కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యంగా ఉంటూ పని చేయి

ధైర్యంగా ఉంటూ పని చేయి

“నీవు బలముపొంది, ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, . . . యెహోవా నీతోకూడ నుండును.”1 దిన. 28:20.

పాటలు: 38, 34

1, 2. (ఎ) యెహోవా సొలొమోనుకు ఏ ప్రాముఖ్యమైన నియామకం ఇచ్చాడు? (బి) దావీదు సొలొమోను విషయంలో ఎందుకు కంగారుపడ్డాడు?

 యెహోవా సొలొమోనుకు ఒక ప్రత్యేకమైన నియామకం ఇచ్చాడు. అదేంటంటే, యెరూషలేము ఆలయాన్ని నిర్మించే పనిని పర్యవేక్షించడం. అది చరిత్రంతటిలో చాలా ప్రాముఖ్యమైన నిర్మాణ పని. ఆ ఆలయం ‘చాలా వైభవంగా’ ఉంటుంది, దాని ‘అందం గురించి దేశాలన్నీ’ మాట్లాడుకుంటాయి. మరిముఖ్యంగా అది, ‘సత్య దేవుడైన యెహోవా మందిరం.’—1 దిన. 22:1, 5, 9- 11, NW.

2 యెహోవా సొలొమోనుకు సహాయం చేస్తాడనే నమ్మకం రాజైన దావీదుకు ఉంది. కానీ సొలొమోను, ‘చిన్నవాడు, అనుభవం లేనివాడు.’ మరి ఆలయాన్ని కట్టే నియామకాన్ని సొలొమోను ధైర్యంగా అంగీకరిస్తాడా? లేదా తన వయసును బట్టి, అనుభవం లేకపోవడాన్ని బట్టి భయపడతాడా? సొలొమోను ఆ నియామకాన్ని పూర్తిచేయాలంటే అతను ధైర్యంగా ఉంటూ పనిని పూర్తి చేయాలి.

 3. ధైర్యంగా ఉండడం గురించి సొలొమోను తన తండ్రైన దావీదు నుండి ఏమి నేర్చుకున్నాడు?

3 ధైర్యంగా ఉండడం గురించి సొలొమోను తన తండ్రైన దావీదు నుండి ఎంతో నేర్చుకుని ఉండవచ్చు. దావీదు చిన్నప్పుడు తన తండ్రి గొర్రెల్ని కాపాడడానికి క్రూర జంతువులతో పోరాడాడు. (1 సమూ. 17:34, 35) అంతేకాదు బలవంతుడు, భయంకరుడు అయిన గొల్యాతు అనే సైనికుడితో చాలా ధైర్యంగా పోరాడాడు. అలా దావీదు దేవుని సహాయంతో, ఒక రాయితో గొల్యాతును చంపాడు.—1 సమూ. 17:45, 49, 50.

 4. సొలొమోను ఎందుకు అధైర్యపడకూడదు?

4 ధైర్యంగా ఉంటూ, ఆలయాన్ని కట్టమని సొలొమోనును ప్రోత్సహించడానికి దావీదే సరైన వ్యక్తని ఎందుకు చెప్పవచ్చో ఇప్పుడు మనకు అర్థమైంది. (1 దినవృత్తాంతములు 28:20 చదవండి.) ఒకవేళ సొలొమోను అధైర్యపడితే, భయం అతన్ని చేతకానివానిగా చేస్తుంది, అంటే అతను కనీసం ఆ పనిని మొదలుపెట్టలేడు కూడా. అది తన నియామకంలో విఫలం అవ్వడం కన్నా ఘోరంగా ఉంటుంది.

 5. మనకు ధైర్యం ఎందుకు అవసరం?

5 సొలొమోనులాగే ధైర్యంగా ఉంటూ, యెహోవా ఇచ్చిన పనిని చేయాలంటే మనకు కూడా దేవుని సహాయం అవసరం. కాబట్టి గతంలో ధైర్యం చూపించిన కొంతమంది ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ తర్వాత, వాళ్లలాగే మనం కూడా ధైర్యంగా ఉంటూ, మన పనిని ఎలా పూర్తిచేయాలో ఆలోచించవచ్చు.

