అధ్యయన ఆర్టికల్ 26
శిష్యుల్ని చేసే పనిలో మీరు సహాయపడగలరా?
‘తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని దేవుడు ఇస్తాడు.’—ఫిలి. 2:13.
పాట 64 సంతోషంగా కోతపని చేద్దాం
ఈ ఆర్టికల్‌లో . . . a
1. యెహోవా మన కోసం ఏం చేశాడు?
మీరొక యెహోవాసాక్షి ఎలా అయ్యారు? మొదటిగా మీరు మంచివార్తను మీ తల్లిదండ్రుల నుండిగానీ, మీ తోటి విద్యార్థి, ఉద్యోగస్థుని నుండిగానీ, ఇంటింటి పరిచర్యలో గానీ విన్నారు. (మార్కు 13:10) ఆ తర్వాత ఒకరు ఎంతో సమయం, శక్తి వెచ్చించి మీకు బైబిలు అధ్యయనం చేశారు. మీరు బైబిలు అధ్యయనం తీసుకుంటుండగా, యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టారు. అలాగే ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నారు. యెహోవా మిమ్మల్ని సత్యం వైపు ఆకర్షించాడు కాబట్టే మీరు యేసుకు శిష్యులై శాశ్వతకాలం జీవించే నిరీక్షణను పొందారు. (యోహా. 6:44) మీకు సత్యం నేర్పించడానికి ఒకరిని పురికొల్పినందుకు, తన సేవకుల్లో ఒకరిగా మిమ్మల్ని అంగీకరించినందుకు మీరు యెహోవాకు నిజంగా రుణపడి ఉన్నారు.
2. ఈ ఆర్టికల్‌లో మనమేం చర్చిస్తాం?
2 మనకు సత్యం తెలుసు కాబట్టి జీవమార్గంలో మనతోపాటు నడవడానికి ఇతరులకు సహాయం చేసే అవకాశం మనకుంది. మనకు ఇంటింటి పరిచర్య చేయడం తేలిగ్గా ఉండవచ్చు. కానీ బైబిలు అధ్యయనం తీసుకుంటారా అని ఇంటివ్యక్తిని అడగడం, దాన్ని చేయడం మనకు కష్టంగా ఉండవచ్చు. మీకలా అనిపిస్తుంటే బహుశా ఈ ఆర్టికల్‌లో ఉన్న కొన్ని సలహాలు మీకు సహాయం చేస్తాయి. శిష్యుల్ని చేసే పనిలో పాల్గొనేలా మనకేది సహాయం చేస్తుందో దీనిలో చర్చిస్తాం. మనం ఏ సవాళ్ల వల్ల బైబిలు అధ్యయనాలు చేయడానికి వెనకాడతామో, వాటిని ఎలా అధిగమించవచ్చో కూడా పరిశీలిస్తాం. అయితే ముందుగా మనం మంచివార్తను కేవలం ప్రకటించడమే కాదు, ఎందుకు బోధించాలో కూడా చూద్దాం.
ప్రకటించడంతోపాటు బోధించమని యేసు ఆజ్ఞాపించాడు
3. మనం ఎందుకు ప్రకటిస్తాం?
3 యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు తన అనుచరులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దానిలో రెండు విషయాలు ఉన్నాయి. మొదటిగా, తన అనుచరులకు రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించమని చెప్పి, దాన్ని ఎలా చేయాలో కూడా చూపించాడు. (మత్త. 10:7; లూకా 8:1) ఉదాహరణకు, ప్రజలు రాజ్య సందేశాన్ని వింటే ఏం చేయాలో, వినకపోతే ఏం చేయాలో యేసు తన శిష్యులకు చెప్పాడు. (లూకా 9:2-5) అంతేకాదు, వాళ్లు ఎంత విస్తృతంగా ప్రకటిస్తారో ముందే చెప్తూ తన అనుచరులు “అన్నిదేశాల ప్రజలకు” సాక్ష్యమిస్తారని ఆయన అన్నాడు. (మత్త. 24:14; అపొ. 1:8) మన సందేశాన్ని ప్రజలు విన్నా, వినకపోయినా దేవుని రాజ్యం గురించి, అదేం చేస్తుందనే దానిగురించి చెప్తూనే ఉండమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు.
4. మత్తయి 28:18-20 ప్రకారం, రాజ్యం గురించి ప్రకటించడంతో పాటు మనం ఇంకా ఏం చేయాలి?
