కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 27

యెహోవాలా సహనం చూపించండి

యెహోవాలా సహనం చూపించండి

“మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.”—లూకా 21:19.

పాట 114 ఓర్పు చూపించండి

ఈ ఆర్టికల్‌లో . . . a

1-2. యెషయా 65:16, 17 లోని యెహోవా మాటలు, మనం సహనం చూపిస్తూ ఉండడానికి ఎలా సహాయం చేస్తాయి?

 “పట్టుదలగా ముందుకు సాగండి!” అనే ఆసక్తికరమైన అంశం మీద 2017 ప్రాదేశిక సమావేశం జరిగింది. మనకు ఎదురయ్యే సమస్యలను ఎలా తట్టుకోవచ్చో ఆ కార్యక్రమంలో నేర్చుకున్నాం. ఆ సమావేశం అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా మనం ఇంకా ఈ చెడ్డ లోకంలో ఓపికతో ముందుకు సాగుతున్నాం.

2 ఈ మధ్యకాలంలో మీరెలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీ కుటుంబ సభ్యుల్లో లేదా స్నేహితుల్లో ఎవరైనా చనిపోయారా? మీరు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్నారా? వృద్ధాప్యం వల్ల జీవితం భారంగా తయారైందా? ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయారా? దౌర్జన్యం లేదా హింసకు గురయ్యారా? కోవిడ్‌-19 మహమ్మారి లేదా అలాంటి వ్యాధుల బారినపడ్డారా? ఈ సమస్యలన్నీ గతించిపోయిన సంగతులుగా ఉండే రోజులు కోసం, అలాగే పాత సంగతులు గుర్తుకురాని, అవి ఇక ఎప్పటికీ జరగని రోజుల కోసం మనం ఎదురుచూస్తున్నాం.యెషయా 65:16, 17 చదవండి.

3. ఇప్పుడు మనమేం చేయాలి? ఎందుకు?

3 ప్రస్తుతం ఈ లోకంలో జీవించడం కష్టంగా ఉంది, అంతేకాదు ముందుముందు మనం ఇంకా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. (మత్త. 24:21) కాబట్టి మనం మరింత సహనం చూపించడం నేర్చుకుంటూ ఉండాలి. యేసు ఇలా అన్నాడు: “మీ సహనం వల్ల మీరు మీ ప్రాణాలు రక్షించుకుంటారు.” (లూకా 21:19) మనకున్నలాంటి సమస్యలనే ఇతరులు ఎలా తట్టుకోగల్గుతున్నారో ఆలోచించినప్పుడు, మనం కూడా మరింత సహనం చూపించగలుగుతాం.

4. సహనం చూపించడంలో గొప్ప ఆదర్శం యెహోవాయే అని మనం ఎలా చెప్పవచ్చు?

4 సహనం చూపించడంలో గొప్ప ఆదర్శం మన దేవుడైన యెహోవాయే. బహుశా మీకది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, దాని గురించి ఆలోచిస్తే మీకలా అనిపించదు. ఈ లోకం అపవాది చేతిలో ఉంది కాబట్టి సమస్యలతో నిండిపోయింది. ఈ సమస్యలన్నిటినీ ఇప్పటికిప్పుడు తీసేసే శక్తి యెహోవాకు ఉంది. కానీ అలా చేసే సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. (రోమా. 9:22) ఆ నియమిత సమయం వచ్చే వరకు మన దేవుడు సహిస్తూనే ఉంటాడు. యెహోవా సహనం చూపిస్తున్న తొమ్మిది విషయాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

యెహోవా వేటిని సహిస్తున్నాడు?

5. దేవుని పేరు ఎలా నిందించబడింది? దాని గురించి ఆలోచించినప్పుడు మీకెలా అనిపిస్తుంది?

5 తన పేరు మీద పడిన నింద. యెహోవాకు తన పేరంటే ఇష్టం. ప్రతీఒక్కరు దాన్ని గౌరవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (యెష. 42:8) కానీ గత ఆరు వేల సంవత్సరాలుగా ఆయన పేరు నిందించబడుతుంది. (కీర్త. 74:10, 18, 23) ఆదాముహవ్వలు సంతోషంగా ఉండడానికి కావాల్సిందేదో దక్కకుండా చేస్తున్నాడని అపవాది ఏదెను తోటలో దేవుణ్ణి నిందించినప్పుడు ఇది మొదలయ్యింది. (అపవాది అంటే “నిందలు వేసేవాడు” అని అర్థం.) (ఆది. 3:1-5) అప్పటినుండి మనుష్యులకు నిజంగా కావాల్సింది దక్కకుండా చేస్తున్నాడని యెహోవా నిందించబడుతూనే ఉన్నాడు. తన తండ్రి పేరు అగౌరవ పర్చబడుతున్నందుకు యేసు చింతించాడు. అందుకే తన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్త. 6:9.

