తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మియన్మార్‌లో
“కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని పంట యజమానిని వేడుకోండి.” (లూకా 10:2) సుమారు 2,000 సంవత్సరాల క్రితం యేసు చెప్పిన ఆ మాటలు నేడు మియన్మార్ పరిస్థితికి అద్దంపడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే, 550 లక్షల జనాభా ఉన్న మియన్మార్‌లో కేవలం 4,200 మంది ప్రచారకులే మంచివార్తను ప్రకటిస్తున్నారు.
ఆగ్నేయ ఆసియాలోని మియన్మార్‌లో కోయాల్సిన ఆధ్యాత్మిక పంట చాలా ఉంది. ఆ పనిలో పాల్గొనేలా, “పంట యజమాని” అయిన యెహోవా వేర్వేరు దేశాల్లో ఉన్న వందలమంది సహోదరసహోదరీల మనసుల్ని కదిలించాడు. సొంత దేశాన్ని విడిచిపెట్టి మియన్మార్‌కు రావడానికి వాళ్లను ఏది ప్రోత్సహించింది? దానివల్ల ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
“రండి, మాకు చాలామంది పయినీర్లు కావాలి!”
జపాన్‌లో ఉంటున్న కాజుహీరో అనే పయినీరు కొన్ని సంవత్సరాల క్రితం మూర్ఛ వచ్చి స్పృహ కోల్పోయినప్పుడు, ఆయన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ ఆయన్ని రెండు సంవత్సరాలపాటు కారు నడపొద్దని చెప్పాడు. దాంతో ఆయన అవాక్కయ్యాడు. ‘నాకు ఎంతో ఇష్టమైన పయినీరు సేవను నేనెలా కొనసాగించాలి?’ అని అనుకున్నాడు. ఆయన పట్టుదలగా ప్రార్థన చేస్తూ, పయినీరు సేవను కొనసాగించడానికి మార్గం చూపించమని యెహోవాను వేడుకున్నాడు.
కాజుహీరో ఇలా చెప్తున్నాడు, “ఒక నెల తర్వాత, నా పరిస్థితి గురించి మియన్మార్‌లో సేవచేస్తున్న నా స్నేహితునికి తెలిసింది. అతను నాకు ఫోన్ చేసి: ‘మియన్మార్‌లో ప్రజలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తారు. ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే, కారు నడపాల్సిన పని లేకుండానే నీ సేవను కొనసాగించవచ్చు’ అని చెప్పాడు. నా ఆరోగ్య పరిస్థితినిబట్టి మియన్మార్‌కు వెళ్లొచ్చో లేదోనని మా డాక్టర్‌ని అడిగాను. ఆశ్చర్యకరంగా మా డాక్టర్ ఇలా చెప్పాడు, ‘మెదడుకు సంబంధించిన ఒక వైద్య నిపుణుడు మియన్మార్ నుండి జపాన్‌కు వస్తున్నాడు. ఆయన్ని నీకు పరిచయం చేస్తాను. ఒకవేళ నీకు మళ్లీ మూర్ఛ వస్తే, ఆయన దగ్గరకు వెళ్లొచ్చు.’ డాక్టర్ చెప్పిన ఆ మాటల్ని యెహోవా నాకిచ్చిన జవాబుగా భావించాను.”
వెంటనే కాజుహీరో, మియన్మార్ బ్రాంచి కార్యాలయానికి ఒక ఈ-మెయిల్ పంపించాడు. ఆయనా, ఆయన భార్యా మియన్మార్‌లో పయినీర్లుగా సేవచేయడానికి ఇష్టపడుతున్నారని అందులో తెలియజేశాడు. ఐదు రోజులకే బ్రాంచి ఇలా జవాబిచ్చింది, “రండి, మాకు చాలామంది పయినీర్లు కావాలి!” కాజుహీరో, ఆయన భార్య మారి వాళ్ల కార్లను అమ్మేసి ఆ డబ్బుతో వీసాలు తీసుకొని, విమాన టికెట్లు కొనుక్కున్నారు. ప్రస్తుతం వాళ్లు మాండలేలో ఉన్న సంజ్ఞా భాష గుంపుతో కలిసి సంతోషంగా సేవచేస్తున్నారు. కాజుహీరో ఇలా అంటున్నాడు, “మాకు కీర్తన 37:5లో ఉన్న దేవుని వాగ్దానంపై మా విశ్వాసం మరింత బలపడినట్టు అనిపించింది.”
