కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 15

పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

యెహోవా సంస్థ మీద మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి

యెహోవా సంస్థ మీద మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి

“మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి.”హెబ్రీ. 13:7.

ముఖ్యాంశం

యెహోవా సంస్థ మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయవచ్చు?

1. మొదటి శతాబ్దంలోని యెహోవా ప్రజలు ఎలా ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు?

 యెహోవా ఎవరికైనా ఏదైనా ఒక నియామకాన్ని ఇచ్చాడంటే, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఆశిస్తాడు. (1 కొరిం. 14:33) ఉదాహరణకు, భూమ్మీదున్న ప్రతీఒక్కరికి మంచివార్త ప్రకటించబడాలనేది దేవుని ఇష్టం. (మత్త. 24:14) ఆ పనిని చూసుకునే బాధ్యతను యెహోవా యేసు భుజాల మీద పెట్టాడు. యేసు ఆ పని పద్ధతి ప్రకారం జరిగేలా చూసుకుంటున్నాడు. మొదటి శతాబ్దంలో చాలా సంఘాలు స్థాపించబడ్డాక, ఆ సంఘాలకు నిర్దేశాలు ఇవ్వడానికి, ముందుండి నడిపించడానికి సంఘపెద్దలు నియమించబడ్డారు. (అపొ. 14:23) యెరూషలేములో ఉన్న కొంతమంది పెద్దలు అలాగే అపొస్తలులు కలిసి పరిపాలక సభగా ఏర్పడ్డారు. వాళ్లు సంఘాల ప్రయోజనం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఆ నిర్ణయాల్ని ఆయా సంఘాల్లో ఉన్న పెద్దలు బ్రదర్స్‌సిస్టర్స్‌కి తెలియజేసేవాళ్లు. (అపొ. 15:2; 16:4) సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ వాటిని పాటించినప్పుడు వాళ్లు “విశ్వాసంలో స్థిరపడుతూ” ఉన్నారు. వాళ్ల “సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.”—అపొ. 16:5.

2. యెహోవా తన ప్రజల్ని 1919 నుండి ఎలా నడిపిస్తూ, ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నాడు?

2 యెహోవా ఇప్పుడు కూడా తన ప్రజల్ని ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాడు. 1919 నుండి ప్రకటనా పనిని చూసుకోవడానికి, తన అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి యేసు అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపును ఉపయోగించుకుంటున్నాడు. a (లూకా 12:42) ఆ గుంపు చేస్తున్న పనిని యెహోవా దీవిస్తున్నాడని అనడంలో ఏ సందేహం లేదు.—యెష. 60:22; 65:13, 14.

3-4. (ఎ) మనం పద్ధతిగా పనిచేయకపోతే ఏం జరగవచ్చో ఉదాహరణతో చెప్పండి. (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేయకపోతే, యేసు మనకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా చేయలేం! (మత్త. 28:19, 20) ఉదాహరణకు, సంఘానికి టెరిటరీ నియమించలేదు అనుకోండి, అప్పుడు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్లు ప్రీచింగ్‌ చేస్తారు. దానివల్ల చేసిన టెరిటరీనే మళ్లీమళ్లీ చేసే అవకాశముంది అలాగే కొన్ని టెరిటరీల్లోనైతే అసలు అడుగు పెట్టకుండా అయిపోతుంది. మనం ఒక పద్ధతిగా పనిచేయడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు?

4 యేసు భూమ్మీదున్నప్పుడు తన అనుచరులు పద్ధతిగా పనిచేసేలా చూసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. మన సంస్థ యేసు చేసిందే ఎలా చేస్తుందో, సంస్థ మీద మన నమ్మకాన్ని ఎలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మన సంస్థ యేసు చేసిందే చేస్తుంది

5. యేసు చేసినట్టే సంస్థ చేస్తున్న ఒక పనేంటి? (యోహాను 8:28)

5 యేసు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తన పరలోక తండ్రి నుండే నేర్చుకున్నాడు. యేసులాగే యెహోవా సంస్థ కూడా ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవడానికి అలాగే మనకు నిర్దేశమివ్వడానికి బైబిలు మీదే ఆధారపడుతుంది. (యోహాను 8:28 చదవండి; 2 తిమో. 3:16, 17) అందుకే బైబిల్ని చదవమని, చదివిన వాటిని పాటించమని సంస్థ పదేపదే గుర్తుచేస్తుంది. ఆ సలహాను పాటించడంవల్ల మనకేంటి ఉపయోగం?

