కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కారు రేడియేటర్‌ను నింపడానికి ఆగిన జార్జ్‌ రోల్‌స్టన్‌, ఆర్థర్‌ విల్లస్‌ అనే పయినీర్లు.—ఉత్తర భాగం, 1933

ఆనాటి జ్ఞాపకాలు

“ప్రయాణించలేనంత కష్టమైన, దూరమైన రోడ్డంటూ ఏదీలేదు”

“ప్రయాణించలేనంత కష్టమైన, దూరమైన రోడ్డంటూ ఏదీలేదు”

అది మార్చి 26, 1937వ సంవత్సరం. ఇద్దరు వ్యక్తులు దుమ్ము పేరుకుపోయిన తమ ట్రక్కును మెల్లగా నడుపుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. వాళ్లు ప్రయాణం చేసీచేసీ బాగా అలసిపోయారు. వాళ్లు సంవత్సరం క్రితం ప్రయాణం మొదలుపెట్టి 19,300 కన్నా ఎక్కువ కి.మీ. దూరం ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతాల గుండా ఎగుడుదిగుడు రోడ్లమీద వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆర్థర్‌ విల్లస్‌, బిల్‌ న్యూలండ్స్‌ అనే పేరుగల ఆ ఇద్దరు వ్యక్తులు సాహసయాత్రికులు కాదు. వాళ్లు, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలో మంచివార్త ప్రకటించాలనే పట్టుదలతో ఉన్న ఉత్సాహవంతమైన పయినీర్లు.

1920వ సంవత్సరం చివరికల్లా, ఆస్ట్రేలియాలో తక్కువ సంఖ్యలో ఉన్న బైబిలు విద్యార్థులు a ఆ ఖండం తీరాన ఉన్న పట్టణాల్లో, నగరాల్లో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే మంచివార్తను ఎంతో విస్తృతంగా ప్రకటించారు. అయితే ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలో కూడా అంతంతమాత్రంగా జనాభా ఉంది. కానీ దాని విస్తీర్ణం అమెరికా దేశంలో సగం కన్నా ఎక్కువ భాగమంత ఉంది, పైగా ఆ ప్రాంతం ఎడారిని తలపించేలా ఉంటుంది. అయితే యేసు అనుచరులు ఆయన గురించి “భూమంతటా” సాక్ష్యమివ్వాలి కాబట్టి ఆస్ట్రేలియా మారుమూల ప్రాంతంలో కూడా మంచివార్త ప్రకటించాల్సిన బాధ్యత తమకు ఉందని సహోదరులు గుర్తించారు. (అపొ. 1:8) కానీ అంత పెద్ద పనిని వాళ్లు ఎలా పూర్తి చేయగలరు? తమ కృషిని యెహోవా దీవిస్తాడనే పూర్తి నమ్మకంతో, తాము చేయగలిగినదంతా చేయాలని ఆ సహోదరులు నిర్ణయించుకున్నారు.

మారుమూల ప్రాంతంలో పయినీర్లు మంచివార్త ప్రకటించడం

1929వ సంవత్సరంలో, క్వీన్‌లాండ్‌ అలాగే పశ్చిమ ఆస్ట్రేలియాలోని సంఘాలు అక్కడి మారుమూల ప్రాంతంలో మంచివార్త ప్రకటించడానికి నడుం బిగించాయి. అందుకే పడుకోవడానికి, వంట చేసుకోవడానికి వీలుగా ఉండే వ్యాన్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి రోడ్ల మీదైనా వాహనాన్ని నడిపే నైపుణ్యం, అవి ఆగిపోయినప్పుడు వాటిని రిపేరు చేసే సామర్థ్యం ఉన్న పయినీర్లే ఆ వాహనాల్ని నడిపేవాళ్లు. వాటి సహాయంతో, ఇంతకుముందెప్పుడూ ప్రకటించని ప్రాంతాలకు వెళ్లి పయినీర్లు మంచివార్త ప్రకటించారు.