ఎదురైన అనుభవాన్ని బట్టి, ‘నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును’ అనియెహోవా మార్గాన్ని తెరుస్తాడు
2014లో మియన్మార్‌లో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. దానికి వేర్వేరు దేశాలనుండి ఎంతోమంది సహోదరసహోదరీలు వచ్చారు. అమెరికాకు చెందిన 35 ఏళ్ల మోనీక్ అనే సహోదరి కూడా ఆ సమావేశానికి వచ్చింది. ఆమె ఇలా చెప్తుంది, “సమావేశం నుండి ఇంటికి వెళ్లాక, నా జీవితంలో తర్వాత ఏం చేయాలనే దానిగురించి యెహోవాకు ప్రార్థన చేశాను. అలాగే నా ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడాను. నేను మియన్మార్ వెళ్లడమే సరైనదని అందరికీ అనిపించింది. అయితే కొంతకాలం తర్వాత, చాలాసార్లు ప్రార్థన చేశాక ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను.” దానికిగల కారణాన్ని మోనీక్ వివరించింది.
“యేసు తన శిష్యుల్ని ‘లెక్కలు వేసుకోమని’ ప్రోత్సహించాడు. అందుకే, ‘మియన్మార్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చు నేను భరించగలనా? అక్కడికి వెళ్లాక ఎక్కువ గంటలు ఉద్యోగం చేయకపోయినా నా ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించగలనా?’ అని ప్రశ్నించుకున్నాను.” అయితే ఆమె ఇలా ఒప్పుకుంది, “ఎంతో దూరంలో ఉన్న ఆ దేశానికి వెళ్లడానికి సరిపడా డబ్బు నా దగ్గర లేదని వెంటనే గ్రహించాను.” మరి ఆమె ఎలా వెళ్లగలిగింది?—లూకా 14:28.
మోనీక్ ఇలా చెప్తుంది, “ఒకరోజు మా యజమానురాలు తనని కలవమని నాకు చెప్పింది. నన్ను ఉద్యోగం నుండి తీసేస్తారేమోనని కంగారుపడ్డాను. కానీ, ఆమె నా పనిని మెచ్చుకుని, బోనస్ ఇవ్వబోతున్నట్లు చెప్పింది. దాంతో, నా ఖర్చులన్నిటికీ సరిపోయేంత డబ్బు సమకూరింది!”
2014 డిసెంబరు నుండి మోనీక్ మియన్మార్‌లో సేవచేస్తోంది. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేస్తున్నందుకు ఆమెకెలా అనిపిస్తుంది? ఆమె ఇలా చెప్తుంది, “ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మూడు బైబిలు స్టడీలు చేస్తున్నాను. వాళ్లలో ఒకామెకు 67 ఏళ్లు. ఆమె నన్నెప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుంది, ఆప్యాయంగా కౌగలించుకుంటుంది. దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నప్పుడు ఆమె కంటతడి పెట్టుకుంది. ఆమె ఇలా అంది, ‘నా జీవితంలో మొట్టమొదటిసారి దేవుని పేరు యెహోవా అని విన్నాను. నీ వయసు నా వయసులో సగం ఉంది, కానీ నేను ఇంతవరకు నేర్చుకోని అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్పించావు.’ ఆ మాటలకు నాకు కూడా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంటుంది.” ఈమధ్యే, మోనీక్‌కు రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు వెళ్లే గొప్ప అవకాశం దొరికింది.
