మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఈ సంవత్సరపు కావలికోట పత్రికను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:
యెహోవా “ఎంతో వాత్సల్యం గలవాడని,” “కరుణామయుడని” చెప్పడం ద్వారా యాకోబు 5:11 మనకు ఏ అభయాన్నిస్తుంది?
మన మీద కరుణతో యెహోవా మన పొరపాట్లను క్షమిస్తాడని మనకు తెలుసు. తన వాత్సల్యాన్ని బట్టి మనకు సహాయం కూడా చేస్తాడని యాకోబు 5:11 అభయాన్నిస్తుంది. మనం ఆయన్ని అనుకరించాలి.—w21.01, 21వ పేజీ.
యెహోవా శిరస్సత్వ ఏర్పాటును ఎందుకు చేశాడు?
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ ఏర్పాటు చేశాడు. ఆయన కుటుంబంలో శాంతి, క్రమపద్ధతి ఉండడానికి అది సహాయం చేస్తుంది. ఈ ఏర్పాటును పాటించే ప్రతీ కుటుంబ సభ్యునికి చివరి నిర్ణయం ఎవరు తీసుకోవాలో, దాన్ని ఎవరు అమలుచేయాలో తెలుస్తుంది.—w21.02, 3వ పేజీ.
మెసేజ్ యాప్‌లను ఉపయోగించే విషయంలో క్రైస్తవులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
ఒక వ్యక్తి ఆ యాప్‌లను ఉపయోగించాలనుకుంటే, వాటి ద్వారా స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎక్కువమంది ఉన్న మెసేజ్ గ్రూపుల్లో అలా ఎంచుకోవడం కష్టంగా ఉండవచ్చు. (1 తిమో. 5:13) పైగా ఆ యాప్‌ల వల్ల, నిజమో కాదో తెలియని వార్తల్ని వ్యాప్తి చేసే ప్రమాదం, సహోదరుల్ని వ్యాపార సంబంధమైన విషయాల్లో వాడుకునే ప్రమాదం ఉంది.—w21.03, 31వ పేజీ.
యేసు బాధలు పడి చనిపోయేలా దేవుడు అనుమతించడానికి కొన్ని కారణాలు ఏంటి?
మొదటిగా, యూదుల్ని ఒక శాపం నుండి విడిపించడానికి యేసు కొయ్య మీద వేలాడదీయబడాల్సి వచ్చింది. (గల. 3:10, 13) రెండవదిగా, తాను ప్రధాన యాజకుడిగా సేవ చేసేలా యెహోవా ఆయనకు శిక్షణ ఇవ్వడం కోసం. మూడవదిగా, యేసు మరణం వరకు యథార్థంగా ఉండడంవల్ల తీవ్రమైన పరీక్షలు వచ్చినా మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉండగలరని నిరూపించడం కోసం. (యోబు 1:9-11)—w21.04, 16-17 పేజీలు.
పరిచర్యలో ప్రజల్ని కలవడం కష్టంగా ఉంటే మీరేం చేయవచ్చు?
ప్రజల్ని కలవడానికి వాళ్లు ఇళ్ల దగ్గర ఉండే సమయాల్లో ప్రకటించడానికి ప్రయత్నించవచ్చు. వేర్వేరు చోట్ల ప్రకటించడానికి కూడా మీరు ప్రయత్నించవచ్చు. అలాగే వేర్వేరు పద్ధతుల్లో అంటే ఉత్తరాల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నించవచ్చు.—w21.05, 15-16 పేజీలు.
“ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాను” అని అపొస్తలుడైన పౌలు అన్న మాటలకు అర్థమేంటి? (గల. 2:19)
ధర్మశాస్త్రం మనుషుల అపరిపూర్ణతను వెల్లడి చేసి, ఇశ్రాయేలీయుల్ని క్రీస్తు వైపుకు నడిపించింది. (గల. 3:19, 24) దానివల్ల పౌలు యేసును అంగీకరించాడు. ఆ విధంగా పౌలు, “ధర్మశాస్త్రం విషయంలో చనిపోయాడు,” అంటే ఆయన ధర్మశాస్త్రం కింద ఇక లేడు.—w21.06, 31వ పేజీ.
సహనం చూపించే విషయంలో యెహోవా మనకెలా ఆదర్శాన్ని ఉంచాడు?
తన పేరు మీద పడిన నిందను, తన సర్వాధిపత్యానికి ఎదురైన వ్యతిరేకతను, తన పిల్లల్లో కొంతమంది చేసిన తిరుగుబాటును, అపవాది చెప్పే అబద్ధాల్ని, తనకు ఇష్టమైన సేవకులు బాధపడడాన్ని, తన స్నేహితులు చనిపోవడం వల్ల దూరమవ్వడాన్ని, చెడ్డ ప్రజలు ఇతరులకు చేసే హానిని, తాను సృష్టించిన భూమిని మనుషులు పాడుచేయడాన్ని యెహోవా సహించాడు.—w21.07, 9-12 పేజీలు.
ఓపిగ్గా ఉండే విషయంలో యోసేపు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?
ఆయన తన అన్నల చేతిలో అన్యాయాన్ని సహించాడు. ఆ తర్వాత అబద్ధ ఆరోపణకు గురై, ఐగుప్తులో చాలా సంవత్సరాలు జైళ్లో వేయబడ్డాడు.—w21.08, 11వ పేజీ.
హగ్గయి 2:6-9, 20-22 వచనాలు ఏ సూచనార్థక కంపన గురించి చెప్తున్నాయి?
చాలా దేశాలు రాజ్య ప్రకటనా పనిని వ్యతిరేకించాయి కానీ అనేకమంది ప్రజలు సత్యం వైపుకు ఆకర్షించబడ్డారు. త్వరలో దేశాలు నాశనం చేయబడినప్పుడు, అవి చివరిసారి కంపించబడతాయి.—w21.09, 15-19 పేజీలు.
మనం పట్టుదలగా పరిచర్యను ఎందుకు చేస్తూ ఉండాలి?
పరిచర్యలో మనం చేసే కృషిని యెహోవా చూస్తాడు, దాన్నిబట్టి సంతోషిస్తాడు. మనం మానకుండా లేదా అలసిపోకుండా పరిచర్య చేస్తే, శాశ్వత జీవితాన్ని పొందుతాం.—w21.10, 25-26 పేజీలు.
“మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి” అనే సలహాను పాటించడానికి లేవీయకాండం 19వ అధ్యాయం ఎలా సహాయం చేస్తుంది? (1 పేతు. 1:15)
పేతురు ఆ మాటల్ని లేవీయకాండం 19:2 నుండి రాసుంటాడు. 1 పేతురు 1:15 లో ఉన్న సలహాను మన రోజువారీ జీవితంలో ఎలా పాటించవచ్చో తెలియజేసే ఎన్నో ఉదాహరణలు లేవీయకాండం 19వ అధ్యాయంలో ఉన్నాయి.—w21.12, 3-4 పేజీలు.