4 యేసు ఇచ్చిన ఆజ్ఞలో రెండో విషయం ఏంటి? తన శిష్యులు అవ్వగలిగేవాళ్లకు ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని పాటించడం నేర్పించమని తన అనుచరులకు చెప్పాడు. ప్రకటించడం, బోధించడం గురించి యేసు ఇచ్చిన ఆజ్ఞ కేవలం మొదటి శతాబ్దపు క్రైస్తవులకు మాత్రమే అని కొంతమంది అంటారు. కానీ అది నిజమేనా? కాదు. ఈ ప్రాముఖ్యమైన పని, “ఈ వ్యవస్థ ముగింపు వరకు” కొనసాగుతుందని యేసు చెప్పాడు. (మత్తయి 28:18-20 చదవండి.) 500 కన్నా ఎక్కువమంది శిష్యులకు తాను కనిపించినప్పుడు, యేసు ఆ ఆజ్ఞ ఇచ్చివుంటాడు. (1 కొరిం. 15:6) అలాగే యోహానుకు వచ్చిన దర్శనంలో తన శిష్యులందరూ యెహోవా గురించి ఇతరులకు నేర్పించాలని తాను కోరుకుంటున్నట్లు యేసు స్పష్టం చేశాడు.—ప్రక. 22:17.
5. మొదటి కొరింథీయులు 3:6-9 లో ప్రకటించడానికి, బోధించడానికి మధ్య ఉన్న సంబంధాన్ని పౌలు ఎలా తెలియజేశాడు?
5 అపొస్తలుడైన పౌలు శిష్యుల్ని చేసే పనిని మొక్కల్ని పెంచడంతో పోలుస్తూ, విత్తనాల్ని నాటడం కన్నా ఎక్కువే చేయాలని చెప్పాడు. ఆయన కొరింథీయులకు ఇలా గుర్తుచేశాడు: “నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు . . . మీరేమో సాగుచేయబడుతున్న దేవుని పొలం.” (1 కొరింథీయులు 3:6-9 చదవండి.) మనం ‘దేవుని పొలంలో’ పనివాళ్లుగా ఉన్నాం. కాబట్టి మనం ప్రకటించినప్పుడు విత్తనాల్ని నాటుతాం, అలాగే బోధించేటప్పుడు నీళ్లు పోస్తాం. (యోహా. 4:35) అదే సమయంలో యెహోవాయే ఆ విత్తనాన్ని పెరిగేలా చేస్తాడని మనం గుర్తిస్తాం.
6. బోధకులుగా మనం ఏయే పనులు చేయాలి?
6 “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” ఉన్నవాళ్ల కోసం మనం వెదుకుతున్నాం. (అపొ. 13:48) యేసు శిష్యులు అవ్వాలంటే బైబిలు నుండి నేర్చుకున్న విషయాల్ని వాళ్లు: (1) అర్థం చేసుకునేలా, (2) అంగీకరించేలా, (3) పాటించేలా మనం సహాయం చేయాలి. (యోహా. 17:3; కొలొ. 2:6, 7; 1 థెస్స. 2:13) వాళ్లు కూటాలకు వచ్చినప్పుడు సంఘంలోని వాళ్లందరూ వాళ్ల మీద ప్రేమ చూపించడం ద్వారా, వాళ్లను ఆహ్వానించడం ద్వారా సహాయం చేయవచ్చు. (యోహా. 13:35) ఒక విద్యార్థి తన లోపల బలంగా నాటుకుపోయిన నమ్మకాల్ని, లేదా ఆచారాల్ని విడిచిపెట్టేలా సహాయం చేయడానికి బైబిలు అధ్యయనం చేసే వ్యక్తి ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి రావచ్చు. (2 కొరిం. 10:4, 5) ఒక విద్యార్థి తన జీవితంలో ఈ పనులన్నీ చేసి బాప్తిస్మం తీసుకునేలా అర్హత సాధించడానికి సహాయం చేయాలంటే ఎన్నో నెలలు పట్టవచ్చు. కానీ ఆ మార్పులు చేసుకోవడం ఆ విద్యార్థికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
శిష్యుల్ని చేసేలా ప్రేమ మనల్ని పురికొల్పుతుంది
7. ప్రకటించే పనిని, శిష్యుల్ని చేసే పనిని మనం ఎందుకు చేస్తాం?
