యౌవనులారా, మీరు సంతోషంగా ఉండాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు
“మేలుతో [లేదా మంచివాటితో, NW] నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు.”—కీర్త. 103:5.
1, 2. మీరు సృష్టికర్త చెప్పింది చేయడం ఎందుకు తెలివైన పని? (ప్రారంభ చిత్రాలు చూడండి.)
ఒకవేళ మీరు యౌవనులైతే, భవిష్యత్తు గురించి మీకు ఎంతోమంది సలహాలు ఇచ్చివుంటారు. ఉన్నత విద్య చదవమని, లేదా పెద్ద ఉద్యోగం చేసి, బాగా డబ్బు సంపాదించమని టీచర్లు, కౌన్సిలర్లు, లేదా మరితరులు మీతో చెప్పివుంటారు. కానీ యెహోవా మీకు వేరే సలహా ఇస్తున్నాడు. నిజమే, మీ కాళ్ల మీద మీరు నిలబడడానికి స్కూల్‌లో కష్టపడి చదువుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కొలొ. 3:23) కానీ మీరు యౌవనంలో ఉన్నప్పుడు, మీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ చివరి రోజుల్లో, మీరు తనను సంతోషపెట్టేలా ఎలా జీవించవచ్చో తెలియజేసే సూత్రాల్ని యెహోవా ఇస్తున్నాడు.—మత్త. 24:14.
2 యెహోవాకు అన్నీ తెలుసని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఈ వ్యవస్థ ముగింపు సరిగ్గా ఎంత దగ్గర్లో ఉందో కూడా ఆయనకు తెలుసు. (యెష. 46:10; మత్త. 24:3, 36) యెహోవాకు మీ గురించి కూడా తెలుసు. మీకు ఏది సంతోషాన్నిస్తుందో, ఏది దుఃఖాన్నిస్తుందో ఆయనకు తెలుసు. మనుషులు ఇచ్చే సలహాలు బానే ఉండవచ్చు, కానీ అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే తెలివైన సలహాలు అవ్వవు.—సామె. 19:21.
యెహోవాయే తెలివికి మూలం
3, 4. చెడ్డ సలహాను వినడంవల్ల ఆదాముహవ్వలు, వాళ్ల పిల్లలు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నారు?
3 చెడ్డ సలహాల్ని మనం ఎప్పటినుండో వింటున్నాం. మనుషులకు మొట్టమొదటిసారి చెడ్డ సలహా ఇచ్చింది సాతానే. ఆదాముహవ్వలు ఎలా జీవించాలో తమకు తామే నిర్ణయించుకుంటే చాలా సంతోషంగా ఉంటారని సాతాను హవ్వకు చెప్పాడు. (ఆది. 3:1-6) కానీ సాతాను స్వార్థపరుడు! ఆదాముహవ్వలు అలాగే వాళ్లకు పుట్టబోయే పిల్లలు యెహోవాకు కాకుండా తనకు లోబడాలని, తనను ఆరాధించాలని సాతాను కోరుకున్నాడు. కానీ అతను మనుషుల కోసం ఏమీ చేయలేదు. ఆదాముహవ్వలకు కావాల్సినవన్నీ ఇచ్చింది యెహోవాయే! వాళ్లకు జీవిత భాగస్వామిని ఇచ్చాడు, ఉండడానికి అందమైన తోటను ఇచ్చాడు, శాశ్వతకాలం ఉండే పరిపూర్ణ శరీరాల్ని ఇచ్చాడు.
4 విచారకరంగా, ఆదాముహవ్వలు దేవునికి అవిధేయత చూపించారు. అలా చేయడం ద్వారా తమకు జీవాన్నిచ్చిన వ్యక్తి నుండి తెగతెంపులు చేసుకున్నారు. దానివల్ల చాలా ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. చెట్టు నుండి తెంపిన పువ్వుల్లాగే, ఆదాముహవ్వలు కూడా క్రమక్రమంగా వృద్ధులై, చనిపోయారు. వాళ్ల పిల్లలు కూడా ఆ పర్యవసానాలు ఎదుర్కొన్నారు, ఆ పిల్లల్లో మనం కూడా ఉన్నాం. (రోమా. 5:12) ఆదాముహవ్వల్లాగే, నేడు చాలామంది దేవుడు చెప్పేవాటిని పట్టించుకోకుండా, తమకు నచ్చింది చేస్తున్నారు. (ఎఫె. 2:1-3) దాని ఫలితం ఏంటి? బైబిలు ఇలా చెప్తుంది, ‘యెహోవాకు విరోధమైన జ్ఞానం నిలువదు.’—సామె. 21:30.
