యౌవనులారా, మీరు సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందించవచ్చు
“జీవమార్గము నీవు నాకు తెలియజేసెదవు.”—కీర్త. 16:11.
1, 2. జీవితంలో మార్పులు చేసుకోవడం సాధ్యమేనని టోని అనుభవం నుండి ఎలా చెప్పవచ్చు?
పద్నాలుగేళ్ల టోని అనే కుర్రాడికి తండ్రి లేడు. అతను హైస్కూల్‌లో ఉన్నప్పుడు చదువు మీద ఏమాత్రం ఆసక్తి చూపించేవాడు కాదు. నిజానికి, చదువు మధ్యలోనే ఆపేయాలని అనుకున్నాడు. వారాంతాల్లో, సినిమాలకు వెళ్లేవాడు లేదా స్నేహితులతో గడిపేవాడు. అతనేమి క్రూరుడు కాదు, డ్రగ్స్‌కు బానిస కాదు, కాకపోతే అతనికి జీవితంలో ఏ సంకల్పం లేదు. దేవుడు ఉన్నాడని కూడా అంతగా నమ్మేవాడు కాదు. ఒకరోజు టోని ఇద్దరు యెహోవాసాక్షుల్ని కలిసి దేవుని గురించి అతనికున్న సందేహాల్ని అడిగాడు. వాళ్లు అతనికి, జీవారంభం—అడగాల్సిన ఐదు ప్రశ్నలు (ఇంగ్లీష్) అలాగే జీవం సృష్టించబడిందా? (ఇంగ్లీష్) అనే రెండు బ్రోషుర్లు ఇచ్చారు.
2 యెహోవాసాక్షులు టోనిని మళ్లీ కలిసే సమయానికి అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. అతను ఆ రెండు బ్రోషుర్లను ఎంతగా చదివాడంటే, అవి మడతలుపడి, నలిగిపోయాయి. టోని వాళ్లకిలా చెప్పాడు, “దేవుడు ఉండేవుంటాడు.” అతను బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు, మెల్లమెల్లగా జీవితం విషయంలో అతనికున్న ఆలోచన పూర్తిగా మారింది. బైబిలు స్టడీ తీసుకోకముందు టోని ఒక డల్ స్టూడెంట్‌గా ఉండేవాడు, కానీ ఇప్పుడు స్కూల్లో ఒక బెస్ట్ స్టూడెంట్ అయ్యాడు! అది చూసి ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోయాడు. దాంతో ఆయన “నీ ఆలోచనల్లో, చదువుల్లో చాలా మెరుగయ్యావు. దీనికి కారణం నువ్వు యెహోవాసాక్షులతో సహవసించడమేనా?” అని టోనిని అడిగాడు. దానికి అతను అవునని జవాబిచ్చి, సాక్షుల దగ్గర నేర్చుకున్న విషయాలు ప్రిన్సిపల్‌కు చెప్పాడు. ఇప్పుడు టోని స్కూల్ చదువు పూర్తి చేసుకుని ఒక క్రమ పయినీరుగా, సంఘ పరిచారకుడిగా సేవచేస్తున్నాడు. అంతేకాదు, తనకు ఒక ప్రేమగల తండ్రైన యెహోవా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాడు!—కీర్త. 68:5.
యెహోవా మాట వింటే విజయం సాధిస్తారు
3. యౌవనులకు యెహోవా ఏ సలహా ఇస్తున్నాడు?
3 యౌవనుల మీద యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో టోని అనుభవం చూపిస్తుంది. మీరు విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే ఆయన, ‘నీ యౌవనకాలంలోనే నీ మహాగొప్ప సృష్టికర్తను గుర్తుచేసుకో’ అని సలహా ఇస్తున్నాడు. (ప్రసం. 12:1, 2 NW) ఇది కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు. దేవుని సహాయంతో మీరు ఇప్పుడు అలాగే భవిష్యత్తులో విజయం సాధించవచ్చు. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థంచేసుకోవడానికి, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకోగలిగారో, దావీదు గొల్యాతును ఎలా చంపగలిగాడో చర్చించుకుందాం.
4, 5. ఇశ్రాయేలీయుల నుండి, దావీదు నుండి మనం ఏ విలువైన పాఠం నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రాలు చూడండి.)
