కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి

యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి

“నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి.”ఆది. 32:28.

పాటలు: 23, 38

1, 2. యెహోవా సేవకులు వేటితో పోరాడుతున్నారు?

 హేబెలు మొదలుకొని ఇప్పటివరకు ఉన్న దేవుని నమ్మకమైన సేవకులందరూ విశ్వాస పరీక్షలతో పోరాడారు. అపొస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులతో మాట్లాడుతూ వాళ్లు యెహోవా ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందేందుకు ‘శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించారు’ అని చెప్పాడు. (హెబ్రీ. 10:32-34) క్రైస్తవులు చేసిన అలాంటి పోరాటాన్ని పరుగుపందెం, కుస్తీపోటీ, బాక్సింగ్‌ వంటి గ్రీకు పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు చేసే పోరాటంతో పౌలు పోల్చాడు. (హెబ్రీ. 12:1-2, 4) నేడు మనం జీవపు పరుగుపందెంలో ఉన్నాం. అయితే శత్రువులు మన అవధానాన్ని పక్కకు మళ్లించి ఇప్పుడు మనకున్న సంతోషాన్ని అలాగే భవిష్యత్తులో మనం పొందబోయే బహుమానాల్ని పోగొట్టుకునేలా చేయాలని చూస్తున్నారు.

2 మనం సాతానుతో, అతని లోకంతో గట్టి పోరాటం చేస్తున్నాం. (ఎఫె. 6:12) ఈ లోకంలోని బోధలు, తత్వజ్ఞానం అలాగే అనైతికత, పొగతాగడం, మద్యం, మత్తుమందు సేవించడం వంటి చెడు అలవాట్లు మన మీద ప్రభావం చూపించకుండా ఉండేందుకు పోరాడడం చాలా ప్రాముఖ్యం. అంతేకాదు నిరుత్సాహంతో, మన బలహీనతలతో కూడా పోరాడుతూనే ఉండాలి.—2 కొరిం. 10:3-6; కొలొ. 3:5-10.

 3. మన శత్రువులతో పోరాడడానికి కావాల్సిన శిక్షణ యెహోవా మనకు ఎలా ఇస్తున్నాడు?

3 అలాంటి శక్తివంతమైన శత్రువులతో పోరాడి గెలవడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమే, కాని అది కష్టంగా ఉంటుంది. పౌలు తనను బాక్సింగ్‌ చేసే వ్యక్తితో పోల్చుకుంటూ, “గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అని చెప్పాడు. (1 కొరిం. 9:27) అవును, బాక్సింగ్‌ చేసే వ్యక్తి తన ప్రత్యర్థితో పోరాడినట్లే మనం కూడా మన శత్రువులతో పోరాడాలి. అందుకు కావాల్సిన సహాయాన్ని, శిక్షణను యెహోవా మనకు బైబిలు ద్వారా ఇస్తాడు. బైబిలు ఆధారిత ప్రచురణలు, మీటింగ్స్‌, సమావేశాల ద్వారా కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. మరి వాటి ద్వారా నేర్చుకుంటున్నవన్నీ మీరు పాటిస్తున్నారా? ఒకవేళ అలా పాటించకపోతే, బాక్సింగ్‌ చేసే వ్యక్తి గాలిని కొట్టినట్టు మీ శత్రువును మీరు పూర్తిగా ఎదిరించలేకపోవచ్చు.

 4. మనం కీడును ఎలా ఎదిరించవచ్చు?

4 మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం ఊహించని సమయంలో లేదా మనం బలహీనంగా ఉన్నప్పుడు శత్రువులు మన మీద దాడి చేయవచ్చు. “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” అని బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. (రోమా. 12:21) అయితే, “కీడువలన జయింపబడక” అనే మాటలు మనం విజయం సాధించవచ్చు అనే ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. కానీ అలా విజయం సాధించాలంటే కీడుతో పోరాడుతూనే ఉండాలి. ఒకవేళ పోరాడడం ఆపేస్తే సాతాను, అతని లోకం, అలాగే మన బలహీనతలు మనపై విజయం సాధిస్తాయి. కాబట్టి నిరుత్సాహపడి పోరాడడం ఆపేయకండి.—1 పేతు. 5:9.

