అధ్యయన ఆర్టికల్ 46
మీ “విశ్వాసం అనే పెద్ద డాలును” జాగ్రత్తగా చూసుకుంటున్నారా?
“విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి.”—ఎఫె. 6:16.
పాట 119 మనకు విశ్వాసం ఉండాలి
ఈ ఆర్టికల్‌లో . . . a
1-2. (ఎ) ఎఫెసీయులు 6:16 ప్రకారం, మనకు “విశ్వాసం అనే పెద్ద డాలు” ఎందుకు అవసరం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
“విశ్వాసం అనే పెద్ద డాలు” మీకుందా? (ఎఫెసీయులు 6:16 చదవండి.) తప్పకుండా ఉండివుంటుంది. ఒక పెద్ద డాలు దాదాపు శరీరాన్నంతా కాపాడినట్లే, మీ విశ్వాసం కూడా ఈ లోకంలోని చెడు విషయాల నుండి అంటే అనైతికత, హింస అలాగే దేవుని ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న ప్రతీదాని నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
2 అయితే, మనందరం “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం కాబట్టి మన విశ్వాసానికి పరీక్షలు ఎదురౌతూనే ఉంటాయి. (2 తిమో. 3:1) మరి మీ విశ్వాసం అనే డాలు మంచిస్థితిలో ఉందో లేదో ఎలా పరిశీలించుకోవచ్చు? దాన్ని ఎలా గట్టిగా పట్టుకొని ఉండవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం.
మీ డాలును జాగ్రత్తగా పరిశీలించుకోండి
3. సైనికులు తమ డాలును ఎలా కాపాడుకునేవాళ్లు? ఎందుకు?
3 బైబిలు కాలాల్లో, సైనికులు ఎక్కువగా తోలుతో కప్పబడిన డాలునే ఉపయోగించేవాళ్లు. ఆ తోలు పాడవ్వకుండా, అలాగే ఇనుముతో చేసిన ఇతర భాగాలు తుప్పు పట్టకుండా సైనికులు డాలుకు నూనె రాసేవాళ్లు. ఒకవేళ తన డాలు పాడైందని సైనికుడు గమనిస్తే దాన్ని వెంటనే బాగు చేసుకుంటాడు. అలా అతను ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. ఈ ఉదాహరణకు, మన విశ్వాసానికి ఎలాంటి సంబంధం ఉంది?
4. మీ విశ్వాసం అనే డాలును ఎందుకు పరిశీలించుకోవాలి? ఎలా పరిశీలించుకోవచ్చు?
4 ప్రాచీన కాలంలోని సైనికుల్లాగే, మీరు కూడా మీ విశ్వాసం అనే డాలును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, అది మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మీరు ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. క్రైస్తవులమైన మనం ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో మన శత్రువులైన చెడ్డదూతలతో పోరాడుతున్నాం. (ఎఫె. 6:10-12) మీ విశ్వాసం అనే డాలు మంచిస్థితిలో ఉండేలా మీరే చూసుకోవాలి, మీకోసం దాన్ని వేరేవాళ్లు చేయలేరు. అయితే, పరీక్షలు ఎదురైనప్పుడు మీ విశ్వాసం బలంగా ఉండాలంటే ఏం చేయవచ్చు? ముందుగా, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. ఆ తర్వాత బైబిలు సహాయంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో అర్థంచేసుకోండి. (హెబ్రీ. 4:12) బైబిలు ఇలా చెప్తుంది, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.” (సామె. 3:5, 6) ఆ మాటల్ని మనసులో ఉంచుకొని, ఈ మధ్యకాలంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, మీకు తీవ్రమైన ఆర్థిక సమస్య ఎదురైందా? అప్పుడు హెబ్రీయులు 13:5లో “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను” అని యెహోవా చేసిన వాగ్దానం మీకు గుర్తొచ్చిందా? ఆ వాగ్దానం, దేవుడు మీకు సహాయం చేస్తాడనే ధైర్యాన్ని ఇచ్చిందా? అలాగైతే, మీ విశ్వాసం అనే డాలును మీరు మంచి స్థితిలో ఉంచుకుంటున్నారని అర్థం.
