జీవిత కథ
“నేను ఇతరుల నుండి చాలా నేర్చుకున్నాను!”
అల్జీరియాలోని పర్వతాల్లో మా ఫ్రెంచ్ సైన్యం డేరాలు వేసుకుని ఉంది, చుట్టూ చిమ్మచీకటి. అక్కడ యుద్ధం భయంకరంగా జరుగుతోంది. నేను ఇసుక బస్తాల వెనక మెషీన్ గన్ పట్టుకొని ఒక్కడినే కాపలా కాస్తున్నాను. హఠాత్తుగా, ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. నేను భయంతో బిగుసుకుపోయాను. నాకప్పుడు ఇరవై ఏళ్లే, చంపాలని గానీ చనిపోవాలని గానీ నాకు లేదు. “దేవా! నాకు సాయం చేయి” అని దేవున్ని వేడుకున్నాను.
భయం కలిగించే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది, అప్పటినుండి నేను దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పేముందు, నా చిన్ననాటి సంగతులు మీకు చెప్తాను. దేవుని గురించి తెలుసుకోవాలనే కోరికను అవి నాలో ఎలా కలిగించాయో వివరిస్తాను.
మా నాన్న నుండి నేర్చుకున్న పాఠాలు
నేను 1937లో ఉత్తర ఫ్రాన్స్‌లో గేనన్ అనే ఊళ్లో పుట్టాను, అక్కడ బొగ్గు గనులు ఉండేవి. ఆ గనుల్లో పనిచేసిన మా నాన్న నుండి కష్టపడి పనిచేయడం, అన్యాయాన్ని ద్వేషించడం నేర్చుకున్నాను. ఆ గనుల్లో చాలామంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేవాళ్లు. వాళ్లను ఎవ్వరూ పట్టించుకోవట్లేదని నాన్న గమనించి, వాళ్లకు సహాయం చేయాలనుకున్నాడు. ఆ కార్మికుల పరిస్థితి మెరుగవ్వాలనే ఉద్దేశంతో ఆయన యూనియన్లలో చేరి, వాళ్ల హక్కుల కోసం పోరాడాడు. ఆ ఊళ్లో ఉన్న క్యాథలిక్ ప్రీస్టుల వేషధారణ కూడా నాన్నకు నచ్చేది కాదు. వాళ్లలో చాలామంది సౌకర్యవంతంగా జీవించేవాళ్లు. అయినప్పటికీ, ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న బొగ్గు కార్మికుల్ని ఆహారం, డబ్బు ఇవ్వమని అడిగేవాళ్లు. వాళ్ల ప్రవర్తన అస్సలు నచ్చక మా నాన్న ఎప్పుడూ మతం గురించి గానీ, దేవుడు గురించి గానీ మాకు చెప్పలేదు.
నేను కూడా పెరిగే కొద్దీ, అన్యాయాన్ని ద్వేషించడం మొదలుపెట్టాను. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో నివసిస్తున్న విదేశీయుల పట్ల ప్రజలు వివక్ష చూపించడం నాకు నచ్చేది కాదు. నేను ఆ విదేశీయుల పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాణ్ణి, సరదాగా ఉండేవాణ్ణి. పైగా మా అమ్మది కూడా ఫ్రాన్స్ కాదు, పోలండ్. కాబట్టి అన్ని జాతులవాళ్లు కలిసికట్టుగా ఉండాలని, ఒకరినొకరు సమానంగా చూసుకోవాలని నేను ఎంతగానో కోరుకునేవాణ్ణి.