4 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దగ్గర్లో ఉన్నప్పుడు, యెహోవా వాళ్లకు ఏ నిర్దేశాలిచ్చాడు? వాళ్లు నైపుణ్యంగల సైనికులు అవ్వాలని లేదా యుద్ధం కోసం శిక్షణ పొందాలని ఆయన చెప్పాడా? లేదు! (ద్వితీ. 28:1, 2) బదులుగా తన మాట వినమని, తన మీద నమ్మకం ఉంచమని చెప్పాడు. (యెహో. 1:7-9) ఈ సలహా సరైనది కాదని మనుషులకు అనిపించవచ్చు, కానీ అదే శ్రేష్ఠమైన సలహా. ఎందుకంటే, యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు కనానీయుల్ని ఓడించారు. (యెహో. 24:11-13) దేవుని మాట వినాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం చూపిస్తే ఎల్లప్పుడూ విజయం సాధిస్తాం. గతంలో అలాగే నేడు ఇది నిజం!
5 గొల్యాతు బలవంతుడైన సైనికుడు. అతను దాదాపు 9.5 అడుగుల ఎత్తు ఉండేవాడు, అతని దగ్గర ప్రమాదకరమైన ఆయుధాలు ఉండేవి. (1 సమూ. 17:4-7) మరోవైపు, దావీదు దగ్గర కేవలం ఒక వడిసెల, దేవుని మీద విశ్వాసం మాత్రమే ఉన్నాయి. గొల్యాతుతో తలపడడానికి వెళ్తున్న దావీదు తెలివితక్కువవాడని విశ్వాసం లేనివాళ్లు అనుకొనివుండవచ్చు. కానీ వాస్తవానికి గొల్యాతే తెలివితక్కువవాడు!—1 సమూ. 17:48-51.
6. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
6 జీవితంలో సంతోషంగా ఉండడానికి, విజయం సాధించడానికి అవసరమయ్యే నాలుగు విషయాల్ని ముందటి ఆర్టికల్‌లో పరిశీలించాం. మనకు దేవుని నిర్దేశం అవసరమని గుర్తించాలని, దేవున్ని ప్రేమించే మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలని, చక్కని లక్ష్యాలు పెట్టుకోవాలని, దేవుడిచ్చిన స్వేచ్ఛను విలువైనదిగా ఎంచాలని నేర్చుకున్నాం. అయితే, ఈ మంచి పనులు చేయడంవల్ల ఇంకా ఏయే విధాలుగా ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దానికోసం 16వ కీర్తనలో ఉన్న కొన్ని సూత్రాల్ని చర్చించుకుందాం.
దేవుని నిర్దేశం అవసరమని గుర్తించండి
7. (ఎ) ఆధ్యాత్మిక వ్యక్తని ఎవరిని అంటాం? (బి) దావీదు ‘వంతు’ ఏంటి? అది అతనిమీద ఎలాంటి ప్రభావం చూపించింది?
7 ఆధ్యాత్మిక వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు, విషయాల్ని యెహోవా చూసినట్లు చూస్తాడు. నిర్దేశం కోసం దేవునివైపు చూస్తాడు, ఆయన మాట వినాలని నిశ్చయించుకుంటాడు. (1 కొరిం. 2:12, 13) ఈ విషయంలో దావీదు చక్కని ఆదర్శం ఉంచాడు. అతనిలా పాడాడు, ‘యెహోవా నా వంతు.’ (కీర్త. 16:5, NW) దావీదు తన ‘వంతు’ విషయంలో అంటే దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం విషయంలో కృతజ్ఞత చూపించాడు అలాగే దేవున్ని ఆశ్రయించాడు. (కీర్త. 16:1) ఫలితంగా, “నా హృదయము సంతోషించుచున్నది” అని దావీదు చెప్పగలిగాడు. యెహోవాతో ఉన్న సన్నిహిత స్నేహమే దావీదుకు నిజమైన సంతోషాన్నిచ్చింది!—కీర్తన 16:9, 11 చదవండి.
8. మీ జీవితంలో నిజమైన సంతృప్తిని పొందాలంటే చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?
