కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు

‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు

“మంచినేల లాంటివాళ్లు ఎవరంటే, వాళ్లు . . . ఓర్పుతో ఫలిస్తారు.”లూకా 8:15.

పాటలు: 68, 72

1, 2. (ఎ) ప్రజలు వినకపోయినా ప్రకటనా పనిని కొనసాగించే సహోదరసహోదరీలను చూస్తే ఎందుకు ప్రోత్సాహం కలుగుతుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) “సొంత ఊరిలో” ప్రకటనా పని చేయడం గురించి యేసు ఏమి చెప్పాడు? (అధస్సూచి చూడండి.)

 సర్జహో, ఓలిండ అనే పయినీరు దంపతులు అమెరికాలో ఉంటున్నారు. వాళ్లిద్దరి వయస్సు 80 దాటింది. కొంతకాలంగా కాళ్ల నొప్పుల వల్ల నడవడానికి ఇబ్బందిపడుతున్నారు. కానీ వాళ్లు ఎంతోకాలంగా చేస్తున్నట్టే, రద్దీగా ఉండే ఒక పట్టణ కూడలి దగ్గరకు ఉదయం ఏడు గంటలకు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఒక బస్టాపు దగ్గర నిలబడి వచ్చిపోయేవాళ్లకు ప్రచురణలు ఇచ్చారు. చాలామంది వాళ్లను పట్టించుకోలేదు. అయినప్పటికీ సర్జహో, ఓలిండలు మాత్రం అక్కడే నిలబడి ఎవరైనా తమవైపు చూస్తే చిరునవ్వు చిందించారు. మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్లు నిదానంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశారు. మరుసటి రోజు, మళ్లీ ఉదయాన్నే ఏడు గంటలకు బస్టాపుకు వెళ్లారు. ఇలా వాళ్లు సంవత్సరమంతా, వారంలో ఆరు రోజులు ప్రీచింగ్‌ చేస్తూనే ఉన్నారు.

2 సర్జహో, ఓలిండలు చేస్తున్నట్టే ఎంతోమంది నమ్మకమైన సహోదరసహోదరీలు తాము ఉంటున్న ప్రాంతంలోనే ప్రీచింగ్‌ చేస్తున్నారు. ఎక్కువశాతం ప్రజలు వినకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ సేవను కొనసాగిస్తున్నారు. బహుశా మీరు ప్రకటిస్తున్న ప్రాంతంలో కూడా చాలామంది ప్రజలు మంచివార్తను పట్టించుకోకపోవచ్చు. అదే నిజమైతే, కష్టమైనప్పటికీ ఓర్పుతో ప్రకటనా పనిలో ముందుకు కొనసాగుతున్న మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. a ఈ విషయంలో మీ మంచి ఆదర్శం, ఎంతోకాలంగా యెహోవా సేవచేస్తున్న వాళ్లతోపాటు, ఇతర సహోదరసహోదరీలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కొంతమంది ప్రాంతీయ పర్యవేక్షకులు ఏమి చెప్పారో గమనించండి: “అలాంటి నమ్మకమైన సహోదరసహోదరీలతో కలిసి ప్రీచింగ్‌ చేసినప్పుడు చాలా బలం పొందినట్టు అనిపిస్తుంది.” “వాళ్ల విశ్వసనీయతను చూస్తే నా పరిచర్యను పట్టుదలగా, ధైర్యంగా చేయాలనే ప్రోత్సాహం కలుగుతుంది.” “వాళ్ల స్ఫూర్తిని చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.”

3. మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం? ఎందుకు?

3 ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం: మనకెందుకు కొన్నిసార్లు నిరుత్సాహం కలగవచ్చు? ఫలించడం అంటే ఏమిటి? ఓర్పుతో ఫలిస్తూ ఉండేలా మనకేది సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం వల్ల యేసు మనకు అప్పగించిన ప్రకటనా పనిని మానకుండా చేయాలనే ప్రోత్సాహాన్ని పొందుతాం.

మనకెందుకు నిరుత్సాహం కలగవచ్చు?

4. (ఎ) చాలామంది యూదుల ప్రతికూల స్పందన చూసి పౌలుకు ఏమనిపించింది? (బి) ఎందుకు?