5. మనుషుల విషయంలో యెహోవా ఏ నమ్మకంతో ఉన్నాడు? ఆయన నమ్మకం సరైనదేనా?
5 తనను తెలుసుకుని, తనకు సేవ చేయాలనుకునే ప్రజలు ఉంటారని యెహోవాకు తెలుసు. వాళ్లలో చాలామంది యౌవనులు కూడా ఉంటారని ఆయనకు తెలుసు. (కీర్త. 103:17, 18; 110:3) ఈ యౌవనులు యెహోవాకు చాలా విలువైనవాళ్లు! వాళ్లలో మీరూ ఒకరా? అలాగైతే, దేవుడిచ్చే ఎన్నో మంచివాటిని మీరూ ఆనందిస్తున్నారు, అవి మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. (కీర్తన 103:5 చదవండి; సామె. 10:22) ఆ మంచివాటిలో నాలుగింటిని ఇప్పుడు చర్చించుకుందాం. అవి: ఆధ్యాత్మిక ఆహారం, మంచి స్నేహితులు, చక్కని లక్ష్యాలు, నిజమైన స్వేచ్ఛ.
యెహోవా మీకు ఆధ్యాత్మిక ఆహారం ఇస్తాడు
6. దేవుని నిర్దేశం మనకు అవసరమని ఎందుకు గుర్తించాలి? అలా గుర్తించడానికి యెహోవా వేటిని ఇచ్చాడు?
6 జంతువులకు ఆధ్యాత్మిక అవసరాలు ఉండవు, అంటే సృష్టికర్తను తెలుసుకోవాలనే ఆలోచన కూడా వాటికి రాదు. కానీ మనం అలా కాదు. సృష్టికర్తను తెలుసుకోవాల్సిన అవసరాన్ని మనం గుర్తిస్తాం. (మత్త. 4:4) దేవుడు చెప్పేది విన్నప్పుడు మనం అవగాహనను, తెలివిని, సంతోషాన్ని సొంతం చేసుకుంటాం. “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు” అని యేసు అన్నాడు. (మత్త. 5:3) ఆ అవసరాన్ని గుర్తించడానికి దేవుడు బైబిల్ని ఇచ్చాడు. అంతేకాదు మన విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు తోడ్పడే ప్రచురణల్ని ఇవ్వడానికి “నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి” యెహోవా ఉపయోగిస్తున్నాడు. (మత్త. 24:45) ఈ ప్రచురణల్ని మనం ఆధ్యాత్మిక ఆహారమని పిలుస్తాం. ఎందుకంటే అవి మన విశ్వాసాన్ని పెంచుతాయి, యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపరుస్తాయి. మనకు రకరకాల ఆధ్యాత్మిక ఆహారం అందుబాటులో ఉంది!—యెష. 65:13, 14.
7. దేవుడిచ్చే ఆధ్యాత్మిక ఆహారం మీకెలా సహాయం చేస్తుంది?
7 ఆధ్యాత్మిక ఆహారం మిమ్మల్ని ఎన్నో విధాలుగా కాపాడే తెలివిని, ఆలోచన సామర్థ్యాన్ని ఇస్తుంది. (సామెతలు 2:10-14, చదవండి.) ఉదాహరణకు సృష్టికర్త లేడని, డబ్బు-వస్తుసంపదలు సంతోషాన్ని ఇస్తాయని చెప్పే అబద్ధాలను గుర్తించేలా ఆ లక్షణాలు మీకు సహాయం చేస్తాయి. హానికరమైన కోరికలకు లేదా అలవాట్లకు దూరంగా ఉండడానికి కూడా అవి మీకు సహాయం చేస్తాయి. కాబట్టి తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. అప్పుడు, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనుకుంటున్నాడని గుర్తించగలుగుతారు.—కీర్త. 34:8; యెష. 48:17, 18.
