కొత్త సంఘానికి అలవాటుపడేందుకు మీరేమి చేయవచ్చు?
“ఈ ప్రాంతానికి మారేటప్పుడు భయమేసింది. ఎవరైనా స్నేహితులు అవుతారో లేదో, నాతో కలుస్తారో లేదోనని కంగారుపడ్డాను” అని కొత్త సంఘానికి అలవాటుపడుతున్న ఆదిత్య a చెప్తున్నాడు. ఆ సంఘం, ఆయన ఇంటికి దాదాపు 1400 కి.మీ. దూరంలో ఉంది.
ఒకవేళ మీరు వేరేప్రాంతంలోని సంఘానికి మారివుంటే, మీకు కూడా అలానే అనిపించి ఉండవచ్చు. మరి ఆ సంఘానికి అలవాటుపడేందుకు మీరేమి చేయవచ్చు? అలవాటుపడడం మీరనుకున్న దానికన్నా కష్టంగా అనిపిస్తుంటే ఏమి చేయవచ్చు? ఒకవేళ మీరు వేరే సంఘానికి మారకపోతే, వేరే ప్రాంతం నుండి మీ సంఘానికి వచ్చినవాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు?
మీరెలా అలవాటుపడి, అభివృద్ధి చెందవచ్చు?
ఒకసారి ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. చెట్లను ఒకచోట నుండి తీసి మరోచోట నాటినప్పుడు వాటిపై ఒత్తిడి పడుతుంది. చెట్టును నేలనుండి తీస్తున్నప్పుడు, రవాణాకు వీలుగా ఉండడం కోసం దాని వేర్లలో చాలావాటిని నరికేస్తారు. కానీ ఆ చెట్టును వేరేచోట నాటిన తర్వాత దానికి వెంటనే కొత్త వేర్లు వస్తాయి. అదేవిధంగా ఒక సంఘం నుండి మరో సంఘానికి మారినప్పుడు మీరు కూడా ఎంతో ఒత్తిడికి గురైవుంటారు. అప్పటివరకు ఉన్న సంఘంలో మీరు చక్కగా వేళ్లూనిపోయి ఉంటారు. అంటే మీకు మంచి స్నేహితులు ఉండివుంటారు, మంచి ఆధ్యాత్మిక ప్రణాళికకు అలవాటుపడిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలా మార్పులు చేసుకోవాలంటే ఏమి చేయాలి? లేఖన సూత్రాలను పాటించాలి. వాటిలో కొన్నిటిని చూద్దాం.
ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి, ‘నీటి కాలువల పక్కన నాటబడి, దాని కాలంలో ఫలాలు ఇస్తూ, ఆకులు వాడని చెట్టులా ఉంటాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.’—కీర్త. 1:1-3, NW.
చెట్టు బలంగా ఉండాలంటే అది ఎలాగైతే నీళ్లను క్రమంగా పీల్చుకోవాలో, అలాగే క్రైస్తవులు కూడా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలంటే క్రమంగా దేవుని వాక్యం చదవాలి. కాబట్టి ప్రతీరోజు బైబిలు చదువుతూ ఉండండి, సంఘంలో జరిగే మీటింగ్స్‌కు క్రమంగా వెళ్లండి. అలాగే కుటుంబ ఆరాధన, వ్యక్తిగత అధ్యయనం లాంటివి మానకుండా చేసుకోండి. ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి ఇంతకుముందు ఉన్న ప్రాంతంలో మీరేమి చేశారో, ఇప్పుడు కూడా అవి చేయాలి.
‘ఇతరుల్ని సేదదీర్చే వాళ్లు తాము కూడా సేదదీర్పు పొందుతారు.’—సామె. 11:25, NW.