నేను జీవితం గురించి లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాను
1957లో ప్రభుత్వ ఆదేశం మేరకు నేను సైన్యంలో చేరాను. ఈ ఆర్టికల్ ఆరంభంలో నేను చెప్పిన సంఘటన ఆ సమయంలోనే జరిగింది. అల్జీరియా పర్వతాల్లో చిమ్మచీకటిలో, “దేవా! నాకు సాయం చేయి” అని ప్రార్థించాక, తీరా చూస్తే ఎదురుగా వచ్చింది శత్రు సైనికుడు కాదుగానీ ఒక అడవి గాడిద అని నాకర్థమైంది. దాంతో నేను ఊపిరి పీల్చుకున్నాను! ఆ సంఘటన, అలాగే అప్పుడు జరుగుతున్న యుద్ధం నేను జీవితం గురించి లోతుగా ఆలోచించేలా చేశాయి. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? దేవుడు మనల్ని పట్టించుకుంటాడా? ఎల్లప్పుడూ శాంతిగా ఉండే రోజు ఎప్పటికైనా వస్తుందా? అనే ప్రశ్నల గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను.
తర్వాత ఒకసారి నేను సెలవు మీద ఇంటికి వెళ్లినప్పుడు, ఒక యెహోవాసాక్షిని కలిశాను. ఆయన నాకు ఒక బైబిలు ఇచ్చాడు. నేను అల్జీరియాకు తిరిగి వెళ్లిన తర్వాత దాన్ని చదవడం మొదలుపెట్టాను. అందులో నన్ను బాగా ఆకట్టుకున్న లేఖనం, ప్రకటన 21:3, 4. అక్కడ ఇలా ఉంది, “దేవుని నివాసం మనుషులతో ఉంది . . . వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.” ఆ మాటలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాయి. ‘అవి ఎప్పటికైనా నిజమౌతాయా?’ అని అనుకున్నాను. ఆ సమయంలో నాకు దేవుని గురించి, బైబిలు గురించి పెద్దగా తెలీదు.
1959 లో నేను సైన్యం నుండి తిరిగి వచ్చేసిన తర్వాత, ఫ్రాంస్వా అనే ఒక యెహోవాసాక్షిని కలిశాను. ఆయన నాకు ఎన్నో బైబిలు సత్యాల్ని బోధించాడు. ఉదాహరణకు దేవునికి ఒక పేరు ఉందని, ఆ పేరు యెహోవా అని బైబిల్లో చూపించాడు. (కీర్త. 83:18) అంతేకాదు, యెహోవా ఈ భూమంతటా న్యాయం జరిగిస్తాడని, ఈ భూమిని పరదైసుగా మారుస్తాడని ప్రకటన 21:3, 4 లో ఉన్న మాటల్ని నిజం చేస్తాడని ఫ్రాంస్వా వివరించాడు.
ఆయన చెప్పిన విషయాలు సరైనవే అనిపించాయి, అవి నా మనసును హత్తుకున్నాయి. అయితే ప్రీస్టుల మీద నాకు చాలా కోపం వచ్చింది, బైబిల్లో లేనివాటిని బోధిస్తున్నందుకు వాళ్లను ఖండించాలని అనుకున్నాను! నేను కూడా మా నాన్నలాగే ఆలోచిస్తూ, అన్యాయాన్ని సహించలేకపోయాను. వెంటనే ఏదోకటి చేయాలనిపించింది.
ఫ్రాంస్వా, అలాగే కొత్తగా స్నేహితులైన ఇతర సాక్షులు నాలోని ఆవేశాన్ని తగ్గించుకోవడానికి సహాయం చేశారు. క్రైస్తవులుగా మన పని ఇతరులకు తీర్పు తీర్చడం కాదుగానీ, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వాళ్లకు సహాయం చేయడమే అని వివరించారు. యేసు ఆ పనే చేశాడు, తన అనుచరుల్ని కూడా అదే చేయమన్నాడు. (మత్త. 24:14; లూకా 4:43) ప్రజల నమ్మకాలు ఏవైనా వాళ్లతో దయగా, నేర్పుగా మాట్లాడాలని నేను నేర్చుకున్నాను. బైబిలు ఇలా చెప్తుంది, “ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా వ్యవహరించాలి.”—2 తిమో. 2:24.