8 డబ్బు మీద లేదా సుఖాల మీద మనసుపెట్టే ప్రజలు దావీదు ఉన్నంత సంతోషంగా ఉండలేరు. (1 తిమో. 6:9, 10) కెనడాలో ఉన్న ఒక సహోదరుడు ఇలా చెప్పాడు: “జీవితంలో మనం ఏం పొందాం అనేదాన్ని బట్టి కాదుగానీ, ప్రతీ మంచి బహుమానం ఇచ్చే యెహోవా దేవునికి మనం ఏం ఇచ్చాం అనేదాన్ని బట్టే నిజమైన సంతృప్తి కలుగుతుంది.” (యాకో. 1:17) యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకుని, ఆయన సేవచేస్తే మీరు ఎంతో అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. కాబట్టి మీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? యెహోవాతో సమయం గడపాలి. బైబిల్ని చదవడం ద్వారా, ఆయన చేసిన అందమైన సృష్టిని గమనించడం ద్వారా, ఆయనకున్న లక్షణాల గురించి, ముఖ్యంగా ప్రేమ గురించి ఆలోచించడం ద్వారా అలా చేయవచ్చు.—రోమా. 1:20; 5:8.
9. దేవుని వాక్యం మిమ్మల్ని మలిచేలా ఎలా అనుమతించవచ్చు?
9 ఒక ప్రేమగల తండ్రిలా, యెహోవా మనకు అవసరమైన దిద్దుబాటును ఇస్తాడు. దావీదు ఆ దిద్దుబాటును విలువైనదిగా ఎంచి ఇలా అన్నాడు, “నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది.” (కీర్త. 16:7) దేవుని ఆలోచనల్ని దావీదు ధ్యానించాడు, దేవునిలా ఆలోచించడం నేర్చుకున్నాడు. దేవుని ఆలోచనలు తనను మలిచేలా, అంటే తనను మార్చి, మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దేలా దావీదు అనుమతించాడు. మీరు కూడా అలా అనుమతిస్తే, దేవుని మీద మీకున్న ప్రేమ, ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక పెరుగుతాయి. అంతేకాదు మీరు ఒక పరిణతిగల క్రైస్తవునిగా తయారౌతారు. క్రిస్టిన్ అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘చదివినవాటి గురించి పరిశోధన చేసినప్పుడు, ధ్యానించినప్పుడు యెహోవా ఆ మాటల్ని నా కోసమే రాయించినట్లు అనిపిస్తుంది!’
10. దేవునిలా ఆలోచిస్తే యెషయా 26:3 ప్రకారం మీరెలాంటి ప్రయోజనం పొందుతారు?
10 మీరు దేవునిలా ఆలోచిస్తే ఈ లోకాన్ని, దాని భవిష్యత్తును ఆయన చూసినట్లే చూస్తారు. యెహోవా మీకు అలాంటి అసాధారణమైన జ్ఞానాన్ని, అవగాహనను ఇస్తాడు. ఎందుకంటే, జీవితంలో ఏది ముఖ్యమో మీరు తెలుసుకోవాలని, మంచి నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తును నిర్భయంగా ఎదుర్కోవాలని ఆయన కోరుకుంటున్నాడు! (యెషయా 26:3 చదవండి.) యెహోవాకు సన్నిహితంగా ఉంటే, ఏవి ముఖ్యమైనవో ఏవి కావో స్పష్టంగా తెలుసుకుంటారని అమెరికాలో ఉంటున్న జాషువ అనే సహోదరుడు చెప్తున్నాడు.
నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోండి
11. దావీదు ఎవర్ని తన స్నేహితులుగా ఎంచుకున్నాడు?
11 కీర్తన 16:3 చదవండి. మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో దావీదుకు తెలుసు. యెహోవాను ప్రేమించేవాళ్లను తన స్నేహితులుగా దావీదు ఎంచుకున్నాడు, దానివల్ల అతనికి ఎంతో సంతోషం కలిగిందని చెప్పాడు. అతని స్నేహితులు యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలను పాటిస్తారు కాబట్టి వాళ్లను “శ్రేష్టులు” లేదా పవిత్రులు అని వర్ణించాడు. స్నేహితుల్ని ఎంచుకోవడం గురించి మరో కీర్తనకర్త కూడా అలాగే భావించాడు. అతనిలా రాశాడు, ‘నీకు భయపడే వాళ్లందరికీ, నీ ఆదేశాలు పాటించేవాళ్లకు నేను స్నేహితుణ్ణి.’ (కీర్త. 119:63, NW) ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్నట్లు, మీరు కూడా యెహోవాను ప్రేమించే, ఆయన మాట వినే ఎంతోమంది మంచి స్నేహితుల్ని సంపాదించుకోవచ్చు. అంతేకాదు మీ స్నేహితులు మీ వయసువాళ్లే కానవసరం లేదు.