ప్రీచింగ్ ఎక్కువ చేయడం వల్ల మీరు బలం పొందుతారు, మార్పులకు త్వరగా అలవాటుపడతారు. సంఘపెద్దగా సేవ చేస్తున్న కెవిన్ ఇలా అంటున్నాడు, “కొత్త సంఘానికి మారగానే నేనూ, నా భార్య సహాయ పయినీరు సేవ చేశాం, అది చాలా సహాయపడింది. సంఘంలోని సహోదరులు, పయినీర్లు త్వరగా పరిచయమయ్యారు. ఇంకా ఆ క్షేత్రానికి కూడా త్వరగా అలవాటుపడ్డాం.” తన ఇంటికి 1600 కి.మీ. దూరంలో ఉన్న మరో ప్రాంతానికి మారిన రోజర్ ఇలా చెప్తున్నాడు, “కొత్త సంఘానికి అలవాటుపడడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే వీలైనంత ఎక్కువగా ప్రీచింగ్ చేయడం. దాంతోపాటు, మీరు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని సంఘపెద్దలకు చెప్పండి. అంటే రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడం, మీటింగ్‌లో ఏదైనా నియామకాన్ని స్వచ్ఛందంగా చేయడం, లేదా ఎవరినైనా బండిమీద మీటింగ్‌కు తీసుకురావడం లాంటివి. స్వయంత్యాగస్ఫూర్తి చూపించే కొత్తవాళ్లతో సహోదరసహోదరీలు త్వరగా కలిసిపోతారు.”
“మీ హృదయాలను విశాలంగా తెరచుకోండి.”—2 కొరిం. 6:13.
వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో సహోదర ప్రేమ చూపించండి. కొత్త సంఘానికి మారిన మాధవి, ఆమె కుటుంబం కొత్త స్నేహితుల్ని చేసుకోవడంపై మనసుపెట్టారు. మాధవి ఇలా
చెప్తోంది, “మీటింగ్‌కి ముందు, ఆ తర్వాత రాజ్యమందిరంలోని సహోదరసహోదరీల్ని కలిసేవాళ్లం. దానివల్ల కేవలం పలకరించడం మాత్రమే కాకుండా ఎక్కువసేపు మాట్లాడడం వీలయ్యేది.” సంఘంలోని వాళ్ల పేర్లు త్వరగా గుర్తుపెట్టుకోవడానికి కూడా అది వాళ్లకు సహాయం చేసింది. దాంతోపాటు సంఘంలోనివాళ్లను తమ ఇంటికి పిలవడంవల్ల కొత్త స్నేహితులతో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, “సంఘ పనులకు, ఇతర పనులకు అందుబాటులో ఉండడం కోసం మేం వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకొని, మా నంబర్లు ఇచ్చాం.”కొత్తవాళ్లతో మాట్లాడడానికి మీకు భయంగా అనిపిస్తే, అలవాటు చేసుకోవడానికి మెల్లగా ప్రయత్నించండి. ఉదాహరణకు చిరునవ్వు చిందించండి. మొదట్లో అలా చేయడం కష్టమనిపించినా ప్రయత్నించండి. చిన్న చిరునవ్వు మిమ్మల్ని ఇతరులకు దగ్గర చేస్తుంది. తన ప్రాంతం నుండి వేరేచోటుకు మారిన రేచల్ ఏమంటుందంటే, “నేను మామూలుగా ఎవరితోనూ త్వరగా కలిసిపోను. కొత్త సంఘంలోని సహోదరసహోదరీలతో మాట్లాడడానికి కొన్నిసార్లు నన్ను నేను ప్రోత్సహించుకోవాల్సి వస్తుంది. నాలాగే బిడియంగా ఉంటూ, ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చున్న వాళ్లకోసం రాజ్యమందిరంలో వెతికేదాన్ని.” ప్రతీ మీటింగ్‌కి ముందు లేదా ఆ తర్వాత కొత్తవాళ్లతో మాట్లాడాలనే లక్ష్యాన్ని మీరెందుకు పెట్టుకోకూడదు?
మరోవైపు, కొత్తవాళ్లను కలిసి మాట్లాడాలనే ఉత్సాహం కేవలం మొదటి కొన్ని వారాలే ఉండవచ్చు. తర్వాత ఆ ఉత్సాహం చల్లబడిపోవచ్చు. అప్పుడు కూడా కొత్త స్నేహితుల్ని చేసుకుంటూ ఉండాలంటే మీరు కాస్త కృషి చేయాల్సి రావచ్చు.