6. తన సర్వాధిపత్యపు వివాదాంశాన్ని పరిష్కరించడానికి ముందు యెహోవా ఎందుకు చాలాకాలం గడిచేలా అనుమతించాడు?

6 తన సర్వాధిపత్యానికి ఎదురైన వ్యతిరేకత. పరలోకాన్ని, భూమిని పరిపాలించే హక్కు యెహోవాకు మాత్రమే ఉంది. ఆయన పరిపాలనా విధానమే అత్యుత్తమమైనది. (ప్రక. 4:11) కానీ దేవునికి ఆ హక్కు లేదని దేవదూతలు, మనుషులు అనుకునేలా అపవాది వాళ్లను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడు. యెహోవా సర్వాధిపత్యపు హక్కు గురించిన వివాదాంశం ఒక్క రోజులో తేలేదికాదు. అందుకే దేవుడు తెలివిగా, మనుషులు ఎక్కువకాలం పరిపాలించడానికి అనుమతించాడు. సృష్టికర్త సహాయం లేకుండా తమనుతాము పరిపాలించుకుంటే విజయం సాధించలేమని అర్థం చేసుకోవడానికే అలా చేశాడు. (యిర్మీ. 10:23) దేవుడు సహనం చూపించడం వల్ల ఆ వివాదాంశం పరిష్కరించబడుతుంది, ఇంకెప్పుడూ ఆయన పరిపాలనా హక్కు ప్రశ్నించబడదు. అప్పుడు యెహోవా పరిపాలనా విధానమే ఉత్తమమైనదని, ఆయన రాజ్యం మాత్రమే భూమ్మీద నిజమైన శాంతిభద్రతలను తేగలదని అందరూ తెలుసుకుంటారు.

7. యెహోవా మీద ఎవరు తిరుగుబాటు చేశారు? ఆయన వాళ్లను ఏం చేస్తాడు?

7 తన పిల్లల్లో కొంతమంది చేసిన తిరుగుబాటు. యెహోవా తన పిల్లలైన దేవదూతల్ని, మనుషుల్ని పరిపూర్ణంగా ఏ లోపం లేకుండా సృష్టించాడు. కానీ తర్వాత దేవదూతైన సాతాను యెహోవా మీద తిరుగుబాటు చేసి, పరిపూర్ణ మానవులైన ఆదాముహవ్వలు కూడా యెహోవాకు ఎదురుతిరిగేలా చేశాడు. (సాతాను అంటే “ఎదిరించేవాడు” అని అర్థం.) వాళ్లేకాదు ఇతర దేవదూతలు, మనుషులు కూడా ఆ తిరుగుబాటులో కలిశారు. (యూదా 6) ఆ తర్వాత, దేవుడు ఎంచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా ఆయన్ని విడిచిపెట్టి అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టారు. (యెష. 63:8, 10) అప్పుడు తనకు నమ్మకద్రోహం చేసినట్లు యెహోవా భావించాడు. అయినా ఆయన దాన్ని సహించాడు, అంతేకాదు తనకు తిరుగుబాటు చేసిన వాళ్లందరినీ నాశనం చేసే సమయం వచ్చే వరకు ఆయన సహిస్తూనే ఉంటాడు. అలా నాశనం చేసిన తర్వాత యెహోవా, ఆయనకు నమ్మకంగా ఉన్న సేవకులు ఈ వ్యవస్థలో ఉన్న దుష్టత్వాన్ని ఇక సహించాల్సిన అవసరం ఉండదు కాబట్టి సంతోషిస్తారు!

8-9. యెహోవా గురించి ఎలాంటి అబద్ధాలు చెప్పబడుతున్నాయి? వాటికి మనమెలా స్పందిస్తాం?

8 అపవాది చెప్పే అబద్ధాలు. యోబు అలాగే ఇతర నమ్మకమైన యెహోవా సేవకులు స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తున్నారని సాతాను నిందించాడు. (యోబు 1:8-11; 2:3-5) అపవాది ఇప్పటికీ మనుషుల్ని నిందిస్తూనే ఉన్నాడు. (ప్రక. 12:10) మనం కష్టాల్ని సహిస్తూ ఉండడం ద్వారా, యెహోవా మీద ప్రేమతో ఆయనకు నమ్మకంగా ఉండడం ద్వారా సాతాను అబద్ధికుడని నిరూపించవచ్చు. మనం సహనం చూపిస్తే యెహోవా యోబును ఆశీర్వదించినట్లే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు.—యాకో. 5:11.