4 మీ ప్రాంతంలోని ప్రజలు మంచివార్త విననందుకు మీకెప్పుడైనా నిరుత్సాహం కలిగిందా? అలాగైతే, అపొస్తలుడైన పౌలు భావాలు మీకు అర్థమౌతాయి. ఆయన దాదాపు 30 సంవత్సరాలు ప్రకటనా పని చేసి, ఎంతోమంది క్రైస్తవులుగా మారడానికి సహాయం చేశాడు. (అపొ. 14:21; 2 కొరిం. 3:2, 3) కానీ ఇంకా చాలామంది యూదులను క్రైస్తవులుగా మార్చలేకపోయాడు. ఎందుకంటే, పౌలు చెప్పేది వినడానికి వాళ్లు ఇష్టపడలేదు. కొంతమందైతే, ఆయన్ని హింసించారు. (అపొ. 14:19; 17:1, 4, 5, 13) వాళ్ల ప్రతికూల స్పందన చూసి పౌలుకు ఎలా అనిపించింది? ఆయనిలా అన్నాడు, “నా హృదయంలో నేను ఎంతో దుఃఖిస్తున్నాను, ఎంతో వేదనపడుతున్నాను.” (రోమా. 9:1-3) ఎందుకు? ఎందుకంటే ప్రకటనా పనన్నా, ప్రజలన్నా ఆయనకెంతో ఇష్టం. యూదుల పట్ల పౌలుకు చాలా శ్రద్ధ ఉంది కాబట్టే వాళ్లు దేవుని కరుణను నిరాకరించినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు.

5. (ఎ) ప్రీచింగ్‌ చేసేలా మనల్ని ఏది ప్రోత్సహిస్తుంది? (బి) కొన్నిసార్లు నిరుత్సాహం కలగడం ఎందుకు సహజం?

5 పౌలులాగే మనం కూడా ప్రజల మీదున్న శ్రద్ధతో, వాళ్లకు సహాయం చేయాలనే కోరికతో ప్రీచింగ్‌ చేస్తాం. (మత్త. 22:39; 1 కొరిం. 11:1) యెహోవాను ఆరాధించడమే ఉత్తమమైన జీవన విధానమని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అదే విషయాన్ని ఇతరులు కూడా తెలుసుకోవడానికి మనం సహాయం చేయాలనుకుంటాం. అందుకే యెహోవా గురించిన సత్యమేమిటో, మానవ జాతిపట్ల ఆయన సంకల్పమేమిటో నేర్చుకోమని వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటాం. ఒకవిధంగా, మనం వాళ్లకొక అందమైన గిఫ్ట్‌ కొని, ‘దయచేసి దీన్ని తీసుకోండి’ అని బతిమాలుతున్నాం. ఒకవేళ వాళ్లు ఆ గిఫ్ట్‌ తీసుకోకపోతే పౌలులాగే ‘వేదనపడతాం’ లేదా బాధపడతాం, అది సహజం. అలా బాధపడుతున్నామంటే మనకు విశ్వాసం లేదని కాదుగానీ, ప్రజలపట్ల నిజమైన ప్రేమ ఉందని అర్థం. అందుకే కొన్నిసార్లు నిరుత్సాహం కలిగినప్పటికీ ప్రీచింగ్‌ చేయడం మాత్రం ఆపము. 25 ఏళ్లుగా పయినీరు సేవచేస్తున్న ఎలేనా అనే సహోదరి ఏమంటుందంటే, “ప్రీచింగ్‌ చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ, దీనికి మించిన పని మరొకటి లేదు.” ఆమె మాటలతో మనం కూడా ఏకీభవిస్తాం కదా!

ఫలించడం అంటే ఏమిటి?

6. మనం ఏ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటాం?

6 మనం ఎలాంటి ప్రాంతంలో ప్రీచింగ్‌ చేసినప్పటికీ పరిచర్యలో ఆనందించగలమనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి యేసు చెప్పిన రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం. ‘ఫలించడం’ ఎందుకు అవసరమో ఆయన వాటి ద్వారా చెప్పాడు. (మత్త. 13:23) మొదటిది ద్రాక్షచెట్టు గురించిన ఉదాహరణ.