5. మీ విశ్వాసాన్ని పరిశీలించుకున్నప్పుడు మీకేం కనిపించవచ్చు?
5 మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు మీరు ఊహించని విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోయి ఉండవచ్చు. బహుశా, మీరు కొంతకాలంగా గమనించుకోని ఒక బలహీనత మీలో కనిపించవచ్చు. ఉదాహరణకు అతిగా చింతించడం, అబద్ధాలు, నిరుత్సాహం వంటివి మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయని మీరు గుర్తించివుంటారు. ఒకవేళ అదే జరిగితే, మీ విశ్వాసం మరింత సన్నగిల్లకుండా ఎలా కాపాడుకోవచ్చు?
అతిగా చింతించడం, అబద్ధాలు, నిరుత్సాహం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి
6. మనం ఎలాంటి విషయాల గురించి ఆలోచించడం తప్పుకాదు?
6 కొన్ని విషయాల గురించి ఆలోచించడం మంచిదే. ఉదాహరణకు మనం యెహోవాను, యేసును సంతోషపెట్టడం గురించి ఆలోచిస్తాం. (1 కొరిం. 7:32) మనం ఏదైనా గంభీరమైన పాపం చేస్తే, దేవునితో తిరిగి మంచి సంబంధం కలిగివుండడం గురించి ఎంతో ఆలోచిస్తాం. (కీర్త. 38:18) అంతేకాదు మన వివాహజతను సంతోషపెట్టడం గురించి, కుటుంబ సభ్యుల, తోటి సహోదరసహోదరీల బాగోగుల గురించి కూడా ఆలోచిస్తాం.—1 కొరిం. 7:33; 2 కొరిం. 11:28.
7. సామెతలు 29:25 ప్రకారం, మనుషులకు భయపడితే ఏం జరిగే అవకాశం ఉంది?
7 మరోవైపు, కొన్ని విషయాల గురించి అతిగా చింతించడం వల్ల మన విశ్వాసం సన్నగిల్లవచ్చు. ఉదాహరణకు సరిపడా ఆహారం, బట్టలు ఉంటాయో లేవో అని మనం ఆందోళన పడుతుండవచ్చు. (మత్త. 6:31, 32) ఆ ఆందోళన తగ్గించుకోవడానికి మనం వస్తుసంపదల్ని కూడబెట్టుకోవడం మీద మనసుపెట్టే అవకాశం ఉంది. ఆఖరికి, డబ్బు మీద ప్రేమను పెంచుకునే ప్రమాదం కూడా ఉంది. అలా జరగడానికి అనుమతిస్తే, యెహోవా మీద విశ్వాసం సన్నగిల్లిపోయి, ఆయనతో మనకున్న స్నేహం పాడౌతుంది. (మార్కు 4:19; 1 తిమో. 6:10) లేదా మనం ఇతరుల ఆమోదం పొందడం గురించి కూడా అతిగా చింతించే అవకాశం ఉంది. అప్పుడు యెహోవాను బాధపెడతామేమో అనే భయం కన్నా ఇతరులు మనల్ని ఎగతాళి చేస్తారేమో లేదా హింసిస్తారేమో అనే భయమే మనకు ఎక్కువ ఉంటుంది. ఆ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే, మనుషుల భయాన్ని అధిగమించడానికి కావాల్సిన విశ్వాసం, ధైర్యం ఇవ్వమని యెహోవాను వేడుకోవాలి.—సామెతలు 29:25 చదవండి; లూకా 17:5.
8. అబద్ధాలకు మనమెలా స్పందించాలి?