12. దావీదు, యోనాతాను ఎలా మంచి స్నేహితులు అవ్వగలిగారు?
12 దావీదు తన వయసువాళ్లను మాత్రమే స్నేహితులుగా ఎంచుకోలేదు. దావీదు సన్నిహిత స్నేహితుల్లో ఒకరి పేరు చెప్పగలరా? బహుశా మీకు యోనాతాను గుర్తొచ్చివుంటాడు. బైబిల్లో నమోదు చేయబడిన మంచి స్నేహితుల్లో దావీదు, యోనాతానులు కూడా ఒకరు. అయితే, యోనాతాను దావీదు కన్నా 30 సంవత్సరాలు పెద్దవాడని మీకు తెలుసా? మరి, వాళ్లు అంతమంచి స్నేహితులు ఎలా అయ్యారు? దేవుని మీద విశ్వాసం, ఒకరిపట్ల ఒకరికి ఉన్న గౌరవం, దేవుని శత్రువులతో పోరాడేటప్పుడు వాళ్లిద్దరూ చూపించిన ధైర్యం వల్ల వాళ్లు మంచి స్నేహితులు అవ్వగలిగారు.—1 సమూ. 13:3; 14:13; 17:48-50; 18:1.
13. మీరు ఎక్కువమంది స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.
13 దావీదు, యోనాతానుల్లాగే మనం కూడా యెహోవాను ప్రేమించేవాళ్లను, ఆయన మీద విశ్వాసం ఉంచేవాళ్లను స్నేహితులుగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటాం. చాలా సంవత్సరాలుగా దేవుని సేవచేస్తున్న కీరా ఇలా చెప్తుంది, “నేను ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల్ని సంపాదించుకున్నాను. వాళ్లు వేర్వేరు నేపథ్యాలకు, సంస్కృతులకు చెందినవాళ్లు.” మీరు కూడా అలాచేస్తే బైబిలు, పవిత్రశక్తి మనందర్నీ ఎలా ఒక ప్రపంచవ్యాప్త కుటుంబంగా చేస్తున్నాయో తెలుసుకుంటారు.
చక్కని లక్ష్యాలు పెట్టుకోండి
14. (ఎ) మీరు చక్కని లక్ష్యాలు ఎలా పెట్టుకోవచ్చు? (బి) తాము పెట్టుకున్న లక్ష్యాల గురించి కొంతమంది యౌవనులు ఏమంటున్నారు?
14 కీర్తన 16:8 చదవండి. దావీదు, దేవుని సేవనే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎంచాడు. మీరు లక్ష్యాలు పెట్టుకునేటప్పుడు దావీదును ఆదర్శంగా తీసుకుని, యెహోవా మీ నుండి ఏం కోరుతున్నాడో ఆలోచించినప్పుడు మీ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. స్టీవెన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “ఒక లక్ష్యం పెట్టుకుని నేను దానికోసం కృషి చేసి, దాన్ని చేరుకున్నప్పుడు, దానికోసం చేసుకున్న మార్పుల గురించి ఒకసారి ఆలోచించినప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది.” జర్మనీ నుండి వేరే దేశానికి వెళ్లి సేవచేస్తున్న ఒక యువ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నేను వృద్ధుణ్ణి అయ్యాక, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను చేసినవన్నీ నాకోసం మాత్రమే అన్నట్లు ఉండకూడదని కోరుకుంటాను.” మీరూ అలాగే భావిస్తున్నారా? అయితే మీ సామర్థ్యాల్ని, నైపుణ్యాల్ని దేవుని ఘనత కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. (గల. 6:10) యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకోండి, వాటిని చేరుకునేలా సహాయం చేయమని ప్రార్థించండి. ఆయన మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడనే నమ్మకంతో ఉండండి!—1 యోహా. 3:22; 5:14, 15.
15. మీరు పెట్టుకోగల కొన్ని లక్ష్యాలు ఏంటి? (“ మీరు పెట్టుకోగల కొన్ని లక్ష్యాలు” అనే బాక్స్ చూడండి.)