అలవాటుపడేందుకు సమయం తీసుకోండి
కొన్ని చెట్లు, కొత్త వాతావరణానికి అలవాటుపడి బలంగా పాతుకుపోవడానికి చాలా సమయం పడుతుంది. అదేవిధంగా కొత్త సంఘానికి అలవాటుపడేందుకు కొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీరు కొత్త సంఘానికి మారి చాలా కాలమైనా ఇంకా అలవాటుపడడానికి ఇబ్బందిపడుతుంటే, ఈ బైబిలు సూత్రాల్ని పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు:
“మనం మానకుండా మంచి పనులు చేద్దాం, మనం అలసిపోకుండా ఉంటే సరైన సమయంలో పంట కోస్తాం.”—గల. 6:9.
అలవాటుపడడానికి మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం పడుతుంటే కంగారుపడకండి. ఉదాహరణకు, ఎంతోమంది మిషనరీలు తమ గిలియడ్ శిక్షణ పూర్తయిన తర్వాత నేరుగా తాము నియామకం పొందిన దేశానికే వెళ్లి చాలా ఏళ్లపాటు అక్కడే ఉంటారు. ఆ తర్వాతే తమ సొంత దేశంలో ఉన్నవాళ్లను చూడడానికి వెళ్తారు. దానివల్ల స్థానిక సహోదరులతో వాళ్లకు ఒక బంధం ఏర్పడుతుంది, వేరే సంస్కృతికి అలవాటుపడగలుగుతారు.
కొత్త ప్రాంతానికి అలవాటుపడడం కొన్నిరోజుల్లో అయ్యే పని కాదని, ఎన్నో ప్రాంతాలు మారిన ఆనంద్‌కు తెలుసు. ఆయనిలా చెప్తున్నాడు, “ఈ మధ్యకాలంలో మేం వేరే ప్రాంతానికి మారినప్పుడు నా భార్య నాతో, ‘నా స్నేహితులందరూ పాత సంఘంలో ఉన్నారు’ అని అంది.” అయితే రెండేళ్ల క్రితం వేరే ప్రాంతానికి మారినప్పుడు కూడా తను అదే మాట అన్నట్లు ఆనంద్ తన భార్యకు గుర్తుచేశాడు. కానీ ఆ రెండేళ్లలో ఆమె చూపించిన శ్రద్ధ వల్ల కొత్తవాళ్లు ఆమెకు దగ్గరి స్నేహితులయ్యారు.
‘“ఇప్పటికన్నా పాత రోజులే బావున్నాయి” అని అనకు, అలా అనడం తెలివి అనిపించుకోదు.’—ప్రసం. 7:10, NW.
మీరు ఒకప్పుడున్న సంఘంతో కొత్త సంఘాన్ని పోల్చకండి. ఉదాహరణకు, పాత సంఘంలోని వాళ్లతో పోలిస్తే కొత్త సంఘంలోని సహోదరులు ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాకపోవచ్చు లేదా మరీ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కావచ్చు. ఇతరులు మీలోని మంచిని చూడాలని మీరు కోరుకున్నట్లే, మీరు కూడా వాళ్లలోని మంచి లక్షణాల్ని చూడండి. ఆశ్చర్యకరంగా, కొత్త ప్రాంతాలకు మారిన కొంతమంది, “నేను ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1 పేతు. 2:17.
సోదర బృందాన్ని’ నిజంగా ప్రేమిస్తున్నానా?” అని తమను తాము ప్రశ్నించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.—“అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది.”—లూకా 11:9.
సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండండి. “సొంత బలంతో తట్టుకోవడానికి ప్రయత్నించకండి” అని సంఘపెద్దగా సేవచేస్తున్న డేవిడ్ చెప్తున్నాడు. ముందు పేరాల్లో ప్రస్తావించబడిన రేచల్ కూడా అదే అంటోంది. ఆమె ఇలా చెప్తోంది, “చాలా విషయాల్ని కేవలం యెహోవా సహాయంతోనే మనం చేయగలం. దానిగురించి ప్రార్థించండి. నాకూ, నా భర్తకూ సంఘంలోని వాళ్లతో కలవడం కష్టంగా అనిపిస్తే ‘దేనివల్ల మేము ఇతరులకు దగ్గరవ్వలేకపోతున్నామో దయచేసి మాకు తెలియజేయి’ అని అడుగుతూ యెహోవాకు ప్రార్థిస్తాం. ఆ తర్వాత సహోదరసహోదరీలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాం.”
తల్లిదండ్రులారా, కొత్త సంఘానికి అలవాటుపడేందుకు మీ పిల్లలు ఇబ్బందిపడుతుంటే దానిగురించి వాళ్లతో కలిసి ప్రార్థించండి. సహోదరసహోదరీలతో స్నేహం చేసే అవకాశాల్ని మీ పిల్లలకు కల్పించండి.
సంఘంలోనివాళ్లతో కలిసిపోవడానికి కొత్తవాళ్లకు సహాయం చేయండి
మీ సంఘానికి కొత్తగా వచ్చిన వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు? వాళ్లకు నిజమైన స్నేహితులుగా ఉండడానికి మొదటి నుండి కృషిచేయండి. అలా చేయాలంటే, మీరే వాళ్ల స్థానంలో ఉంటే ఇతరులు మీకేమి చేయాలని కోరుకుంటారో ఆలోచించి, దాన్నే మీరు వాళ్లకు చేయండి. (మత్త. 7:12) మీతో కలిసి కుటుంబ ఆరాధన చేసుకోవడానికి లేదా ప్రతీనెల వచ్చే JW బ్రాడ్‌కాస్టింగ్ కార్యక్రమాన్ని చూడడానికి రమ్మని కొత్తవాళ్లను ఆహ్వానించగలరా? మీతో కలిసి ప్రీచింగ్‌కి రమ్మని పిలవగలరా? వాళ్లతో కలిసి భోజనం చేస్తూ మీరు గడిపిన క్షణాల్ని వాళ్లు ఎంతోకాలం గుర్తుంచుకుంటారు. కొత్తవాళ్లకు మీరింకా ఏవిధంగా సహాయం చేయవచ్చు?
కార్తిక్ ఇలా చెప్తున్నాడు, “మేం కొత్త సంఘానికి వచ్చినప్పుడు, అక్కడున్న ఒక సహోదరి తక్కువ రేట్లకు సరుకులు దొరికే షాపుల లిస్టు మాకు ఇచ్చింది. అది మాకు చాలా ఉపయోగపడింది.” వేరే వాతావరణ పరిస్థితుల నుండి వచ్చినవాళ్లకు మీ ప్రాంతంలోని వేసవి కాలంలో, చలికాలంలో, వర్షాకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్తే వాళ్లకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు కొత్తవాళ్లు ప్రీచింగ్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు వీలుగా, మీ ప్రాంత ప్రజల నేపథ్యం లేదా స్థానిక మత నమ్మకాల గురించిన వివరాలు వాళ్లకు చెప్పవచ్చు.
అలవాటుపడేందుకు మీరు చేసే కృషి వృథాకాదు
ఆర్టికల్ మొదట్లో ప్రస్తావించబడిన ఆదిత్య మీకు గుర్తున్నాడా? ఆయన కొత్త సంఘానికి మారి సంవత్సరం పైనే అయ్యింది. ఆయనిలా చెప్తున్నాడు, “మొదట్లో సహోదరసహోదరీలతో మాట్లాడడానికి చాలా ఇబ్బందిపడేవాడిని. ఇప్పుడు వాళ్లు నన్ను కుటుంబంలో ఒకడిగా చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది.” వేరే సంఘానికి మారడంవల్ల పాత స్నేహితుల్ని పోగొట్టుకోలేదని ఆదిత్య గ్రహించాడు. బదులుగా చిరకాలం ఉండే కొత్త స్నేహితుల్ని సంపాదించుకున్నాడు.
a అసలు పేర్లు కావు.