ఈ లోకంలో వాళ్లలా స్వార్థంగా ఉండకండి
లోకంలో చాలామంది అందరూ తమను స్పెషల్‌గా చూడాలని, వేరేవాళ్ల కన్నా తమకు ఎక్కువ హక్కులు ఉన్నాయని ఫీలౌతుంటారు. వాళ్లను స్పెషల్‌గా చూసినా సరే, ఇంకా స్పెషల్‌గా చూడాలని ఆశిస్తారు. ఇలాంటి ఆలోచన స్వార్థపరుల, కృతజ్ఞత లేనివాళ్ల నరనరాల్లో వేళ్లూనుకుంది. చివరి రోజుల్లో ఇలాంటి వాళ్లే ఉంటారని బైబిలు చెప్పింది.—2 తిమో. 3:2.
అయితే, స్వార్థం ఈ లోకానికి కొత్తేమీ కాదు. ఆదాముహవ్వలు మంచేంటో, చెడేంటో సొంతగా నిర్ణయించుకున్నారు. దానివల్ల తీరని నష్టం జరిగింది. వందల సంవత్సరాల తర్వాత యూదా రాజైన ఉజ్జియా ఆలయంలో ధూపం వేయవచ్చు అనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. (2 దిన. 26:18, 19) పరిసయ్యులు, సద్దూకయ్యులు అబ్రాహాము సంతానం కాబట్టి దేవుడు తమను స్పెషల్‌గా చూస్తాడని అనుకున్నారు. —మత్త. 3:9.
ఒంటి నిండా స్వార్థం, అహం నిండిపోయిన ప్రజలు మనచుట్టూ ఉన్నారు. కాబట్టి వాళ్ల ఆలోచన మనకు అంటుకునే ప్రమాదం ఉంది. (గల. 5:26) అప్పుడు ఫలానా నియామకం వచ్చే హక్కు మనకు ఉందని అనుకోవచ్చు. లేదా అందరూ మనల్ని ప్రత్యేకంగా చూడాలని అనుకోవచ్చు. మరి అలాంటి ఆలోచన రాకుండా ఎలా జాగ్రత్తపడాలి? దానికోసం మనం విషయాల్ని యెహోవాలా చూడడం నేర్చుకోవాలి. దానికి సహాయపడే రెండు బైబిలు సూత్రాల్ని ఇప్పుడు చూద్దాం.
మనకు ఏం పొందే అర్హత ఉందో యెహోవా నిర్ణయిస్తాడు. కొన్ని ఉదాహరణల్ని గమనిద్దాం.
-
ఒక కుటుంబ ఏర్పాటులో భర్త తన భార్య గౌరవాన్ని పొందాలి, భార్య భర్త ప్రేమను పొందాలి. (ఎఫె. 5:33) భార్యాభర్తలు చూపించుకోవాల్సిన ప్రేమను వాళ్లిద్దరి మధ్య మాత్రమే ఉంచుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 కొరిం. 7:3) తల్లిదండ్రులు పిల్లల విధేయత పొందాలి, పిల్లలు అమ్మానాన్నల ప్రేమాప్యాయతల్ని పొందాలి.—2 కొరిం. 12:14; ఎఫె. 6:2.
-
సంఘంలో, కష్టపడి పనిచేసే సంఘపెద్దలు మన గౌరవానికి అర్హులు. (1 థెస్స. 5:12) అయితే, బ్రదర్స్‌సిస్టర్స్ మీద పెత్తనం చెలాయించే హక్కు వాళ్లకు లేదు.—1 పేతు. 5:2, 3.
-
పన్నులు వసూలు చేసే, ప్రజల గౌరవాన్ని పొందే హక్కును ప్రభుత్వాలకు యెహోవా ఇచ్చాడు.—రోమా. 13:1, 6, 7.