15 మీరు పెట్టుకోగల కొన్ని లక్ష్యాలు ఏంటి? మీటింగ్స్‌లో మీ సొంత మాటల్లో కామెంట్స్ చెప్పాలనే లక్ష్యం పెట్టుకోగలరా? పయినీరు అవ్వాలని లేదా బెతెల్‌లో సేవచేయాలని లక్ష్యం పెట్టుకోగలరా? మీరు ఒక కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు, దానివల్ల మీరు ఇంకా ఎక్కువమందికి మంచివార్త చెప్పే అవకాశం ఉంటుంది. పూర్తికాల సేవచేస్తున్న బారక్ అనే యువ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “రోజూ ఉదయాన్నే నిద్రలేచినప్పుడు, నా శక్తినంతా యెహోవా కోసం ఉపయోగిస్తున్నాననే ఆలోచన నాకెక్కువ సంతోషాన్నిస్తుంది. అది వేరే దేనిలోనూ దొరకదు.”
దేవుడిచ్చే స్వేచ్ఛను ఆనందించండి
16. యెహోవా నియమాల్ని, సూత్రాల్ని దావీదు ఎలా ఎంచాడు? ఎందుకు?
16 కీర్తన 16:2, 4 చదవండి. మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు, దేవుని నియమాల ప్రకారం, సూత్రాల ప్రకారం జీవిస్తే నిజమైన స్వేచ్ఛను పొందుతాం. అంతేకాదు మంచిని ప్రేమించి, చెడును ద్వేషించడం నేర్చుకుంటాం. (ఆమో. 5:15) ఆదిమ భాషలో, కీర్తన 16:2లో దావీదు చెప్పిన మాటల భావం ఏంటంటే, తనలో ఉన్న మంచి అంతటికి మూలం యెహోవాయే. దావీదు యెహోవాను అనుకరించడానికి, ఆయన ప్రేమించే వాటినే ప్రేమించడానికి ఎంతో కృషిచేశాడు. అంతేకాదు, దేవుడు ద్వేషించేవాటిని ద్వేషించడం కూడా నేర్చుకున్నాడు. అందులో విగ్రహారాధన ఒకటి. యెహోవాను తప్ప వేరే ఎవ్వర్నీ లేదా దేన్నీ ఆరాధించినా అది విగ్రహారాధనే అవుతుంది. మనుషులు దిగజారిపోయేలా, యెహోవాకు చెందాల్సిన ఘనతను వేరేవాళ్లకు లేదా వేరేవాటికి ఇచ్చేలా విగ్రహారాధన చేస్తుంది.—యెష. 2:8, 9; ప్రక. 4:11.
17, 18. (ఎ) అబద్ధ ఆరాధన వల్ల ఎలాంటి చెడు పర్యవసానాలు వస్తాయని దావీదు చెప్పాడు? (బి) చాలామంది చేసే ఏ పనుల వల్ల వాళ్ల ‘శ్రమలు విస్తరిస్తాయి’?
17 బైబిలు కాలాల్లో, లైంగిక పాపాలు తరచూ అబద్ధ ఆరాధనలో భాగంగా ఉండేవి. (హోషే. 4:13, 14) చాలామంది వాటిని ఇష్టపడేవాళ్లు కాబట్టి అబద్ధ ఆరాధన కూడా వాళ్లకు నచ్చేది. మరి ఆ ఆరాధన వాళ్లకు సంతోషాన్నిచ్చిందా? ఎంతమాత్రం ఇవ్వలేదు! అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్ల “శ్రమలు విస్తరించును” అని దావీదు చెప్పాడు. అలాంటివాళ్లు తమ పిల్లల్ని కూడా అబద్ధ దేవుళ్లకు బలి ఇచ్చారు! (యెష. 57:5) వాళ్ల క్రూరత్వాన్ని యెహోవా అసహ్యించుకున్నాడు. (యిర్మీ. 7:31) ఒకవేళ మీరు ఆ కాలంలో జీవించివుంటే, మీ అమ్మానాన్నలు యెహోవా ఆరాధకులుగా ఉన్నందుకు సంతోషించి ఉండేవాళ్లు కాదా?