ధైర్యం చూపించినవాళ్లు

 6. యోసేపు చూపించిన ధైర్యాన్ని బట్టి మీకేమనిపిస్తుంది?

6 తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని పోతీఫరు భార్య బలవంతం చేసినప్పుడు యోసేపు ధైర్యంగా ఎదిరించాడు. ఒకవేళ ఆమె చెప్పినట్లు చేయకపోతే తన ప్రాణానికి ప్రమాదమని యోసేపుకు తెలిసేవుంటుంది. అయినప్పటికీ అతను ధైర్యం చూపించి, వెంటనే అక్కడ నుండి పారిపోయాడు.—ఆది. 39:10, 12.

 7. రాహాబు ఎలా ధైర్యం చూపించింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 ధైర్యం చూపించిన మరొకరు రాహాబు. ఇశ్రాయేలుకు చెందిన ఇద్దరు వేగులవాళ్లు యెరికోలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు, ఆమె భయపడి వాళ్లకు సహాయం చేయకుండా ఉండవచ్చు. కానీ ఆమె యెహోవాను నమ్మింది కాబట్టి ధైర్యంగా ఆ ఇద్దర్ని దాచిపెట్టి, వాళ్లు సురక్షితంగా తప్పించుకునేలా సహాయం చేసింది. (యెహో. 2:4, 5, 9, 12-16) యెహోవాయే నిజమైన దేవుడనీ, ఆయన ఎలాగైనా ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తాడనీ రాహాబు నమ్మింది. ఆమె ఇతరులకు ఆఖరికి యెరికో రాజుకు, అతని మనుషులకు కూడా భయపడకుండా ధైర్యంగా చర్య తీసుకుని తననూ, తన కుటుంబాన్నీ రక్షించుకుంది.—యెహో. 6:22, 23.

 8. యేసు చూపించిన ధైర్యం అపొస్తలులపై ఎలాంటి ప్రభావం చూపించింది?

8 నమ్మకమైన యేసు అపొస్తలులు కూడా ధైర్యం చూపించారు. యేసు ఎలా ధైర్యం చూపించాడో వాళ్లు కళ్లారా చూశారు, అందుకే యేసును అనుకరించగలిగారు. (మత్త. 8:28-32; యోహా. 2:13-17; 18:3-5) సద్దూకయ్యులు అపొస్తలులను అడ్డుకున్నప్పటికీ వాళ్లు యేసు గురించి బోధించడం మానలేదు.—అపొ. 5:17, 18, 27-29.

 9. రెండవ తిమోతి 1:7 ప్రకారం మనకు ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది?

9 యోసేపు, రాహాబు, యేసు, అలాగే ఆయన అపొస్తలులు సరైనదే చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమ సొంత సామర్థ్యాలపై కాకుండా యెహోవా మీద ఆధారపడి ధైర్యం చూపించారు. మనం కూడా ధైర్యంగా ఉండాల్సిన సందర్భాల్లో, మనమీద కాకుండా యెహోవా మీద ఆధారపడాలి. (2 తిమోతి 1:7 చదవండి.) అయితే మన జీవితంలో ధైర్యం చూపించాల్సిన రెండు రంగాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అవే: కుటుంబం, సంఘం.

ధైర్యం చూపించాల్సిన సందర్భాలు

10. యౌవనులకు ఎందుకు ధైర్యం అవసరం?