 5. (ఎ) దేవుని ఆమోదం, ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమి గుర్తుంచుకోవాలి? (బి) బైబిలు కాలాల్లో జీవించిన ఎవరెవరి గురించి ఇప్పుడు పరిశీలిస్తాం?

5 విజయం సాధించాలంటే, మనం అసలు ఎందుకు పోరాడుతున్నామో గుర్తుంచుకోవాలి. మనం పోరాడుతున్నది దేవుని ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికే. హెబ్రీయులు 11:6, NWలో మనమిలా చదువుతాం, ‘దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను ఆరాధించడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించేవాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.’ యెహోవాను వెదకడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడమంటే ఆయన ఆమోదం కోసం మనం చాలా కష్టపడాలని అర్థం. (అపొ. 15:16) అలా కష్టపడిన ఎంతోమంది స్త్రీ-పురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. యాకోబు, రాహేలు, యోసేపు, పౌలు భావోద్వేగంగా, శారీరకంగా ఎన్నో కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ వాళ్లు విజయం సాధించగలిగారు. కష్టపడితే మనం కూడా యెహోవా ఆశీర్వాదాలను పొందవచ్చని వాళ్ల ఉదాహరణలు బట్టి అర్థమౌతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశీర్వాదం పొందుతారు

 6. పట్టుదలతో ప్రయత్నించడానికి యాకోబుకు ఏది సహాయం చేసింది? దానివల్ల అతను ఏ బహుమానం పొందాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 నమ్మకస్థుడైన యాకోబు యెహోవాను ప్రేమించి, ఆయనతో తనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచాడు కాబట్టి అతను పోరాడి గెలిచాడు. తన సంతానాన్ని ఆశీర్వదిస్తానని యెహోవా ఇచ్చిన మాట మీద యాకోబుకు పూర్తి విశ్వాసం ఉంది. (ఆది. 28:3, 4) అతనికి సుమారు 100 ఏళ్లు ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి ఒక దేవదూతతో పోరాడాడు కూడా. (ఆదికాండము 32:24-28 చదవండి.) యాకోబు బలవంతుడైన ఆ దేవదూతతో పోరాడింది తన సొంత శక్తితోనా? కానేకాదు. అయినప్పటికీ, అతను ఆ ఆశీర్వాదాన్ని ఎలాగైనా పొందాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు అందుకోసం ఎంతైనా కష్టపడతానని నిరూపించాడు. యాకోబుకు ఉన్న పట్టుదలను చూసి యెహోవా అతన్ని ఆశీర్వదించి ఇశ్రాయేలు అనే పేరుపెట్టాడు. ఆ పేరుకు అర్థం ‘దేవునితో పోరాడువాడు, లేదా పట్టు విడవకుండా దేవునితో పోరాడేవాడు.’ యాకోబు, దేవుని ఆమోదాన్ని, ఆశీర్వాదాన్ని పొందాడు. మనం కూడా ఆ బహుమానం కోసమే వెదుకుతున్నాం.

 7. (ఎ) నిరుత్సాహం కలిగించే ఎలాంటి పరిస్థితి రాహేలుకు ఎదురైంది? (బి) అప్పుడు ఆమె ఏమి చేసింది? ఏ ఆశీర్వాదం పొందింది?

7 యాకోబు భార్యయైన రాహేలు కూడా, యెహోవా తన భర్తకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలని ఎంతగానో కోరుకుంది. కానీ సమస్యేమిటంటే రాహేలుకు పిల్లలు పుట్టలేదు. బైబిలు కాలాల్లో పిల్లలు పుట్టని స్త్రీలను చాలా తక్కువగా చూసేవాళ్లు. నిరుత్సాహం కలిగించే అలాంటి పరిస్థితిలో కూడా రాహేలు తన పోరాటాన్ని ఎలా కొనసాగించింది? ఆమె ఎన్నడూ ఆశను వదులుకోలేదు. అంతేకాదు యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేస్తూనే వచ్చింది. ఆమె మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనల్ని యెహోవా విన్నాడు. యెహోవా ఆశీర్వదించడంతో ఆమెకు పిల్లలు పుట్టారు. అందుకే ఆమె ఇలా అంది, ‘చాలా కష్టపడి పోరాడి, గెలిచాను.’—ఆది. 30:8, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; ఆది. 30:20-24.