6. బైబిల్ని మన ప్రచురణల సహాయంతో అధ్యయనం చేసినప్పుడు ఏ ప్రయోజనం ఉంటుంది?

6 మనం సంస్థ ఇచ్చే ప్రచురణల సహాయంతో బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు చాలా ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు, సంస్థ ఇచ్చే నిర్దేశాలు బైబిలు ప్రకారం ఉన్నాయో లేవో మనం పోల్చి చూసుకోగలుగుతాం. అలా, సంస్థ ఇచ్చే నిర్దేశం బైబిలు ఆధారంగానే ఉందని తెలుసుకున్నప్పుడు సంస్థ మీద మనకున్న నమ్మకం ఇంకాఇంకా పెరుగుతుంది.—రోమా. 12:2.

7. యేసు దేనిగురించి ప్రకటించాడు? యేసు చేసినట్టే యెహోవా సంస్థ చేసే ఇంకో పనేంటి?

7 యేసు “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించాడు. (లూకా 4:43, 44) తన శిష్యులు కూడా ప్రకటించాలని చెప్పాడు. (లూకా 9:1, 2; 10:8, 9) ఈరోజు యెహోవా సంస్థలో ఉన్న ప్రతీఒక్కరు ఎక్కడున్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారు.

8. మనకు ఏ గొప్ప గౌరవం దక్కింది?

8 దేవుని రాజ్యం గురించిన సత్యాన్ని వేరేవాళ్లకు చెప్పడం మనకు దొరికిన గొప్ప గౌరవం! అయితే అది ఎవరికి పడితే వాళ్లకు దొరికేది కాదు. ఉదాహరణకు, యేసు భూమ్మీదున్నప్పుడు చెడ్డదూతలు తన గురించి సాక్ష్యం ఇచ్చేలా ఆయన అనుమతించలేదు. (లూకా 4:41) ఈరోజుల్లో కూడా, ఒకవ్యక్తి యెహోవా ప్రజలతోపాటు ప్రీచింగ్‌కి వెళ్లాలంటే దానికి అర్హత సంపాదించాలి. మనం ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ప్రీచింగ్‌ చేయడం ద్వారా ఆ బాధ్యత మీద మనకు కృతజ్ఞత ఉందని చూపించినవాళ్లం అవుతాం. యేసులాగే ప్రజల హృదయాల్లో రాజ్య సత్యాన్ని నాటి, నీళ్లు పోయాలన్నదే మన లక్ష్యం!—మత్త. 13:3, 23; 1 కొరిం. 3:6.

9. దేవుని పేరును ప్రజలకు తెలియజేయడానికి సంస్థ ఏం చేసింది?

9 యేసు దేవుని పేరును తెలియజేశాడు. తన పరలోక తండ్రికి చేసిన ప్రార్థనలో ఆయన ఇలా అన్నాడు: “నేను నీ పేరును వీళ్లకు తెలియజేశాను.” (యోహా. 17:26) యేసు చేసినట్టే యెహోవా సంస్థ కూడా దేవుని పేరును ఇతరులకు తెలియజేయడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. దానికోసం సంస్థ పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం తయారుచేసింది. ఈ అనువాదంలో, బైబిల్ని రాసినప్పుడు దేవుని పేరు ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా తిరిగి చేర్చింది. ఈ బైబిలు కొన్ని భాగాలుగా లేదా పూర్తిగా దాదాపు 270 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ బైబిల్లో, దేవుని పేరును ఎక్కడెక్కడ, ఎందుకు తిరిగి చేర్చారో మరిన్ని వివరాలు అనుబంధం A4 అలాగే A5 లో ఉన్నాయి. అంతేకాదు, అనుబంధం A5లో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు 237 సార్లు ఉంది అనడానికి రుజువులు కూడా ఉన్నాయి.