2013 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకంలో మియన్మార్ గురించి వచ్చిన సమాచారాన్ని చదివి కూడా కొంతమంది ఈ దేశానికి వచ్చారు. 30 ఏళ్లు దాటిన లీ అనే సహోదరి ఒకప్పుడు ఆగ్నేయ ఆసియాలో ఉండేది. ఆమె పూర్తికాలం ఉద్యోగం చేసేది, కానీ వార్షిక పుస్తకంలో వచ్చిన సమాచారం చదివినప్పుడు మియన్మార్‌కు వెళ్లాలనే ఆలోచన ఆమెకు కలిగింది. ఆమె ఇలా చెప్తుంది, “2014లో యాంగన్‌లో జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరైనప్పుడు, మియన్మార్‌లో అవసరం ఎక్కువున్న చైనీస్ క్షేత్రంలో సేవచేస్తున్న ఒక జంటను కలిశాను. నాకు చైనీస్ భాష వచ్చు కాబట్టి, మియన్మార్‌లో ఉన్న చైనీస్ గుంపుకు మద్దతివ్వడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. దాంతో నేను, మోనీక్‌తో కలిసి మాండలే వెళ్లాను. అక్కడ మాకు ఒకే స్కూల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం దొరికింది, మేం ఉండడానికి దగ్గర్లోనే ఒక అపార్ట్‌మెంట్ కూడా దొరికింది. ఆ విధంగా యెహోవా మమ్మల్ని దీవించాడు. వేడి వాతావరణం, కొన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ నా సేవను ఆనందిస్తున్నాను. మియన్మార్‌లో ప్రజలు సాదాసీదాగా జీవిస్తారు, మర్యాదగా ఉంటారు, మంచివార్త వినడానికి సమయమిస్తారు. యెహోవా తన పనిని ఎలా త్వరపెడుతున్నాడో చూడడం చాలా ఆసక్తిగా ఉంది. నేను మాండలేలో సేవ చేయాలనేదే యెహోవా చిత్తమని బలంగా నమ్ముతున్నాను.”
యెహోవా ప్రార్థనలను వింటాడు
అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లిన చాలామంది ప్రార్థనకు ఉన్న శక్తిని గుర్తించారు. 37 ఏళ్ల జుంపే, 35 ఏళ్ల ఆయన భార్య నావో ఉదాహరణే తీసుకోండి. జపాన్‌లోని సంజ్ఞా భాష సంఘంలో సేవచేస్తున్న ఆ జంట మియన్మార్‌కు వచ్చారు. ఎందుకు? జుంపే ఇలా చెప్తున్నాడు, “అవసరం ఎక్కువున్న వేరే
దేశంలో సేవ చేయాలనే లక్ష్యం నాకూ, నా భార్యకూ ఎప్పటినుండో ఉండేది. జపాన్‌లోని సంజ్ఞా భాషా సంఘంలో సేవచేస్తున్న ఒక సహోదరుడు మియన్మార్‌కు వెళ్లాడు. మా దగ్గర కొంత డబ్బే ఉన్నప్పటికీ, 2010 మే నెలలో మేము కూడా అక్కడికి వెళ్లాం. మియన్మార్‌లోని సహోదరసహోదరీలు మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు.” మియన్మార్‌లోని సంజ్ఞా భాషా క్షేత్రంలో సేవచేస్తున్నందుకు జుంపేకు ఎలా అనిపిస్తుంది? ఆయనిలా చెప్పాడు, “ఇక్కడి ప్రజలకు చాలా ఆసక్తి ఉంది. సంజ్ఞా భాషలో వీడియోలు చూపించినప్పుడు, బధిరులైన ఇంటివ్యక్తులు ఆశ్చర్యపోయారు. ఇక్కడికి వచ్చి సేవ చేయాలని మేం తీసుకున్న నిర్ణయాన్నిబట్టి చాలా సంతోషిస్తున్నాం.”జుంపే, నావో ఖర్చులను ఎలా భరించుకోగలిగారు? “మూడు సంవత్సరాల తర్వాత, మా దగ్గరున్న డబ్బంతా అయిపోవచ్చింది. దాంతో ఆ తర్వాతి సంవత్సరం అద్దె కట్టడానికి కావాల్సిన డబ్బు లేకుండా పోయింది. నేనూ, నా భార్యా పట్టుదలగా ప్రార్థించాం. అనుకోకుండా, బ్రాంచి నుండి మాకో ఉత్తరం వచ్చింది. మమ్మల్ని తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా నియమిస్తున్నట్లు అందులో ఉంది. మేం యెహోవా మీద నమ్మకం ఉంచాం కాబట్టి ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా ప్రతీ అవసరాన్ని తీరుస్తూ వచ్చాడు” అని వాళ్లు చెప్పారు. ఈమధ్యే జుంపే, నావో రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు కూడా హాజరయ్యారు.
