“పరదేశుల” పిల్లలకు సహాయం చేయండి
“నా పిల్లలు సత్యానికి తగ్గట్టు జీవిస్తున్నారని వినడం కన్నా సంతోషకరమైన విషయం నాకు ఇంకొకటి లేదు.”—3 యోహా. 4.
1, 2. (ఎ) వలస వచ్చిన వాళ్ల పిల్లల్లో చాలామంది ఏ సమస్య ఎదుర్కొంటున్నారు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
కొన్నేళ్ల క్రితం, జాషువ అనే సహోదరుని తల్లిదండ్రులు వేరే దేశానికి వలస వెళ్లారు. అతను ఇలా చెప్తున్నాడు, “నేను చిన్నప్పటినుండి మా ఇంట్లో, సంఘంలో నా మాతృభాషే మాట్లాడేవాణ్ణి. కానీ స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టినప్పటి నుండి స్థానిక భాషలో మాట్లాడడానికి ఇష్టపడ్డాను. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి, నేను నా మాతృభాషలో మాట్లాడడం పూర్తిగా ఆపేశాను. మీటింగ్స్‌లో చెప్పే విషయాలు అర్థమయ్యేవి కావు, మా అమ్మానాన్నల సంస్కృతిని, భాషను పూర్తిగా మర్చిపోయాను.” ఆ సహోదరునికి ఎదురైన అనుభవం చాలామందికి ఎదురైవుంటుంది.
2 నేడు, 24 కోట్ల కన్నా ఎక్కువమంది తాము పుట్టిన దేశంలో ఉండట్లేదు. మీరు ఒకవేళ వలస వచ్చిన తల్లిదండ్రులైతే, మీ పిల్లలు యెహోవా గురించి నేర్చుకుని, “సత్యానికి తగ్గట్టు” జీవించేలా మీరు వాళ్లకెలా సహాయం చేయవచ్చు? (3 యోహా. 4) అంతేకాదు ఇతరులు కూడా ఎలా సహాయం చేయవచ్చు?
తల్లిదండ్రులారా, చక్కని ఆదర్శం ఉంచండి
3, 4. (ఎ) తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా చక్కని ఆదర్శాన్ని ఉంచవచ్చు? (బి) తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి ఆశించకూడదు?
3 తల్లిదండ్రులారా, మీ పిల్లలు యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండి, శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే మీరు వాళ్లకు ఆదర్శంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మీరు ‘రాజ్యానికి మొదటిస్థానం’ ఇవ్వడం మీ పిల్లలు చూస్తే వాళ్లు రోజూవారి అవసరాల కోసం యెహోవాపై ఆధారపడడం నేర్చుకుంటారు. (మత్త. 6:33, 34) కాబట్టి వస్తుసంపదల వెనక పరుగెత్తకుండా యెహోవా సేవకే మొదటిస్థానం ఇవ్వండి. సాదాసీదాగా జీవించండి, అప్పుల జోలికి పోకండి. ‘మనుషుల ఆమోదం’ పొందాలని లేదా డబ్బు సంపాదించాలని చూడకుండా, “పరలోకంలో ఐశ్వర్యం” కోసం అంటే యెహోవా ఆమోదం కోసం పాటుపడండి.—మార్కు 10:21, 22 చదవండి; యోహా. 12:43.
4 మీ పిల్లలతో సమయం గడపలేనంత బిజీగా ఎప్పుడూ ఉండకండి. వాళ్లు మంచిపేరు, డబ్బు సంపాదించడానికి కాకుండా యెహోవాకు మొదటిస్థానం ఇస్తున్నందుకు మీరు గర్వపడుతున్నారని చూపించండి. పిల్లలు సంపాదించి తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని ఆలోచించడం సరైనది కాదు. నిజానికి, “పిల్లలు తల్లిదండ్రుల కోసం కూడబెట్టడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కోసం కూడబెట్టాలి” అని గుర్తుంచుకోండి.—2 కొరిం. 12:14.
తల్లిదండ్రులారా, భాషవల్ల వచ్చే సమస్యల్ని అధిగమించండి
5. తల్లిదండ్రులు తమ పిల్లలతో యెహోవా గురించి ఎందుకు మాట్లాడాలి?
