కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక చిన్ని ప్రశ్న అడిగి చూడండి

ఒక చిన్ని ప్రశ్న అడిగి చూడండి

మేరీ అలాగే ఆమె భర్త జాన్‌ a ఉంటున్న ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌ నుండి చాలామంది పనికోసం వచ్చేవాళ్లు. వాళ్లతో మేరీ, జాన్‌ మంచివార్త చెప్పేవాళ్లు. కోవిడ్‌ సమయంలో మేరీ, ఆమె ఉంటున్న దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా బైబిలు స్టడీలు మొదలుపెట్టింది. ఎలాగో చూద్దాం.

మేరీ తను బైబిలు స్టడీలు చేసేవాళ్లతో, “బైబిలు గురించి తెలుసుకోవాలని అనుకునేవాళ్లు మీకు ఎవరైనా తెలుసా?” అని అడిగేది. “తెలుసు” అని చెప్తే, “వాళ్లను నాకు పరిచయం చేయండి” అని ఆమె చెప్పేది. అలాంటి ఒక చిన్ని ప్రశ్న ఎన్నో మంచి ఫలితాల్ని తీసుకొచ్చేది. ఎందుకు? బైబిలు గురించి తెలుసుకున్నవాళ్లు వాళ్ల కుటుంబాలకు, వాళ్ల ఫ్రెండ్స్‌కు వాటిగురించి చెప్పాలని అనుకుంటారు. అలాంటి చిన్ని ప్రశ్న వల్ల వచ్చిన ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం.

మేరీ జాస్మిన్‌కి బైబిలు స్టడీ చేస్తుంది. జాస్మిన్‌ ఆసక్తి ఉన్న ఓ నలుగురిని మేరీకి పరిచయం చేసింది. వాళ్లలో క్రిస్టిన్‌ ఒకరు. క్రిస్టిన్‌కి మేరీ చేసే స్టడీ ఎంతబాగా నచ్చిందంటే వారానికి రెండుసార్లు చేయమని అడిగింది. తర్వాత మేరీ క్రిస్టిన్‌ని ‘బైబిలంటే ఆసక్తివున్నవాళ్లు నీకు ఎవరైనా తెలుసా’ అని అడిగింది. అప్పుడు క్రిస్టిన్‌ “తెలుసు, నా ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాను” అని చెప్పి కొన్ని వారాలకే నలుగురిని పరిచయం చేసింది. ఆ నలుగురు మేరీకి ఇంకొంతమందిని పరిచయం చేశారు.

ఫిలిప్పీన్స్‌లో ఉన్న తన కుటుంబానికి కూడా సత్యం తెలియాలని క్రిస్టిన్‌ అనుకుంది. అందుకే ఆమె తన కూతురు ఆండ్రియాతో మాట్లాడింది. మొదట్లో ఆండ్రియా సాక్షులది వింత మతమని, వాళ్లు యేసును నమ్మరని, పాత నిబంధనను పట్టుకుని వేలాడతారని అనుకుంది. కానీ ఒక్కసారి బైబిలు స్టడీ జరిగిన తర్వాత ఆమెకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. బైబిలు స్టడీ జరుగుతున్నప్పుడు ఆమె ఇలా అంది: “బైబిలు ఏమైనా చెప్పిందంటే అది ఖచ్చితంగా నిజమే!”

కొంతకాలానికి ఆండ్రియా తన ఇద్దరు ఫ్రెండ్స్‌ని అలాగే తనతోపాటు పనిచేసే ఒకామెను మేరీకి పరిచయం చేసింది. ఆండ్రియా వాళ్ల అత్త ఏంజెలా మేరీకి తెలియకుండా స్టడీ జరుగుతున్నప్పుడు చాటుగా వినేది. ఆమెకు కళ్లు కనిపించవు. ఒకరోజు మేరీని పరిచయం చేయమని ఆమె ఆండ్రియాని అడిగింది. తనకు కూడా వేరుగా బైబిలు స్టడీ మొదలుపెట్టమని ఆమె మేరీని అడిగింది. నేర్చుకున్న విషయాలు ఆమెకు చాలా బాగా నచ్చాయి. ఒక నెలలో ఆమె ఎన్నో లేఖనాల్ని గుర్తుపెట్టుకుంది. అలాగే వారానికి నాలుగుసార్లు స్టడీ చేయమని ఆమె అడిగింది. ఆండ్రియా సహాయంతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్రమంగా మీటింగ్స్‌కి హాజరవ్వడం మొదలుపెట్టింది.

క్రిస్టిన్‌కి మేరీ స్టడీ చేస్తున్నప్పుడు ఆమె భర్త జాషువా స్టడీ అంటే ఇష్టం ఉన్నట్టు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. తర్వాత మేరీ “మీరు కూడా స్టడీలో కూర్చుంటారా” అని ఆయన్ని అడిగింది. “కూర్చుంటాను కానీ నన్ను ప్రశ్నలు అడిగితే ఇక్కడనుండి వెళ్లిపోతాను” అని జాషువా చెప్పాడు. కానీ ఐదు నిమిషాల తర్వాత క్రిస్టిన్‌ కన్నా ఎక్కువ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అలా ఆ స్టడీ కొనసాగింది.

మేరీ అడిగిన ఈ చిన్ని ప్రశ్న ఎన్నో బైబిలు స్టడీలకు దారితీసింది. చాలా బైబిలు స్టడీలను ఆమె వేరేవాళ్లకు అప్పగించింది. ఇలా ఆమె నాలుగు వేర్వేరు దేశాల్లో 28 బైబిలు స్టడీలను మొదలుపెట్టింది.

ఈ అనుభవంలో మనం చూసిన మొదటి విద్యార్థి జాస్మిన్‌ ఏప్రిల్‌, 2021లో బాప్తిస్మం తీసుకుంది. క్రిస్టిన్‌ మే, 2022లో బాప్తిస్మం తీసుకుని ఫిలిప్పీన్స్‌లో ఉన్న తన కుటుంబం దగ్గరికి వెళ్లిపోయింది. క్రిస్టిన్‌ మేరీకి పరిచయం చేసిన ఇంకో ఇద్దరు విద్యార్థులు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఏంజెలా బాప్తిస్మం తీసుకున్న కొన్ని నెలలకే క్రమ పయినీరుగా సేవచేస్తోంది. క్రిస్టిన్‌ భర్త జాషువా, తన కూతురు ఆండ్రియా అలాగే ఇంకొంతమంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం వైపు అడుగులు వేస్తున్నారు.

మొదటి శతాబ్దంలో కుటుంబాల మధ్య, ఫ్రెండ్స్‌ మధ్య మంచివార్త త్వరగా వ్యాప్తి అయ్యేది. (యోహా. 1:41, 42ఎ; అపొ. 10:24, 27, 48; 16:25-33) కాబట్టి మీ బైబిలు విద్యార్థులను లేదా ఆసక్తి ఉన్నవాళ్లను “బైబిలు గురించి తెలుసుకోవాలని అనుకునేవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?” అని మీరు అడిగి చూడండి. ఈ చిన్ని ప్రశ్న ఎన్నో బైబిలు స్టడీలకు దారితీయవచ్చు.

a పేర్లను మార్చాం.