10 యెహోవా సేవలో ధైర్యం చూపించాల్సిన ఎన్నో సందర్భాలు యౌవనులకు ఎదురౌతాయి. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న సొలొమోను నుండి యౌవనులు ఎంతో నేర్చుకోవచ్చు, వాళ్లు అతనిలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. యౌవనులు తమ తల్లిదండ్రుల నిర్దేశం కింద ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వాళ్లు సొంతగా తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. (సామె. 27:11) ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి వినోదం ఎంచుకోవాలి, నైతికంగా ఎలా పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి వంటి నిర్ణయాలు తీసుకోవడానికి యౌవనులకు ధైర్యం అవసరం. ఎందుకంటే యౌవనులు, దేవున్ని నిందించే సాతానుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

11, 12. (ఎ) మోషే ఎలా ధైర్యం చూపించాడు? (బి) యౌవనులు మోషేను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

11 యౌవనులు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలో నిర్ణయించుకోవడం ప్రాముఖ్యం. కొన్నిదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలనే ఒత్తిడి యౌవనులపై ఉంటుంది. ఇంకొన్ని పేద దేశాల్లో, యౌవనులు అన్నిటికన్నా ముఖ్యంగా తమ కుటుంబానికి సహాయం చేయడం కోసం కష్టపడి పనిచేయాలని అనుకుంటారు. మీరు ఎలాంటి దేశంలో ఉన్నాసరే, మోషే ఉదాహరణ గురించి ఆలోచించండి. మోషే ఫరో కూతురి దగ్గర పెరిగాడు కాబట్టి బాగా ధనవంతుడవ్వాలని లేదా ప్రముఖుడు అవ్వాలనే లక్ష్యం అతను పెట్టుకోగలిగేవాడు. ఈ విషయంలో ఐగుప్తీయులైన తన కుటుంబం నుండి, బోధకుల నుండి, సలహాదారుల నుండి మోషేకు ఎంత ఒత్తిడి ఎదురైవుంటుందో ఊహించండి! కానీ అతను యెహోవా ప్రజలతో ఉండాలని చాలా ధైర్యంగా నిర్ణయించుకున్నాడు. అతను ఐగుప్తును, దాని సంపదలను విడిచిపెట్టిన తర్వాత యెహోవాపై పూర్తిగా ఆధారపడ్డాడు. (హెబ్రీ. 11:24-26) ఫలితంగా యెహోవా అతన్ని ఎంతో దీవించాడు, భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతో దీవిస్తాడు.

12 యౌవనులు కూడా యెహోవా సేవలో ధైర్యంగా లక్ష్యాలు పెట్టుకుని, రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటిస్థానం ఇస్తే, ఆయన వాళ్లను దీవిస్తాడు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన వాటిని ఆయన వాళ్లకు ఇస్తాడు. మొదటి శతాబ్దంలో, యువకుడైన తిమోతి దేవుని సేవ మీదే దృష్టిపెట్టాడు, మీరు కూడా అలానే చేయవచ్చు. aఫిలిప్పీయులు 2:19-22 చదవండి.

మీ జీవితంలోని ప్రతీ రంగంలో ధైర్యం చూపించాలని నిర్ణయించుకున్నారా? (13-17 పేరాలు చూడండి)

13. తన లక్ష్యాలు చేరుకోవడానికి ఒక యౌవన సహోదరికి ధైర్యం ఎలా సహాయం చేసింది?

13 దేవుని సేవలో లక్ష్యాలు పెట్టుకోవడానికి అమెరికాలోని, అలబామాలో ఉంటున్న ఒక సహోదరికి ధైర్యం అవసరమైంది. ఆమె ఇలా రాసింది, “చిన్నప్పటి నుండి నాకు సిగ్గు ఎక్కువ. రాజ్యమందిరంలో తోటి సహోదరసహోదరీలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, ఏమాత్రం పరిచయంలేని వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడడం కూడా చాలా అరుదు.” తన తల్లిదండ్రుల, సంఘంలోని సహోదరసహోదరీల సహాయంతో ఈ యౌవన సహోదరి క్రమ పయినీరు అవ్వాలనే తన లక్ష్యాన్ని చేరుకుంది. ఆమె ఇలా అంటోంది, “ఉన్నత విద్య, పేరు-ప్రఖ్యాతలు, డబ్బు, వస్తుసంపదలు సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలు పెట్టుకోమని సాతాను లోకం ప్రోత్సహిస్తుంది.” కానీ చాలామంది ఆ లక్ష్యాలు ఎప్పటికీ చేరుకోలేరని, వాటిని చేరుకోవడానికి ప్రయత్నిస్తే ఒత్తిడి, బాధ మాత్రమే మిగులుతాయని కూడా ఆ సహోదరి గుర్తించింది. ఆమె ఇంకా ఇలా చెప్తుంది, “యెహోవా సేవచేయడం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఏదో సాధించాననే తృప్తి కూడా కలిగింది.”