అలాంటి వ్యాన్‌లను తయారుచేసుకునేంత స్తోమతలేని పయినీర్లు సైకిల్‌పై మారుమూల ప్రాంతానికి బయల్దేరారు. ఉదాహరణకు 1932⁠లో, 23 ఏళ్ల బెనట్‌ బ్రికల్‌, క్వీన్‌లాండ్‌లోని రాక్‌హాంప్టన్‌ నుండి బయల్దేరి ఉత్తర వైపునున్న మారుమూల ప్రాంతంలో ఐదునెలల పాటు ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన సైకిల్‌పై దుప్పట్లు, బట్టలు, ఆహారం, చాలా పుస్తకాలు సర్దుకున్నాడు. మార్గమధ్యలో సైకిల్‌ టైర్లు అరిగిపోయినప్పుడు కూడా భారాన్ని యెహోవామీద వేసి ప్రయాణాన్ని కొనసాగించాడు. తన ప్రయాణంలోని చివరి 320 కి.మీ. సైకిల్‌ను తోసుకుంటూ వెళ్లాడు, ఒకప్పుడు ఆ మార్గంలో ప్రయాణించిన ఎంతోమంది దాహంతో అక్కడే చనిపోయారు. తర్వాతి 30 ఏళ్లు అతను సైకిల్‌, బైక్‌, కారు ద్వారా ఆస్ట్రేలియా అంతటా వందల వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ సహోదరుడు మారుమూల ప్రాంతంలో ఉన్న ఆదిమవాసులకు మంచివార్త ప్రకటించి, అక్కడ కొత్త సంఘాల్ని ప్రారంభించడానికి సహాయం చేశాడు. దాంతో అక్కడ అతను మంచి పేరు, గౌరవం సంపాదించుకున్నాడు.

సవాళ్లను అధిగమించడం

ప్రపంచంలోని అతి తక్కువ జనాభాగల ఖండాల్లో ఆస్ట్రేలియా ఒకటి, ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఆ మారుమూల ప్రాంతంలో ప్రజల్ని కనుగొనడం కోసం సహోదరులు ఎంతో పట్టుదలతో కృషిచేశారు.

స్టూవర్ట్‌ కెల్టీ, విలయమ్‌ టోరింగ్‌టన్‌ అనే పయినీర్లు కూడా అలాంటి పట్టుదలనే చూపించారు. ఉదాహరణకు ఆలిస్‌ స్ప్రింగ్స్‌ అనే పట్టణం ఆస్ట్రేలియా ఖండానికి నడిమధ్యలో ఉంది. అక్కడ మంచివార్త ప్రకటించాలంటే వాళ్లు ఇసుక దిబ్బలతో ఉండే సింప్సన్‌ అనే పెద్ద ఎడారిని దాటాలి. అయినాసరే 1933⁠లో వాళ్లు చిన్న కారు సహాయంతో ఆ ఎడారి గుండా ప్రయాణించారు, అది పాడైనప్పుడు దాన్ని అక్కడే వదిలేసి ప్రయాణాన్ని కొనసాగించారు. సహోదరుడు కెల్టీకి ఒక కాలు మాత్రమే ఉంది, మరో కాలు చెక్క కాలు. అయినప్పటికీ అతను, విలయమ్‌ టోరింగ్‌టన్‌తో కలిసి ఒంటె సహాయంతో ప్రయాణించారు. అయితే ఆ సహోదరులు పడిన కష్టం వృథాకాలేదు. వాళ్లకు విలియమ్‌ క్రీక్‌ అనే ఓ మారుమూల రైల్వే స్టేషన్‌ దగ్గర ఛార్లెస్‌ బెర్నార్ట్‌ అనే ఓ హోటల్‌ మేనేజర్‌ కలిశాడు, అతనికి మంచివార్త ప్రకటించారు. కొంతకాలానికి అతను సత్యాన్ని అంగీకరించాక, హోటల్‌ని అమ్మేసి, ఒంటరిగా 15 ఏళ్లపాటు ఆస్ట్రేలియాలో ఎంతో మారుమూలన ఉన్న ఎడారిలాంటి కొన్ని ప్రాంతాల్లో పయినీరు సేవచేశాడు.

ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలో మంచివార్త ప్రకటించేందుకు వెళ్లడానికి సిద్ధపడుతున్న ఆర్థర్‌ విల్లస్‌.—పెర్త్‌, పశ్చిమ ఆస్ట్రేలియా, 1936

ఆ కాలంలోని పయినీర్లకు ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించాలంటే వాళ్లకు ఎంతో ధైర్యం, పట్టుదల అవసరమయ్యాయి. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆర్థర్‌ విల్లస్‌, బిల్‌ న్యూలండ్స్‌ అనే సహోదరులకు, ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయాణంలో ఓ సవాలు ఎదురైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో వాళ్లు ప్రయాణిస్తున్న ఎడారి బురదమయం అయిపోయింది. ఆ బురదలో ప్రయాణించడం ఎంత కష్టమైందంటే కేవలం 32 కి.మీ. వెళ్లడానికి వాళ్లకు రెండు వారాలు పట్టింది. కొన్నిసార్లు ఆ ఎడారిలో నిప్పులుకక్కే ఎండలో చెమటలు కారుస్తూ, ఎంతో కష్టపడి వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లేవాళ్లు. ఇంకొన్నిసార్లు రాతిలోయల గుండా, ఇసుక తిన్నెల గుండా వెళ్లేవాళ్లు. వ్యాన్‌ పాడైతే నడుచుకుంటూ లేదా సైకిల్‌ తొక్కుకుంటూ దగ్గర్లోని పట్టణానికి వెళ్లి వ్యాన్‌కి సంబంధించిన విడిభాగాలు వచ్చేవరకు కొన్నివారాలపాటు అక్కడే వేచివుండేవాళ్లు. అలా తరచూ జరిగేది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ పయినీర్ల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ద గోల్డెన్‌ ఏజ్‌ పత్రికలో ఒకసారి వచ్చిన వాక్యాన్ని సహోదరుడు ఆర్థర్‌ విల్లస్‌ తన సొంతమాటల్లో ఇలా అన్నాడు, “యెహోవాసాక్షులకు ప్రయాణించలేనంత కష్టమైన, దూరమైన రోడ్డంటూ ఏదీలేదు.”

మారుమూల ప్రాంతంలో ప్రజలకు దూరంగా జీవించడం, శారీరక ఇబ్బందులు పడడం వల్ల యెహోవాకు మరింత దగ్గర అయ్యాడని ఎంతోకాలంపాటు పయినీరుగా సేవచేసిన ఛార్లెస్‌ హారిస్‌ వివరించాడు. ఆయనింకా ఇలా చెప్పాడు, “ఎంత తక్కువలో జీవిస్తే అంత మంచిది. అవసరమైతే ఆరుబయట నిద్రపోవడానికి యేసు ఇష్టపడినప్పుడు, నియామకాన్ని పూర్తిచేసే క్రమంలో అవసరమైతే మనం కూడా అలానే చేయడానికి ఇష్టంగా ముందుకు రావాలి.” చాలామంది పయినీర్లు అలానే చేశారు. అలుపెరగకుండా వాళ్లు చేసిన కృషికి ఫలితంగా, ఆస్ట్రేలియా ఖండం నలుమూలలకు మంచివార్త చేరింది. దానివల్ల లెక్కలేనంత మంది దేవుని పక్షాన నిలబడగలిగారు. ఆ సహోదరులకు మనమెంత కృతజ్ఞులమో కదా!

a బైబిలు విద్యార్థులు 1931వ సంవత్సరం నుండి యెహోవాసాక్షులు అని పిలవబడుతున్నారు.—యెష. 43:10.