8. మీరు దేవునికి ఇప్పుడే ఎందుకు దగ్గరవ్వాలి? భవిష్యత్తులో అది మీకెలా సహాయం చేస్తుంది?
8 త్వరలోనే, సాతాను లోకంలో ఉన్న ప్రతీది నాశనమౌతుంది. అప్పుడు యెహోవా మాత్రమే మనల్ని కాపాడగలడు, మనకు కావాల్సిన వాటన్నిటినీ ఇవ్వగలడు, ఆఖరికి మనం తర్వాతి పూట తినే భోజనం కూడా ఆయన ఇవ్వగలడు! (హబ. 3:2, 12-19) కాబట్టి దేవునికి దగ్గరవ్వడానికి, ఆయనపై ఉన్న నమ్మకాన్ని బలపర్చుకోవడానికి ఇదే సమయం. (2 పేతు. 2:9) అలా చేసినప్పుడు, మీ చుట్టూ ఏం జరిగినా సరే, దావీదులాగే భావిస్తారు. అతనిలా అన్నాడు, “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.”—కీర్త. 16:8.
యెహోవా మీకు మంచి స్నేహితుల్ని ఇస్తాడు
9. (ఎ) యోహాను 6:44 ప్రకారం యెహోవా ఏం చేస్తాడు? (బి) మీరు ఒక యెహోవాసాక్షిని కలవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి?
9 యెహోవాసాక్షికాని ఒకవ్యక్తిని మీరు మొదటిసారి కలిసినప్పుడు, అతని గురించి మీకు ఏయే విషయాలు తెలుస్తాయి? బహుశా అతని పేరు, రూపం తప్ప ఇంకేమీ తెలియకపోవచ్చు. కానీ ఒక యెహోవాసాక్షిని కలిసినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అతను యెహోవాను ప్రేమిస్తున్నాడని మీకు తెలుసు. యెహోవా అతనిలో ఉన్న ఏదో మంచిని చూసి, తన ఆరాధకుల కుటుంబంలోకి ఆహ్వానించాడని మీకు తెలుసు. (యోహాను 6:44, చదవండి.) అతని దేశం, పెరిగిన వాతావరణం ఏదైనా, అతని గురించి మీకు అప్పటికే చాలా విషయాలు తెలుసు, అతనికి కూడా మీ గురించి చాలా విషయాలు తెలుసు!
10, 11. యెహోవాసాక్షుల్లో ఏ విషయాలు కలుస్తాయి? అది మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
10 మీరు ఒక యెహోవాసాక్షిని కలిసిన వెంటనే అతనిలో, మీలో చాలా విషయాలు కలుస్తున్నాయని గుర్తిస్తారు. మీ భాషలు వేరైనా, మీరిద్దరూ సత్యమనే ‘స్వచ్ఛమైన భాషను’ మాట్లాడతారని మీకు తెలుసు. (జెఫ. 3:9, NW) అంటే మీరిద్దరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ఒకే రకమైన నైతిక ప్రమాణాలు పాటిస్తున్నారు, ఒకే నిరీక్షణతో ఉన్నారు. మీరు ఒకరినొకరు నమ్మడానికి, శాశ్వతకాలం ఉండే స్నేహాన్ని బలపర్చుకోవడానికి ఇవన్నీ సహాయం చేస్తాయి.
11 మీరు యెహోవాను ఆరాధిస్తుంటే, మీకు మంచి స్నేహితులు ఉన్నారని గట్టి నమ్మకంతో చెప్పవచ్చు. మీకు ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు ఉన్నారు, మీరు వాళ్లను ముందెప్పుడూ కలవకపోయినా, వాళ్లు మీ స్నేహితులే! ఇంత మంచి బహుమానం యెహోవాసాక్షులకు తప్ప ఇంకెవ్వరికైనా దొరుకుతుందంటారా?
