కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 16

మరణం గురించిన సత్యాన్ని సమర్థించండి

మరణం గురించిన సత్యాన్ని సమర్థించండి

“మనం తప్పుడు సందేశానికి, సత్య సందేశానికి మధ్య తేడాను గుర్తించగలుగుతాం.”—1 యోహా. 4:6.

పాట 73 మాకు ధైర్యాన్నివ్వు

ఈ ఆర్టికల్‌లో . . . a

దేవున్ని బాధపెట్టే ఆచారాల్లో పాల్గొనే బదులు, ప్రియమైనవాళ్లను కోల్పోయి దుఃఖిస్తున్న మీ బంధువుల్ని ఓదార్చండి (1-2 పేరాలు చూడండి) b

1-2. (ఎ) సాతాను ప్రజల్ని ఏయే విధాలుగా మోసం చేశాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

 ‘అబద్ధానికి తండ్రైన’ సాతాను ఆదాముహవ్వల కాలం నుండి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. (యోహా. 8:44) మరణం గురించి, మరణం తర్వాతి జీవితం గురించి సృష్టించబడిన తప్పుడు బోధలు కూడా సాతాను అబద్ధాల్లో భాగమే. ఆ బోధల ఆధారంగానే ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆచారాలు, మూఢనమ్మకాలు పుట్టుకొచ్చాయి. ఫలితంగా, తమ కుటుంబసభ్యులు లేదా పొరుగువాళ్లు ఎవరైనా చనిపోయినప్పుడు, మన సహోదరసహోదరీల్లో చాలామంది “విశ్వాసం కోసం గట్టిగా” పోరాడాల్సి వస్తోంది.—యూదా 3.

2 ఒకవేళ మిమ్మల్ని అలాంటి ఆచారాల్లో పాల్గొనమని ఒత్తిడి చేస్తే, మరణం గురించి బైబిలు చెప్తున్న విషయాల్ని పాటించడానికి మీకేది సహాయం చేస్తుంది? (ఎఫె. 6:11) దేవునికి ఇష్టంలేని ఆచారాల్లో పొల్గొనమనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న తోటి క్రైస్తవుణ్ణి మీరెలా ఓదార్చి బలపర్చవచ్చు? ఈ విషయంలో యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. ముందుగా, మరణం గురించి బైబిలు ఏం చెప్తుందో పరిశీలిద్దాం.

చనిపోయినవాళ్ల స్థితి గురించిన సత్యం

 3. మొదటి అబద్ధం వల్ల వచ్చిన ఫలితం ఏంటి?

3 మనుషులు చనిపోవాలని దేవుడు కోరుకోలేదు. వాళ్లు నిరంతరం జీవించాలంటే యెహోవాకు లోబడాలి. ఆయన ఆదాముహవ్వలకు, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు” అనే సరళమైన ఆజ్ఞ ఇచ్చాడు. (ఆది. 2:16, 17) అప్పుడే సాతాను రంగంలోకి దిగాడు. అతను ఒక పాము ద్వారా హవ్వతో మాట్లాడుతూ, “మీరు చావనే చావరు” అన్నాడు. విచారకరంగా, ఆమె ఆ అబద్ధాన్ని నమ్మి పండు తింది. తర్వాత ఆమె భర్త కూడా దాన్ని తిన్నాడు. (ఆది. 3:4, 6) ఆ విధంగా పాపం, మరణం లోకంలోకి ప్రవేశించాయి.—రోమా. 5:12.

4-5. సాతాను ప్రజల్ని ఎలా మోసం చేస్తూ ఉన్నాడు?

4 దేవుడు చెప్పినట్లే ఆదాముహవ్వలు చనిపోయారు. కానీ సాతాను మాత్రం మరణం గురించి అబద్ధాలు చెప్పడం ఆపలేదు. కొంతకాలానికి, అతను ఇంకొన్ని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. వాటిలో ఒకటి ఏంటంటే, శరీరం చనిపోతుంది గానీ ఆత్మ బహుశా వేరే లోకంలో బ్రతికే ఉంటుందనే అబద్ధం. రకరకాల రూపాల్లో వ్యాప్తి చెందిన ఈ అబద్ధం వల్ల ఇప్పటికీ లెక్కలేనంతమంది మోసపోతున్నారు.—1 తిమో. 4:1.

