పాఠకుల ప్రశ్న
వివాహజతను వెతకడానికి యెహోవాసాక్షులు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చా?
▪ వివాహం చేసుకునే జంట సంతోషంగా ఉండాలని, చిరకాలం నిలిచే దగ్గరి సంబంధాన్ని కలిగివుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త. 19:4-6) మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే ఒక మంచి వివాహజతను ఎలా కనుగొనవచ్చు? యెహోవా మన సృష్టికర్త కాబట్టి మన వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనకు ఇచ్చిన సూత్రాల్ని పాటిస్తే మనం నిజంగా సంతోషంగా ఉంటాం. ఆ సూత్రాల్లో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
మొదటిగా, మన గురించి చెప్పబడిన ఈ విషయాన్ని అర్థంచేసుకోవాలి: “హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది.” (యిర్మీ. 17:9) వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు వ్యక్తులు కలిసి సమయం గడుపుతున్నప్పుడు, త్వరగా ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వాళ్లకు కష్టమౌతుంది. వాళ్లు ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి ఏర్పడిన భావాలవల్లే వివాహం చేసుకోవాలనుకుంటే, ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. (సామె. 28:26) అందుకే ఎదుటివ్యక్తి నిజంగా ఎలాంటివాళ్లో తెలుసుకోకుండా వాళ్ల మీద కలిగిన బలమైన భావాల్ని మొదట్లోనే చెప్పేయడం లేదా మాటివ్వడం తెలివైన పని కాదు.
సామెతలు 22:3 ఇలా చెప్తుంది: “వివేకం గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు, అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు అనుభవిస్తాడు.” మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు? విచారకరంగా, కొంతమంది ఆన్‌లైన్‌లో తెలియనివాళ్లను కలిసి వాళ్లతో పరిచయం పెంచుకున్న తర్వాత, ఆ వ్యక్తి మోసం చేశాడని తెలుసుకున్నారు. మోసగాళ్లు నకిలీ అకౌంట్లను తయారుచేసి, అమాయకపు ప్రజల నుండి డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు యెహోవాసాక్షులని చెప్పుకున్నారు.
ఇంకొక ప్రమాదాన్ని పరిశీలించండి. ఎవరు ఎవరికి సరిపోతారో చెప్పడానికి కొన్ని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తాయి. అయితే అలాంటి పద్ధతుల వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. ఎవరు మంచి వివాహజతగా ఉండగలరనే ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు, మనుషులు తయారుచేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల మీద ఆధారపడడం తెలివైన పని అనిపించుకోదు. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు బైబిలు సూత్రాలంత నమ్మదగినవిగా ఎప్పటికీ ఉండలేవు.—సామె. 1:7; 3:5-7.
సామెతలు 14:15 లో ఉన్న ఒక సూత్రం ఇలా చెప్తుంది: “అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు, వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.” ఒక వ్యక్తి మీకు మంచి వివాహజతగా ఉండగలరని నిర్ణయించుకునే ముందు మీరు ఆ వ్యక్తి గురించి బాగా తెలుసుకోవాలి. కానీ ఆన్‌లైన్‌లో కలవడంవల్ల అలా తెలుసుకోవడం కష్టమవ్వవచ్చు. ఒకరి వివరాలు ఒకరికి తెలిసినప్పటికీ, ఒకరితో ఒకరు ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు మాట్లాడుకున్నప్పటికీ, వాళ్ల గురించి మీకు తెలుసని మీరు నిజంగా చెప్పగలరా? తమకు సరిపోయే వివాహజత దొరికారని అనుకున్న కొంతమంది, తీరా వాళ్లను నేరుగా చూసి అవాక్కయ్యారు.