5 బైబిలు ముందే చెప్పినట్లు, ‘దేశాల్లోని అన్ని భాషల’ ప్రజలు యెహోవా సంస్థలోకి వస్తున్నారు. (జెకర్యా 8:23, NW) అయితే మీ పిల్లలు మీరు మాట్లాడే భాషను సరిగ్గా అర్థంచేసుకోలేకపోతే వాళ్లకు సత్యాన్ని బోధించడం కష్టం అవ్వవచ్చు. మీ పిల్లలే మీకు అత్యంత ప్రాముఖ్యమైన బైబిలు విద్యార్థులు. వాళ్లు యెహోవా గురించి ‘తెలుసుకుంటే’ శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటారు. (యోహా. 17:3) మీ పిల్లలు యెహోవా బోధల్ని నేర్చుకోవాలంటే వాటిగురించి మీరు వాళ్లతో తరచుగా ‘మాట్లాడాలి.’—ద్వితీయోపదేశకాండము 6:6, 7 చదవండి.
6. మీ పిల్లలు మీ భాష నేర్చుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతారు? (ప్రారంభ చిత్రం చూడండి.)
6 మీ పిల్లలు స్కూల్లో అలాగే తోటివాళ్ల నుండి స్థానిక భాష నేర్చుకుంటారు. కానీ వాళ్లు మీ భాషను నేర్చుకోవాలంటే మీరు వాళ్లతో తరచుగా మాట్లాడాలి. మీ పిల్లలు మీ భాష మాట్లాడితేనే తమ మనసులోని మాటల్ని మీకు చెప్పగలుగుతారు. అంతేకాదు దానివల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ పిల్లలు ఒకటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడడంవల్ల వాళ్ల ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది, ఇతరుల ఉద్దేశాలను కూడా అర్థంచేసుకోగలుగుతారు. పరిచర్యలో వేర్వేరు భాషల వాళ్లకు ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువ దొరుకుతాయి. కారోలీన తల్లిదండ్రులు వేరేదేశానికి వలస వెళ్లారు. ఆమె ఇలా చెప్తోంది, “వేరే భాషా సంఘంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది. అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేయడం చాలా ఉత్తేజాన్నిస్తుంది.”
7. మీ కుటుంబంలో భాష ఒక సమస్యగా మారితే ఏమి చేయవచ్చు?
7 అయితే వలస వచ్చినవాళ్ల పిల్లల్లో కొంతమంది స్థానిక సంస్కృతిని, భాషను నేర్చుకున్న తర్వాత మాతృభాషను మర్చిపోవచ్చు అలాగే ఆ భాష మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. తల్లిదండ్రులారా, మీ పిల్లల పరిస్థితి అదే అయితే మీరు స్థానిక భాషలో కనీసం కొన్ని మాటలైనా నేర్చుకోగలరా? మీ పిల్లల మాటల్ని, వాళ్లు చూసే వినోదాన్ని, స్కూల్లో వాళ్లు నేర్చుకునే విషయాల్ని మీరు అర్థంచేసుకుంటే, అలాగే వాళ్ల స్కూల్ టీచర్లతో మీరు మాట్లాడగలిగితే మీ పిల్లల్ని క్రైస్తవులుగా పెంచడం మీకు మరింత తేలికౌతుంది. నిజమే ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే సమయం, కృషి, వినయం అవసరం. కానీ నేర్చుకోవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, అనుకోకుండా మీ పిల్లవాడు చెవిటివాడు అయ్యాడనుకోండి, అతనితో మాట్లాడడానికి మీరు సంజ్ఞా భాష నేర్చుకోరా? అధేవిధంగా మీ పిల్లవాడు వేరే భాష మాట్లాడడానికి ఇష్టపడుతుంటే అతని విషయంలో కూడా మీరు అదే చేయాల్సివస్తుంది. కాదంటారా? a
8. మీరు స్థానిక భాష మాట్లాడలేనప్పుడు మీ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?