మీరు చక్కని లక్ష్యాలు పెట్టుకునేలా యెహోవా సహాయం చేస్తాడు
12. మీరు ఎలాంటి చక్కని లక్ష్యాలు పెట్టుకోవచ్చు?
12 ప్రసంగి 11:9–12:1, 2 చదవండి. మీరు ఏవైనా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? బహుశా, ప్రతీరోజు బైబిలు చదవాలనే లక్ష్యం మీకుండవచ్చు, మీటింగ్స్‌లో మంచి కామెంట్స్ చెప్పాలనే లేదా మీ భాగాన్ని చక్కగా చేయాలనే లక్ష్యం మీకుండవచ్చు. అంతేకాదు ప్రీచింగ్‌లో బైబిల్ని సమర్థవంతంగా ఉపయోగించాలనే లక్ష్యం మీకుండవచ్చు. మీరు అభివృద్ధి సాధిస్తున్నారని మీకైమీరు గుర్తించినప్పుడు లేదా ఎవరైనా మీకు చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు చాలా సంతోషిస్తారు కదా. అలా సంతోషించాలి కూడా! ఎందుకు? ఎందుకంటే మీరు యెహోవా చెప్పింది చేస్తున్నారు, యేసు కూడా అదే చేశాడు.—కీర్త. 40:8; సామె. 27:11.
13. లౌకిక లక్ష్యాలపై కాకుండా యెహోవా సేవపై మనసుపెట్టడం ఎందుకు మంచిది?
13 యెహోవా సేవపై మనసుపెడితే, మీకు సంతోషాన్నిచ్చే పనిచేస్తున్నట్లే, మీ జీవితానికి కూడా ఒక అర్థముంటుంది. పౌలు ఈ సలహా ఇచ్చాడు: “స్థిరంగా, నిలకడగా ఉండండి. ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదని గుర్తుంచుకొని, ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి.” (1 కొరిం. 15:58) దానికి భిన్నంగా, ప్రజలు డబ్బు లేదా పేరు సంపాదించడం లాంటి లౌకిక లక్ష్యాలపై మనసుపెడితే నిజమైన సంతోషాన్ని అనుభవించలేరు. ఒకవేళ వాళ్లు తమ లక్ష్యాలు చేరుకున్నా, వాళ్ల జీవితంలో ఏదో వెలితి ఉంటుంది. (లూకా 9:25) ఆ విషయాన్ని సొలొమోను రాజు ఉదాహరణ నుండి తెలుసుకోవచ్చు.—రోమా. 15:4.
14. సొలొమోను చేసిన ప్రయోగం నుండి మీరేమి నేర్చుకోవచ్చు?
14 సొలొమోనుకు చాలా డబ్బు, అధికారం ఉండేవి. అతను ఒక ప్రయోగం చేశాడు. ‘సుఖసంతోషాలు అనుభవించి, అందులో ఏదైనా మంచి ఉందేమో చూద్దాం’ అని అతను అనుకున్నాడు. (ప్రసం. 2:1-10, NW) సొలొమోను విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నాడు, అందమైన తోటలు, ఉద్యానవనాలు నిర్మించాడు, తన మనసుకు నచ్చిందల్లా చేశాడు. మరి అతను సంతృప్తిని, సంతోషాన్ని పొందాడా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ వ్యర్థమైనవిగా, ఏ ప్రయోజనం లేనివిగా అనిపించాయని సొలొమోను అన్నాడు. (ప్రసం. 2:11) మరి సొలొమోను అనుభవం నుండి మీరూ అదే పాఠం నేర్చుకుంటారా?
15. మీకు విశ్వాసం ఎందుకు అవసరం? కీర్తన 32:8 చెప్తున్నట్లు విశ్వాసం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?