5 చాలామంది ఆ అబద్ధాన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే, ప్రజలు మరణం గురించి ఎలా భావిస్తారో సాతానుకు తెలుసు కాబట్టి దాన్ని ఉపయోగించుకొనే అతను వాళ్లను మోసం చేయడానికి చూస్తున్నాడు. నిజానికి, మనం శాశ్వతకాలం జీవించడానికి సృష్టించబడ్డాం కాబట్టి మనం చనిపోవాలని కోరుకోం. (ప్రసం. 3:11) మనం మరణాన్ని ఒక శత్రువులా చూస్తాం.—1 కొరిం. 15:26.

6-7. (ఎ) సాతాను చనిపోయినవాళ్ల స్థితి గురించిన సత్యాన్ని దాచిపెట్టగలిగాడా? (బి) బైబిలు సత్యం మనలో ఎలాంటి అనవసరమైన భయాల్ని తీసేస్తుంది?

6 సాతాను ఎంత ప్రయత్నించినా, మరణం గురించిన సత్యం మరుగున పడిపోలేదు. నిజం చెప్పాలంటే, చనిపోయినవాళ్ల స్థితి గురించి, వాళ్లకున్న నిరీక్షణ గురించి బైబిలు ఏం చెప్తుందో ఇంతకుముందు కన్నా ఇప్పుడే ఎక్కువమంది తెలుసుకుంటున్నారు, దాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నారు. (ప్రసం. 9:5, 10; అపొ. 24:15) ఆ సత్యాలు మనకు ఓదార్పునిస్తాయి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే అనవసరమైన భయాల్ని, సందేహాల్ని పోగొడతాయి. ఉదాహరణకు, చనిపోయినవాళ్లు మనకు హాని చేస్తారనో లేదా వాళ్లకు ఏదో చెడు జరుగుతుందనో మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే వాళ్లు ప్రాణాలతో లేరని, ఎవ్వరికీ హాని చేయలేరని మనకు తెలుసు. నిజానికి, వాళ్లు గాఢ నిద్రలాంటి స్థితిలో ఉన్నారు. (యోహా. 11:11-14) అంతేకాదు, చనిపోయినవాళ్లకు గడిచే కాలం కూడా తెలియదు. కాబట్టి పునరుత్థానం జరిగినప్పుడు, వందల సంవత్సరాల క్రితం చనిపోయినవాళ్లకు కూడా గడిచిన కాలం కేవలం ఒక్క క్షణంలా అనిపిస్తుంది.

7 చనిపోయినవాళ్ల స్థితి గురించిన సత్యం స్పష్టంగా, సరళంగా, అర్థవంతంగా ఉందని మీరు ఒప్పుకోరా? తికమకపెట్టే సాతాను అబద్ధాలకు ఇదెంత భిన్నంగా ఉందో కదా! సాతాను చెప్పే అబద్ధాలు ప్రజల్ని మోసం చేయడమే కాకుండా, మన సృష్టికర్త పేరును పాడుచేస్తున్నాయి. సాతాను చేసిన హాని గురించి పూర్తిగా అర్థంచేసుకోవడానికి మనం ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం: సాతాను చెప్పిన అబద్ధాలు, యెహోవా పేరును ఎలా పాడుచేశాయి? క్రీస్తు విమోచన క్రయధనం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా తగ్గించాయి? మనుషుల దుఃఖాన్ని, బాధను ఎలా పెంచాయి?

సాతాను చెప్పిన అబద్ధాలు చాలా హాని చేశాయి

 8. యిర్మీయా 19:5 ప్రకారం చనిపోయినవాళ్ల గురించి సాతాను చెప్పే అబద్ధాలు యెహోవా పేరును ఎలా పాడుచేస్తున్నాయి?