8 వలస వచ్చిన కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలు మాట్లాడే భాషలో పట్టు సాధించడం చాలా కష్టంగా ఉండవచ్చు. దానివల్ల, “పవిత్ర లేఖనాలు” అర్థం చేసుకోగలిగేలా పిల్లలకు సహాయం చేయడం తల్లిదండ్రులకు కష్టమవ్వవచ్చు. (2 తిమో. 3:15) మీ పరిస్థితి కూడా అదే అయినప్పటికీ, మీ పిల్లలు యెహోవా గురించి నేర్చుకుని, ఆయన్ను ప్రేమించేలా మీరు సహాయం చేయగలరు. సంఘపెద్దగా సేవచేస్తున్న షాన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “విధవరాలైన మా అమ్మ మేము మాట్లాడే భాషను అంతగా అర్థంచేసుకోలేదు. అంతేకాదు నేనూ, మా అక్క అమ్మ మాట్లాడే భాషలో సరిగ్గా మాట్లాడలేం. కానీ మా అమ్మ బైబిలు చదవడానికి, ప్రార్థించడానికి, ప్రతీవారం కుటుంబ ఆరాధన చేయడానికి కృషి చేయడం చూసినప్పుడు యెహోవాను తెలుసుకోవడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని మేము గ్రహించగలిగాం.”
9. బైబిల్ని, బైబిలు ఆధారిత ప్రచురణల్ని రెండు భాషల్లో చదవాల్సి వచ్చే పిల్లలకు తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?
9 కొంతమంది పిల్లలు యెహోవా గురించి రెండు భాషల్లో నేర్చుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే వాళ్లు ఇంట్లో ఒక భాష, స్కూల్లో ఒక భాష మాట్లాడతారు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు రెండు భాషల్లో ఉన్న ప్రచురణల్ని, ఆడియో రికార్డింగ్‌లను, వీడియోలను ఉపయోగిస్తారు. కాబట్టి తమ పిల్లలు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయాలంటే వలస వచ్చిన తల్లిదండ్రులకు చాలా సమయం, కృషి అవసరం.
మీరు ఏ భాషా సంఘంతో సహవసించాలి?
10. (ఎ) ఏ భాషా సంఘంతో సహవసించాలనే నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలి? (బి) నిర్ణయం తీసుకునే ముందు అతను ఏమి చేయాలి?
10 వలస వచ్చినవాళ్లు, ‘పరదేశులుగా’ ఉంటున్న ప్రాంతంలో తమ భాష మాట్లాడే సాక్షులు లేనప్పుడు, స్థానిక భాష మాట్లాడే సంఘంతో సహవసించాల్సి రావచ్చు. (కీర్త. 146:9) ఒకవేళ తమ మాతృభాషా సంఘం దగ్గర్లో ఉంటే తమ కుటుంబం ఏ భాషా సంఘంతో సహవసించడం మంచిదో కుటుంబ పెద్ద నిర్ణయించాలి. అలా నిర్ణయం తీసుకునే ముందు అతను జాగ్రత్తగా ఆలోచించాలి, ప్రార్థించాలి అంతేకాదు విషయాన్ని భార్యాపిల్లలతో చర్చించాలి. (1 కొరిం. 11:3) మరి నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్ద ఏ విషయాల గురించి ఆలోచించాలి? ఏ బైబిలు సూత్రాలు అతనికి సహాయం చేస్తాయి?
11, 12. (ఎ) మీటింగ్స్ నుండి ప్రయోజనం పొందే విషయంలో భాష ఏ పాత్ర పోషిస్తుంది? (బి) కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల భాషను నేర్చుకోవడానికి ఎందుకు ఇష్టపడరు?
11 పిల్లలకు నిజంగా ఏమి అవసరమో తల్లిదండ్రులు ఆలోచించాలి. బైబిలు సత్యాలు పిల్లల హృదయంలో నాటుకుపోవాలంటే ప్రతీవారం మీటింగ్స్‌లో కొన్ని గంటలపాటు దొరికే ఉపదేశం సరిపోదు. దీనిగురించి ఆలోచించండి: పిల్లలకు బాగా అర్థమయ్యే భాషలో జరిగే మీటింగ్స్‌కు వెళ్తే, వాళ్లు తల్లిదండ్రులు అనుకున్న దానికన్నా ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటారు. కానీ వాళ్లకు అర్థంకాని భాషలో మీటింగ్స్ వింటే అంత ప్రయోజనం పొందరు. (1 కొరింథీయులు 14:9, 11 చదవండి.) అంతేకాదు పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారని చెప్పలేం. నిజానికి కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల భాషలో జరిగే మీటింగ్స్‌లో కామెంట్ చేస్తారు, ప్రదర్శనలు చేస్తారు, ప్రసంగాలు ఇస్తారు కానీ తమ మనసులోని ఆలోచనల్ని, భావాల్ని ఆ భాషలో చెప్పలేరు.