8 “అబద్ధానికి తండ్రి” అయిన సాతాను తన అధీనంలో ఉన్నవాళ్లను ఉపయోగించుకొని యెహోవా గురించి, మన సహోదరసహోదరీల గురించి అబద్ధాల్ని వ్యాప్తి చేస్తాడు. (యోహా. 8:44) ఉదాహరణకు మతభ్రష్టులు ఇంటర్నెట్‌లో, టీవీలో అలాగే మరితర మాధ్యమాల్లో యెహోవా సంస్థ గురించి అబద్ధాలు వ్యాప్తి చేస్తారు, వాస్తవాలను మార్చి చెప్తారు. సాతాను ఉపయోగించే ‘అగ్ని బాణాల్లో’ ఆ అబద్ధాలు కూడా ఉన్నాయి. (ఎఫె. 6:16) అయితే, అలాంటి అబద్ధాల గురించి మనతో ఎవరైనా మాట్లాడితే ఏం చేయాలి? వాటిని మనం అస్సలు వినకూడదు! ఎందుకు? ఎందుకంటే, మనకు యెహోవా మీద విశ్వాసం ఉంది, సహోదరుల మీద నమ్మకం ఉంది. నిజానికి, మనం మతభ్రష్టులతో ఏ విధంగానైనా, ఏ కారణంతోనైనా మాట్లాడడానికి ప్రయత్నించం, ఆఖరికి కుతూహలంతోనైనా వాళ్లతో వాదించాలని చూడం.
9. నిరుత్సాహం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
9 నిరుత్సాహం వల్ల మన విశ్వాసం సన్నగిల్లవచ్చు. మనకున్న సమస్యల్ని బట్టి కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. నిజానికి, మనం మన సమస్యల్ని పట్టించుకోవాలి కానీ వాటిగురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండకూడదు. అలాచేస్తే, యెహోవా మనకిచ్చిన అద్భుతమైన నిరీక్షణను మర్చిపోయే ప్రమాదం ఉంది. (ప్రక. 21:3, 4) నిరుత్సాహం మన శక్తిని నీరుగార్చి, మనం యెహోవా సేవను ఆపేసేలా చేయగలదు. (సామె. 24:10) కానీ మన విషయంలో అలా జరగకుండా జాగ్రత్తపడాలి.
10. ఒక సహోదరి రాసిన ఉత్తరం నుండి మనమేం నేర్చుకోవచ్చు?
10 అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసుకుంటూనే తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటుందో పరిశీలించండి. ఆమె ప్రధాన కార్యాలయానికి రాసిన ఉత్తరంలో ఇలా చెప్పింది, “మేము ఉన్న పరిస్థితిని బట్టి మాకు ఒత్తిడి, కొన్నిసార్లు నిరుత్సాహం కూడా కలుగుతుంది. కానీ మా నిరీక్షణ బలంగా ఉంది. మా విశ్వాసాన్ని బలపర్చడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి యెహోవా ఇస్తున్న ప్రతీదాన్ని బట్టి నేను ఆయనకు ఎంతో రుణపడివున్నాను. మాకు అలాంటి సలహా, ప్రోత్సాహం నిజంగా అవసరం. వాటివల్ల, సాతాను మమ్మల్ని బలహీనపర్చడానికి ఉపయోగించే సవాళ్లను ఎదుర్కొని యెహోవా సేవలో కొనసాగగలుగుతున్నాం.” ఆ సహోదరి మాటల్నిబట్టి, మనం కూడా నిరుత్సాహాన్ని అధిగమించగలమని అర్థమౌతుంది. ఎలా? మీ సమస్యల్ని, సాతానును ఎదిరించడానికి దొరికిన అవకాశంగా చూడండి. యెహోవా మిమ్మల్ని ఓదారుస్తాడని నమ్మండి. ఆయనిచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్నిబట్టి కృతజ్ఞత కలిగివుండండి.
11. మన విశ్వాసం బలంగా ఉందో లేదో పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
11 మీ విశ్వాసం బలంగా ఉందో లేదో పరిశీలించుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు. గత కొన్ని నెలల్లో మీరు అతిగా చింతించకుండా ఉండగలిగారా? మతభ్రష్టులు వ్యాప్తి చేసే అబద్ధాల్ని వినకుండా, వాళ్లతో వాదించకుండా ఉండగలిగారా? నిరుత్సాహాన్ని అధిగమించగలిగారా? మీరు అవన్నీ చేసివుంటే, మీ విశ్వాసం అనే డాలు మంచిస్థితిలో ఉన్నట్టే. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సాతాను మనపై వేరే ఆయుధాల్ని కూడా ప్రయోగిస్తాడు. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
వస్తుసంపదలపై మోజు పెంచుకోకండి
12. వస్తుసంపదలపై మోజు పెంచుకుంటే ఏం జరిగే ప్రమాదం ఉంది?