7. (ఎ) యేసు చెప్పిన ఉదాహరణలో “వ్యవసాయదారుడు,” “ద్రాక్షచెట్టు,” ‘కొమ్మలు’ ఎవర్ని సూచిస్తున్నాయి? (బి) మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయమేమిటి?

7 యోహాను 15:1-5, 8 చదవండి. ఈ ఉదాహరణలో, “వ్యవసాయదారుడు” యెహోవా అని, “ద్రాక్షచెట్టు” తానేనని, ‘కొమ్మలు’ తన శిష్యులని యేసు వివరించాడు. b ఆ తర్వాత తన అపొస్తలులకు ఇలా చెప్పాడు, “మీరు ఎక్కువగా ఫలిస్తూ, నా శిష్యులని నిరూపించుకుంటూ ఉంటే నా తండ్రికి మహిమ వస్తుంది.” ఇంతకీ ఫలించడం అంటే ఏమిటి? దానికి సూటైన జవాబును యేసు చెప్పలేదు గానీ, దాన్ని అర్థంచేసుకోవడానికి సహాయం చేసే కొన్ని వివరాల్ని ఆయన ఈ ఉదాహరణలో చెప్పాడు.

8. (ఎ) యేసు చెప్పిన ఉదాహరణలో, ఫలించడం అంటే కొత్త శిష్యుల్ని తయారుచేయడం కాదని ఎలా చెప్పవచ్చు? (బి) యెహోవా మన నుండి ఏమి కోరతాడు?

8 తన తండ్రి గురించి యేసు ఇలా చెప్పాడు, “నాలో ఉండి ఫలించని ప్రతీ కొమ్మను ఆయన తెంచి పారేస్తాడు.” మరో మాటలో చెప్పాలంటే, మనం ఫలిస్తేనే యెహోవా సేవకులుగా ఉండగలం. (మత్త. 13:23; 21:43) కాబట్టి ఫలించడమంటే కొత్త శిష్యుల్ని తయారుచేయడం కాదని అర్థంచేసుకోవచ్చు. (మత్త. 28:19) ఒకవేళ ఫలించడమంటే కొత్త శిష్యుల్ని తయారుచేయడం అనుకుంటే, మంచివార్తకు స్పందించని ప్రజలున్న ప్రాంతంలో ప్రకటించడం వల్ల శిష్యుల్ని తయారు చేయలేని నమ్మకమైన సహోదరసహోదరీలందరూ ఫలించని కొమ్మలు అవుతారు. కానీ ఆ వివరణ సరైనది కాదు. ఎందుకంటే శిష్యులు అవ్వమని మనం ప్రజల్ని బలవంతం చేయలేము. అంతేకాదు, ప్రేమగల యెహోవా మనం చేయలేని దాన్ని చేయమని ఎన్నడూ అడగడు. మనం చేయగలిగిందే ఆయన కోరతాడు.—ద్వితీ. 30:11-14.

9. (ఎ) ఫలించడం అంటే ఏమిటి? (బి) మనం ఏ ఉదాహరణ గురించి చర్చించుకుంటాం?

9 మరి ఫలించడం అంటే ఏమిటి? అది మనందరం చేయగలిగిందే అయ్యుండాలి. తన సేవకులందరికీ యెహోవా ఏ పని అప్పగించాడు? దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడమే ఫలించడం. c (మత్త. 24:14) విత్తేవాడి గురించి యేసు చెప్పిన ఉదాహరణ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దానిగురించి ఇప్పుడు చర్చించుకుందాం.

10. (ఎ) యేసు చెప్పిన ఉదాహరణలో విత్తనం, నేల వేటిని సూచిస్తున్నాయి? (బి) గోధుమ వెన్ను ఫలించినప్పుడు ఏమి ఏర్పడతాయి?

