ఎలాంటి ప్రేమ నిజమైన సంతోషాన్నిస్తుంది?
“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్త. 144:15.
1. మనం జీవిస్తున్న కాలం మానవజాతి చరిత్రంతటిలో ఎందుకు ప్రత్యేకమైనది?
మనం జీవిస్తున్న కాలం మానవజాతి చరిత్రంతటిలో చాలా ప్రత్యేకమైనది. బైబిలు ముందే చెప్పినట్లుగా, “అన్ని దేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి” యెహోవా ఒక గొప్ప సమూహాన్ని సమకూరుస్తున్నాడు. అలా ఆయన సమకూర్చిన ‘బలమైన జనములో’ 80 లక్షల కన్నా ఎక్కువమంది ఉన్నారు. సంతోషంగా ఉన్న ఆ ప్రజలు “రాత్రింబగళ్లు ఆయనకు పవిత్రసేవ చేస్తున్నారు.” (ప్రక. 7:9, 15; యెష. 60:22) దేవుణ్ణీ, సాటి మనుషుల్నీ ప్రేమించే ఇంతమంది ముందెప్పుడూ లేరు.
2. దేవునితో స్నేహం చేయనివాళ్లు ఎలాంటి ప్రేమ కలిగివుంటారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
2 అయితే బైబిలు మరో విషయాన్ని కూడా ముందే చెప్పింది. అదేమిటంటే మనం జీవిస్తున్న రోజుల్లో, దేవునితో స్నేహం చేయని ప్రజలు స్వార్థపూరితమైన ప్రేమను కలిగివుంటారు. చివరి రోజుల్లో ‘స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు’ ఉంటారని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 తిమో. 3:1-4) దేవున్ని ప్రేమించేవాళ్లెవ్వరూ వాళ్లలా ఉండరు. స్వార్థపూరితమైన ప్రేమలో సంతోషం ఉంటుందని కొంతమంది భ్రమపడతారు. నిజం చెప్పాలంటే, అలాంటి ప్రేమ స్వార్థాన్ని పెంచి పోషిస్తుంది, ప్రతీఒక్కరి జీవితాన్ని కష్టతరం చేస్తుంది.
3. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం? ఎందుకు?
3 స్వార్థపూరితమైన ప్రేమ ప్రపంచమంతా వ్యాపిస్తుందని, దానివల్ల క్రైస్తవులకు ప్రమాదాలు ఎదురౌతాయని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. అందుకే అలాంటి ప్రేమ చూపించేవాళ్లకు ‘దూరంగా ఉండండి’ అని ఆయన క్రైస్తవులను హెచ్చరించాడు. (2 తిమో. 3:5) కానీ వాళ్లకు పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యంకాదు. అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న అలాంటి ప్రజల నుండి మనల్ని మనం కాపాడుకుంటూ, ప్రేమకు మూలమైన యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు? ముందుగా దేవుడు మనల్ని చూపించమని చెప్తున్న ప్రేమకూ, 2 తిమోతి 3:2-4లో వర్ణించబడిన ప్రేమకూ ఉన్న తేడా ఏమిటో ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం. అలా పరిశీలించడం వల్ల, మనం ఎలాంటి ప్రేమను చూపిస్తున్నామో గుర్తించగలుగుతాం. నిజమైన సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చే ప్రేమను చూపించడానికి మనమింకా ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోగలుగుతాం.
దేవున్ని ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా?
4. మనల్ని మనం కొంతమేరకు ప్రేమించుకోవడం ఎందుకు తప్పుకాదు?
4 ప్రజలు ‘స్వార్థపరులుగా’ ఉంటారని అంటే తమను తాము ప్రేమించుకుంటారని పౌలు రాశాడు. మనల్ని మనం ప్రేమించుకోవడం తప్పని దానర్థమా? కాదు. అది సాధారణమైన విషయం, మనల్ని మనం ప్రేమించుకోవడం అవసరం కూడా. నిజానికి యెహోవాయే మనల్ని ఆ విధంగా తయారుచేశాడు. యేసు ఇలా అన్నాడు, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’ (మార్కు 12:31) మనల్ని మనం ప్రేమించుకోకపోతే, ఇతరుల్ని ప్రేమించలేం. బైబిలు ఇలా చెప్తోంది, “భర్త తన శరీరాన్ని ప్రేమించుకున్నట్టే తన భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించే భర్త తనను తాను ప్రేమించుకుంటున్నాడు. ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.” (ఎఫె. 5:28, 29) వీటన్నిటిని బట్టి, మనల్ని మనం కొంతమేరకు ప్రేమించుకోవాలని తెలుస్తోంది.
5. తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేవాళ్లు ఎలా ప్రవర్తిస్తారు?
5 రెండవ తిమోతి 3:2లో వర్ణించబడిన ప్రేమ సరైనది కాదు, అది స్వార్థపూరితమైనది. తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేవాళ్లు, తమ గురించి చాలా గొప్పగా భావిస్తారు. (రోమీయులు 12:3 చదవండి.) ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు తప్ప వేరే ఎవ్వరి గురించి పట్టించుకోరు. తాము అనుకున్నట్లు జరగనప్పుడు ఇతరుల్ని తప్పుపడతారు. అలాంటివాళ్లు నిజమైన సంతోషాన్ని అనుభవించట్లేదు.
6. యెహోవాను ప్రేమించే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
6 పౌలు ప్రస్తావించిన చెడు లక్షణాలన్నిటికి మూలం స్వార్థమే గనుక పౌలు దాన్ని మొదట ప్రస్తావించాడని కొంతమంది విద్వాంసులు అంటారు. దేవున్ని ప్రేమించేవాళ్లు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. వాళ్లు చూపించే ప్రేమలో సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం వంటి లక్షణాలు ఉంటాయని బైబిలు చెప్తుంది. (గల. 5:22, 23) కీర్తనకర్త ఇలా రాశాడు, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.” (కీర్త. 144:15) యెహోవా సంతోషంగా ఉండే దేవుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అంతేకాదు వాళ్లు ఇతరులకు ఇవ్వడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. కానీ తమను తాము ఎక్కువగా ప్రేమించుకుంటూ, ఇతరుల నుండి ఎప్పుడూ ఏదోకటి ఆశించేవాళ్లు సంతోషంగా ఉండరు.—అపొ. 20:35.
7. మనం దేవున్ని ప్రేమిస్తున్నామో లేదో పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?
7 దేవున్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, మనల్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నామో ఎలా తెలుసుకోవచ్చు? జ్ఞానయుక్తమైన ఈ సలహా గురించి ఆలోచించండి: “గొడవలకు దిగే మనస్తత్వాన్ని, అహాన్ని చూపించకండి. వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి. మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలి. 2:3, 4) మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఈ సలహాను నేను పాటిస్తున్నానా? దేవుడు నాకు చెప్తున్నట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నానా? సంఘంలో, పరిచర్యలో ఇతరులకు సహాయం చేయగల అవకాశాల కోసం వెతుకుతున్నానా?’ మన సమయాన్ని, శక్తిని ఇతరుల కోసం వెచ్చించడం ప్రతీసారి సులభం కాదు. దానికోసం చాలా కష్టపడాల్సి రావచ్చు, కొన్నిసార్లు మనకిష్టమైన వాటిని త్యాగం చేయాల్సి రావచ్చు. కానీ విశ్వసర్వాధిపతి మనల్ని చూసి సంతోషిస్తున్నాడని తెలుసుకోవడం కన్నా మించిన ఆనందం మరొకటి ఉండదు.
8. యెహోవాపై ప్రేమతో కొంతమంది ఏమి చేశారు?
8 దేవునిపై ప్రేమ, ఆయన సేవను మరింత ఎక్కువగా చేయాలనే కోరిక ఉండడం వల్ల కొంతమంది క్రైస్తవులు మంచి సంపాదన వచ్చే ఉద్యోగాల్ని వదిలిపెట్టేశారు. అమెరికాకు చెందిన ఎరికా వృత్తిరీత్యా డాక్టరు. ఆ వృత్తిలో ఉన్నతస్థాయికి ఎదగడానికి కృషిచేసే బదులు ఆమె పయినీరుగా సేవచేయాలని నిర్ణయించుకుంది. తన భర్తతో కలిసి ఎన్నో దేశాల్లో సేవచేసింది. ఎరికా ఇలా చెప్పింది, “వేరే భాష మాట్లాడేవాళ్లకు మంచివార్త ప్రకటించిన అనుభవాలు, దొరికిన స్నేహితులు మా జీవితాల్ని సుసంపన్నం చేశాయి.” ఎరికా ఇప్పటికీ డాక్టరుగా పనిచేస్తోంది. కానీ ఎక్కువ సమయాన్ని ప్రజలకు యెహోవా గురించి నేర్పించడానికీ, తోటి సహోదరసహోదరీలకు సహాయం చేయడానికీ ఉపయోగిస్తోంది. అదే తనకు “నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని” ఇస్తోందని ఆమె చెప్తోంది.