10. మియన్మార్‌లో ఉంటున్న ఒక పెద్దావిడ చెప్పిన దాన్నుండి మీరేం నేర్చుకున్నారు?

10 యేసులాగే మనం కూడా వీలైనంత ఎక్కువమంది దేవుని పేరు తెలుసుకునేలా సహాయం చేస్తాం. మియన్మార్‌లో ఉంటున్న 67 ఏళ్ల పెద్దావిడ దేవునికి ఒక పేరు ఉందని తెలుసుకున్నాక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తనకు బైబిలు స్టడీ ఇచ్చేవాళ్లతో ఆమె ఇలా అంది: “నా జీవితంలో దేవుని పేరు యెహోవా అని మొట్టమొదటిసారి వింటున్నాను. . . . ఇప్పటివరకు నాకెవ్వరూ నేర్పించని ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించారు.” ఈ అనుభవం చూపిస్తున్నట్టు, ప్రజలు దేవుని పేరును తెలుసుకున్నప్పుడు అది వాళ్ల జీవితాల్ని మార్చేస్తుంది.

సంస్థ మీద నమ్మకాన్ని చూపిస్తూ ఉండండి

11. దేవుని సంస్థ మీద నమ్మకం ఉందని సంఘపెద్దలు ఎలా చూపిస్తారు? (చిత్రం కూడా చూడండి.)

11 దేవుని సంస్థ మీద నమ్మకం ఉందని సంఘపెద్దలు ఎలా చూపిస్తారు? నిర్దేశాలు వచ్చినప్పుడు పెద్దలు వాటిని జాగ్రత్తగా చదవాలి, వాటిని పాటించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఉదాహరణకు, మీటింగ్స్‌లో భాగాలు ఎలా చేయాలి, సంఘంలో ప్రార్థన ఎలా చేయాలి అనే వాటి గురించే కాదు, క్రీస్తు గొర్రెల్ని ఎలా సంరక్షించాలో కూడా సంఘపెద్దలకు నిర్దేశాలు వస్తాయి. వాళ్లు సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే, బ్రదర్స్‌సిస్టర్స్‌ యెహోవా ప్రేమను, సంరక్షణను రుచి చూడగలుగుతారు.

యెహోవా సంస్థ ఇస్తున్న నిర్దేశాల్ని పాటించేలా సంఘపెద్దలు మనకు సహాయం చేస్తారు (11వ పేరా చూడండి) b


12. (ఎ) మనం సంఘపెద్దల మాట ఎందుకు వినాలి? (హెబ్రీయులు 13:7, 17) (బి) వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద ఎందుకు మనసుపెట్టాలి?

12 సంఘపెద్దలు మనకు ఏదైనా నిర్దేశం ఇచ్చినప్పుడు వాటికి ఇష్టంగా లోబడాలి. అలా చేసినప్పుడు వాళ్ల పని తేలికౌతుంది. నాయకత్వం వహించేవాళ్లకు లోబడి ఉండాలని, విధేయత చూపించాలని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) అయితే, అది మనకు కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే సంఘపెద్దలు అపరిపూర్ణులు. కానీ, మనం వాళ్లలో ఉన్న మంచి లక్షణాల మీద కాకుండా, చెడు లక్షణాల మీద మనసుపెడితే, మనం మన శత్రువులతో చేతులు కలిపినట్టే. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మనం సంఘపెద్దల గురించి తప్పుగా ఆలోచిస్తే, యెహోవా సంస్థ గురించి కూడా తప్పుగా ఆలోచించే అవకాశముంది. అప్పుడు సంస్థ మీద మనకున్న నమ్మకం కూడా తగ్గుతుంది. అలా తగ్గాలనే శత్రువులు ప్రయత్నిస్తున్నారు. అయితే, వాళ్ల పన్నాగాల్ని మనమెలా పసిగట్టి, తప్పించుకోవచ్చు?

వేరేవాళ్లు మీ నమ్మకాల్ని నీరుగార్చనివ్వకండి

13. యెహోవా సంస్థను చెడుగా చూపించడానికి శత్రువులు ఎలా ప్రయత్నిస్తారు?