7 ప్రకటించే పనిని, శిష్యుల్ని చేసే పనిని మనం ఎందుకు చేస్తాం? మొదటిగా, మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ప్రకటించమని, శిష్యుల్ని చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి శాయశక్తులా కృషి చేస్తాం. అలా మనకు దేవుని మీద ప్రేమ ఉందని చూపిస్తాం. (1 యోహా. 5:3) దీని గురించి ఆలోచించండి: మీరు యెహోవా మీద ప్రేమతో ప్రజలకు ప్రకటించడం మొదలుపెట్టారు. అలా ప్రకటించడం మీకు సులువుగా అనిపించిందా? బహుశా అనిపించి ఉండదు. మొట్టమొదటిసారి మీరు పరిచర్యకు వెళ్లినప్పుడు మీకు భయం వేసిందా? ఖచ్చితంగా వేసే ఉంటుంది. కానీ ఈ పనిని యేసు చేయమన్నాడని మీకు తెలుసు, అందుకే మీరు దాన్ని చేశారు. అలా కొంతకాలం మీరు పరిచర్య చేశాక మీకు ఆ పని చేయడం తేలికైంది. మరి బైబిలు అధ్యయనం విషయం ఏంటి? బహుశా దాని గురించి ఆలోచిస్తేనే మీకు భయమేసి ఉండవచ్చు. అయినా మీ భయాన్ని అధిగమించి, ఒక బైబిలు అధ్యయనం మొదలుపెట్టేలా కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాను అడిగితే శిష్యుల్ని చేయాలనే మీ కోరికను ఆయన బలపరుస్తాడు.
8. మార్కు 6:34 ప్రకారం, ఇతరులకు బోధించేలా ఇంకా ఏది మనల్ని పురికొల్పుతుంది?
8 రెండవదిగా, ప్రజల మీదున్న ప్రేమ వాళ్లకు సత్యాన్ని బోధించేలా మనల్ని పురికొల్పుతుంది. ఒక సందర్భంలో యేసు, ఆయన శిష్యులు ఎంతోసేపు ప్రకటించడం వల్ల బాగా అలసిపోయారు. విశ్రాంతి కోసం వాళ్లు ఒక చోటుకు వెళ్తున్నప్పుడు, వాళ్లకన్నా ముందే చాలామంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రజల మీద జాలిపడి యేసు వాళ్లకు “చాలా విషయాలు” బోధించడం మొదలుపెట్టాడు. (మార్కు 6:34 చదవండి.) ఆయన అలసిపోయినా వాళ్లకు ఎందుకు బోధించాడు? ఆ ప్రజలు ఎలా భావిస్తున్నారో యేసు వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించాడు. వాళ్లు ఎంత బాధపడుతున్నారో, వాళ్లకి నిరీక్షణ ఎంత అవసరమో ఆయన గుర్తించాడు కాబట్టి వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. నేడున్న ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజలు పైకి సంతోషంగా, సంతృప్తిగా కనిపించినప్పటికీ వాళ్లకూ సమస్యలున్నాయి, వాళ్లకూ నిరీక్షణ అవసరం. వాళ్లు కాపరిలేని గొర్రెల్లా చెదిరిపోయి, నడిపింపు లేకుండా ఉన్నారు. అలాంటి ప్రజల్ని అపొస్తలుడైన పౌలు, దేవుడు తెలియనివాళ్లనీ నిరీక్షణ లేనివాళ్లనీ వర్ణిస్తున్నాడు. (ఎఫె. 2:12) వాళ్లు ‘నాశనానికి నడిపించే దారిలో’ ఉన్నారు! (మత్త. 7:13) మన ప్రాంతంలోని ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత అవసరమో మనం ఆలోచించినప్పుడు, వాళ్లకు సహాయం చేసేలా ప్రేమ, కనికరం మనల్ని కదిలిస్తాయి. అలా వాళ్లకు సహాయం చేయడానికి శ్రేష్ఠమైన మార్గం, వాళ్లతో కలిసి బైబిలు అధ్యయనం చేయడమే!
9. ఫిలిప్పీయులు 2:13 ప్రకారం, యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?