9 యెహోవా క్రూరుడని, మనుషుల బాధలకు ఆయనే కారణమని సాతాను అబద్ధ మతనాయకుల్ని ఉపయోగించి చెప్తున్నాడు. పిల్లలు చనిపోయినప్పుడు పరలోకంలో ఇంకా ఎక్కువ దేవదూతల అవసరం ఉందని, అందుకే దేవుడు వాళ్లను తీసుకెళ్లాడని కూడా కొంతమంది అంటారు. అది యెహోవాను ఎంత అగౌరవ పరుస్తుందో కదా! కానీ ఆయన ఒక ప్రేమగల తండ్రి అని మనకు తెలుసు. మనం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినా మనం ఎప్పుడూ దేవున్ని నిందించం. బదులుగా, ఆయన ఏదోకరోజు అనారోగ్యాన్ని తీసేస్తాడని, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తాడని మనం నమ్ముతాం. వినే ప్రతీఒక్కరికి యెహోవా ఎంత ప్రేమగల దేవుడో మనం చెప్పవచ్చు. అప్పుడు తనను నిందించేవాడికి యెహోవా మంచి జవాబిస్తాడు.—సామె. 27:11.

10. కీర్తన 22:23, 24 వచనాలు, యెహోవా గురించి ఏం చెప్తున్నాయి?

10 తనకు ఇష్టమైన సేవకులు బాధపడడం. యెహోవా కనికరంగల దేవుడు. హింస, అనారోగ్యం లేదా అపరిపూర్ణత బట్టి మనం బాధపడడం చూసి ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు. (కీర్తన 22:23, 24 చదవండి.) యెహోవా మన బాధను అర్థం చేసుకుంటాడు, ఆయన దాన్ని తీసేయాలని అనుకుంటున్నాడు, తీసేస్తాడు కూడా. (నిర్గ. 3:7, 8 పోల్చండి; యెష. 63:9.) “[మన] కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ” ఇక ఉండని రోజు వస్తుంది.—ప్రక. 21:4.

11. చనిపోయిన తన నమ్మకమైన సేవకుల గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు?

11 తన స్నేహితులు చనిపోవడం వల్ల దూరమవ్వడం. చనిపోయిన నమ్మకమైన స్త్రీపురుషుల గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు? వాళ్లను మళ్లీ చూడాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు! (యోబు 14:15) తన స్నేహితుడైన అబ్రాహాము యెహోవాకు ఎంతగా గుర్తొస్తుంటాడో మీరు ఊహించగలరా? (యాకో. 2:23) మరి ఆయన “ముఖాముఖిగా” మాట్లాడిన మోషే సంగతి ఏంటి? (నిర్గ. 33:11) స్తుతిగీతాలు పాడిన దావీదు, అలాగే ఇతర కీర్తనకర్తల పాటల్ని వినాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నాడో కదా! (కీర్త. 104:33) యెహోవా స్నేహితులైన వీళ్లంతా చనిపోయినా ఆయన మాత్రం వాళ్లను మర్చిపోలేదు. (యెష. 49:15) వాళ్లకు సంబంధించిన ప్రతీ విషయం ఆయనకు గుర్తే. ఒకవిధంగా, “వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు.” (లూకా 20:38) ఒకరోజు వాళ్లందరినీ ఆయన తిరిగి బ్రతికించి వాళ్లు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనల్ని మళ్లీ వింటాడు, వాళ్ల ఆరాధనను అంగీకరిస్తాడు. ఒకవేళ మీ ప్రియమైనవాళ్లు ఎవరైనా చనిపోతే ఈ విషయాలు మీకు ఊరటనిస్తాయి.

12. ఈ చివరి రోజుల్లో ఏది యెహోవాను చాలా బాధపెడుతుంది?

12 చెడ్డ ప్రజలు ఇతరులకు చేసే హాని. ఏదెనులో మొదలైన తిరుగుబాటును పరిష్కరించే సమయం వచ్చేలోపు పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారౌతాయని యెహోవాకు తెలుసు. నేడు లోకంలో జరుగుతున్న దుష్టత్వం, హింస, అన్యాయాన్ని యెహోవా అసహ్యించుకుంటున్నాడు. నిస్సహాయుల పట్ల అంటే ఉదాహరణకు బలహీనులుగా, తమనుతాము కాపాడుకోలేని అనాథల పట్ల, విధవరాళ్ల పట్ల ఆయన ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు. (జెక. 7:9, 10) ముఖ్యంగా తన నమ్మకమైన సేవకులకు హాని చేసినప్పుడు, వాళ్లను జైల్లో వేసినప్పుడు యెహోవా చాలా బాధపడతాడు. తనతోపాటు సహిస్తున్న వాళ్లందరినీ యెహోవా ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో ఉండండి.