పరలోక ధనాన్ని సంపాదిస్తున్నారా లేదా భూమ్మీద వస్తుసంపదలనా?
9. డబ్బును ప్రేమించేవాళ్లు ఎందుకు సంతోషంగా ఉండలేరు?
9 చివరిరోజుల్లో “డబ్బును ప్రేమించేవాళ్లు” ఉంటారని పౌలు రాశాడు. కొన్నేళ్ల క్రితం ఐర్లాండ్‌లోని ఒక పయినీరు సహోదరుడు ఒకతనితో దేవుని గురించి మాట్లాడాడు. అప్పుడతను పర్సులో నుండి ఒక నోటును తీసి అతనికి చూపించి, “ఇదే నా దేవుడు” అని అన్నాడు. నిజమే ప్రజలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చాలామంది డబ్బునే దేవునిగా భావిస్తున్నారు. వాళ్లు డబ్బును, దానివల్ల పొందగలిగే వాటిని ప్రేమిస్తున్నారు. కానీ బైబిలు ఇలా హెచ్చరిస్తోంది, ‘వెండిని ప్రేమించేవాళ్లు వెండితో, సిరిసంపదల్ని ప్రేమించేవాళ్లు ఆదాయంతో ఎప్పటికీ తృప్తిపడరు.’ (ప్రసం. 5:10, NW) అవును, డబ్బును ప్రేమించేవాళ్లకు ఎంత డబ్బు ఉన్నా తృప్తి ఉండదు. ఇంకా కావాలని ఆశపడతారు, దాన్ని సంపాదించడం కోసం జీవితమంతా కష్టపడతారు. దానివల్ల ఎన్నో బాధలుపడతారు.—1 తిమో. 6:9, 10.
10. ఐశ్వర్యం, పేదరికం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
10 మనందరికీ డబ్బు అవసరమనేది వాస్తవమే. అది మనకు కొంతమేరకు భద్రతనిస్తుంది. (ప్రసం. 7:12) కానీ, మన కనీస అవసరాలకు మాత్రమే సరిపడా డబ్బు ఉంటే సంతోషంగా ఉండగలమా? ఉండగలం. (ప్రసంగి 5:12 చదవండి.) యాకె కొడుకైన ఆగూరు ఇలా రాశాడు, “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.” ఆయన పేదరికాన్ని అనుభవించాలని ఎందుకు అనుకోవట్లేదో మనం అర్థంచేసుకోగలం. పేదరికం వల్ల దొంగతనం చేయాలనే కోరిక తనలో కలగవచ్చు, అది దేవుని పేరుకు మచ్చ తీసుకొస్తుందని ఆయన చెప్పాడు. మరి ఆయన ఐశ్వర్యాన్ని కూడా ఎందుకు వద్దనుకున్నాడు? దానికి జవాబు ఆయనిలా చెప్పాడు, “ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి—యెహోవా యెవడని అందునేమో.” (సామె. 30:8, 9) దేవునికి బదులు సిరిసంపదల్ని నమ్మేవాళ్లు మీకు తెలిసేవుంటారు.
11. డబ్బు గురించి యేసు ఏమి చెప్పాడు?
11 డబ్బును ప్రేమించేవాళ్లు దేవున్ని సంతోషపెట్టలేరు. యేసు ఇలా చెప్పాడు, “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు, లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ డబ్బుకూ దాసులుగా ఉండలేరు.” ఆయనింకా ఇలా చెప్పాడు, “భూమ్మీద నీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపు; ఇక్కడ చిమ్మెట, తుప్పు వాటిని తినేస్తాయి; దొంగలు చొరబడి దొంగతనం చేస్తారు. దానికి బదులు, పరలోకంలో నీ కోసం సంపదలు కూడబెట్టుకో; అక్కడ చిమ్మెటగానీ, తుప్పుగానీ వాటిని తినవు; దొంగలు చొరబడి దొంగతనం చేయరు.”—మత్త. 6:19, 20, 24.
12. సాదాసీదాగా జీవించడం వల్ల దేవుని సేవ చేయగలమని అనడానికి ఒక అనుభవం చెప్పండి.