10 లూకా 8:5-8, 11-15 చదవండి. విత్తేవాడి గురించిన ఉదాహరణలో, విత్తనం “దేవుని వాక్యం” లేదా దేవుని రాజ్య సందేశం అని; నేల ఒక వ్యక్తి హృదయమని యేసు వివరించాడు. మంచి నేలమీద పడిన విత్తనం మొలకెత్తి, తర్వాత ‘100 రెట్లు ఎక్కువగా ఫలించింది.’ ఒకసారి ఆలోచించండి: గోధుమ వెన్ను ఫలించినప్పుడు ఏమి ఏర్పడతాయి? చిన్న గోధుమ వెన్నులా? కాదు. గోధుమ గింజలు వస్తాయి ఆ తర్వాత అవి వెన్నులుగా తయారవుతాయి. యేసు చెప్పిన ఆ ఉదాహరణలో, ఒక విత్తనం ఫలించి 100 విత్తనాలు వచ్చాయి. దీనికీ, మన పరిచర్యకు ఎలాంటి సంబంధం ఉంది?

మనమెలా “ఓర్పుతో ఫలిస్తాం?” (11వ పేరా చూడండి)

11. (ఎ) విత్తేవాడి ఉదాహరణ పరిచర్యకు ఎలా అన్వయించవచ్చు? (బి) మనం ఏ విధంగా కొత్త విత్తనాన్ని చల్లుతాం?

11 కొన్నేళ్ల క్రితం సహోదరసహోదరీల్లో ఒకరు లేదా మన అమ్మానాన్నలు రాజ్యసందేశాన్ని మనకు తెలియజేశారు. సంతోషకరంగా, రాజ్యసందేశం అనే విత్తనానికి మన హృదయం స్పందించడం వాళ్లు గమనించారు. అంతేకాదు గోధుమ గింజ మొలకెత్తి గోధుమ వెన్నుగా తయారైనట్లు, రాజ్యసందేశమనే విత్తనం మనలో మొలకెత్తి శిష్యులుగా తయారయ్యాం. సాధారణంగా గోధుమ వెన్ను ఫలించినప్పుడు దాన్నుండి కొత్త వెన్నులు రావుగానీ, గోధుమ గింజలు వస్తాయి. అదేవిధంగా శిష్యులుగా తయారైన మనం ఫలించడమంటే కొత్త శిష్యుల్ని తయారుచేయడం కాదుగానీ, కొత్త రాజ్య విత్తనాన్ని d చల్లడం. అవును, దేవుని రాజ్యం గురించి ప్రకటించిన ప్రతీసారి మన హృదయంలో మొలకెత్తిన లాంటి కొత్త రాజ్య విత్తనాన్ని తయారుచేసి, చల్లుతున్నట్లే. (లూకా 6:45; 8:1) కాబట్టి మనం రాజ్య సందేశాన్ని ప్రకటించినంత కాలం ‘ఓర్పుగా ఫలిస్తున్నట్లే’ అని చెప్పవచ్చు.

12. (ఎ) ద్రాక్షచెట్టు, విత్తేవాడి ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) నేర్చుకున్న దాన్నిబట్టి మీకెలా అనిపిస్తుంది?

12 ద్రాక్షచెట్టు, విత్తేవాడి ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ‘ఫలించడం’ అనేది ప్రజలు మంచివార్తను వినడంపై ఆధారపడిలేదు. బదులుగా అది మనం ప్రకటనా పనిని కొనసాగించడం పై ఆధారపడి ఉంది. పౌలు కూడా అదే చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “వాళ్లవాళ్ల పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతారు.” (1 కొరిం. 3:8) యెహోవా మన పనిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకానీ మన పనికి వచ్చే ఫలితాల్నిబట్టి కాదు. 20 ఏళ్లుగా పయినీరు సేవ చేస్తున్న మెటిల్డా అనే సహోదరి ఇలా చెప్తుంది, “మన కృషికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడని తెలుసుకోవడం సంతోషాన్నిస్తుంది.”

మనం ఓర్పుతో ఎలా ఫలించగలం?

13, 14. రోమీయులు 10:1, 2 ప్రకారం, పౌలు ప్రకటించడం ఆపకపోవడానికి కారణాలేమిటి?