15 కొంతమంది పొరపాట్లు చేసి, వాటివల్ల వచ్చే చెడు పర్యవసానాలు అనుభవించాక గానీ పాఠాలు నేర్చుకోరు. కానీ మీకు అలాంటి పరిస్థితి రాకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు ఆయన మాట విని, ఆయనకు లోబడాలని కోరుకుంటున్నాడు. మనమలా చేయాలంటే విశ్వాసం అవసరం. మీరు విశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల బాధపడే పరిస్థితి ఎన్నడూ రాదు. అంతేకాదు, “తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను” దేవుడు ఎన్నడూ మర్చిపోడు. (హెబ్రీ. 6:10) కాబట్టి బలమైన విశ్వాసం పెంపొందించుకోవడానికి కష్టపడండి. అప్పుడు, మీరు జీవితంలో మంచి ఎంపికలు చేసుకోగలుగుతారు, మీ పరలోక తండ్రి మీకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని కోరుకుంటున్నట్లు గుర్తించగలుగుతారు.—కీర్తన 32:8 చదవండి.
దేవుడు మీకు నిజమైన స్వేచ్ఛను ఇస్తాడు
16. స్వేచ్ఛను ఎందుకు విలువైనదిగా చూడాలి? దాన్ని తెలివిగా ఎలా ఉపయోగించాలి?
16 పౌలు ఇలా రాశాడు, “యెహోవా పవిత్రశక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.” (2 కొరిం. 3:17) యెహోవా స్వేచ్ఛను ఇష్టపడతాడు, మీరు కూడా స్వేచ్ఛను ఇష్టపడేలా ఆయన సృష్టించాడు. కానీ మీకున్న స్వేచ్ఛను తెలివిగా ఉపయోగించి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. బహుశా మీ తోటివాళ్లలో కొంతమంది అశ్లీల చిత్రాలు చూస్తుండవచ్చు, లైంగిక పాపాలు చేస్తుండవచ్చు, ప్రమాదకరమైన ఆటలు ఆడుతుండవచ్చు, డ్రగ్స్ లేదా మద్యం తీసుకుంటుండవచ్చు. మొదట్లో అవి సరదాగా లేదా ఉత్తేజకరంగా అనిపించవచ్చు, కానీ అవి తరచూ రోగాల బారినపడ్డానికి, చెడు వ్యసనాలకు అలవాటుపడ్డానికి, ఆఖరికి చావుకు కూడా దారితీస్తాయి. (గల. 6:7, 8) ఇలాంటి పనులు చేసే యౌవనులు తమకు స్వేచ్ఛ ఉందని అనుకోవచ్చు, కానీ అది నిజమైన స్వేచ్ఛ కాదు!—తీతు 3:3.
17, 18. (ఎ) దేవునికి లోబడితే మనకు నిజమైన స్వేచ్ఛ ఉంటుందని ఎలా చెప్పవచ్చు? (బి) నేడున్న మనుషుల కన్నా ఒకప్పుడు ఆదాముహవ్వలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవించారని ఎందుకు చెప్పవచ్చు?
17 మరోవైపు, యెహోవాకు లోబడడం మనకు మేలు చేస్తుంది. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాం. (కీర్త. 19:7-11) మీరు మీ స్వేచ్ఛను తెలివిగా ఉపయోగిస్తే, అంటే దేవుని పరిపూర్ణ ఆజ్ఞల్ని, సూత్రాల్ని పాటిస్తే బాధ్యతగల వ్యక్తులని దేవునికి, మీ తల్లిదండ్రులకు చూపించిన వాళ్లవుతారు. అప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంకా ఎక్కువ నమ్ముతారు, ఎక్కువ స్వేచ్ఛను ఇస్తారు. అంతేకాదు, తన నమ్మకమైన సేవకులందరికీ త్వరలోనే పరిపూర్ణ స్వేచ్ఛను ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. దాన్నే “దేవుని పిల్లలు ఆస్వాదించే మహిమగల స్వాతంత్ర్యం” అని బైబిలు పిలుస్తుంది.—రోమా. 8:21.