13. మనుషులు చేసే ఎలాంటి అనైతిక పనులను యెహోవా చూస్తున్నాడు? త్వరలోనే వాళ్లను ఏం చేస్తాడు?

13 మనుషులు నైతికంగా బాగా దిగజారడం. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుషులు అనైతిక పనులు చేసేలా వాళ్లను ప్రేరేపించడమంటే సాతానుకు ఇష్టం. నోవహు కాలంలో “భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉంది” అని చూసినప్పుడు, “తాను భూమ్మీద మనుషుల్ని చేసినందుకు యెహోవా విచారపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు.” (ఆది. 6:5, 6, అధస్సూచి, 11) అప్పటినుండి పరిస్థితులేమైనా మెరుగయ్యాయా? అస్సలు లేదు. వ్యతిరేకలింగ వ్యక్తుల మధ్య, ఒకేలింగ వ్యక్తుల మధ్య జరిగే అనైతిక పనులతోసహా, అన్నిరకాల లైంగిక పాపాలు సర్వసాధారణం అవ్వడం చూసి సాతాను ఎంత సంతోషిస్తాడో కదా! (ఎఫె. 4:18, 19) ముఖ్యంగా యెహోవాను ఆరాధించే ప్రజలు అలాంటి గంభీరమైన పాపం చేసినప్పుడు, సాతాను ఇంకా సంతోషిస్తాడు. యెహోవా ఓపిక నశించినప్పుడు, మారడానికి నిరాకరించే అన్నిరకాల అనైతిక ప్రజలను నాశనం చేస్తాడు. అలా అనైతిక ప్రవర్తనను తానెంత ద్వేషిస్తున్నాడో చూపిస్తాడు.

14. భూమిని, జంతువుల్ని మనుషులు ఏం చేస్తున్నారు?

14 తాను సృష్టించిన భూమిని మనుషులు పాడుచేయడం. “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని” తెచ్చుకుంటున్నాడు. దానితోపాటు యెహోవా తమకు అప్పగించిన భూమిని, జంతువుల్ని సరిగ్గా చూసుకోవడం లేదు. (ప్రసం. 8:9; ఆది. 1:28) మనుషులు చేస్తున్న పనుల వల్ల రానున్న కొన్ని సంవత్సరాల్లో 10 లక్షలకన్నా ఎక్కువ జాతులు అంతరించిపోవచ్చని కొందరు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ప్రకృతి గురించి ప్రజలు ఎందుకు ఆందోళన పడుతున్నారో దీన్నిబట్టి మనకు అర్థమౌతుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే, “భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం” చేసి యెహోవా ఈ భూమంతా అందమైన పరదైసుగా మారుస్తానని మాటిచ్చాడు.—ప్రక. 11:18; యెష. 35:1.

యెహోవా చూపించే సహనం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

15-16. యెహోవాలా సహనం చూపించడానికి మనల్ని ఏది కదిలిస్తుంది? ఒక ఉదాహరణ చెప్పండి.

15 తనకు బాధ కలుగుతున్నా, ఎన్నో వేల సంవత్సరాలుగా మన పరలోక తండ్రి సహిస్తున్న సమస్యలన్నిటి గురించి ఆలోచించండి. (“ యెహోవా వేటిని సహిస్తున్నాడంటే . . . ” అనే బాక్సు చూడండి.) యెహోవా ఏ సమయంలోనైనా ఈ దుష్ట వ్యవస్థను అంతం చేయగలడు. కానీ ఆయన చూపించిన ఓర్పు మనకు ఎంతో సహాయం చేసింది. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. తమకు పుట్టబోయే బిడ్డకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, బ్రతకడం కష్టమని, అలాగే చిన్న వయస్సులోనే చనిపోతాడని ఒక జంటకు తెలిసింది అనుకోండి. ఆ బిడ్డను పెంచడం కష్టమే అయినా తల్లిదండ్రులు బిడ్డ పుట్టినందుకు సంతోషిస్తారు. వాళ్లు ఆ బిడ్డను ప్రేమిస్తారు కాబట్టి, వీలైనంత మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఏ కష్టాన్నైనా సహిస్తారు.