13 ‘ఓర్పుతో ఫలించడానికి’ మనకేది సహాయం చేస్తుంది? పౌలు ఉదాహరణను మరింత లోతుగా పరిశీలిద్దాం. యూదులు రాజ్య సందేశాన్ని అంగీకరించనందుకు పౌలు నిరుత్సాహపడ్డాడని మనకు తెలుసు. కానీ ఆయన వాళ్లకు ప్రకటించడం మాత్రం ఆపలేదు. వాళ్ల గురించి ఆయనకు ఏమనిపించిందో చెప్తూ ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దేవుణ్ణి వేడుకుంటున్నాను. దేవుని సేవ చేయాలనే ఉత్సాహం వాళ్లకు ఉందని నేను చెప్పగలను. అయితే, ఆ ఉత్సాహం సరైన జ్ఞానానికి అనుగుణంగా లేదు.” (రోమా. 10:1, 2) పౌలు యూదులకు ప్రకటించడం ఎందుకు ఆపలేదు?

14 దానికి మొదటి కారణం ఏమిటంటే, యూదులు రక్షించబడాలని ఆయన ‘మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.’ (రోమా. 11:13, 14) రెండవ కారణం, ఆయన వాళ్ల గురించి ‘దేవుణ్ణి వేడుకున్నాడు.’ అవును, వాళ్లు రాజ్య సందేశాన్ని అంగీకరించేలా సహాయం చేయమని పౌలు యెహోవాను వేడుకున్నాడు. మూడవ కారణం, “దేవుని సేవ చేయాలనే ఉత్సాహం వాళ్లకు ఉందని” పౌలు గుర్తించాడు. ప్రజల్లో ఉన్న మంచిని, యెహోవా సేవ చేయగల వాళ్ల సామర్థ్యాన్ని ఆయన గమనించాడు. ఉత్సాహవంతులైన ఆ యూదులు తనలాగే యేసు శిష్యులు అవ్వగలరని పౌలుకు తెలుసు.

15. మనం పౌలును ఎలా అనుకరించవచ్చు? కొన్ని అనుభవాలు చెప్పండి.

15 మనం పౌలును ఎలా అనుకరించవచ్చు? మొదటిగా, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్న” వాళ్లందర్ని వెదకాలనే కోరికతో ఉండాలి. రెండవదిగా, మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు నిజమైన ఆసక్తి ఉన్నవాళ్లు వినేలా సహాయం చేయమని యెహోవాను వేడుకోవాలి. (అపొ. 13:48; 16:14) దాదాపు 30 ఏళ్లుగా పయినీరు సేవచేస్తున్న సిల్వాన అనే సహోదరి ఆ పనే చేసింది. ఆమె ఇలా చెప్తుంది, “నేను పరిచర్యలో ఎవరి ఇంటికైనా వెళ్లే ముందు, ఇతరుల గురించి మంచిగా ఆలోచించేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేస్తాను.” అయితే, వినే మనసున్న ప్రజల్ని కనుగొనేలా దేవదూతల సహాయాన్ని ఇవ్వమని కూడా మనం ప్రార్థించవచ్చు. (మత్త. 10:11-13; ప్రక. 14:6) రాబర్ట్‌ అనే సహోదరుడు 30 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా పయినీరు సేవచేస్తున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు, “ఇంటివ్యక్తి జీవితంలో ఏమి జరుగుతుందో తెలిసిన దేవదూతలతో కలిసి పనిచేయడం ఆసక్తిగా ఉంటుంది.” మూడవదిగా, మనం ప్రజల్లో ఉన్న మంచిని, యెహోవా సేవ చేయగల వాళ్ల సామర్థ్యాన్ని చూడడానికి ప్రయత్నించాలి. బాప్తిస్మం తీసుకొని 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన కార్ల్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “ఒక వ్యక్తిలో ఆసక్తి ఉందని తెలిపే ఏదైనా చిన్న సూచన కోసం నేను చూస్తాను. బహుశా అది చిన్న నవ్వు కావచ్చు, దయగా చూడడం లేదా నిజాయితీగా ఒక ప్రశ్న అడగడం కావచ్చు.” మనం ఇవన్నీ చేస్తే, పౌలులాగే “ఓర్పుతో ఫలిస్తాం.”

“నీ చేయి వెనుక తియ్యక విత్తుము”

16, 17. (ఎ) ప్రసంగి 11:6 నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (బి) మనల్ని గమనిస్తున్న వాళ్లపై మన పరిచర్య ఎలాంటి ప్రభావం చూపించగలదు?