13 యెహోవా సంస్థలో ఉన్న మంచి విషయాల్ని చెడుగా చూపించడానికి శత్రువులు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, తనను ఆరాధించేవాళ్లు తమ శరీరాల్ని, తమ ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకోవాలని, తనకు ఇష్టమైన విధంగా ఆరాధించాలని యెహోవా చెప్తున్నాడు. అంతేకాదు, పశ్చాత్తాపం చూపించకుండా లేఖన విరుద్ధమైన పనులు చేస్తూ ఉండేవాళ్లను సంఘం నుండి తీసేయాలని ఆయన చెప్పాడు. (1 కొరిం. 5:11-13; 6:9, 10) మనం ఆయన చెప్పింది చేస్తాం. కానీ మనలా లేనివాళ్లను దూరం పెడతామని, అసహ్యించుకుంటామని, ద్వేషిస్తామని శత్రువులు మనగురించి తప్పుడు ప్రచారం చేస్తారు.

14. సంస్థ గురించి వచ్చే కట్టుకథల వెనుక ఎవరున్నారు?

14 శత్రువుల వెనక ఎవరున్నారో గుర్తించండి. కట్టుకథల వెనక అపవాదియైన సాతాను దాక్కొని ఉన్నాడు. అతను “అబద్ధానికి తండ్రి.” (యోహా. 8:44; ఆది. 3:1-5) కాబట్టి, యెహోవా సంస్థ గురించి కట్టుకథల్ని వ్యాప్తి చేయడానికి సాతాను తన గుప్పిట్లో ఉన్నవాళ్లను ఉపయోగించుకుంటాడు. మొదటి శతాబ్దంలో సాతాను అదే చేశాడు.

15. యేసును, ఆయన అనుచరుల్ని మతనాయకులు ఏం చేశారు?

15 యేసు పరిపూర్ణుడని, అద్భుతాలు చేసే సామర్థ్యం తనకు ఉందని మొదటి శతాబ్దంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అయినాసరే, సాతానుకు మద్దతిచ్చేవాళ్లు ఆయన గురించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఉదాహరణకు, యేసు చెడ్డదూతల్ని వెళ్లగొట్టేది “చెడ్డదూతల నాయకుడి సహాయంతోనే” అని మతనాయకులు ప్రజలకు చెప్పారు. (మార్కు 3:22) అలాగే, యేసును విచారణ చేస్తున్నప్పుడు ఆయన దైవదూషణ చేస్తున్నాడని నిందించి, ఆయనకు మరణశిక్ష వేయమని ప్రజలు అడిగేలా మతనాయకులు రెచ్చగొట్టారు. (మత్త. 27:20) ఆ తర్వాత క్రీస్తు అనుచరులు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, వాళ్లను హింసించేలా ప్రజల “మనసుల్ని చెడగొట్టారు.” (అపొ. 14:2, 19) అపొస్తలుల కార్యాలు 14:2 గురించి 1998, డిసెంబరు 1 కావలికోట పత్రిక ఇలా చెప్పింది: ‘విశ్వసించని యూదులు ఆ సందేశాన్ని కేవలం నిరాకరించి ఊరుకోలేదు గానీ క్రైస్తవులకు వ్యతిరేకంగా అన్యుల మనసుల్లో ప్రతికూల అభిప్రాయాల్ని నాటి, క్రైస్తవుల పేరుకు కళంకం తీసుకొచ్చే ప్రచారాన్ని మొదలుపెట్టారు.’

16. కట్టుకథలు విన్నప్పుడు మనమేం గుర్తుంచుకోవాలి?