8 చనిపోయినవాళ్ల గురించి సాతాను చెప్పే అబద్ధాలు యెహోవా పేరును పాడుచేస్తున్నాయి. చనిపోయినవాళ్లను దేవుడు అగ్నిలో యాతనపెడతాడనే బోధ కూడా ఆ అబద్ధాల్లో ఒకటి. అలాంటి అబద్ధ బోధలు దేవుని పేరును పాడుచేస్తున్నాయి. ఎలా? ఆ అబద్ధ బోధలు ప్రేమగల దేవుణ్ణి అపవాదిలాగే క్రూరునిగా చిత్రీకరిస్తున్నాయి. (1 యోహా. 4:8) అది విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? మరిముఖ్యంగా, యెహోవాకు ఎలా అనిపిస్తుంది? నిజానికి, యెహోవా అన్నిరకాల క్రూరత్వాన్ని అసహ్యించుకుంటాడు.—యిర్మీయా 19:5 చదవండి.

 9. సాతాను చెప్పే అబద్ధాలు, యోహాను 3:16 అలాగే 15:13 లేఖనాల్లో వర్ణించబడిన క్రీస్తు విమోచన క్రయధనంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?

9 మరణం గురించిన అబద్ధాలు క్రీస్తు విమోచన క్రయధనం మీద నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. (మత్త. 20:28) సాతాను చెప్పే మరో అబద్ధం ఏంటంటే, మనుషులకు అమర్త్యమైన ఆత్మ ఉంది. ఒకవేళ అదే నిజమైతే, మనుషులందరూ శాశ్వతకాలం జీవిస్తారు. కాబట్టి మనకు శాశ్వత జీవితం ఇవ్వడానికి క్రీస్తు తన ప్రాణాన్ని విమోచనా క్రయధనంగా అర్పించాల్సిన అవసరం ఉండేదికాదు. క్రీస్తు బలి, మనుషులందరి పట్ల చూపించబడిన గొప్ప ప్రేమకు నిదర్శనమని గుర్తుంచుకోండి. (యోహాను 3:16; 15:13 చదవండి.) ఆ అమూల్యమైన బహుమానం విలువను తగ్గిస్తున్నట్లు చూపించే బోధల గురించి యెహోవా, యేసు ఎలా భావిస్తారో ఊహించండి!

10. మరణం గురించి సాతాను చెప్పే అబద్ధాలు మనుషుల దుఃఖాన్ని, బాధను ఎలా పెంచుతున్నాయి?

10 సాతాను చెప్పే అబద్ధాలు మనుషుల దుఃఖాన్ని, బాధను పెంచుతున్నాయి. బిడ్డను కోల్పోయిన దుఃఖంలోవున్న తల్లిదండ్రులతో, బహుశా పరలోకంలో ఒక దేవదూత అవసరమైవుంటాడు కాబట్టి దేవుడు మీ బిడ్డను తీసుకెళ్లాడని ప్రజలు అనొచ్చు. సాతాను పుట్టించిన ఈ అబద్ధం ఆ తల్లిదండ్రుల బాధను తగ్గిస్తుందా లేదా పెంచుతుందా? చర్చి బోధల్ని వ్యతిరేకించేవాళ్లను కొయ్యకు కట్టి తగలబెట్టడం వంటి చిత్రహింసల్ని సమర్థించడానికి నరకాగ్ని అనే తప్పుడు బోధ ఉపయోగించబడింది. స్పానిష్‌ ఇన్‌క్విజిషన్‌ గురించిన ఒక పుస్తకం చెప్తున్నట్లు, మతభ్రష్టుల్ని అలా హింసించడం ద్వారా తాము కేవలం వాళ్లకు “నిత్యం మండే నరకాగ్ని ఎలా ఉంటుందో రుచి” చూపిస్తున్నామని, అప్పుడే వాళ్లు చనిపోయేలోగా పశ్చాత్తాపపడి, నరకాగ్నిని తప్పించుకుంటారని కొంతమంది నమ్మారు. చాలా దేశాల్లో ప్రజలు, చనిపోయిన తమ పూర్వీకులను పూజించడం, గౌరవించడం, లేదా వాళ్ల ఆశీస్సులు తీసుకోవడం వంటివి తప్పనిసరిగా చేయాలని భావిస్తారు. ఇంకొంతమంది, చనిపోయిన తమ పూర్వీకులు తమను శిక్షించకూడదనే ఉద్దేశంతో వాళ్లను శాంతింపజేయాలని అనుకుంటారు. విచారకరంగా, సాతాను పుట్టించిన అబద్ధాలపై ఆధారపడిన నమ్మకాలు నిజమైన ఓదార్పును ఇవ్వలేవు. బదులుగా, అవి అనవసరమైన ఆందోళనను, భయాన్ని కలిగిస్తాయి.