18 నేడు చాలా అబద్ధ మతాలు లైంగిక పాపాల్ని ఆఖరికి స్వలింగ సంపర్కాన్ని కూడా అంగీకరిస్తున్నాయి. దానివల్ల స్వేచ్ఛగా ఉన్నామని ప్రజలు అనుకోవచ్చు, కానీ వాస్తవానికి వాళ్ల ‘శ్రమలు విస్తరిస్తాయి.’ (1 కొరిం. 6:18, 19) ఆ విషయాన్ని మీరూ గమనించేవుంటారు. కాబట్టి యౌవనులారా, మీ పరలోక తండ్రి మాట వినండి, దేవుడు చెప్పింది చేయడమే మంచిదని నమ్మకం కుదుర్చుకోండి. లైంగిక అనైతికత వల్ల ఎలాంటి చెడు పర్యవసానాలు వస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు, తప్పు చేయడంవల్ల కలిగే సంతోషం కన్నా నష్టమే ఎక్కువని మీరు అర్థంచేసుకుంటారు. (గల. 6:8) పై పేరాల్లో ప్రస్తావించిన జాషువ అనే సహోదరుడు ఇలా అంటున్నాడు, “మన స్వేచ్ఛను మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే అసంతృప్తే మిగులుతుంది.”
19, 20. యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మాట వినే యౌవనులు ఎలాంటి దీవెనలు పొందుతారు?
19 యేసు ఇలా చెప్పాడు, “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు. అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది.” (యోహా. 8:31, 32) అబద్ధమతం నుండి, అజ్ఞానం నుండి, మూఢనమ్మకాలు నుండి యెహోవా మనల్ని విడిపించాడు. భవిష్యత్తులో, “దేవుని పిల్లల మహిమగల స్వాతంత్ర్యాన్ని” పొందే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాం. (రోమా. 8:21) ఇప్పుడు కూడా యేసు బోధల్ని పాటిస్తే కొంతమేరకు ఆ స్వేచ్ఛను అనుభవించవచ్చు. అయితే, మీరు సత్యం నేర్చుకోవడంవల్ల మాత్రమే కాదుగానీ, దాని ప్రకారంగా జీవించడంవల్ల “సత్యాన్ని తెలుసుకుంటారు.”
20 యౌవనులారా, యెహోవా ఇచ్చే స్వేచ్ఛను విలువైనదిగా ఎంచండి. దాన్ని తెలివిగా ఉపయోగించండి. దానివల్ల, మీరు బంగారు భవిష్యత్తును సొంతం చేసుకునే మంచి నిర్ణయాలు ఇప్పుడే తీసుకోగలుగుతారు. ఒక యువ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “యౌవనంలో ఉన్నప్పుడే స్వేచ్ఛను తెలివిగా ఉపయోగిస్తే, భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలా లేక కొంతకాలంపాటు ఒంటరిగా ఉండాలా వంటి పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవడం తేలికౌతుంది.”
21. “వాస్తవమైన జీవితం” మీరెలా సొంతం చేసుకోవచ్చు?
21 ఈ పాత లోకంలో, ఆఖరికి మంచి జీవితం అని ప్రజలు పిలిచే జీవితం కూడా తాత్కాలికమైనదే. రేపు ఏం జరుగుతుందో మనుషులకు తెలియదు. (యాకో. 4:13, 14) కాబట్టి మీరు చేయగల శ్రేష్ఠమైన పని ఏంటంటే, “వాస్తవమైన జీవితం” సొంతం చేసుకోవడానికి సహాయపడే మంచి ఎంపికలు చేసుకోవడం. కొత్త లోకంలో మీరు పొందే శాశ్వత జీవితమే, వాస్తవమైన జీవితం. (1 తిమో. 6:19) తనను ఆరాధించమని యెహోవా ఎవ్వర్నీ బలవంతపెట్టడు, అది ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి. కాబట్టి, యెహోవాకు సన్నిహితం అవ్వడానికి ప్రతీరోజు కష్టపడుతూ ఆయన్ని మీ ‘వంతుగా’ చేసుకోండి. అంతేకాదు ఆయన మీకిచ్చిన మంచివాటన్నిటిని విలువైనవిగా ఎంచండి. (కీర్త. 103:5) యెహోవా మీకు పట్టలేనంత ఆనందాన్ని, శాశ్వతకాలం ఉండే సంతోషాన్ని ఇస్తాడనే నమ్మకంతో ఉండండి!—కీర్త. 16:11.