16 సాతాను తన అబద్ధాల్ని మొదటి శతాబ్దానికే పరిమితం చేయలేదు. ఇప్పుడు కూడా “అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (ప్రక. 12:9) కాబట్టి సంస్థ గురించి లేదా నాయకత్వం వహిస్తున్నవాళ్ల గురించి ఏవైనా కట్టుకథలు మీరు విన్నప్పుడు, యేసును అలాగే మొదటి శతాబ్దంలోని శిష్యుల్ని శత్రువులు ఏం చేశారో గుర్తుచేసుకోండి. ఇప్పుడు కూడా బైబిలు ముందే చెప్పినట్టు శత్రువులు దేవుని ప్రజల్ని హింసిస్తున్నారు. వాళ్ల గురించి లేనిపోని అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. (మత్త. 5:11, 12) ఒకవేళ ఈ కట్టుకథల వెనక ఎవరున్నారో మనం గుర్తించి, వెంటనే చర్య తీసుకుంటే వాటివల్ల మనం మోసపోము. అయితే, మనం తీసుకోవాల్సిన చర్య ఏంటి?

17. కట్టుకథలు మన చెవిన పడినప్పుడు ఏం చేయాలి? (2 తిమోతి 1:13) (“ కట్టుకథల్ని కట్టిపడేయండి!” అనే బాక్స్‌ కూడా చూడండి.)

17 కట్టుకథల్ని తిరస్కరించండి. కట్టుకథలు మన చెవిన పడినప్పుడు మనమేం చేయాలో అపొస్తలుడైన పౌలు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు. “కట్టుకథల మీద, . . . మనసు పెట్టొద్దు,” “భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు” అని అప్పుడున్న కొంతమందికి తిమోతి ద్వారా పౌలు చెప్పాడు. (1 తిమో. 1:3, 4; 4:7) బుడిబుడి అడుగులు వేసే ఒక పసి పిల్లవాడు తన కంటికి ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకుంటాడు. కానీ అలా చేయడంవల్ల ఉన్న ప్రమాదాన్ని పెద్దవాళ్లు అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా, మనం కూడా కట్టుకథల వెనకున్న వ్యక్తిని, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించినప్పుడు వాటిని తిరస్కరిస్తాం. మనం సత్యం అనే “మంచి మాటల్ని” మాత్రమే వింటాం.—2 తిమోతి 1:13 చదవండి.

18. యెహోవా సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?

18 మనం ఇప్పటివరకు దేవుని సంస్థ యేసు చేసినట్టే చేస్తున్న మూడు పనుల్ని మాత్రమే పరిశీలించాం. కానీ మీరు బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, సంస్థ ఇంకా ఏయే విధాలుగా యేసును అనుకరిస్తుందో తెలుసుకోండి. యెహోవా సంస్థ మీద నమ్మకాన్ని పెంచుకునేలా మీ సంఘంలో వాళ్లకు కూడా సహాయం చేయండి. యెహోవాను, ఆయన ఇష్టాన్ని చేయడానికి ఆయన ఉపయోగించుకుంటున్న సంస్థను అంటిపెట్టుకుని ఉంటూ సంస్థ మీద మీకున్న నమ్మకాన్ని చూపిస్తూ ఉండండి. (కీర్త. 37:28) ప్రేమకు, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన యెహోవా ప్రజల్లో ఒకరిగా ఉండే ఈ గొప్ప గౌరవాన్ని బట్టి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉందాం!

మీరెలా జవాబిస్తారు?

  • దేవుని ప్రజలు యేసు చేసినట్టే ఏమేమి చేస్తున్నారు?

  • యెహోవా సంస్థ మీద మనకున్న నమ్మకాన్ని ఎలా చూపిస్తూ ఉండవచ్చు?

  • కట్టుకథలు మన చెవిన పడినప్పుడు మనమేం చేయాలి?

పాట 103 కాపరులు మనుషుల్లో వరాలు

a యెహోవా స్వచ్ఛారాధన—మళ్లీ స్థాపించబడింది! (ఇంగ్లీష్‌) పుస్తకంలోని 102-103 పేజీల్లో ఉన్న “ఎందుకు 1919?” అనే బాక్స్‌ చూడండి.

b చిత్రం వివరణ: బహిరంగ సాక్ష్యం గురించి పెద్దలు మాట్లాడుకున్న తర్వాత, గోడ వైపుకు వీపు ఉండేలా నిలబడమని నిర్దేశాన్ని ఇస్తున్న ఒక గుంపు పర్యవేక్షకుడు.