బైబిలు సత్యాన్ని మనమెలా సమర్థించవచ్చు?

11. లేఖనవిరుద్ధమైనవి చేయమని మన శ్రేయస్సు కోరే బంధువులు లేదా స్నేహితులు ఎలా ఒత్తిడి చేయవచ్చు?

11 చనిపోయినవాళ్లకు సంబంధించి చేసే లేఖనవిరుద్ధమైన ఆచారాల్లో పాల్గొనమని మన శ్రేయస్సు కోరే బంధువులు, స్నేహితులు మనల్ని ఒత్తిడి చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవాకు లోబడేలా దేవుని మీద, ఆయన వాక్యం మీద ఉన్న ప్రేమే మనల్ని బలపరుస్తుంది. మనం ఆ ఆచారాల్లో పాల్గొనకపోతే, మనకు చనిపోయినవాళ్ల పట్ల ప్రేమ, గౌరవం లేదంటూ వాళ్లు మనల్ని అవమానించవచ్చు. లేదా మన ప్రవర్తన కారణంగా, చనిపోయినవాళ్లు బ్రతికున్నవాళ్లకు ఏదైనా హాని చేస్తారని చెప్పవచ్చు. మరి మనం బైబిలు సత్యాన్ని ఎలా సమర్థించవచ్చు? ఈ కింది బైబిలు సూత్రాల్ని మీరెలా పాటించవచ్చో పరిశీలించండి.

12. చనిపోయినవాళ్లకు సంబంధించిన ఏ ఆచారాలు లేఖనవిరుద్ధమైనవి?

12 లేఖనవిరుద్ధమైన నమ్మకాలు, ఆచారాల నుండి ‘వేరుగా ఉండాలని’ నిశ్చయించుకోండి. (2 కొరిం. 6:17) ఒకవ్యక్తి చనిపోయాక, అతని “ఆత్మ” అక్కడక్కడే తిరుగుతూ అతన్ని బాధపెట్టినవాళ్లను శిక్షిస్తుందని కరీబియన్‌లో ఉండే చాలామంది నమ్ముతారు. ఆ “ఆత్మ” ఆఖరికి “ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా ఇబ్బందిపెట్టవచ్చు” అని ఒక రెఫరెన్సు చెప్తుంది. ఆఫ్రికాలో చనిపోయినవాళ్ల ఇంట్లో ఉండే అద్దాలను కప్పేయడం, గోడకున్న ఫోటోలను వెనక్కి తిప్పేయడం ఒక ఆచారం. వాళ్లు ఎందుకలా చేస్తారు? చనిపోయినవాళ్లు తమను తాము చూసుకోకూడదని కొంతమంది అంటారు. కానీ యెహోవా ప్రజలముగా మనం మాత్రం సాతాను పుట్టించే అబద్ధాలకు ఆజ్యం పోసే ఎలాంటి కట్టుకథల్ని నమ్మం లేదా ఆచారాల్లో పాల్గొనం.—1 కొరిం. 10:21, 22.

బైబిలు ఆధారిత ప్రచురణల్ని జాగ్రత్తగా పరిశోధన చేయడం వల్ల, సాక్షులుకాని బంధువులతో చక్కగా మాట్లాడడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి (13-14 పేరాలు చూడండి) c

13. ఏదైనా ఆచారంలో పాల్గొనవచ్చో లేదో మీకు అర్థంకాకపోతే యాకోబు 1:5 ప్రకారం ఏం చేయాలి?