14. క్రైస్తవ తల్లిదండ్రులకు ఎప్పుడు ధైర్యం అవసరం?

14 క్రైస్తవ తల్లిదండ్రులకు కూడా ధైర్యం అవసరం. ఉదాహరణకు కుటుంబ ఆరాధన, పరిచర్య, మీటింగ్స్‌ కోసం కేటాయించిన రోజుల్లో మీ యజమాని ప్రతీసారి ఓవర్‌టైమ్‌ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు కుదరదని చెప్పడానికి మీకు ధైర్యం అవసరం. అలా చేయడం వల్ల మీరు మీ పిల్లలకు సరైన ఆదర్శం ఉంచుతారు. అంతేకాదు, మీరు మీ పిల్లలకు ఏ పనుల్ని చేయొద్దని చెప్పారో, వాటినే చేయమని సంఘంలోని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ప్రోత్సహించవచ్చు. అలాంటి తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ధైర్యంగా ఉంటూ, కారణాల్ని గౌరవపూర్వకంగా వివరిస్తారా?

15. కీర్తన 37:25; హెబ్రీయులు 13:5 లేఖనాలు తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తాయి?

15 పిల్లలు దేవుని సేవలో లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులకు ధైర్యం అవసరం. ఉదాహరణకు, తమ పిల్లల్ని పయినీరు సేవ, అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడం, బెతెల్‌ సేవ, లేదా రాజ్యమందిరాలు, అసెంబ్లీ హాళ్ల నిర్మాణ పనికి సహాయం చేయడం వంటి లక్ష్యాల్ని పెట్టుకోమని ప్రోత్సహించడానికి కొంతమంది తల్లిదండ్రులు భయపడతారు. బహుశా అలాంటి సేవకు వెళ్లనిస్తే తాము ముసలివాళ్లయ్యాక పిల్లలు తమను చూసుకునే స్థితిలో ఉండరని భయపడుతుండవచ్చు. కానీ తెలివైన తల్లిదండ్రులు ధైర్యం చూపిస్తూ, యెహోవా తన మాటను నిలబెట్టుకుంటాడని నమ్ముతారు. (కీర్తన 37:25; హెబ్రీయులు 13:5 చదవండి.) అలాంటి ధైర్యం చూపించి, యెహోవా మీద ఆధారపడే తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కని ఆదర్శం ఉంచుతారు.—1 సమూ. 1:27, 28; 2 తిమో. 3:14, 15.

16. తమ పిల్లలు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకునేలా కొంతమంది తల్లిదండ్రులు ఎలా సహాయం చేశారు? అది ప్రయోజనకరమని ఎందుకు చెప్పవచ్చు?

16 తమ పిల్లలు యెహోవా సేవ మీదే దృష్టిపెట్టేలా అమెరికాలో ఉంటున్న ఒక జంట సహాయం చేసింది. తండ్రి ఇలా చెప్తున్నాడు, “మా పిల్లలకు మాటలు, నడక రాకముందే పయినీరు సేవవల్ల అలాగే సంఘంలో మేము చేసే సేవవల్ల ఎంత ఆనందంగా ఉన్నామో వాళ్లకు చెప్పేవాళ్లం. ఇప్పుడు వాళ్ల లక్ష్యం అదే.” తమ పిల్లలు అలాంటి లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించడం వల్ల సాతాను లోక ప్రభావం వాళ్లమీద పడకుండా యెహోవా సేవ మీదే దృష్టిపెట్టగలిగారని ఆ తండ్రి చెప్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్న ఒక సహోదరుడు ఇలా రాశాడు, “తమ పిల్లలు స్పోర్ట్స్‌, వినోదం, విద్య వంటి రంగాల్లో లక్ష్యాలు చేరుకునేలా సహాయం చేయడానికి చాలామంది తల్లిదండ్రులు ఎంతో శ్రమను, డబ్బును ధారపోస్తారు. అలాంటప్పుడు మన పిల్లలు యెహోవా ముందు మంచి స్థానాన్ని కాపాడుకునేందుకు సహాయం చేసే లక్ష్యాలు చేరుకోవడానికి మనం ఇంకెంతగా శ్రమను, డబ్బును ధారపోయాలో కదా. మన పిల్లలు ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడాన్ని చూడడమే కాదు, అలా చేరుకోవడంలో ఉన్న గొప్ప సంతృప్తిని పిల్లలతోపాటు మనం కూడా పొందవచ్చు.” తమ పిల్లలు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకునేలా సహాయం చేసే తల్లిదండ్రులకు యెహోవా ఆమోదం ఉంటుందనే నమ్మకంతో మీరుండవచ్చు.