18 ఆదాముహవ్వలు అలాంటి స్వేచ్ఛనే అనుభవించారు. వాళ్లు ఏదెను తోటలో ఉన్నప్పుడు, ఒకే ఒక్క పని చేయొద్దని దేవుడు వాళ్లకు చెప్పాడు. ఒక చెట్టు ఫలాన్ని తినకూడదని ఆయన చెప్పాడు. (ఆది. 2:9, 17) దేవుడు ఆ ఆజ్ఞ ఇవ్వడం అన్యాయమనీ, కట్టుదిట్టం చేసినట్లనీ అనుకుంటున్నారా? ఎంతమాత్రం కాదు! ఎందుకంటే నేడు మనుషులు ఎన్నో నియమాలు పెట్టి, వాటిని పాటించమని బలవంతం చేస్తున్నారు. కానీ యెహోవా ఆదాముహవ్వలకు కేవలం ఒకే ఒక్క నియమం పెట్టాడు.
19. మనం నిజమైన స్వేచ్ఛను అనుభవించడానికి యెహోవా, యేసు ఏం నేర్పిస్తున్నారు?
19 యెహోవా మనతో చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. ఆయన మనకు చాలా నియమాలు ఇచ్చే బదులు, ప్రేమ నియమాన్ని పాటించమని ఓపిగ్గా నేర్పిస్తున్నాడు. తన సూత్రాల ప్రకారం జీవిస్తూ, చెడును అసహ్యించుకోమని ఆయన చెప్తున్నాడు. (రోమా. 12:9) ప్రజలు తప్పు చేయడానికి గల కారణాన్ని యేసు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో చెప్పాడు. (మత్త. 5:27, 28) దేవుని రాజ్యానికి రాజుగా యేసు కొత్త లోకంలో కూడా, తప్పొప్పులను తనలా చూడడం ఎలాగో మనకు నేర్పిస్తూనే ఉంటాడు. (హెబ్రీ. 1:9) మనం మానసికంగా, శారీరకంగా పరిపూర్ణులం అయ్యేలా యేసు చేస్తాడు. కొత్త లోకంలో, మనకు చెడు చేయాలనే ఆలోచన కూడా రాదు, అపరిపూర్ణత వల్ల వచ్చిన ఎలాంటి బాధలు ఉండవు. అప్పుడు జీవితం ఎంత బాగుంటుందో ఊహించండి! చివరికి, మనం యెహోవా మాటిచ్చిన “మహిమగల స్వాతంత్ర్యాన్ని” అనుభవిస్తాం.
20. (ఎ) యెహోవా తన స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తాడు? (బి) ఆయన్ని మనమెలా అనుకరించవచ్చు?
20 కొత్త లోకంలో కూడా మన స్వేచ్ఛకు హద్దులు ఉంటాయి. ఏవిధంగా? మనం ఏం చేసినా దేవుని మీద, ఇతరుల మీద ఉన్న ప్రేమతోనే చేయాలి. మనం అలా చేసినప్పుడు, యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం. ఆయనకు హద్దుల్లేని స్వేచ్ఛ ఉన్నప్పటికీ మనతో ప్రేమగా వ్యవహరిస్తాడు. (1 యోహా. 4:7, 8) కాబట్టి మనం దేవున్ని అనుకరించినప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛను ఆనందించినట్లని చెప్పవచ్చు.
21. (ఎ) దావీదు యెహోవా గురించి ఎలా భావించాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
21 యెహోవా మీకిచ్చిన మంచివాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగివున్నారా? ఆయన మీకు ఆధ్యాత్మిక ఆహారాన్ని, మంచి స్నేహితుల్ని, చక్కని లక్ష్యాల్ని, భవిష్యత్తులో పరిపూర్ణ స్వేచ్ఛ పొందుతామనే నిరీక్షణను, ఇంకా ఎన్నో అద్భుతమైన బహుమానాల్ని ఇచ్చాడు. (కీర్త. 103:5) బహుశా మీరు కూడా దావీదులాగే భావిస్తుండవచ్చు. అతను యెహోవాకు ఇలా ప్రార్థించాడు, “జీవమార్గము నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.” (కీర్త. 16:11) 16వ కీర్తనలో ఉన్న ఇంకొన్ని విలువైన సత్యాల్ని తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మీరు శ్రేష్ఠమైన జీవితాన్ని సొంతం చేసుకోవడానికి అవి ఎలా సహాయం చేస్తాయో తెలుసుకోవచ్చు.