13 ఏదైనా ఆచారంలో పాల్గొనవచ్చో లేదో మీకు అర్థంకాకపోతే, జ్ఞానం కోసం యెహోవాకు ప్రార్థించండి. (యాకోబు 1:5 చదవండి.) ఆ తర్వాత దానిగురించి మన ప్రచురణల్లో పరిశోధన చేయండి. అవసరమైతే, మీ సంఘపెద్దల్ని సంప్రదించండి. వాళ్లు మీరేం చేయాలో చెప్పరు కానీ, ఇప్పుడు చర్చించినలాంటి బైబిలు సూత్రాల్ని మీకు చూపించవచ్చు. మీరు ఇవన్నీ చేసినప్పుడు, మీ ‘వివేచనా సామర్థ్యాలకు’ శిక్షణ ఇచ్చుకుంటారు. దానివల్ల “తప్పొప్పులను గుర్తించగలుగుతారు.”—హెబ్రీ. 5:14.

14. మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదంటే ఏం చేయకూడదు?

14 “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి. దేవుని సంఘానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి.” (1 కొరిం. 10:31, 32) ఏదైనా ఆచారంలో పాల్గొనవచ్చో లేదో నిర్ణయించుకునేటప్పుడు, మన నిర్ణయం ఇతరుల మనస్సాక్షిపై, ముఖ్యంగా తోటి క్రైస్తవుల మనస్సాక్షిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఆలోచించాలి. నిజానికి, ఇతరులు విశ్వాసాన్ని కోల్పోయేలా మనం ప్రవర్తించకూడదు. (మార్కు 9:42) అలాగే, సాక్షులుకాని వాళ్లను అనవసరంగా బాధపెట్టకూడదు. వాళ్లతో గౌరవపూర్వకంగా మాట్లాడేలా ప్రేమ మనల్ని కదిలిస్తుంది, అలాచేస్తే యెహోవాకు మహిమ వస్తుంది. మనం ఇతరులతో గొడవపడం లేదా వాళ్ల ఆచారాల్ని ఎగతాళి చేయం. ప్రేమ శక్తివంతమైనదని గుర్తుంచుకోండి! మనం ఆ ప్రేమను దయగా, గౌరవపూర్వకంగా చూపించినప్పుడు ఆఖరికి వ్యతిరేకుల హృదయాలు కూడా మెత్తబడవచ్చు.

15-16. (ఎ) మీ నమ్మకాల గురించి ఇతరులకు ముందే చెప్పడం ఎందుకు తెలివైన పని? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) రోమీయులు 1:16⁠లో పౌలు చెప్పిన మాటల్ని మనమెలా పాటించవచ్చు?

15 మీరొక యెహోవాసాక్షి అని మీ ప్రాంతంలోని వాళ్లకు చెప్పండి. (యెష. 43:10) మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు చేసే ఆచారంలో మీరు పాల్గొనకపోతే మీ బంధువులు, ఇరుగుపొరుగువాళ్లు చాలా బాధపడతారు. ఒకవేళ మీ నమ్మకాల గురించి ముందే వాళ్లకు వివరించివుంటే, ఆ పరిస్థితిని ఎదుర్కోవడం మీకు కాస్త తేలికౌతుంది. మొజాంబిక్‌లో ఉండే ఫ్రాన్సీస్కో అనే సహోదరుడు ఇలా రాస్తున్నాడు, “నేనూ, నా భార్య కారోలీనా సత్యం నేర్చుకున్నప్పుడు, మేము చనిపోయినవాళ్లను ఇక ఆరాధించమని మా కుటుంబ సభ్యులకు చెప్పేశాం. అయితే, కారోలీనా వాళ్ల అక్క చనిపోయినప్పుడు మా నిర్ణయానికి ఒక పరీక్ష ఎదురైంది. స్థానిక ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి మతపరమైన పద్ధతిలో స్నానం చేయించాలి. ఆ తర్వాత, స్నానం చేయించిన నీళ్లను పారబోసే స్థలంలో, చనిపోయిన వ్యక్తి అతిదగ్గరి బంధువు మూడు రోజులపాటు నిద్రపోవాలి. ఈ ఆచారాలన్నీ చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని చేసేవాళ్లు. కాబట్టి, కారోలీనా కుటుంబ సభ్యులు ఆమె అక్కడ నిద్రపోవాలని చెప్పారు.”