16 అదేవిధంగా, ఆదాముహవ్వల నుండి వచ్చిన వాళ్లందరూ అపరిపూర్ణతతోనే పుట్టారు. అయినా యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు, వాళ్లపట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. (1 యోహా. 4:19) ఆ ఉదాహరణలోని తల్లిదండ్రుల్లా కాకుండా తన పిల్లలు పడే బాధను యెహోవా తీసివేయగలడు. మనుషులు పడే బాధ అంతటినీ తీసివేయడానికి ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు. (మత్త. 24:36) అప్పటివరకు ఆయనతోపాటు సహించేలా ఆయన ప్రేమ మనల్ని పురికొల్పట్లేదా?

17. హెబ్రీయులు 12:2, 3 లో యేసు గురించి చెప్పిన మాటలు, మనం సహనం చూపిస్తూ ఉండడానికి ఎలా సహాయం చేస్తాయి?

17 సహనం చూపించే విషయంలో యెహోవా పరిపూర్ణ ఆదర్శంగా ఉన్నాడు. తన తండ్రిలాంటి సహనాన్ని యేసు చూపించాడు. ఒక మనిషిగా యేసు దూషణకరమైన మాటల్ని, అవమానాన్ని, హింసాకొయ్య మీద బాధను మనకోసం సహించాడు. (హెబ్రీయులు 12:2, 3 చదవండి.) యేసు వాటిని సహించడానికి యెహోవా ఉంచిన ఆదర్శం ఖచ్చితంగా సహాయం చేసింది, అది మనకు కూడా సహాయం చేయగలదు.

18. యెహోవా ఇంతకాలం సహనం చూపించడం వల్ల ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి 2 పేతురు 3:9 ఎలా సహాయం చేస్తుంది?

18 రెండవ పేతురు 3:9 చదవండి. ఈ భూమ్మీదున్న దుష్టత్వాన్ని అంతం చేయడానికి ఏది సరైన సమయమో యెహోవాకు తెలుసు. ఆయన సహనం చూపించడం వల్ల నేడు లక్షలమంది ఆయన గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక గొప్ప సమూహమే ఆయన్ని ఆరాధిస్తుంది. వాళ్లందరూ పుట్టి, ఆయన్ని ప్రేమించడం నేర్చుకొని, ఆయనకు సమర్పించుకునేంత ఎక్కువకాలం ఆయన సహనం చూపించినందుకు వాళ్లు సంతోషిస్తున్నారు. అంతం వరకు సహించినవాళ్లలో లక్షలమంది ఉండడం చూసినప్పుడు సహనం చూపించాలని యెహోవా తీసుకున్న నిర్ణయం సరైనదని మనకు అర్థమౌతుంది.

19. మనమేం నిర్ణయించుకోవాలి? దానివల్ల మనకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది?

19 సంతోషంగా ఎలా సహించవచ్చో మనం యెహోవా నుండి నేర్చుకుంటాం. సాతాను వల్ల ఎంత దుఃఖం, బాధ కలిగినా యెహోవా ఎప్పుడూ ‘సంతోషంగల దేవుడిగా’ ఉంటాడు. (1 తిమో. 1:11) యెహోవా తన నామాన్ని పవిత్రపర్చి, తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకొని, దుష్టత్వంతో పాటు మనకున్న సమస్యలన్నిటినీ తీసేస్తాడు. అప్పటివరకు సహనం చూపిస్తే, మనం కూడా సంతోషంగా ఉండవచ్చు. మనం సహనం చూపించాలని నిర్ణయించుకుందాం. మన పరలోక తండ్రి కూడా సహిస్తున్నాడని తెలుసుకోవడం మనకు ఊరటనిస్తుంది. అలా మనం సహనం చూపిస్తే మనందరి విషయంలో ఈ మాటలు నిజమౌతాయి: “కష్టాన్ని సహిస్తూ ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతను దేవుని ఆమోదం పొందిన తర్వాత అతనికి జీవకిరీటం ఇవ్వబడుతుంది. యెహోవా తనను ప్రేమిస్తూ ఉండేవాళ్లకు ఆ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు.”—యాకో. 1:12.

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

a మనందరికీ సమస్యలున్నాయి. ప్రస్తుతం ఆ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించలేం కాబట్టి వాటిని సహించాలి. అలా సహనం చూపిస్తున్నది మనం ఒక్కరమే కాదు, యెహోవా కూడా ఎన్నో విషయాల్లో సహనం చూపిస్తున్నాడు. వాటిలో తొమ్మిది విషయాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం. యెహోవా సహనం చూపించడం వల్ల ఏ మంచి జరిగిందో, ఆయన ఆదర్శం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో కూడా చూద్దాం.