12 అంతేకాదు కేవలం భాషనుబట్టి పిల్లల వ్యక్తిత్వం, అభిప్రాయాలు ఏర్పడవు. మొదట్లో చర్చించుకున్న జాషువ అనే సహోదరుని పరిస్థితి అదే. అతని అక్క ఎస్తేర్ ఇలా చెప్తోంది, “చిన్నపిల్లలకు తల్లిదండ్రుల భాష, సంస్కృతి, మతం పుట్టుకతో వస్తాయి.” ఒకవేళ తమ తల్లిదండ్రుల సంస్కృతికి చెందినవాళ్లం కాదని పిల్లలు అనుకుంటే వాళ్లు తల్లిదండ్రుల భాషను, మతాన్ని ఇష్టపడకపోవచ్చు. కాబట్టి వలస వచ్చిన తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?
13, 14. (ఎ) ఒక కుటుంబం స్థానిక భాషా సంఘానికి ఎందుకు మారారు? (బి) యెహోవాతో తమకున్న సంబంధాన్ని ఆ తల్లిదండ్రులు ఎలా బలంగా ఉంచుకున్నారు?
13 క్రైస్తవ తల్లిదండ్రులు తమ ఇష్టాలకన్నా పిల్లల అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. (1 కొరిం. 10:24) జాషువ, ఎస్తేర్‌ల నాన్న సామ్యూల్ ఇలా చెప్తున్నాడు, “ఏ భాషలో సత్యం మా పిల్లల హృదయాన్ని చేరుకుంటుందో నేనూ, నా భార్య గమనించాం. నిర్ణయం తీసుకునేలా సహాయం చేయమని ప్రార్థించాం. అయితే మాకు అనుకూలమైన జవాబు రాలేదు. కానీ మేము మాట్లాడే భాషలో జరిగే మీటింగ్స్ ద్వారా మా పిల్లలు అంతగా ప్రయోజనం పొందట్లేదని చూసినప్పుడు, మేము స్థానిక భాష మాట్లాడే సంఘానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేము కుటుంబంగా కలిసి క్రమంగా మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లాం. అంతేకాదు స్థానిక భాష మాట్లాడే స్నేహితులను మా ఇంటికి భోజనానికి పిలిచేవాళ్లం, మాతోపాటు విహారయాత్రలకు తీసుకెళ్లేవాళ్లం. వీటన్నిటి వల్ల మా పిల్లలు సహోదరులకు దగ్గరయ్యారు, యెహోవాను కేవలం ఒక దేవునిగా మాత్రమే కాకుండా తమ తండ్రిగా, స్నేహితునిగా చేసుకోగలిగారు. వాళ్లు మా భాషను నేర్చుకోవడం కన్నా యెహోవాకు దగ్గరవ్వడమే అన్నిటికన్నా ముఖ్యం అనుకున్నాం.”
14 సామ్యూల్ ఇంకా ఇలా అంటున్నాడు, “యెహోవాతో ఉన్న సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి నేనూ, నా భార్య మా భాషలో జరిగే మీటింగ్స్‌కు కూడా వెళ్లేవాళ్లం. దానివల్ల మా జీవితం చాలా బిజీగా ఉండేది, అలసిపోయే వాళ్లం. కానీ మా కృషిని, త్యాగాలను దీవించినందుకు యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. ఇప్పుడు మా ముగ్గురు పిల్లలు పూర్తికాల సేవ చేస్తున్నారు.”
ఎదిగిన పిల్లలు ఏమి చేయవచ్చు?
15. స్థానిక భాషా సంఘానికి మారాలని క్రిస్టీనా అనే సహోదరి ఎందుకు నిర్ణయించుకుంది?