నేను అవసరమైన మార్పులు చేసుకొని, 1959 లో ఒక ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షిని అయ్యాను. ఆ సమావేశంలో ఏంజెల్ అనే ఒక సామె. 19:14.
యువ సహోదరిని కలిశాను, ఆమె నాకు బాగా నచ్చింది. ఆమె వెళ్లే సంఘానికి నేను అప్పుడప్పుడు వెళ్లడం మొదలుపెట్టాను, తర్వాత 1960లో మేము పెళ్లి చేసుకున్నాం. ఆమె తెలివైన అమ్మాయి, మంచి భార్య. ఆమె నాకు యెహోవా ఇచ్చిన అమూల్యమైన బహుమతి.—తెలివి, అనుభవం ఉన్న సహోదరుల నుండి నేను చాలా నేర్చుకున్నాను
సంవత్సరాలు గడుస్తుండగా తెలివి, అనుభవం ఉన్న సహోదరుల నుండి నేను ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా, ఏదైనా కష్టమైన నియామకంలో విజయం సాధించాలంటే, వినయం చూపిస్తూ సామెతలు 15:22 లోని సలహాను పాటించాలని నేర్చుకున్నాను. అక్కడ ఇలా ఉంది, “సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.”
1964 నుండి ఆ మాటలు ఎంత నిజమో నేను చూస్తున్నాను. ఆ సంవత్సరంలో నేను ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేయడం మొదలుపెట్టి, సంఘాల్ని సందర్శిస్తూ సహోదరుల్ని ప్రోత్సహించాను, ఆధ్యాత్మికంగా బలపర్చాను. అప్పుడు నాకు 27 ఏళ్లే, అంతగా అనుభవం కూడా లేదు. దానివల్ల కొన్ని పొరపాట్లు చేశాను. అయితే, వాటినుండి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. అన్నిటికన్నా ముఖ్యంగా సమర్థులైన, అనుభవంగల “సలహాదారుల” నుండి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను.
ఉదాహరణకు, నేను ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న కొత్తలో ఏం జరిగిందో చెప్తాను. నేను ప్యారిస్‌లో ఒక సంఘాన్ని సందర్శించిన తర్వాత, అనుభవంగల ఒక సహోదరుడు, “మీతో ఒంటరిగా మాట్లాడొచ్చా?” అని అడిగాడు. నేను “సరే” అన్నాను.
అప్పుడు ఆయన, “లూయీ, మనం ఒక డాక్టర్ని ఇంటికి రమ్మని పిలిస్తే ఆయన ఎవర్ని చూడడానికి వస్తాడు?” అని అడిగాడు.
దానికి నేను, “ఒంట్లో బాలేనివాళ్లను” అని అన్నాను.
అప్పుడు ఆయన నాతో, “సరిగ్గా చెప్పావు. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లతో, అంటే సంఘ పర్యవేక్షకుని లాంటివాళ్లతో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. మా సంఘంలో నిరుత్సాహంతో ఉన్నవాళ్లు, కొత్తవాళ్లు, బిడియస్థులు చాలామంది ఉన్నారు. నువ్వు వాళ్లతో సమయం గడిపితే, వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్తే, వాళ్లెంతో సంతోషిస్తారు” అని అన్నాడు.
ఆ సహోదరుడు చెప్పింది సరైనదే, ఆయన నిజంగా మంచి సలహా ఇచ్చాడు. దేవుని గొర్రెల మీద ఆయనకు ఉన్న ప్రేమ నా హృదయాన్ని తాకింది. కాబట్టి నేను నా అహాన్ని పక్కనపెట్టి, వెంటనే ఆయన ఇచ్చిన సలహాను పాటించడం మొదలుపెట్టాను. అలాంటి సహోదరుల్ని ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు.