 8. యోసేపుకు ఎలాంటి కష్టాలు వచ్చాయి? అతని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8 నమ్మకస్థులైన యాకోబు, రాహేలుల ఆదర్శం వాళ్ల కొడుకైన యోసేపు మీద ప్రభావం చూపించి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు అది అతనికి సహాయం చేసింది. యోసేపుకు 17 ఏళ్లున్నప్పుడు, అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఈర్ష్యతో సొంత అన్నలే అతన్ని బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత, అతను ఏ తప్పు చేయకపోయినా ఈజిప్టులో చాలా సంవత్సరాలు జైల్లో గడిపాడు. (ఆది. 37:23-28; 39:7-9, 20, 21) ఇన్ని జరిగినా యోసేపు నిరుత్సాహపడలేదు లేదా కోపం పెంచుకోలేదు, పగతీర్చుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే అతను యెహోవాతో తనకున్న స్నేహాన్ని విలువైనదిగా ఎంచి దానిమీదే మనసుపెట్టాడు. (లేవీ. 19:18; రోమా. 12:17-21) మనం యోసేపు నుండి పాఠం నేర్చుకోవచ్చు. ఒకవేళ మనం చిన్నతనంలో కష్టాలు ఎదుర్కొన్నా, ప్రస్తుత జీవితంలో నిరాశలే ఎదురౌతున్నా, మనం పట్టుదలగా పోరాడుతూనే ఉండాలి. అలా చేస్తే యెహోవా మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—ఆదికాండము 39:21-23 చదవండి.

 9. యాకోబు, రాహేలు, యోసేపులను మనమెలా అనుకరించవచ్చు?

9 నేడు, మనం కూడా కష్టమైన సమస్యల్ని సహించాల్సిరావచ్చు. బహుశా మీరు అన్యాయం, పక్షపాతం, ఎగతాళి, ఇతరులు మీమీద ఈర్ష్యపడడం వంటివాటి వల్ల బాధపడుతుండవచ్చు. అలాంటప్పుడు నిరుత్సాహపడకుండా, యెహోవాను సంతోషంగా సేవిస్తూ ఉండడానికి యాకోబు, రాహేలు, యోసేపులకు ఏమి సహాయం చేసిందో గుర్తుచేసుకోండి. వాళ్లు యెహోవాతో ఉన్న తమ సంబంధానికి చాలా విలువిచ్చారు కాబట్టి ఆయన వాళ్లను బలపర్చి ఆశీర్వదించాడు. వాళ్లు పోరాటం ఆపకుండా, తమ ప్రార్థనలకు తగినట్టు ప్రవర్తించారు. మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం కాబట్టి భవిష్యత్తు విషయంలో మన నిరీక్షణను బలంగా ఉంచుకోవాలి. యెహోవా ఆమోదం పొందడం కోసం పోరాడడానికి అంటే కష్టపడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ఆశీర్వాదం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉండండి

10, 11. (ఎ) దేవుని ఆశీర్వాదం కోసం మనమెందుకు పోరాడాల్సిరావచ్చు? (బి) సరైన ఎంపికలు చేసుకోవడానికి మనకేవి సహాయం చేస్తాయి?

10 దేవుని ఆశీర్వాదం కోసం మనమెందుకు పోరాడాల్సిరావచ్చు? ఎందుకంటే మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్ని చెడు కోరికలతో పోరాడుతుండవచ్చు. కొంతమంది పరిచర్య విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండేందుకు కృషి చేస్తుండవచ్చు, మరికొంతమంది అనారోగ్యంవల్ల లేదా ఒంటరితనంవల్ల బాధపడుతుండవచ్చు. ఇంకొంతమంది తమను బాధపెట్టినవాళ్లను క్షమించలేక పోతుండవచ్చు. అయితే, నమ్మకంగా ఉండేవాళ్లకు ప్రతిఫలాన్ని ఇచ్చే యెహోవాను మనం ఎంతకాలంగా సేవిస్తున్నప్పటికీ, ఆయన సేవ చేయనివ్వకుండా అడ్డుపడే విషయాలతో మనందరం పోరాడాలి.