12 చాలామంది యెహోవా సేవకులు సాదా సీదాగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా జీవించడం వల్ల యెహోవా సేవచేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని, ఎక్కువ సంతోషంగా కూడా ఉండగలరని వాళ్లు గుర్తించారు. అమెరికాలో ఉంటున్న జాక్, భార్యతో కలిసి పయినీరు సేవ చేయడం కోసం తన పెద్ద ఇంటిని, వ్యాపారాన్ని అమ్మేశాడు. ఆయనిలా వివరిస్తున్నాడు, “మా అందమైన ఇంటిని, స్థలాన్ని అమ్మేయడం బాధనిపించింది.” కానీ ఎన్నో ఏళ్లపాటు పని ఒత్తిడి వల్ల ఇంటికి చిరాకుగా వచ్చేవాడని ఆయన చెప్పాడు. ఆయనింకా ఇలా అన్నాడు, “క్రమపయినీరుగా సేవ చేసే నా భార్య ఎప్పుడు చూసినా సంతోషంగా కనిపించేది. కారణం అడిగితే, ‘ఎవ్వరికీ దొరకని మంచి బాస్ నాకు దొరికాడు’ అని చెప్పేది. ఇప్పుడు నేను కూడా పయినీరు సేవ చేస్తున్నాను. కాబట్టి మా ఇద్దరికీ బాస్ ఒక్కరే, ఆయనే యెహోవా.”
13. డబ్బుకు ఏ స్థానం ఇస్తున్నామో ఎలా పరిశీలించుకోవచ్చు?
13 డబ్బుకు ఏ స్థానం ఇస్తున్నామో పరిశీలించుకునేటప్పుడు నిజాయితీగా ఇలా ప్రశ్నించుకోవాలి: ‘డబ్బు గురించి బైబిలు చెప్పే విషయాల్ని నేను నిజంగా నమ్ముతున్నానని నా జీవన విధానం చూపిస్తోందా? డబ్బు సంపాదించడానికే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నానా? యెహోవాతో, ఇతరులతో నాకున్న సంబంధం కన్నా వస్తుసంపదలకే ఎక్కువ విలువ ఇస్తున్నానా? నా అవసరాలను యెహోవా తీరుస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానా?’ తనపై నమ్మకం ఉంచేవాళ్లను యోహోవా ఎన్నడూ విడిచిపెట్టడు.—మత్త. 6:33.
యెహోవాను ప్రేమిస్తున్నామా? సుఖాల్ని ప్రేమిస్తున్నామా?
14. సుఖాల్ని ప్రేమించే విషయంలో బైబిలు ఏమి చెప్తోంది?
14 చివరిరోజుల్లో “సుఖాల్ని ప్రేమించేవాళ్లు” ఉంటారని కూడా బైబిలు ముందే చెప్పింది. మనల్ని మనం కొంతమేరకు ప్రేమించుకోవడం, కనీస అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించడం ఎలాగైతే తప్పు కాదో; కొంతమేరకు జీవితాన్ని ఆనందించడంలో కూడా తప్పులేదు. కొంతమంది మాత్రం సుఖాలకు పూర్తిగా దూరంగా ఉండాలంటారు, కానీ దేవుడు అలా చెప్పట్లేదు. “నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము” అని దేవుని నమ్మకమైన సేవకుల్ని బైబిలు ప్రోత్సహిస్తోంది.—ప్రసం. 9:7.
15. రెండవ తిమోతి 3:4 ఎలాంటి ప్రజల గురించి మాట్లాడుతోంది?
15 అయితే 2 తిమోతి 3:4, సుఖాల్ని ప్రేమిస్తూ తమ జీవితంలో దేవునికి చోటివ్వనివాళ్ల గురించి మాట్లాడుతోంది. ఆ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ప్రజలు దేవుని కన్నా సుఖాల్ని ప్రేమిస్తారని చెప్పట్లేదు. ఒకవేళ అలా చెప్పుంటే, వాళ్లకు దేవుని మీద ఏదో కాస్త ప్రేమ ఉంటుందని అనుకోవచ్చు. కానీ వాళ్లు “దేవుణ్ణి కాకుండా” సుఖాల్ని ప్రేమిస్తారని ఆ వచనం చెప్తోంది. ఈ వచనం గురించి ఒక విద్వాంసుడు ఏమని రాశాడంటే, ‘ఆ వచనానికి అర్థం, వాళ్లకు దేవుని మీద కూడా కొంచెం ప్రేమ ఉంటుందని కాదు. వాళ్లకు దేవుని మీద ఏమాత్రం ప్రేమ ఉండదని దానర్థం.’ సుఖాల్ని ప్రేమించేవాళ్లకు ఈ వచనం ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక లాంటిది. ఎందుకంటే అలాంటివాళ్లు జీవితంలోని సుఖాలవల్ల ‘పక్కదారి పడతారని’ బైబిలు చెప్తోంది.—లూకా 8:14.
16, 17. సుఖాలకు యేసు తన జీవితంలో ఏ స్థానం ఇచ్చాడు?