9 బైబిలు అధ్యయనాన్ని సిద్ధపడడానికి, దాన్ని చేయడానికి ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుందని మీకు తెలుసు. కాబట్టి ఎవరితోనైనా బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి మీరు వెనకాడవచ్చు. మీకలా అనిపిస్తుంటే దాని గురించి యెహోవాకు చెప్పండి. ఆసక్తి ఉన్న ఒక్కరినైనా కనుగొని వాళ్లతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే మీ కోరికను పెంచమని ఆయన్ని అడగండి. (ఫిలిప్పీయులు 2:13 చదవండి.) తన ఇష్టానికి తగ్గట్టు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని అపొస్తలుడైన యోహాను హామీ ఇచ్చాడు. (1 యోహాను 5:14, 15) శిష్యుల్ని చేసే పనిలో పాల్గొనాలనే మీ కోరికను పెంచుకునేలా యెహోవా తప్పకుండా సహాయం చేస్తాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు.
ఇతర సవాళ్లను ఎలా అధిగమించవచ్చు?
10-11. బైబిలు అధ్యయనం చేయకుండా మనల్ని ఏది ఆపవచ్చు?
10 బోధించే పని చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. మనకు ఎదురయ్యే సవాళ్ల వల్ల శిష్యుల్ని చేసే పనిలో మనం చేయాలనుకున్నంత చేయలేకపోవచ్చు. ఆ సవాళ్లు కొన్ని ఏంటో, వాటిని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.
11 మన పరిస్థితులవల్ల మనం చేయాలనుకున్నంత ఎక్కువ చేయలేకపోతుండవచ్చు. ఉదాహరణకు, కొంతమంది ప్రచారకులకు వయసుపైబడి ఉండొచ్చు లేదా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నారా? అలాగైతే కోవిడ్ సమయంలో మనం నేర్చుకున్న ఒక పాఠాన్ని గమనించండి. ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా బైబిలు అధ్యయనాల్ని చేయవచ్చని మనం నేర్చుకున్నాం. కాబట్టి మీరు ఇంట్లో ఉండే, సులభంగా ఒక బైబిలు అధ్యయనం మొదలుపెట్టి దాన్ని చేయవచ్చు. మరో ప్రయోజనం కూడా ఉంది. కొంతమందికి బైబిలు అధ్యయనం తీసుకోవడం ఇష్టం ఉన్నా, మన సహోదరులు పరిచర్య చేసే సమయంలో వాళ్లకు కుదరకపోవచ్చు. బహుశా వాళ్లకు మరీ ఉదయాన్నే, లేదా రాత్రుళ్లు కుదరొచ్చు. ఆ సమయంలో మీరు వాళ్లతో బైబిలు అధ్యయనం చేయగలరా? యేసు నీకొదేముకు రాత్రిపూట బోధించాడు, ఎందుకంటే ఆ సమయంలోనే అతనికి కుదిరేది.—యోహా. 3:1, 2.
12. బైబిలు అధ్యయనాలు చేయగలరని మీకు నమ్మకం కుదిరేలా ఏ విషయాలు మీకు సహాయం చేస్తాయి?
12 మనకు బైబిలు అధ్యయనం చేసే సామర్థ్యం లేదని అనుకోవచ్చు. ఎవరికైనా బైబిలు అధ్యయనం చేయాలంటే ఒక బోధకుడిగా మనకు ఎక్కువ జ్ఞానం లేదా నైపుణ్యం ఉండాలని మనం అనుకోవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే, బైబిలు అధ్యయనం చేయగలరని మీకు నమ్మకం కుదిరేలా సహాయం చేసే మూడు విషయాల్ని పరిశీలిద్దాం. మొదటిగా, మీరు ఇతరులకు బోధించడానికి అర్హులని యెహోవా భావిస్తున్నాడు. (2 కొరిం. 3:5) రెండవదిగా, ‘పరలోకంలో, భూమ్మీద పూర్తి అధికారం’ ఉన్న యేసు మిమ్మల్ని బోధించమని ఆజ్ఞాపించాడు. (మత్త. 28:18) మూడవదిగా, సహాయం కోసం మీరు ఇతరులపై ఆధారపడవచ్చు. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో యేసుకు తన తండ్రి నేర్పించాడు. యేసు ఎలాగైతే వాటిమీద ఆధారపడ్డాడో మనమూ అలాగే ఆధారపడవచ్చు. (యోహా. 8:28; 12:49) దాంతోపాటు బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టి, దాన్ని నిర్వహించేలా సహాయం చేయమని మీ క్షేత్రసేవా గుంపు పర్యవేక్షకుణ్ణి లేదా ఒక నైపుణ్యంగల పయినీరుని లేదా ప్రచారకుణ్ణి మీరు అడగవచ్చు. ఆ ప్రచారకుల బైబిలు అధ్యయనానికి వెళ్లడం ద్వారా మంచి బోధకులుగా ఎలా ఉండవచ్చో మీరు నేర్చుకుంటారు.