దేవుని ఆశీర్వాదం కోసం మీరు పోరాడుతున్నారా? (10, 11 పేరాలు చూడండి)

11 నిజమే క్రైస్తవునిగా జీవించడం, సరైన ఎంపికలు చేసుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. ముఖ్యంగా చెడు కోరికలతో పోరాడుతున్నప్పుడు అది మరీ కష్టంగా ఉండవచ్చు. (యిర్మీ. 17:9) ఒకవేళ మీకు అలా అనిపిస్తే, పవిత్రశక్తి కోసం యెహోవాకు ప్రార్థించండి. సరైనది చేయడానికి కావాల్సిన బలాన్ని పొందడానికి మీకు ప్రార్థన, పవిత్రశక్తి సహాయం చేస్తాయి. అప్పుడు మీరు దేవుని ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు. మీ ప్రార్థనలకు తగినట్లుగా జీవించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ బైబిలు చదవడానికి ప్రయత్నించండి, వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ ఆరాధన చేసుకోవడానికి సమయం కేటాయించండి.—కీర్తన 119:32 చదవండి.

12, 13. చెడు కోరికలను అదుపు చేసుకోవడానికి ఇద్దరు క్రైస్తవులకు ఏమి సహాయం చేసింది?

12 దేవుని వాక్యం, పవిత్రశక్తి, మన క్రైస్తవ ప్రచురణల సహాయంతో చెడు కోరికలను అధిగమించిన మన సహోదరసహోదరీల అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఒక టీనేజీ సహోదరుడు 2003, డిసెంబరు 8 తేజరిల్లు! (ఇంగ్లీషు) సంచికలో వచ్చిన “హౌ కెన్‌ యు రెసిస్ట్‌ రాంగ్‌ డిజైర్స్‌?” అనే ఆర్టికల్‌ చదివాడు. అది చదివాక అతనికి ఎలా అనిపించింది? “నాకొచ్చే చెడు ఆలోచనల్ని అదుపు చేసుకోవడానికి నేను పోరాడుతున్నాను. కానీ, ‘చెడు కోరికలతో తీవ్రంగా పోరాడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు’ అని ఈ ఆర్టికల్‌లో చదివినప్పుడు ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీల్లో నేనూ ఒక్కడినని అనిపించింది. నేను ఒంటరివాణ్ణి కాదని అర్థమైంది.” అదే సహోదరుడు 2003, అక్టోబరు 8 తేజరిల్లు! (ఇంగ్లీషు) సంచికలో వచ్చిన “ఆల్టర్నేటివ్‌ లైఫ్‌-స్టైల్స్‌—డజ్‌ గాడ్‌ అప్రూవ్‌?” అనే ఆర్టికల్‌ నుండి కూడా ప్రయోజనం పొందాడు. ఈ పోరాటం కొందరికి ‘శరీరములో ఒక ముల్లులా’ ఎప్పుడూ ఉంటుందని అతను ఆ ఆర్టికల్‌లో తెలుసుకున్నాడు. (2 కొరిం. 12:7) కానీ, వాళ్లు మంచి ప్రవర్తనతో ఉండడానికి పోరాడుతూనే ఉన్నప్పుడు, భవిష్యత్తు విషయంలో వాళ్లు మంచి ఆశతో ఉంటారు. ఆ సహోదరుడు ఇలా చెప్పాడు, “ఆ కారణాన్ని బట్టే, ఒక్కోరోజు గడిచేకొద్దీ నేను నమ్మకంగా ఉండగలనని అనిపిస్తుంది. తన సంస్థను ఉపయోగిస్తూ ఈ దుష్టలోకంలో మనల్ని ప్రతీరోజు సంరక్షిస్తున్న యెహోవాకు నేను ఎంతో కృతజ్ఞుడిని.”