16 అప్పుడు ఫ్రాన్సీస్కో, అతని భార్య ఏం చేశారు? ఫ్రాన్సీస్కో ఇలా వివరిస్తున్నాడు, “మేము యెహోవాను ప్రేమిస్తున్నాం, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ఆ ఆచారంలో పాల్గొనమని చెప్పాం. దాంతో కారోలీనా కుటుంబ సభ్యులకు చాలా కోపం వచ్చింది. చనిపోయినవాళ్ల పట్ల మాకు గౌరవం లేదని వాళ్లు మమ్మల్ని నిందిస్తూ ఇక మా ఇంటికి రామని, మాకు సహాయం చేయమని చెప్పారు. అయితే, మేము ముందే మా నమ్మకాల గురించి వాళ్లకు వివరించాం కాబట్టి, వాళ్లు కోపంగా ఉన్నప్పుడు దానిగురించి ఏమీ మాట్లాడలేదు. కొంతమంది బంధువులు కూడా మా తరఫున మాట్లాడుతూ, మేము అలాంటి వాటిల్లో పాల్గొనమని అంతకుముందే చెప్పిన విషయాన్ని కారోలీనా కుటుంబ సభ్యులకు గుర్తుచేశారు. కొంతకాలానికి కారోలీనా బంధువుల కోపం చల్లారింది, వాళ్లతో మేము శాంతి నెలకొల్పుకోగలిగాం. నిజానికి వాళ్లలో కొంతమంది మా ఇంటికొచ్చి బైబిలు ప్రచురణల కోసం అడిగారు.” కాబట్టి, మరణం గురించిన సత్యాన్ని సమర్థించే విషయంలో మనం ఎన్నడూ సిగ్గుపడకుండా ఉందాం.—రోమీయులు 1:16 చదవండి.

దుఃఖిస్తున్నవాళ్లను ఓదార్చండి, వాళ్లకు మద్దతివ్వండి

ప్రియమైనవాళ్లను మరణంలో కోల్పోయినవాళ్లకు నిజమైన స్నేహితులు ఓదార్పును, మద్దతును ఇస్తారు (17-19 పేరాలు చూడండి) d

17. దుఃఖిస్తున్న తోటి క్రైస్తవులకు మనం నిజమైన స్నేహితుల్లా ఎలా ఉండవచ్చు?

17 తోటి క్రైస్తవులు తమ ప్రియమైనవాళ్లను మరణంలో పోగొట్టుకున్నప్పుడు, మనం దుర్దశలోని సహోదరునికి ‘నిజమైన స్నేహితునిలా’ ఉండడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. (సామె. 17:17) అలా దుఃఖిస్తున్న సహోదరుణ్ణి గానీ సహోదరిని గానీ లేఖనవిరుద్ధమైన ఆచారాల్లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే, ఆ సమయంలో మనం వాళ్లకు ‘నిజమైన స్నేహితునిలా’ ఎలా ఉండగలం? వాళ్లను ఓదార్చడానికి సహాయపడే రెండు బైబిలు సూత్రాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

18. యేసు ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

18 “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి.” (రోమా. 12:15) దుఃఖంలో మునిగిపోయిన వాళ్లతో ఏం మాట్లాడాలో ఒక్కోసారి మనకు అర్థంకాకపోవచ్చు. కొన్నిసార్లు మన మాటల కన్నా మన కన్నీళ్లే మన భావాల్ని ఎక్కువ తెలియజేస్తాయి. యేసు స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు అతని తోబుట్టువులైన మరియ, మార్త, ఇంకొంతమంది స్నేహితులు ఏడ్చారు. నాలుగు రోజుల తర్వాత అక్కడికి వచ్చిన యేసు కూడా “కన్నీళ్లు పెట్టుకున్నాడు.” నిజానికి లాజరును కాసేపట్లో బ్రతికిస్తానని తెలిసినా యేసు ఏడ్చాడు. (యోహా. 11:17, 33-35) ఆయన అలా ఏడ్వడం, లాజరు చనిపోయినందుకు యెహోవా ఎలా భావిస్తున్నాడో తెలియజేసింది. యేసు కన్నీళ్లు లాజరు కుటుంబంపట్ల ఆయనకున్న ప్రేమను కూడా తెలియజేశాయి. అది ఖచ్చితంగా మరియ, మార్తలను ఓదార్చివుంటుంది. అదేవిధంగా మన సహోదరులు మన ప్రేమను, శ్రద్ధను రుచి చూసినప్పుడు తాము ఒంటరివాళ్లం కామని, తమ చుట్టూ శ్రద్ధ చూపించే, మద్దతిచ్చే స్నేహితులు ఉన్నారని అర్థంచేసుకుంటారు.