సామెతలు 15:22 చెప్తున్నట్టుగా, తెలివిగలవాళ్లను సంప్రదించడం మరోసారి నాకు సహాయం చేసింది. అంటే ఆధ్యాత్మికంగా పరిణతిగల సహోదరుల్ని సలహా అడిగాను. వాళ్లలో కొంతమందికి మాంసం అమ్మడంలో, కాయగూరలు పండించడంలో, వంట చేయడంలో, సరుకులు కొనడంలో అనుభవం ఉంది. మేమందరం కలిసి పనిచేయడం వల్ల, పెద్ద పర్వతంలా అనిపించిన నియామకాన్ని పూర్తి చేయగలిగాం.
1969 అలాగే 1973 లో, ప్యారిస్‌లోని కొలొంబ్స్‌లో జరిగిన రెండు అంతర్జాతీయ సమావేశాల్లో, నన్ను ఫుడ్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌కు పర్యవేక్షకుడిగా నియమించారు. 1973 సమావేశంలో మేము దాదాపు 60,000 మందికి ఐదు రోజులపాటు ఆహారం అందించాల్సి ఉంది! అప్పుడు నాకు చాలా భయమేసింది. కానీ1973 లో నాకు, నా భార్యకు ఫ్రాన్స్‌లోని బెతెల్‌లో సేవచేయడానికి ఆహ్వానం వచ్చింది. అక్కడ నాకిచ్చిన మొదటి నియామకం ఇంకో పెద్ద సవాలుగా అనిపించింది. నేను ఆఫ్రికాలోని కామెరూన్ దేశంలో ఉన్న మన సహోదరులకు ప్రచురణలు అందించాలి. అక్కడ 1970 నుండి 1993 వరకు మన పనిమీద నిషేధం ఉంది. నాకు మళ్లీ భయమేసింది. బహుశా నా భయాన్ని గమనించి, ఫ్రాన్స్‌లో బ్రాంచి పర్యవేక్షకునిగా సేవచేస్తున్న సహోదరుడు, “కామెరూన్‌లో ఉన్న మన సహోదరులకు ఆధ్యాత్మిక ఆహారం ఎంతో అవసరం. కాబట్టి వాళ్లకు ఆహారం అందిద్దాం” అని నన్ను ప్రోత్సహించాడు. మేము అదే చేశాం.
నేను కామెరూన్ సరిహద్దుల్లో ఉన్న దేశాలకు తరచూ ప్రయాణించి, అక్కడ కామెరూన్ నుండి వచ్చిన సంఘ పెద్దల్ని కలిసేవాణ్ణి. ధైర్యం, వివేచన ఉన్న ఆ పెద్దలు కామెరూన్‌లోని సహోదరసహోదరీలకు క్రమంగా ఆధ్యాత్మిక ఆహారం అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి నాకు సహాయం చేశారు. యెహోవా మా ప్రయత్నాల్ని దీవించాడు. సుమారు 20 సంవత్సరాల్లో ఒక్క కావలికోట పత్రిక గానీ, నెలనెలా వచ్చే మన రాజ్య సేవ గానీ దేవుని ప్రజలకు చేరడం ఆగలేదు.
నా ప్రియమైన భార్య నుండి చాలా నేర్చుకున్నాను
మా కోర్ట్‌షిప్ మొదలైనప్పటి నుండే, ఏంజెల్‌లో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాల్ని నేను గమనించాను. మా పెళ్లయ్యాక ఆ లక్షణాల్ని ఇంకా స్పష్టంగా చూడగలిగాను.
నిజానికి మా పెళ్లయిన రోజు సాయంత్రమే, దంపతులుగా మా జీవితాన్ని యెహోవా సేవలో ఎక్కువ ఉపయోగించాలనే కోరిక గురించి ప్రార్థించమని ఆమె నన్ను అడిగింది. యెహోవా మా ప్రార్థనకు జవాబిచ్చాడు.యెహోవా మీద ఇంకా ఎక్కువగా నమ్మకం ఉంచడానికి కూడా ఏంజెల్ నాకు సహాయం చేసింది. ఉదాహరణకు, 1973 లో బెతెల్‌లో సేవచేయమని ఆహ్వానం వచ్చినప్పుడు, నాకు ప్రాంతీయ సేవంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కాస్త వెనకడుగు వేశాను. కానీ ఏంజెల్ ఇలా గుర్తుచేసింది, “మనం మన జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నాం. కాబట్టి ఆయన సంస్థ ఏం చెప్తే అది మనం చేయాలి.” (హెబ్రీ. 13:17) నేను ఆమె మాటలతో పూర్తిగా ఏకీభవించాను! కాబట్టి మేము బెతెల్‌కు వెళ్లాం. మా వివాహ జీవితమంతటిలో నా భార్య తెలివి, వివేచన, ఆధ్యాత్మికత మా బంధాన్ని బలపర్చాయి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేశాయి.