సంఘంలో ధైర్యం చూపించడం

17. సంఘంలో ధైర్యం చూపించాల్సిన కొన్ని సందర్భాలు చెప్పండి.

17 మనం సంఘంలో కూడా ధైర్యం చూపించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, గంభీరమైన తప్పు చేసినందుకు ఎవరినైనా సరిదిద్దాల్సి వచ్చినప్పుడు లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు పెద్దలకు ధైర్యం అవసరమౌతుంది. కొంతమంది సంఘపెద్దలు ఆసక్తి ఉన్నవాళ్లకు బైబిలు అధ్యయనాలు చేయడానికి లేదా మీటింగ్స్‌ నిర్వహించడానికి జైళ్లను సందర్శిస్తారు. అయితే ఒంటరి సహోదరీల విషయమేమిటి? ధైర్యం చూపించడానికి, యెహోవా సేవ చేయడానికి వాళ్లకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాళ్లు పయినీరు సేవచేయవచ్చు, అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లవచ్చు, లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయవచ్చు, రాజ్య ప్రచారకుల కోసం పాఠశాలకు హాజరవ్వవచ్చు. కొంతమందికి గిలియడ్‌కు హాజరయ్యే అవకాశం కూడా దొరుకుతుంది.

18. వృద్ధ సహోదరీలు ఎలా ధైర్యం చూపించవచ్చు?

18 వృద్ధ సహోదరీలను మనం ప్రేమిస్తాం, వాళ్లు మనతోపాటు సంఘంలో ఉండడం చాలా ఆనందాన్నిస్తుంది. వాళ్లలో కొంతమంది ఒకప్పుడు చేసినంత సేవ ఇప్పుడు చేయలేకపోయినప్పటికీ ధైర్యంగా ఉంటూ చేతనైనంత సేవ చేయవచ్చు. (తీతు 2:3-5 చదవండి.) ఉదాహరణకు, అణకువగా బట్టలు వేసుకునే విషయంలో యౌవన సహోదరికి సహాయం చేయమని సంఘపెద్దలు ఒక వృద్ధ సహోదరిని అడగవచ్చు. అలాంటి సందర్భాల్లో యౌవన సహోదరితో మాట్లాడడానికి వృద్ధ సహోదరికి ధైర్యం అవసరం. ఫలానా బట్టలు ఎందుకు వేసుకున్నావని యౌవన సహోదరిని తిట్టకుండా, బట్టల విషయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించడానికి దయగా సహాయం చేస్తుంది. (1 తిమో. 2:9, 10) వృద్ధ సహోదరీలు తమ ప్రేమను ఈ విధంగా చూపించినప్పుడు సంఘం బలపడుతుంది.

19. (ఎ) బాప్తిస్మం తీసుకున్న సహోదరులు ఎలా ధైర్యంగా ఉండవచ్చు? (బి) సహోదరులు ధైర్యంగా ఉండడానికి ఫిలిప్పీయులు 2:13; 4:13 వచనాలు ఎలా సహాయం చేస్తాయి?