కీర్తనకర్త ఇలా అన్నాడు: “మోసగాళ్లతో నేను సహవసించను, తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.” (కీర్త. 26:4) మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తమ గురించిన సమాచారాన్ని నింపుతున్నప్పుడు, ఇతరులకు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి తమ గురించి తప్పుడు సమాచారాన్ని నింపడం సర్వసాధారణమని చాలామంది ప్రజలు అనుకుంటారు. వాళ్లకున్న చెడు లక్షణాల్ని దాయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ఇతరులకు మెసేజ్‌లు పంపిస్తున్నప్పుడు వాళ్లకేమీ చెడు లక్షణాలు లేనట్లు ప్రవర్తించవచ్చు. ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం ప్రాముఖ్యం: కొంతమంది బహుశా తాము యెహోవాసాక్షులమని చెప్పుకున్నా, వాళ్లు నిజంగా బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులేనా? వాళ్లకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉందా? వాళ్ల సంఘంలో వాళ్లకు మంచి పేరుందా? వాళ్లు ఆదర్శవంతులా లేదా ‘చెడ్డ సహవాసులా’? (1 కొరిం. 15:33; 2 తిమో. 2:20, 21) మళ్లీ వివాహం చేసుకోవడానికి వాళ్లు లేఖనాధారంగా అర్హులేనా? ఈ ప్రశ్నలకు జవాబులు మీరు తెలుసుకోవాలి. కానీ ఆ వ్యక్తి గురించి తెలిసిన సాక్షులతో మాట్లాడకుండా వివరాలు తెలుసుకోవడం కష్టం కావచ్చు. (సామె. 15:22) నిజానికి ఒక నమ్మకమైన యెహోవా సేవకుడు అవిశ్వాసిని వివాహం చేసుకోవాలని గానీ వాళ్లతో జతకట్టాలని గానీ అస్సలు అనుకోడు.—2 కొరిం. 6:14; 1 కొరిం. 7:39.
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను ఉపయోగించడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి సరైన వివాహజత కోసం వెతకడానికి, వాళ్ల గురించి తెలుసుకోవడానికి ఇంకా మంచి మార్గాలు ఉన్నాయి. మరైతే, సరైన వివాహజతని ఎక్కడ కనుగొనవచ్చు? సాధారణంగా యెహోవాసాక్షులు సంఘ కూటాలకు, సమావేశాలకు, అలాగే మరికొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వీలౌతుంది.
కోవిడ్-19 ఉన్నలాంటి పరిస్థితుల్లో నేరుగా కలుసుకోవడం సాధ్యం కానప్పుడు, మనం సంఘ కూటాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కలుస్తున్నాం. అలాంటి కూటాల్లో పెళ్లికాని ఇతర సాక్షుల గురించి తెలుసుకోవడానికి వీలౌతుంది. అక్కడ మీరు వాళ్లెలా ప్రసంగిస్తున్నారో, కామెంట్స్ ద్వారా వాళ్ల విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారో చూడొచ్చు. (1 తిమో. 6:11, 12) కూటాలు ముగిశాక ఒకరితో ఒకరు బ్రేకౌట్ రూమ్‌లో మాట్లాడుకోవచ్చు. కొంతమంది సాక్షులు సరదాగా గడపడానికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కలుసుకున్నప్పుడు, మీరు ఇష్టపడే వ్యక్తి ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారో గమనించవచ్చు. ఆ విధంగా, అతనికి లేదా ఆమెకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. (1 పేతు. 3:4) మీరు అవతలి వ్యక్తి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటుండగా, వాళ్లకు కూడా మీలాంటి లక్ష్యాలు ఉన్నాయో లేవో అలాగే మీరు ఒకరికొకరు సరిపోతారో లేదో తెలుసుకోవచ్చు.
పెళ్లికాని వ్యక్తులు వివాహజత కోసం బైబిలు సూత్రాలకు అనుగుణంగా ఉన్న మార్గాల్లో వెదికినప్పుడు, వాళ్ల వివాహ జీవితం ఎక్కువ సంతోషంగా ఉంటుంది. వాళ్ల జీవితం సామెతలులోని ఈ మాటలకు తగ్గట్టు ఉంటుంది: ‘మంచి భార్యను పొందినవాడు [లేదా భర్తను పొందిన స్త్రీ] అమూల్యమైనదాన్ని పొందాడు [లేదా పొందింది], అతను [లేదా ఆమె] యెహోవా అనుగ్రహం పొందుతాడు [లేదా పొందుతుంది].’—సామె. 18:22.