13. మనం వేర్వేరు పద్ధతుల్లో బోధించడానికి ఎందుకు అలవాటుపడాలి?
13 కొత్త పద్ధతుల్ని, కొత్త బోధనా పనిముట్లను ఉపయోగించడం మనకు కష్టంగా ఉండవచ్చు. మనం బైబిలు అధ్యయనాలు చేసే పద్ధతిలో ఇప్పుడు మార్పు వచ్చింది. బైబిలు అధ్యయనం చేయడం కోసం మనం ముఖ్యంగా ఉపయోగించే, “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకం నుండి ఇతరులకు అధ్యయనం చేయాలంటే సిద్ధపడాలి. గతంలో మనం బైబిలు అధ్యయనాలు చేసిన పద్ధతి కన్నా, ఈ పుస్తకం నుండి అధ్యయనం చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. మనం కొన్ని పేరాలు చదివి, విద్యార్థితో ఎక్కువ సంభాషణ చేస్తాం. మనం విద్యార్థికి బోధిస్తున్నప్పుడు ఎక్కువ వీడియోలను, అలాగే JW లైబ్రరీ యాప్ లాంటి ఎలక్ట్రానిక్ పనిముట్లను ఉపయోగిస్తాం. ఈ పనిముట్లను ఉపయోగించడం మీకు తెలియకపోతే, వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసినవాళ్ల సహాయం తీసుకోండి. సాధారణంగా, మనకు బాగా అలవాటైన పద్ధతిలోనే ఏ పనైనా చేయాలనుకుంటాం. కాబట్టి కొత్త పద్ధతుల్ని అలవాటు చేసుకోవడం అంత తేలిక కాదు. కానీ యెహోవా సహాయంతో, ఇతరుల సహాయంతో వాటికి అలవాటుపడడం తేలికౌతుంది. అలాగే బైబిలు అధ్యయనం చేయడాన్ని మీరు ఎక్కువ ఆనందిస్తారు. ఒక పయినీరు చెప్తున్నట్టు, ఈ పద్ధతిలో బైబిలు అధ్యయనం చేయడం స్టడీ చేసే వ్యక్తికీ, తీసుకునే వ్యక్తికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
14. మనం చెప్పేది ప్రజలు ఎక్కువగా వినని ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? 1 కొరింథీయులు 3:6, 7 వచనాలు మనకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి?
14 బైబిలు అధ్యయనాల్ని మొదలుపెట్టడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో మనం ప్రకటిస్తుండవచ్చు. కొంతమంది ప్రజలు మన సందేశం పట్ల ఆసక్తి చూపించకపోవచ్చు లేదా దాన్ని వ్యతిరేకించవచ్చు. అలాంటి ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు సానుకూలంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? కష్టాలతో నిండిన ఈ లోకంలో, ప్రజల పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. దానివల్ల ఒకప్పుడు మన సందేశం పట్ల ఆసక్తి చూపించనివాళ్లు, ఇప్పుడు దేవుని నిర్దేశం అవసరమని గ్రహించవచ్చు. (మత్త. 5:3) గతంలో మన ప్రచురణల్ని తీసుకోవడానికి నిరాకరించిన కొంతమంది ఆ తర్వాత బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నారు. అయితే, యెహోవాయే కోత యజమానని మనకు తెలుసు. (మత్త. 9:38) మనం నాటుతూ, నీళ్లు పోస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ అది పెరిగేలా చేసేది మాత్రం ఆయనే. (1 కొరిం. 3:6, 7) ప్రస్తుతం మనం ఒక్క బైబిలు అధ్యయనం కూడా చేయలేకపోతున్నా, యెహోవా మనల్ని ఫలితాల్ని బట్టి కాదుగానీ మనం చేసే ప్రయత్నం బట్టి ఆశీర్వదిస్తాడని గుర్తుంచుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. b
శిష్యుల్ని చేసే పనిలో ఉండే ఆనందాన్ని పొందండి
15. ఒక వ్యక్తి బైబిలు అధ్యయనానికి ఒప్పుకొని, తాను నేర్చుకున్నవాటిని పాటిస్తుంటే యెహోవా ఎలా భావిస్తాడు?