15 తమకు బాగా అర్థమయ్యే భాషా సంఘంతో సహవసించడం వల్ల యెహోవా సేవ మరింత ఎక్కువ చేయవచ్చని ఎదిగిన పిల్లలు గుర్తించవచ్చు. అలాంటప్పుడు పిల్లలు తమను ఇష్టపడట్లేదని తల్లిదండ్రులు అనుకోకూడదు. క్రిస్టీనా అనే సహోదరి ఇలా గుర్తుచేసుకుంటుంది, “నాకు మా అమ్మానాన్నల భాష కొంతవరకు అర్థమౌతుంది. కానీ వాళ్ల భాషలో జరిగే మీటింగ్స్ అస్సలు అర్థమయ్యేవి కావు. నాకు 12 ఏళ్లున్నప్పుడు స్థానిక భాషలో జరిగే సమావేశానికి వెళ్లాను. నేను వింటున్న మాటలు సత్యమని మొట్టమొదటిసారి అనిపించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను స్థానిక భాషలో ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు నా హృదయం నుండి యెహోవాతో మాట్లాడగలిగాను.” (అపొ. 2:11, 41) క్రిస్టీనాకు 18 ఏళ్లు వచ్చాక అదే విషయాన్ని ఆమె తన అమ్మానాన్నలకు చెప్పింది, తర్వాత స్థానిక భాషా సంఘానికి మారాలని నిర్ణయించుకుంది. “స్థానిక భాషలో యెహోవా గురించి నేర్చుకున్నప్పుడు అవి నన్ను చర్య తీసుకునేలా పురికొల్పాయి” అని క్రిస్టీనా చెప్తోంది. కొంతకాలానికే ఆమె క్రమ పయినీరు సేవ మొదలుపెట్టింది, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది.
16. తమ అమ్మానాన్నల భాషా సంఘంలో ఉన్నందుకు నాద్య ఎందుకు సంతోషంగా ఉంది?
16 యౌవనులారా మీరు స్థానిక భాషా సంఘానికి మారాలనుకుంటున్నారా? అయితే ఎందుకలా అనుకుంటున్నారో ప్రశ్నించుకోండి. యెహోవాకు మరింత దగ్గరవ్వడానికి సంఘం మారాలనుకుంటున్నారా? (యాకో. 4:8) లేదా అమ్మానాన్నల పర్యవేక్షణను తప్పించుకోవడానికి, భాష నేర్చుకోవడం, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం వంటి వాటికోసం చేసే కృషిని తగ్గించుకోవడానికి అలా మారాలనుకుంటున్నారా? ప్రస్తుతం బెతెల్‌లో సేవచేస్తున్న నాద్య అనే సహోదరి ఇలా చెప్తోంది, “నేనూ, నా తోబుట్టువులు టీనేజీకి వచ్చాక, స్థానిక భాషా సంఘానికి మారాలనుకున్నాం.” కానీ అలా మారితే యెహోవాతో వాళ్లకున్న సంబంధం దెబ్బతింటుందని ఆమె తల్లిదండ్రులకు తెలుసు. “మా అమ్మానాన్నలు ఎంతో కష్టపడి తమ భాషను మాకు నేర్పించి, సంఘం మారకుండా చేసినందుకు ఇప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అది మా జీవితాల్ని మెరుగుపర్చింది, యెహోవా గురించి ఇతరులకు చెప్పడానికి ఎన్నో అవకాశాల్ని ఇచ్చింది” అని నాద్య చెప్పింది.
ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
17. (ఎ) పిల్లల్ని పెంచే బాధ్యతను యెహోవా ఎవరికి ఇచ్చాడు? (బి) పిల్లలకు సత్యాన్ని నేర్పించడానికి కావాల్సిన సహాయం తల్లిదండ్రులు ఎలా పొందవచ్చు?
