నా చిన్న కుక్కలకు వాళ్లు బిస్కెట్లు పెట్టారు
అమెరికాలోని ఒరెగన్‌లో ఉంటున్న నిక్ ఇలా చెప్తున్నాడు: “2014 వసంతకాలంలో, నేను నా రెండు కుక్కల్ని తీసుకుని వాకింగ్ చేస్తూ సిటీ సెంటర్‌కి వెళ్లాను. ఎప్పటిలాగే ఆ సెంటర్లో యెహోవాసాక్షులు కార్టులు పెట్టారు. చక్కగా రెడీ అయిన సాక్షులు అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నారు.
“వాళ్లు ప్రజలపట్ల దయ చూపించడమే కాదు, నా కుక్కల మీద కూడా శ్రద్ధ చూపించారు. ఒకరోజు కార్టు దగ్గరున్న ఇలేన్ అనే సాక్షి నా కుక్కలకు బిస్కెట్లు పెట్టింది. ఆ తర్వాత మేం ఆ కార్టు వైపుకు ఎప్పుడు వెళ్లినా, బిస్కెట్ల కోసం నా కుక్కలు వాళ్ల దగ్గరికి పరిగెత్తేవి.
“ఒకవైపు నా కుక్కలు బిస్కెట్లు తింటుంటే మరోవైపు నేను ఆ సాక్షులతో కాసేపు మాట్లాడేవాడిని. అలా కొన్ని నెలలు గడిచాయి. అయితే వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడడానికి నేను వెనకాడేవాడిని. నాకు 70 ఏళ్లు దాటాయి. పైగా సాక్షుల నమ్మకాలేంటో నాకు తెలీదు. దానికితోడు, ఎన్నో చర్చీలు తిరిగి-తిరిగి విసిగిపోయాను. అందుకే బైబిల్ని సొంతగా పరిశీలించడం మంచిదని అనుకున్నాను.
“అయితే మా నగరంలో వేర్వేరు చోట్ల కూడా యెహోవాసాక్షులు కార్టుల దగ్గర నిలబడడం నేను చూశాను. వాళ్లు కూడా ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండేవాళ్లు. నా ప్రశ్నలకు బైబిలు నుండే జవాబిచ్చేవాళ్లు. దానివల్ల వాళ్లమీద నాకు నమ్మకం పెరిగింది.
“ఒకరోజు ఇలేన్ నన్ను ఇలా అడిగింది: ‘జంతువులు దేవుడిచ్చిన బహుమానమని మీరు నమ్ముతారా?’ దానికి నేను ‘ఖచ్చితంగా నమ్ముతాను!’ అని చెప్పాను. తర్వాత ఆమె యెషయా 11:6-9 వచనాల్ని చదివింది. అప్పటినుండి నాకు బైబిలు గురించి నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అయినా వాళ్లిచ్చే ప్రచురణలు తీసుకోవడానికి నేను ఇష్టపడలేదు.
“ఆ తర్వాత కొన్నిరోజుల వరకు ఇలేన్, ఆమె భర్త బ్రెంట్ నాతో బైబిలు విషయాలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడింది కొంచెంసేపే అయినా అవి నాకు ఆసక్తికరంగా అనిపించాయి. ఒక క్రైస్తవునిగా ఉండడమంటే ఏంటో అర్థంచేసుకోవడానికి, మత్తయి నుండి అపొస్తలుల కార్యాలు వరకు చదవమని వాళ్లు నాకు చెప్పారు. నేను వాళ్లు చెప్పినట్టే చదివాను. కొంతకాలానికి అంటే 2016 వేసవికాలంలో, బ్రెంట్ అలాగే ఇలేన్ దగ్గర బైబిలు స్టడీ తీసుకోవడానికి ఒప్పుకున్నాను.
“నేను ప్రతీవారం బైబిలు స్టడీ తీసుకోవడానికి, మీటింగ్స్‌కి వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాణ్ణి. బైబిలు నిజంగా ఏం చెప్తుందో నేర్చుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను. నాకిప్పుడు 79 ఏళ్లు, నేను నిజమైన మతాన్ని కనుగొన్నానని నాకు తెలుసు. తన ప్రపంచవ్యాప్త కుటుంబంలో నేను కూడా ఒకనిగా ఉండడానికి యెహోవా నాకు సహాయం చేశాడు. అది నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం!”