15 ఒక వ్యక్తి బైబిలు సత్యాన్ని అంగీకరించి, దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (సామె. 23:15, 16) తన ప్రజలు ఉత్సాహంగా ప్రకటిస్తూ, బోధిస్తూ ఉండడం చూసినప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో కదా! ఉదాహరణకు, 2020 సేవ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ 77,05,765 బైబిలు అధ్యయనాల్ని నిర్వహించాం. అలాగే 2,41,994 మంది యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేశాం. కొత్తగా శిష్యులైన వీళ్లు కూడా బైబిలు అధ్యయనాల్ని నిర్వహించి ఎక్కువమందిని శిష్యుల్ని చేస్తారు. (లూకా 6:40) ఇతరులు క్రీస్తు శిష్యులు అయ్యేలా సహాయం చేసినప్పుడు మనం ఖచ్చితంగా యెహోవాను సంతోషపెడతాం.
16. మనం ఏ మంచి లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు?
16 శిష్యుల్ని చేయడం కష్టమైన పనే, కానీ యెహోవా సహాయంతో కొత్తవాళ్లు మన పరలోక తండ్రిని ప్రేమించేలా బోధించగలం. ఒక్క వ్యక్తికైనా బైబిలు అధ్యయనం మొదలుపెట్టి దాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోగలమా? మనం కలిసే ప్రతి ఒక్కరినీ బైబిలు అధ్యయనం తీసుకుంటారా అని అడిగినప్పుడు, ఆ తర్వాత జరిగేదాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. మన కృషిని యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.
17. ఒక బైబిలు అధ్యయనం చేయగలిగినప్పుడు మనకెలా అనిపిస్తుంది?
17 ఇతరులకు సత్యాన్ని ప్రకటించడం, బోధించడం మనకు దొరికిన గొప్ప గౌరవం! ఈ పని మనకు నిజమైన సంతోషాన్నిస్తుంది. థెస్సలోనికలో ఎంతోమంది క్రీస్తు శిష్యులు అయ్యేలా సహాయం చేసిన అపొస్తలుడైన పౌలు తన భావాల్ని ఇలా చెప్తున్నాడు: “మన ప్రభువైన యేసు ప్రత్యక్షత సమయంలో ఆయన ఎదుట మా నిరీక్షణ, మా ఆనందం, మా సంతోష కిరీటం ఎవరు? మీరే కదా? అవును, మీరే మా ఘనత, మా ఆనందం.” (1 థెస్స. 2:19, 20; అపొ. 17:1-4) నేడు కూడా చాలామంది అదేవిధంగా భావిస్తున్నారు. ఎంతోమంది బాప్తిస్మం తీసుకోవడానికి తన భర్తతో కలిసి సహాయం చేసిన స్టెఫెనీ అనే సహోదరి ఇలా చెప్తుంది: “ప్రజలు యెహోవాకు సమర్పించుకునేలా సహాయం చేయడం వల్ల వచ్చే సంతోషానికి ఏదీ సాటిరాదు.”
పాట 57 అన్నిరకాల ప్రజలకు ప్రకటిద్దాం
a మనం ప్రకటించడంతో పాటు యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటిని పాటించేలా ఇతరులకు నేర్పించే గొప్ప అవకాశాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. ఇతరులకు అలా బోధించడానికి మనల్ని ఏది పురికొల్పుతుంది? ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసేపనిలో ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు? ఆ సవాళ్లను మనం ఎలా అధిగమించవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం.
b శిష్యుల్ని చేసే పనిలో మనమెలా సహాయం చేయవచ్చో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, 2021 మార్చి కావలికోటలో వచ్చిన “బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సంఘమంతా సహాయం చేయవచ్చు” అనే ఆర్టికల్ చూడండి.
c చిత్రాల వివరణ: బైబిలు అధ్యయనం తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో వచ్చే మార్పులను చూడండి. మొదట్లో, యెహోవా గురించి తెలియని ఓ వ్యక్తి తన జీవితానికి ఏ అర్థం లేనట్టు భావిస్తున్నాడు. తర్వాత, పరిచర్యలో యెహోవాసాక్షులు అతన్ని కలిసినప్పుడు బైబిలు అధ్యయనం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతను నేర్చుకున్న విషయాలు తను సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేస్తాయి. కొంతకాలానికి అతను కూడా శిష్యుల్ని చేసే పనిలో పాల్గొంటున్నాడు. చివరికి పరదైసులో వాళ్లందరూ ఆనందంగా జీవిస్తున్నారు.