మా వయసు పైబడుతున్నా ఏంజెల్ ఇప్పటికీ నాకు చక్కగా మద్దతిస్తోంది. ఉదాహరణకు, సంస్థ నిర్వహించే పాఠశాలలు ఎక్కువశాతం ఇంగ్లీషులో జరుగుతాయి. కాబట్టి నేను, ఏంజెల్ ఆ భాష ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి కృషిచేశాం. అందుకోసం, 70 ఏళ్లు దాటాక కూడా ఇంగ్లీషు భాషా సంఘానికి వెళ్లడం మొదలుపెట్టాం. ఒకవైపు ఫ్రాన్స్ బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేస్తూ, మరోవైపు కొత్త భాషను నేర్చుకోవడం ఒక సవాలే. కానీ నేను, ఏంజెల్ ఒకరికొకరం సహాయం చేసుకున్నాం. ఇప్పుడు మా వయసు 80 ఏళ్లు దాటినా మేము ఇంగ్లీషులో, ఫ్రెంచ్‌లో రెండు భాషల్లో మీటింగ్స్‌కి సిద్ధపడతాం. అంతేకాదు మా సంఘంతోపాటు మీటింగ్స్‌లో, పరిచర్యలో వీలైనంత ఎక్కువగా పాల్గొనడానికి కృషిచేస్తాం. ఇంగ్లీషు నేర్చుకోవడానికి మేము చేసిన ప్రయత్నాల్ని యెహోవా దీవించాడు.
2017 లో మేము ఒక గొప్ప ఆశీర్వాదం పొందాం. బ్రాంచి కమిటీ సభ్యులకు, వాళ్ల భార్యలకు జరిగే పాఠశాలకు నేను, ఏంజెల్ వెళ్లాం. అది న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో జరిగింది.
యెహోవా నిజంగా మహాగొప్ప ఉపదేశకుడు. (యెష. 30:20) కాబట్టి వృద్ధులమైనా, యౌవనులమైనా మనందరం శ్రేష్ఠమైన విద్యను పొందుతాం! (ద్వితీ. 4:5-8) యెహోవా చెప్పేది, అలాగే అనుభవంగల సహోదరసహోదరీలు చెప్పేది వినే యౌవనులు తమ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలరని, యెహోవాకు నమ్మకంగా సేవ చేయగలరని నేను గమనించాను. సామెతలు 9:9 ఇలా గుర్తుచేస్తుంది, “తెలివిగలవాడికి ఉపదేశం ఇవ్వు, అతను ఇంకా తెలివిగలవాడు అవుతాడు. నీతిమంతునికి బోధించు, అతను నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటాడు.”
దాదాపు 60 సంవత్సరాల క్రితం అల్జీరియాలో జరిగిన సంఘటన అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ సంఘటన తర్వాత నా జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అప్పుడు నాకు తెలీదు. నేను ఇతరుల నుండి చాలా నేర్చుకున్నాను! యెహోవా నాకు, ఏంజెల్‌కు అద్భుతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మన పరలోక తండ్రి నుండి, అలాగే తెలివి, అనుభవం, దేవుని మీద ప్రేమ ఉన్న సహోదరసహోదరీల నుండి నేర్చుకోవడం ఎన్నడూ ఆపకూడదని మేము నిర్ణయించుకున్నాం.