యెహోవా ఎంతోమందిని పురికొల్పుతున్నాడు
ఇటలీకి చెందిన 43 ఏళ్ల సీమోనే అనే సహోదరుడు అలాగే న్యూజిలాండ్‌కు చెందిన 37 ఏళ్ల ఆన అనే ఆయన భార్య మియన్మార్‌కు వచ్చేలా ఏది వాళ్లను ప్రోత్సహించింది? “2013 వార్షిక పుస్తకంలో మియన్మార్ గురించి వచ్చిన సమాచారం” తనను ప్రోత్సహించిందని ఆన చెప్తుంది. సీమోనే ఇలా చెప్తున్నాడు, “మియన్మార్‌లో ఉండడం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతోంది. నేను యెహోవా సేవను ఎక్కువ చేయగలుగుతున్నాను. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవా చూపించే శ్రద్ధను రుచిచూడడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.” (కీర్త. 121:5) ఆన ఇలా చెప్తుంది, “ఇంతకుముందుకన్నా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేం సాదాసీదాగా జీవిస్తున్నాం. నేను నా భర్తతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను, దాంతో మేం మరింత దగ్గరయ్యాం. మమ్మల్ని ప్రేమించే కొత్త స్నేహితులు కూడా దొరికారు. ఇక్కడి ప్రజలకు యెహోవాసాక్షుల పట్ల వివక్షలేదు, పైగా క్షేత్రంలోని వాళ్లు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.” కొన్ని ఉదాహరణలు చూడండి.
ఆన ఇలా చెప్తుంది, “ఒకరోజు నేను మార్కెట్లో యూనివర్సిటీలో చదువుతున్న ఒక అమ్మాయికి ప్రీచింగ్ చేశాను, పునర్దర్శనం కూడా ఏర్పాటు చేసుకున్నాను. నేను ఆమెను మళ్లీ కలవడానికి వెళ్లినప్పుడు, ఆమె తన స్నేహితురాలిని కూడా పిలిచింది. మరోసారి వెళ్లినప్పుడు, కొంతమందిని పిలిచింది. ఆ తర్వాత ఇంకొంతమందిని పిలిచింది. వాళ్లలో ఐదుగురికి ఇప్పుడు స్టడీ చేస్తున్నాను.” సీమోనే ఇలా చెప్తున్నాడు, “ఈ క్షేత్రంలోని ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు, వాళ్లకు కుతూహలం ఎక్కువ. చాలామంది సత్యంపట్ల ఆసక్తి చూపించారు. కానీ వాళ్లందర్నీ కలవడానికి మాకు సమయం సరిపోవట్లేదు.”
మియన్మార్‌కు వెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? జపాన్‌కు చెందిన మీజూహో ఇలా చెప్తుంది, “నాకూ, నా భర్త సాచీవోకూ అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయాలనే కోరిక ఎప్పుడూ ఉండేది. కానీ ఎక్కడకి వెళ్లాలి? 2013 వార్షిక పుస్తకంలో మియన్మార్ గురించి చదివాక, దానిలో
ఉన్న అనుభవాలు మా హృదయాన్ని తాకాయి. అప్పుడు, మియన్మార్‌కు వెళ్లి సేవచేయడం గురించి ఆలోచించాం.” సాచీవో ఇలా చెప్తున్నాడు, “ఇక్కడి ముఖ్య నగరమైన యాంగోన్‌కు వచ్చి ఒక వారంపాటు ఉండి, ఈ దేశం ఎలా ఉంటుందో వేగు చూడాలని నిర్ణయించుకున్నాం. ఆ చిన్న ట్రిప్ తర్వాత ఇక్కడికి రావాలని తీర్మానించుకోగలిగాం.”ఈ పిలుపుకు మీరు స్పందిస్తారా?
