛమైన మనస్సాక్షితో ఆరాధించగలుగుతాం అలాగే నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాం.—కీర్త. 40:8.
8, 9. (ఎ) మన స్వేచ్ఛను ఉపయోగించే విషయంలో పేతురు ఎలాంటి హెచ్చరిక ఇచ్చాడు? (బి) ఒక వ్యక్తి ఎలా తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది?
8 యెహోవాపట్ల మనకు కృతజ్ఞత ఉందని కేవలం చెప్పడమే కాదుగానీ మన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు, మన స్వేచ్ఛను తప్పు చేయడానికి సాకుగా ఉపయోగించకూడదని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. (1 పేతురు 2:16 చదవండి.) అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏమి జరిగిందో ఈ హెచ్చరిక మనకు గుర్తుచేస్తుంది. బహుశా అప్పటికన్నా నేడు మనకే ఆ హెచ్చరిక ఎంతో అవసరమని చెప్పవచ్చు. ఈ సాతాను లోకం రకరకాల బట్టలతో, ఆహారంతో, పానీయాలతో, వినోదంతో మనల్ని ఆకర్షిస్తుంది. తెలివైన వ్యాపారవేత్తలు వాణిజ్య ప్రకటనల్లో అందమైన వ్యక్తులను ఉపయోగించి, నిజంగా అవసరంలేని వస్తువుల్ని కూడా మనతో కొనిపించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేలా ఈ లోకం మనల్ని చాలా తేలిగ్గా మోసం చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.
9 జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విద్య, ఉద్యోగం వంటివాటికి సంబంధించిన ఎంపికల్లో కూడా పేతురు ఇచ్చిన సలహా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, కష్టపడి చదివి పేరుపొందిన యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలనే ఒత్తిడి నేటి యౌవనులపై ఎక్కువగా ఉంది. ఉన్నత విద్య చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, గౌరవంగా జీవించవచ్చని చాలామంది వాళ్లకు చెప్తుంటారు. ఉన్నత విద్య చదివినవాళ్లే ఎక్కువ డబ్బు సంపాదిస్తారని నిరూపించే సమాచారాన్ని కూడా వాళ్లు చూపిస్తుంటారు. కాబట్టి ఉన్నత విద్యను ఎంచుకోవడమే సరైన నిర్ణయమని చాలామంది యౌవనులకు అనిపించవచ్చు. ఎందుకంటే ఆ నిర్ణయం వాళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. కానీ వాళ్లూ, వాళ్ల తల్లిదండ్రులూ ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?
10. వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?
10 అది వ్యక్తిగత నిర్ణయం కాబట్టి మనస్సాక్షి బాధించనంతవరకు నచ్చింది చేసే స్వేచ్ఛ తమకు ఉండాలని కొంతమంది అనుకుంటారు. బహుశా తమ వాదనకు బలం చేకూర్చడానికి పౌలు చెప్పిన ఈ మాటల్ని వాళ్లు ఉపయోగిస్తారు: “వేరేవాళ్ల మనస్సాక్షి ఆధారంగా నా స్వేచ్ఛ ఎందుకు విమర్శకు గురికావాలి?” (1 కొరిం. 10:29) విద్య, ఉద్యోగం విషయంలో నచ్చిన ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకు ఉందనేది వాస్తవమే. కానీ ఆ స్వేచ్ఛకు పరిమితి ఉందని, చేసుకున్న ఎంపికకు తగిన పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అందుకే పౌలు ఇలా చెప్పాడు, “అన్నీ సరైనవే, కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నీ చేయదగినవే, కానీ అన్నీ ప్రోత్సాహాన్ని ఇవ్వవు.” (1 కొరిం. 10:23) కాబట్టి వ్యక్తిగత విషయాల్లో నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మనకు ఉన్నప్పటికీ, మన ఇష్టాలకన్నా అత్యంత ప్రాముఖ్యమైనవి వేరే ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
యెహోవా సేవ కోసం మన స్వేచ్ఛను తెలివిగా ఉపయోగిస్తాం
11. యెహోవా మనల్ని పాపమరణాల బానిసత్వం నుండి ఎందుకు విడిపించాడు?