13 అమెరికాలో ఉంటున్న ఒక సహోదరి అనుభవాన్ని కూడా పరిశీలించండి. ఆమె ఇలా రాసింది, “ఎప్పుడూ మాకు సరిగ్గా కావాల్సిన దాన్ని, సరైన సమయానికి అందిస్తూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆర్టికల్స్‌ని నా కోసమే రాశారని చాలాసార్లు అనిపిస్తుంటుంది. యెహోవా అసహ్యించుకొనే ఒక బలమైన కోరికతో కొన్ని సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. కొన్నిసార్లయితే, ఇక నావల్ల కాదు ఈ పోరాటాన్ని ఆపేద్దాం అనిపిస్తుంది. యెహోవా దయగలవాడు, క్షమించేవాడని నాకు తెలుసు కానీ ఆ చెడ్డకోరిక మీద నాలో దాగివున్న ఇష్టంవల్ల ఆయన ఇస్తున్న సహాయాన్ని పొందడానికి అర్హురాలిని కాదనిపిస్తుంది. నాలో జరుగుతున్న ఈ పోరాటం నా జీవితంలోని ప్రతీ విషయంపై ప్రభావం చూపించింది . . . 2013, మార్చి 15 కావలికోట సంచికలో వచ్చిన ‘యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?’ అనే ఆర్టికల్‌ చదివాక, యెహోవా నాకు సహాయం చేయాలనుకుంటున్నాడని నాకు నిజంగా అనిపించింది.”

14. (ఎ) తాను చేస్తున్న పోరాటం గురించి పౌలు ఎలా భావించాడు? (బి) మన బలహీనతలతో చేసే పోరాటంలో మనమెలా గెలవవచ్చు?

14 రోమీయులు 7:21-25 చదవండి. చెడు కోరికలతో, బలహీనతలతో పోరాడడం ఎంత కష్టమో పౌలుకు స్వయంగా తెలుసు. అయితే యెహోవాకు ప్రార్థన చేసి, సహాయం కోసం ఆయన మీద ఆధారపడి, యేసు బలి మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా విజయం సాధించగలడని అతనికి తెలుసు. మరి మన విషయమేమిటి? మన బలహీనతలతో చేస్తున్న పోరాటంలో గెలవగలమా? పౌలులాగే మనం కూడా సొంత శక్తిమీద కాకుండా యెహోవా మీద పూర్తిగా ఆధారపడుతూ యేసు బలిమీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా గెలవగలం.

15. నమ్మకంగా ఉంటూ కష్టాలను సహించడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేయగలడు?

15 కొన్నిసార్లు, ఒక విషయం గురించి మనం ఎంత చింతిస్తున్నామో తెలుసుకోవడానికి దేవుడు అనుమతించవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మనం గానీ, మన కుటుంబంలో ఇంకెవరైనా గానీ తీవ్ర అనారోగ్య పాలైతే లేదా అన్యాయానికి గురైతే ఏమి చేస్తాం? మనకు యెహోవామీద పూర్తి విశ్వాసం ఉంటే, ఆయనకు నమ్మకంగా ఉండడానికీ, మన సంతోషాన్ని, ఆయనతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికీ కావాల్సిన బలాన్ని ఇవ్వమని ఆయన్ను అడుగుతాం. (ఫిలి. 4:13) మనం సహిస్తూ ఉండడానికి కావాల్సిన బలాన్ని, ధైర్యాన్ని ప్రార్థన ద్వారా పొందవచ్చని పూర్వం అలాగే ఇప్పుడు ఉన్న ఎంతోమంది క్రైస్తవుల ఉదాహరణలు నిరూపించాయి.

యెహోవా ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉండండి

16, 17. మీరేం చేయాలని నిర్ణయించుకున్నారు?

16 మీరు నిరుత్సాహపడి, మీ పోరాటాన్ని ఆపేస్తే చూడాలని సాతాను ఎదురుచూస్తున్నాడు. అందుకే ‘మేలైనదానిని చేపట్టాలనే’ నిశ్చయంతో ఉండండి. (1 థెస్స. 5:19-21) సాతానుతో, అతని లోకంతో, చెడు కోరికలతో చేసే పోరాటంలో మీరు గెలవగలుగుతారు. యెహోవా మీకు కావాల్సిన బలాన్ని, సహాయాన్ని ఇస్తాడని మనస్ఫూర్తిగా నమ్మితే మీరు గెలుస్తారు.—2 కొరిం. 4:7-9; గల. 6:9.

17 కాబట్టి మీ పోరాటాన్ని ఆపకండి, పట్టుదలతో పోరాడుతూనే ఉండండి. అప్పుడు, యెహోవా మీమీద ‘పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడనే’ నమ్మకంతో మీరుండవచ్చు.—మలా. 3:10.