19 బాప్తిస్మం తీసుకున్న సహోదరులు కూడా ధైర్యంగా ఉంటూ, తమకు అప్పగించిన పనిని చేయాలి. వాళ్లు సంఘ పరిచారకులుగా, పెద్దలుగా సేవచేయడానికి ముందుకొచ్చినప్పుడు సంఘానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. (1 తిమో. 3:1) కానీ కొంతమంది ఆ విషయంలో వెనకాడతారు. బహుశా ఒక సహోదరుడు గతంలో చేసిన తప్పును బట్టి తనకు సంఘ పరిచారకునిగా లేదా పెద్దగా సేవచేసే అర్హత లేదని అనుకోవచ్చు. మరో సహోదరుడు అలా సేవచేయడానికి కావాల్సిన సామర్థ్యం తనకు లేదని అనుకోవచ్చు. ఒకవేళ మీకలా అనిపిస్తే, ధైర్యంగా ఉండడానికి యెహోవా సహాయం చేయగలడు. (ఫిలిప్పీయులు 2:13; 4:13 చదవండి.) మోషేను గుర్తుచేసుకోండి. యెహోవా అడిగింది తాను చేయలేనని అతను కూడా అనుకున్నాడు. (నిర్గ. 3:11) కానీ ధైర్యంగా ఉండడానికి, ఇచ్చిన పనిని చేయడానికి యెహోవా అతనికి సహాయం చేశాడు. అదేవిధంగా బాప్తిస్మం తీసుకున్న సహోదరులు కూడా, సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించవచ్చు. ప్రతీరోజు బైబిలు చదవవచ్చు, అందులోని ధైర్యం చూపించినవాళ్ల ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించవచ్చు. అంతేకాదు తమకు శిక్షణ ఇవ్వమని పెద్దలను వినయంగా అడగవచ్చు, సంఘంలో అవసరమైన ఎలాంటి పనుల్లోనైనా సహాయం చేసేందుకు ముందుండవచ్చు. ధైర్యంగా ఉంటూ, సంఘం కోసం కష్టపడి పనిచేయమని బాప్తిస్మం తీసుకున్న సహోదరులందర్నీ మేము ప్రోత్సహిస్తున్నాం.

‘యెహోవా నీతో కూడ ఉంటాడు’

20, 21. (ఎ) దావీదు సొలొమోనుకు ఏమి గుర్తుచేశాడు? (బి) మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

20 ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు యెహోవా తనకు తోడుంటాడని సొలొమోనుకు రాజైన దావీదు గుర్తుచేశాడు. (1 దిన. 28:20) సొలొమోను ఆ మాటల గురించి ఖచ్చితంగా లోతుగా ఆలోచించివుంటాడు. అతను తన వయసును బట్టి, అనుభవం లేకపోవడాన్ని బట్టి వెనకడుగు వేయలేదు. బదులుగా గొప్ప ధైర్యాన్ని చూపించాడు, యెహోవా సహాయంతో ఎంతో ఘనమైన ఆ ఆలయాన్ని ఏడున్నర సంవత్సరాల్లో పూర్తిచేశాడు.

21 యెహోవా సొలొమోనుకు సహాయం చేసినట్లే, మనకూ సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో మనం ధైర్యంగా ఉంటూ, కుటుంబంలో అలాగే సంఘంలో మన పనిని పూర్తిచేయవచ్చు. (యెష. 41:9-10, 13) యెహోవా సేవచేస్తూ ధైర్యం చూపిస్తే మనం ఇప్పుడు, భవిష్యత్తులో ఆయన దీవెనలు పొందవచ్చనే నమ్మకంతో ఉండవచ్చు. కాబట్టి ధైర్యంగా ఉంటూ, ఇచ్చిన పనిని పూర్తి చేయండి.

a ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవడానికి సహాయం చేసే కొన్ని సలహాలు 2004, జూలై 15 కావలికోట సంచికలోని “ఆధ్యాత్మిక లక్ష్యాలతో మీ సృష్టికర్తను మహిమపరచండి” అనే ఆర్టికల్‌లో ఉన్నాయి.