ఆస్ట్రేలియాకు చెందిన రాడ్నీ, జేన్ అనే జంట వాళ్ల పిల్లలైన జోర్డన్, డానికతో కలిసి 2010 నుండి మియన్మార్‌లో సేవచేస్తున్నారు. రాడ్నీ ఇలా చెప్తున్నాడు, “ఇక్కడి ప్రజలు సత్యం కోసం తపించిపోవడం చూసి మేం చలించిపోయాం. మియన్మార్ లాంటి ప్రాంతంలో సేవచేయడానికి ప్రయత్నించమని ఇతర కుటుంబాల్ని కూడా నేను ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను.” ఎందుకు? “ఇక్కడికి రావడంవల్ల మా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎంత ప్రయోజనం పొందిందో మాటల్లో చెప్పలేను. చాలామంది యౌవనులు ఫోన్‌లతో, కార్లతో, ఉద్యోగాలతో మరితర వాటితో బిజీగా గడుపుతున్నారు. కానీ మా పిల్లలు పరిచర్యలో ఉపయోగించడానికి కొత్త భాషను నేర్చుకోవడంలో బిజీగా ఉన్నారు. బైబిలు గురించి అంతగా తెలియనివాళ్లు కలిసినప్పుడు వాళ్లను ఆలోచింపజేసేలా ఎలా మాట్లాడాలో, స్థానిక సంఘంలో వ్యాఖ్యానాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అంతేకాదు మరితర ఆసక్తికరమైన ఆధ్యాత్మిక పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు.”
అమెరికాకు చెందిన ఆలివర్ అనే 37 ఏళ్ల సహోదరుడు అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయమని ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. దానికిగల కారణాన్ని వివరిస్తూ ఇలా అంటున్నాడు, “సౌకర్యవంతమైన జీవితాన్ని, బాగా పరిచయమున్న పరిసరాల్ని వదిలిపెట్టి యెహోవా సేవచేయడం కోసం ఇక్కడికి రావడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందాను. నా ఇంటి నుండి దూరంగా రావడంవల్ల, ఎలాంటి పరిస్థితుల్లోనైనా యెహోవా మీద నమ్మకం, విశ్వాసం ఉంచడం నేర్చుకున్నాను. ముందెప్పుడూ పరిచయంలేని సహోదరులతో నేను పనిచేస్తున్నాను. మనందరికీ ఒకే నమ్మకాలు ఉన్నాయి కాబట్టి అది సాధ్యమైంది. కేవలం యెహోవా సంస్థలోనే ఇలాంటిది చూడగలం.” ప్రస్తుతం ఆలివర్ ఆయన భార్య ఆనతో కలిసి చైనీస్ భాషా క్షేత్రంలో ఉత్సాహంగా సేవచేస్తున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన 52 ఏళ్ల ట్రేజెల్ అనే సహోదరి 2004 నుండి మియన్మార్‌లో సేవచేస్తోంది. ఆమె ఇలా చెప్తుంది, “తమ పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయమని నేను ఇతరుల్ని ప్రోత్సహిస్తాను. మనకు సేవచేయాలనే కోరిక ఉంటే, యెహోవా మన ప్రయత్నాలను దీవిస్తాడని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా జీవితం ఇంత బాగుంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఫలవంతమైన, సంతృప్తికరమైన జీవితం మరెక్కడా దొరకదు.”
మియన్మార్‌లో సేవ చేస్తున్నవాళ్లు హృదయపూర్వకంగా చెప్పిన ఆ మాటల్నిబట్టి, ఇంతవరకు సాక్ష్యమివ్వని ప్రాంతాల్లో సేవ చేయాలనే ప్రోత్సాహం మీకు కలగడం లేదా? అవును, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేస్తున్నవాళ్లు, “దయచేసి, మియన్మార్‌కు వచ్చి మాకు సహాయం చేయండి” అని పిలుస్తున్నారు.