19. దుఃఖిస్తున్న తోటి క్రైస్తవుల్ని ఓదారుస్తున్నప్పుడు, మనం ప్రసంగి 3:7⁠లో ఉన్న మాటల్ని ఏయే విధాలుగా పాటించవచ్చు?

19 “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయం ఉంది. (ప్రసం. 3:7) వాళ్లు చెప్పేది కేవలం శ్రద్ధగా వినడం ద్వారా కూడా మనం దుఃఖిస్తున్న తోటి క్రైస్తవులను ఓదార్చవచ్చు. వాళ్ల మనసులో ఉన్నదంతా చెప్పనివ్వండి, వాళ్లు అనాలోచితంగా మాట్లాడితే బాధపడకండి. (యోబు 6:2, 3) బహుశా వాళ్లు సాక్షులుకాని బంధువుల వల్ల మరింత ఒత్తిడిలో ఉండివుంటారు. కాబట్టి వాళ్లతో కలిసి ప్రార్థించండి. వాళ్లను బలపర్చమని, విషయాల్ని స్పష్టంగా అర్థంచేసుకునేలా సహాయం చేయమని ‘ప్రార్థన ఆలకించువాడైన’ యెహోవాను వేడుకోండి. (కీర్త. 65:2) ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వాళ్లతో కలిసి బైబిలు చదవండి. లేదా మన ప్రచురణల్లో నుండి జీవిత కథలు లాంటి ప్రోత్సాహకరమైన ఆర్టికల్స్‌ చదవండి.

20. తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏం పరిశీలిస్తాం?

20 మరణం గురించిన సత్యాన్ని, సమాధుల్లో ఉన్నవాళ్ల కోసం వేచివున్న అద్భుతమైన భవిష్యత్తును తెలుసుకున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! (యోహా. 5:28, 29) కాబట్టి మన మాటల్లో, చేతల్లో బైబిలు సత్యాన్ని సమర్థిస్తూ, అవకాశం దొరికిన ప్రతీసారి దాన్ని ఇతరులతో పంచుకుందాం. సాతాను ప్రజల్ని ఆధ్యాత్మిక చీకటిలో ఉంచడానికి ప్రయత్నించే మరో మార్గం, మంత్రతంత్రాలు. దానిగురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఆ ఉచ్చుకు సంబంధించిన వినోదానికి, ఆచారాలకు మనమెందుకు దూరంగా ఉండాలో కూడా చూస్తాం.

పాట 24 యెహోవా పర్వతానికి రండి

a చనిపోయినవాళ్ల స్థితి గురించి అబద్ధాలు చెప్పడం ద్వారా సాతాను, అతని చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేశారు. ఆ అబద్ధాలవల్ల లేఖన విరుద్ధమైన ఎన్నో ఆచారాలు పుట్టుకొచ్చాయి. అయితే, అలాంటి ఆచారాల్లో పాల్గొనమని ఇతరులు మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పుడు, మీరు యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

b చిత్రాల వివరణ : ప్రియమైనవాళ్లను కోల్పోయిన ఒక బంధువును, ఓదారుస్తున్న సాక్షులైన కుటుంబ సభ్యులు.

c చిత్రాల వివరణ : ఒక యెహోవాసాక్షి, అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాల గురించి పరిశోధన చేసి, తర్వాత తన నమ్మకాల గురించి బంధువులకు దయగా వివరిస్తున్నాడు.

d చిత్రాల వివరణ : ప్రియమైనవాళ్లను కోల్పోయిన ఒక సహోదరుణ్ణి ఓదార్చి, మద్దతిస్తున్న సంఘపెద్దలు.