11 స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించడంతోపాటు దాన్ని సరైన విధంగా ఎలా ఉపయోగించాలో పేతురు వివరించాడు. మనం దాన్ని “దేవునికి దాసులుగా” ఉండడానికి ఉపయోగించాలని ఆయన చెప్పాడు. నిజానికి, మన పూర్తి జీవితాన్ని తన సేవ చేయడానికి ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన యేసు ద్వారా మనల్ని పాపమరణాల బానిసత్వం నుండి విడిపించాడు.
12. నోవహు, ఆయన కుటుంబం మనకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచారు?
12 యెహోవా సేవ కోసం మన పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చించినప్పుడే మన స్వేచ్ఛను శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించినట్లు అవుతుంది. దానివల్ల లోకసంబంధమైన లక్ష్యాలకు, వ్యక్తిగత కోరికలకు మన జీవితంలో మొదటిస్థానం ఇవ్వకుండా ఉంటాం. (గల. 5:16) నోవహు, ఆయన కుటుంబం ఏమి చేశారో గుర్తుచేసుకోండి. వాళ్ల కాలంలో లోకం దౌర్జన్యంతో, అనైతికతతో నిండిపోయింది. కానీ వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రజల్లా ప్రవర్తించలేదు. బదులుగా యెహోవా తమకిచ్చిన పనిని పూర్తిచేయడంలో బిజీగా గడిపారు. అంటే ఓడను కట్టడంలో, తమ కోసం జంతువుల కోసం ఆహారాన్ని సమకూర్చడంలో సమయాన్ని గడిపారు. దానితోపాటు జలప్రళయం గురించి ఇతరుల్ని హెచ్చరించారు. అందుకే, “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను” అని బైబిలు చెప్తుంది. (ఆది. 6:22) ఫలితంగా నోవహు, ఆయన కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకున్నారు.—హెబ్రీ. 11:7.
13. యెహోవా మనకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
13 నేడు యెహోవా మనకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? ప్రకటనా పని చేయమనే ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడని యేసు శిష్యులైన మనకు తెలుసు. (లూకా 4:18, 19 చదవండి.) నేడు సాతాను చాలామందికి గుడ్డితనం కలుగజేశాడు. అందుకే వాళ్లు అబద్ధ మతానికి, వస్తుసంపదలకు, రాజకీయ వ్యవస్థకు బానిసలయ్యారని గుర్తించట్లేదు. (2 కొరిం. 4:4) కాబట్టి వాళ్లు స్వేచ్ఛకు మూలమైన యెహోవాను తెలుసుకొని, ఆయనను ఆరాధించేలా యేసులాగే మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి. (మత్త. 28:19, 20) ఇతరులకు ప్రకటించడం తేలికైన పనికాదు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు దేవున్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు, ఇంకొంతమందైతే మనల్ని కోప్పడతారు. కానీ యెహోవా మనకు ప్రకటించమనే ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, ‘యెహోవా సేవను మరింత ఎక్కువ చేయడానికి నేను నా స్వేచ్ఛను ఉపయోగించగలనా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
14, 15. చాలామంది యెహోవా ప్రజలు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
14 ఈ విధానపు అంతం అతి దగ్గర్లో ఉందని యెహోవా ప్రజల్లో చాలామంది గుర్తించారు. అందుకే వాళ్లు సాదాసీదాగా జీవిస్తూ, పయినీరు సేవ మొదలుపెట్టారు. ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! (1 కొరిం. 9:19, 23) కొంతమంది తాము ఉంటున్న ప్రాంతంలో సేవ చేస్తున్నారు, ఇంకొందరు అవసరం ఉన్న వేరే సంఘాలకు వెళ్లి సేవ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో 2,50,000 కన్నా ఎక్కువమంది పయినీరు సేవను మొదలుపెట్టారు. ఇప్పుడు క్రమ పయినీర్ల సంఖ్య 11 లక్షలు దాటింది. ఈ విధంగా చాలామంది తమ స్వేచ్ఛను యెహోవా సేవ చేయడానికి ఉపయోగించడం నిజంగా అద్భుతం!—కీర్త. 110:3.