16 ఎవ్వరూ వినట్లేదని అనిపించినప్పటికీ, ప్రకటనా పని ఇతరులపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనమెప్పుడూ మర్చిపోకూడదు. (ప్రసంగి 11:6 చదవండి.) ప్రజలు మనల్ని గమనిస్తారు. మన శుభ్రమైన బట్టల్ని, ఇతరులతో మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడే విధానాన్ని వాళ్లు గమనిస్తారు. అది వాళ్లపై మంచి ప్రభావం చూపించవచ్చు. ఒకప్పుడు మన గురించి తప్పుగా అనుకున్నవాళ్లు కూడా కొంతకాలం తర్వాత అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. సర్జహో, ఓలిండల విషయంలో అదే జరిగింది.

17 సర్జహో ఇలా అంటున్నాడు, “అనారోగ్యం కారణంగా మేము కొంతకాలం బస్టాపుకు వెళ్లలేదు. మళ్లీ వెళ్లినప్పుడు, దారిలో కనిపించినవాళ్లు ‘ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు, మిమ్మల్ని మిస్‌ అయ్యాం!’” అని అన్నారు. ఓలిండ చిరునవ్వుతో ఇలా చెప్తుంది, “బస్సు డ్రైవర్లు చేతులు ఊపుతూ మమ్మల్ని పలకరించేవాళ్లు. కొంతమందేమో వాళ్ల సీట్లో నుండే ‘మంచి పని చేస్తున్నారు’ అని గట్టిగా చెప్పేవాళ్లు. మన పత్రికలు కూడా అడిగి తీసుకున్నారు.” అంతేకాదు, ఒకాయన కార్టు దగ్గరకు వచ్చి, పూల బొకే ఇచ్చి, వాళ్లు చేస్తున్న పనికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు సర్జహో, ఓలిండలు చాలా ఆశ్చర్యపోయారు.

18. ‘ఓర్పుతో ఫలించాలని’ మీరెందుకు నిర్ణయించుకున్నారు?

18 దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెప్పడంలో ‘మీ చేయి వెనుక తియ్యకుండా’ పనిచేసినంతకాలం “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యం” ఇచ్చే పనిలో మీకొక ప్రాముఖ్యమైన భాగం ఉంటుంది. (మత్త. 24:14) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాను సంతోషపెడుతున్నందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ‘ఓర్పుతో ఫలించే’ వాళ్లందర్నీ ఆయన ప్రేమిస్తాడు.

a “సొంత ఊరిలో” ప్రీచింగ్‌ చేయడం కష్టమని యేసు కూడా చెప్పాడు. ఆయన చేసిన పరిచర్య గురించి రాయబడిన నాలుగు సువార్త వృత్తాంతాల్లో ఆ విషయం ప్రస్తావించబడింది.—మత్త. 13:57; మార్కు 6:4; లూకా 4:24; యోహా. 4:44.

b ఈ ఉదాహరణలోని ‘కొమ్మలు’ పరలోకానికి వెళ్లే వాళ్లను సూచిస్తున్నప్పటికీ, దేవుని సేవకులందరూ ఈ ఉదాహరణ నుండి పాఠాలు నేర్చుకోవచ్చు.

c ‘ఫలించడం’ అనే పదం పవిత్రశక్తి పుట్టించే లక్షణాలను అలవర్చుకోవడాన్ని కూడా సూచిస్తుండవచ్చు. అయితే, ఈ ఆర్టికల్‌లో అలాగే తర్వాతి ఆర్టికల్‌లో “మన పెదవులతో” దేవుని రాజ్యాన్ని ప్రకటించడం గురించే ముఖ్యంగా తెలుసుకుంటాం.—గల. 5:22, 23; హెబ్రీ. 13:15.

d వేరే సందర్భాల్లో, శిష్యుల్ని చేసే పని గురించి చెప్పడానికి విత్తడం, కోయడం గురించిన ఉదాహరణల్ని యేసు ఉపయోగించాడు.—మత్త. 9:37; యోహా. 4:35-38.