12 వస్తుసంపదలపై మోజు పెంచుకుంటే మన విశ్వాసం సన్నగిల్లి, యెహోవా సేవను ఎక్కువగా చేయలేకపోవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వాణిజ్య సంబంధ వ్యాపారాల్లో పాల్గొనడు. ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు.” (2 తిమో. 2:4) నిజానికి, రోమా సైనికులకు వ్యాపారం చేయడానికి అనుమతి ఉండేది కాదు. ఒకవేళ సైనికులు ఆ నియమాన్ని పాటించకపోతే ఏం జరగవచ్చు?
13. సైనికులు ఎందుకు వ్యాపారం చేయకూడదు?
13 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక సైనికుల గుంపు ఉదయాన్నే తమ ఖడ్గాలతో సాధన చేస్తున్నారు, కానీ ఒక సైనికుడు మాత్రం అక్కడ లేడు. అతను సంతలో ఆహారాన్ని అమ్మే వ్యాపారంలో మునిగిపోయాడు. సాయంత్రం, సైనికులు తమ కవచాల్ని పరిశీలించుకొని, ఖడ్గాలకు పదును పెట్టుకుంటున్నారు. కానీ వ్యాపారం చేసే సైనికుడు మాత్రం తర్వాతి రోజు అమ్మబోయే ఆహారం సిద్ధం చేసుకుంటున్నాడు. మరుసటి రోజు ఉదయం, శత్రువులు హఠాత్తుగా దాడిచేశారు. అప్పుడు ఎవరు ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండి, సైనికాధికారిని సంతోషపెడతారు? ఒకవేళ మీరు ఆ యుద్ధంలో పాల్గొంటే, ఏ సైనికుని పక్కన ఉండాలనుకుంటారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుని పక్కనా? లేదా వ్యాపారంలో మునిగిపోయిన సైనికుని పక్కనా?
14. క్రీస్తు సైనికులముగా మనకు ఏది విలువైనది?
14 మనం మంచి సైనికుల్లా ఉన్నాం. మన సైనికాధికారులైన యెహోవాను, యేసుక్రీస్తును సంతోషపెట్టడమే మనకు అన్నిటికన్నా ముఖ్యం. సాతాను లోకంలో మనం పొందే దేనికన్నా అదే మనకు చాలా విలువైనది. యెహోవా సేవ చేయడానికి, విశ్వాసం అనే డాలును అలాగే ఆధ్యాత్మిక కవచంలో ఉన్న మిగతావాటిని మంచి స్థితిలో ఉంచుకోవడానికి కావాల్సిన సమయం, శక్తి ఉండేలా చూసుకుంటాం.
15. పౌలు మనకు ఏ హెచ్చరిక ఇచ్చాడు? ఎందుకు?
15 మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే, ‘ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు విశ్వాసం నుండి తొలగిపోతారు’ అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 తిమో. 6:9, 10) ‘తొలగిపోతారు’ అనే పదం, మనకు అవసరంలేని వస్తువుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ పక్కదారి పట్టే ప్రమాదాన్ని సూచిస్తుంది. దానివల్ల మన హృదయంలో “ఎన్నో హానికరమైన వెర్రి కోరికలు” కలగవచ్చు. అయితే, మన విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి సాతాను అలాంటి కోరికల్ని ఆయుధాల్లా ఉపయోగిస్తున్నాడని గుర్తుంచుకోవాలి.
16. మార్కు 10:17-22 లో ఉన్న వృత్తాంతం, మనం ఏ ప్రశ్నలు వేసుకునేలా ప్రోత్సహిస్తుంది?