15 స్వేచ్ఛను తెలివిగా ఉపయోగించడానికి వాళ్లకేది సహాయం చేసింది? జాన్, జూడిత్‌ల అనుభవాన్ని పరిశీలించండి. గత 30 ఏళ్లలో వాళ్లు వేర్వేరు దేశాలకు వెళ్లి సేవచేశారు. 1977లో పయినీరు సేవా పాఠశాలకు హాజరయ్యారు. అవసరం ఎక్కువున్న చోటకు వెళ్లి సేవచేయాలనే ప్రోత్సాహాన్ని ఆ పాఠశాల ద్వారా పొందామని వాళ్లు చెప్పారు. అలా చేయాలంటే జాన్, జూడిత్‌లు సాదాసీదాగా జీవించాలి. అందుకోసం జాన్ చాలా ఉద్యోగాలు మారాడు. కొంతకాలం తర్వాత, వాళ్లు వేరేదేశంలో సేవచేయడానికి వెళ్లారు. కొత్త భాష నేర్చుకోవడం, కొత్త సంస్కృతికి, వాతావరణానికి అలవాటుపడడం వంటి సవాళ్లను వాళ్లెలా ఎదుర్కొన్నారు? వాళ్లు ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడ్డారు. వేరే దేశంలో ఇన్ని సంవత్సరాలు సేవ చేసినందుకు వాళ్లెలా భావించారో చెప్తూ జాన్ ఇలా అన్నాడు, “నాకు తెలిసి నేను ఇప్పటివరకు చేసిన మంచిపని ఇదే, నిజానికి నేను ఆ పనిలో నిమగ్నమయ్యాను. యెహోవా నాకు మరింత వాస్తవమైన వ్యక్తిలా, ఒక ప్రేమగల తండ్రిలా అనిపించాడు. ‘దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు’ అని యాకోబు 4:8 లో ఉన్న మాటలు మరింత బాగా అర్థమయ్యాయి. నేను వెదుకుతున్న సంతృప్తికరమైన జీవితం నాకు దొరికిందని గుర్తించాను.”
16. వేలమంది సహోదరసహోదరీలు తమ స్వేచ్ఛను ఎలా తెలివిగా ఉపయోగించారు?
16 జాన్, జూడిత్‌లు చేసినట్టే కొంతమంది ఎక్కువకాలంపాటు పయినీరు సేవచేయగలుగుతారు. ఇంకొంతమంది తమ పరిస్థితుల్ని బట్టి కేవలం కొంతకాలమే చేయగలుగుతారు. మరికొందరైతే, ప్రపంచవ్యాప్తంగా జరిగే నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా సహాయం చేస్తుంటారు. ఉదాహరణకు, న్యూయార్క్‌లోని వార్విక్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనిలో సహాయం చేసేందుకు దాదాపు 27,000 మంది సహోదరసహోదరీలు వెళ్లారు. వాళ్లలో కొందరు రెండు వారాలు, కొందరు కొన్ని నెలలు ఇంకొందరు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం సేవచేశారు. దానికోసం చాలామంది సహోదర సహోదరీలు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ విధంగా తమ స్వేచ్ఛను యెహోవాను స్తుతించడానికి, ఘనపర్చడానికి ఉపయోగించి చక్కని ఆదర్శాన్ని ఉంచారు.
17. మన స్వేచ్ఛను తెలివిగా ఉపయోగిస్తే ఏమి ఆనందిస్తాం?
17 యెహోవా దేవున్ని తెలుసుకున్నందుకు, ఆయన్ని ఆరాధించడంవల్ల కలిగే స్వేచ్ఛను పొందినందుకు మనం కృతజ్ఞులం. ఈ స్వేచ్ఛను ఎంతో విలువైనదిగా ఎంచుతున్నామని మనం చేసుకునే ఎంపికల ద్వారా నిరూపిద్దాం. దాన్ని దుర్వినియోగం చేసే బదులు, సాధ్యమైనంత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికి ఉపయోగిద్దాం. అప్పుడు యెహోవా వాగ్దానం చేసిన ఆశీర్వాదాల్ని ఆనందిస్తాం. ఆయనిలా వాగ్దానం చేశాడు, ‘సృష్టి పాపమరణాల బానిసత్వం నుండి విడుదలై, దేవుని పిల్లలు ఆస్వాదించే మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతుంది.’—రోమా. 8:21.