17 పిల్లలకు సత్యాన్ని బోధించే బాధ్యతను యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చాడు. అంతేగానీ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలకు లేదా మరితరులకు ఇవ్వలేదు. (సామెతలు 1:8; 31: 10, 27, 28 చదవండి.) అయితే తమ పిల్లల హృదయాన్ని చేరుకోవడానికి స్థానిక భాష తెలియని తల్లిదండ్రులకు ఇతరుల సహాయం అవసరం కావచ్చు. తల్లిదండ్రులు ఇతరుల సహాయం అడిగినంత మాత్రాన వాళ్లు తమ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాదు. బదులుగా, ‘యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇవ్వడంలో’ అది ఒక భాగం. (ఎఫె. 6:4) ఉదాహరణకు, కుటుంబ ఆరాధన చేసుకోవడానికి సహాయపడే సలహాలను, తమ పిల్లలు మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి ఉపయోగపడే సలహాలను తల్లిదండ్రులు సంఘపెద్దల్ని అడగవచ్చు.
18, 19. (ఎ) యౌవనులకు ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు? (బి) తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఏమి చేస్తుండాలి?
18 పిల్లలకు సహాయం చేసేందుకు తల్లిదండ్రులు అప్పుడప్పుడు తమ కుటుంబ ఆరాధనకు ఇతరుల్ని కూడా ఆహ్వానించవచ్చు. దాంతోపాటు చాలామంది యౌవనులు తోటి క్రైస్తవులతో ప్రీచింగ్‌కు వెళ్లినప్పుడు, వాళ్లతో సరదాగా సమయం గడిపినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. (సామె. 27:17) ఇంతకుముందు చర్చించుకున్న షాన్ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నా పట్ల శ్రద్ధ చూపించిన సహోదరులు నాకింకా గుర్తున్నారు. మీటింగ్‌లో నాకిచ్చిన విద్యార్థి నియామకాలను చేయడానికి వాళ్లు సహాయం చేశారు, వాళ్లనుండి ఎంతో నేర్చుకున్నాను. అంతేకాదు మేమంతా కలిసి సరదాగా సమయం గడపడాన్ని కూడా ఆనందించాను.”
19 తమ పిల్లలకు సహాయం చేయమని తల్లిదండ్రులు ఇతరుల్ని అడగవచ్చు. అలా సహాయం చేసేవాళ్లు పిల్లల దగ్గర తల్లిదండ్రుల గురించి మంచిగా మాట్లాడుతూ వాళ్లపై గౌరవం పెరిగేలా చేయాలి. అయితే తల్లిదండ్రులకు ఉన్న బాధ్యతను ఇతరులు తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. మీరు ఆ పిల్లలపై చూపించే శ్రద్ధను సంఘంలోనివాళ్లు అలాగే సంఘం బయటివాళ్లు తప్పుగా అనుకునేలా ఉండకూడదు. (1 పేతు. 2:12) తల్లిదండ్రులు ఇతరుల సహాయం అడిగినప్పటికీ పిల్లలకు సత్యాన్ని నేర్పించాల్సిన బాధ్యత మాత్రం తమదే అని గుర్తుంచుకోవాలి. తోటి క్రైస్తవులు ఇచ్చే సహాయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.
20. తమ పిల్లలు యెహోవా సేవకులు అయ్యేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?
20 తల్లిదండ్రులారా సహాయం కోసం యెహోవాను అడగండి, మీరు చేయాల్సినదంతా చేయండి. (2 దినవృత్తాంతములు 15:7 చదవండి.) మీ ఇష్టాలకన్నా యెహోవాతో మీ పిల్లలకు ఉన్న స్నేహానికే మొదటిస్థానం ఇవ్వండి. దేవుని వాక్యం మీ పిల్లల హృదయానికి చేరేలా మీరు చేయాల్సినదంతా చేయండి. మీ పిల్లవాడు యెహోవా సేవకుడు అవుతాడనే మీ నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకండి. మీ పిల్లలు బైబిల్ని, మీ మంచి ఆదర్శాన్ని పాటిస్తే, అపొస్తలుడైన యోహాను తన ఆధ్యాత్మిక పిల్లల గురించి భావించినట్లే మీరూ భావిస్తారు, “నా పిల్లలు సత్యానికి తగ్గట్టు జీవిస్తున్నారని వినడం కన్నా సంతోషకరమైన విషయం నాకు ఇంకొకటి లేదు.”—3 యోహా. 4.
a 2007 ఏప్రిల్ తేజరిల్లు! పత్రికలోని 12-14 పేజీల్లో ఉన్న “మీరు మరో భాషను నేర్చుకోగలరు!” అనే ఆర్టికల్ చూడండి.