16 బహుశా ఎక్కువ వస్తువులు కొనుక్కునే స్తోమత మనకు ఉండవచ్చు. అయితే, అవసరం లేకపోయినా మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం తప్పా? కాకపోవచ్చు. కానీ ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ఫలానా వస్తువు కొనే స్తోమత ఉన్నా దాన్ని వాడుకునేంత, మంచిస్థితిలో ఉంచుకునేంత సమయం, శక్తి మనకున్నాయా? అంతేకాదు, మనం వస్తువుల్ని ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టే ప్రమాదం ఉందా? వస్తుసంపదలపై మనకున్న ప్రేమ వల్ల, దేవుని సేవ ఎక్కువ చేయమని యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన యువకునిలా ప్రవర్తించే అవకాశం ఉందా? (మార్కు 10:17-22 చదవండి.) సాదాసీదాగా జీవిస్తూ మన విలువైన సమయాన్ని, శక్తిని దేవుని ఇష్టం చేయడానికి ఉపయోగించడం ఎంత మంచిదో కదా!
విశ్వాసం అనే డాలును గట్టిగా పట్టుకొని ఉండండి
17. మనం ఏ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు?
17 మనం యుద్ధంలో ఉన్నామని ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ యుద్ధంలో మనం ప్రతీరోజు పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. (ప్రక. 12:17) విశ్వాసం అనే డాలును సహోదరసహోదరీలు మనకోసం పట్టుకోలేరు, దాన్ని మనమే గట్టిగా పట్టుకోవాలి. అంటే, మన విశ్వాసాన్ని మనమే బలంగా ఉంచుకోవాలి.
18. ప్రాచీన కాలాల్లోని సైనికులు తమ డాళ్లను ఎందుకు గట్టిగా పట్టుకునేవాళ్లు?
18 ప్రాచీన కాలాల్లో, యుద్ధంలో ధైర్యం చూపించిన సైనికుడిని గౌరవించేవాళ్లు. ఒకవేళ సైనికుడు యుద్ధం నుండి డాలు లేకుండా తిరిగి వస్తే అది అతనికి అవమానంగా ఉండేది. రోమా చరిత్రకారుడైన టాసిటస్ ఇలా రాశాడు, “ఒక సైనికుడు తన డాలును వదిలేసి వస్తే, అది అతనికి ఘోరమైన అవమానం.” కాబట్టి సైనికులు తమ డాళ్లను గట్టిగా పట్టుకోవడానికి అది కూడా ఒక కారణం.
19. విశ్వాసం అనే డాలును మనమెలా గట్టిగా పట్టుకొని ఉండవచ్చు?
19 విశ్వాసం అనే డాలును గట్టిగా పట్టుకోవాలంటే, మనం మీటింగ్స్‌కి క్రమంగా హాజరవ్వాలి, యెహోవా పేరు గురించి, ఆయన రాజ్యం గురించి ఇతరులకు చెప్పాలి. (హెబ్రీ. 10:23-25) అంతేకాదు, ప్రతీరోజు బైబిలు చదివి, అందులోని విషయాలు పాటించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాలి. (2 తిమో. 3:16, 17) అప్పుడు, మనకు విరోధంగా సాతాను ఉపయోగించే ఏ ఆయుధం కూడా మనకు శాశ్వత హాని చేయదు. (యెష. 54:17) “విశ్వాసం అనే పెద్ద డాలు” మనల్ని కాపాడుతుంది. దానివల్ల మనం స్థిరంగా నిలబడి, సహోదరసహోదరీలతో కలిసి ధైర్యంగా పనిచేస్తాం. మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రతీరోజు మనం చేసే పోరాటంలో గెలుస్తాం. అంతకన్నా ముఖ్యంగా సాతాను మీద, అతని అనుచరుల మీద యేసు విజయం సాధించినప్పుడు మనం ఆయనవైపు ఉంటాం.—ప్రక. 17:14; 20:10.
పాట 118 ‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’
a సైనికులు తమను తాము కాపాడుకోవాలంటే డాలు చాలా అవసరం. మన విశ్వాసాన్ని ఆ డాలుతో పోల్చవచ్చు. సైనికులు తమ డాలును జాగ్రత్తగా చూసుకున్నట్టే, మనం కూడా మన విశ్వాసం బలంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అయితే, మన “విశ్వాసం అనే పెద్ద డాలు” మంచి స్థితిలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.