యెహోవా ప్రేమతో మన అర్హతకు మించి ఇస్తున్నాడు. మనం పాపులం కాబట్టి మనకు చనిపోయే అర్హత మాత్రమే ఉంది. (రోమా. 6:23) కానీ యెహోవా మన మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ చాలా దీవెనలు ఇస్తున్నాడు. (కీర్త. 103:10, 11) మనకు వచ్చిన ప్రతీ దీవెన లేదా సేవావకాశం యెహోవా అపారదయకు ఒక రుజువు.—రోమా. 12:6-8; ఎఫె. 2:8.
స్వార్థం, అహం మనలో పెరగకుండా ఎలా చూసుకోవచ్చు?
చుట్టూ లోక స్ఫూర్తి ఉంది, జాగ్రత్త! మనకు తెలీకుండానే వేరే వాళ్లకన్నా మనకు ఎక్కువ పొందే అర్హత ఉందని అనుకునే అవకాశం ఉంది. ఆ ఆలోచన ఎంత తేలికగా పుట్టవచ్చో చెప్పడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. అదేంటంటే, ఒక దేనారానికి పనికి ఒప్పుకున్న పనివాళ్ల ఉదాహరణ. కొంతమంది పనివాళ్లు పెందలాడే పని మొదలుపెట్టి మండుటెండలో రోజంతా పనిచేశారు. ఇంకొంతమంది కేవలం ఒక గంటే పనిచేశారు. గంట పని చేసిన వాళ్లకన్నా తమకు ఎక్కువ డబ్బులు వస్తాయని పొద్దున నుండి పనిచేసినవాళ్లు అనుకున్నారు. (మత్త. 20:1-16) ఈ ఉదాహరణలో ఉన్న పాఠాన్ని చెప్తూ తన అనుచరులు దేవుడు తమకు ఇచ్చిన వాటితో తృప్తిపడాలని యేసు చూపించాడు.
కృతజ్ఞతతో ఉండండి, డిమాండ్ చేయకండి. (1 థెస్స. 5:18) కొరింథు సంఘంలో ఉన్న బ్రదర్స్ నుండి ఆర్థిక సహాయం అడిగే హక్కు ఉన్నాసరే, అపొస్తలుడైన పౌలు అడగలేదు. మనం ఆయన్ని అనుకరించవచ్చు. (1 కొరిం. 9:11-14) మనకు వచ్చే ప్రతీ దీవెనను బట్టి కృతజ్ఞతతో ఉందాం. డిమాండ్ చేసే స్ఫూర్తిని చూపించకుండా ఉందాం.
వినయం చూపించండి. ఒకవ్యక్తి తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటే తన దగ్గర ఉన్నదానికన్నా తనకు ఇంకా ఎక్కువ రావాలని ఆలోచిస్తాడు. అలాంటి విషపూరితమైన ఆలోచనకు విరుగుడు వినయం!
దానియేలు ప్రవక్త వినయం చూపించడంలో మంచి ఆదర్శం ఉంచాడు. ఆయనకు మంచి కుటుంబం, అందం, తెలివి అన్నీ ఉన్నాయి. నైపుణ్యాలకు కూడా ఏ కొదువ లేదు. ఇవన్నీ చూసుకుని అందరూ తనను ప్రత్యేకంగా చూడాలని గానీ, తనకు ఎక్కువ సేవావకాశాలు రావాలని గానీ ఆయన కోరుకోలేదు. (దాని. 1:3, 4, 19, 20) దానియేలు చాలా వినయంగా ఉన్నాడు. అందుకే యెహోవాకు ఎంతో అమూల్యమైనవాడు అయ్యాడు.—దాని. 2:30; 10:11, 12.
స్వార్థం, అహం నిండిన ఈ లోక స్ఫూర్తికి దూరంగా ఉందాం. అలాగే యెహోవా తన అపారదయతో మనకు ఇచ్చే ప్రతీ దీవెనతో తృప్తిపడదాం.