16 సుఖాలకు మన జీవితంలో సరైన స్థానం ఎలా ఇవ్వవచ్చో యేసు మనకు నేర్పించాడు. యేసు విందుకు హాజరైన రెండు వేర్వేరు సందర్భాల గురించి బైబిల్లో ఉంది. (యోహా. 2:1-10; లూకా 5:29) పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యేసు అద్భుతం చేసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. మరో సందర్భంలో, తిని తాగుతున్నందుకు ప్రజలు తనను విమర్శించినప్పుడు, వాళ్ల ఆలోచన సరైనది కాదని యేసు స్పష్టంగా చెప్పాడు.—లూకా 7:33-36.
17 కానీ సుఖాలకు యేసు తన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇవ్వలేదు. యెహోవాకు మొదటి స్థానమిచ్చి, ఇతరులకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషిచేశాడు. మానవజాతిని కాపాడేందుకు నొప్పిని దిగమింగుతూ హింసాకొయ్యపై మరణించడానికి సిద్ధపడ్డాడు. తనను అనుసరించాలని కోరుకునేవాళ్లకు యేసు ఇలా చెప్పాడు: “మీరు నా శిష్యులనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ గురించి అబద్ధాలు చెప్తూ మీకు వ్యతిరేకంగా అన్నిరకాల చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఎంతో ఆనందించండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందు ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారు.”—మత్త. 5:11, 12.
18. సుఖాలకు మన జీవితంలో ఏ స్థానమిస్తున్నామో పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?
18 సుఖాలకు మన జీవితంలో ఏ స్థానమిస్తున్నామో పరిశీలించుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? మనం ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు: ‘మీటింగ్స్, ప్రీచింగ్ కన్నా వినోదమే నాకు ముఖ్యమా? దేవుని సేవ చేయడం కోసం నాకిష్టమైన కొన్నిటిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానా? వినోదాన్ని ఎంచుకునేటప్పుడు, అది యెహోవాకు నచ్చుతుందో లేదో ఆలోచిస్తున్నానా?’ మనం దేవున్ని ప్రేమిస్తున్నాం, ఆయన్ను సంతోషపెట్టాలని కోరుకుంటాం. కాబట్టి తప్పని మనకు తెలిసిన వాటికే కాదు, దేవునికి నచ్చవేమోనని మనకు అనిపించిన వాటికి కూడా దూరంగా ఉంటాం.—మత్తయి 22:37, 38 చదవండి.
సంతోషానికి రహస్యం
19. ఎలాంటివాళ్లు ఎప్పటికీ సంతోషాన్ని పొందలేరు?
19 దాదాపు 6,000 ఏళ్లుగా మనుషుల కష్టాలకు కారణమైన సాతాను లోకం త్వరలో నాశనం అవుతుంది. ప్రస్తుతం లోకమంతా స్వార్థపరులతో, డబ్బును, సుఖాల్ని ప్రేమించేవాళ్లతో నిండిపోయింది. వాళ్లు ఎప్పుడూ తమకొచ్చే లాభం గురించే ఆలోచిస్తారు. తమ కోరికల్ని తీర్చుకోవడమే వాళ్లకు అన్నిటికన్నా ముఖ్యం. కానీ అలాంటివాళ్లు ఎప్పటికీ నిజమైన సంతోషాన్ని పొందలేరు. దానికి భిన్నంగా బైబిలు ఇలా చెప్తోంది, “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు.”—కీర్త. 146:5.
20. దేవునిపై ప్రేమ మీకెలా సంతోషాన్నిచ్చింది?
20 యెహోవా అంటే ఆయన సేవకులకు చెప్పలేనంత ఇష్టం. ప్రతీ సంవత్సరం ఎంతోమంది యెహోవా గురించి నేర్చుకుంటున్నారు, వాళ్లు కూడా ఆయన్ను ప్రేమిస్తున్నారు. దేవుని రాజ్యం పరిపాలిస్తోందని, అది మన ఊహకందని దీవెనల్ని త్వరలో మనకిస్తుందని దీన్నిబట్టి రుజువౌతుంది. యెహోవా కోరేవాటిని మనం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన్ను సంతోషపెట్టడంలోనే మనకు నిజమైన ఆనందం ఉంది. యెహోవాను ప్రేమించేవాళ్లు ఎల్లకాలం ఆనందంగా ఉంటారు. స్వార్థం వల్ల కలిగే కొన్ని చెడు లక్షణాల గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. యెహోవా సేవకుల్లో కనిపించే మంచి లక్షణాలకు అవి ఎలా భిన్నంగా ఉన్నాయో కూడా తెలుసుకుంటాం.