యెహోవాలా ఇతరుల్ని అర్థంచేసుకోండి
“బీదలను కటాక్షించువాడు [లేదా అర్థంచేసుకునేవాడు] ధన్యుడు.”—కీర్త. 41:1
1. యెహోవా ఆరాధకులు ఒకరిపట్ల ఒకరు ఎలా ప్రేమ చూపించుకుంటారు?
ప్రపంచవ్యాప్తంగా యెహోవా ఆరాధకులందరూ ఒక కుటుంబంలా ఉంటారు. తోబుట్టువుల్లా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. (1 యోహా. 4:16, 21) వాళ్లు కొన్నిసార్లు తమ సహోదరుల కోసం పెద్దపెద్ద త్యాగాలు చేస్తారు, కానీ ఎక్కువశాతం చిన్నచిన్న పనుల ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. ఉదాహరణకు వాళ్లు తమ సహోదరసహోదరీల్ని మెచ్చుకుంటారు, వాళ్లతో దయగా వ్యవహరిస్తారు. మనం ఇతరుల్ని అర్థంచేసుకున్నప్పుడు మన పరలోక తండ్రైన యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం.—ఎఫె. 5:1.
2. యేసు తన తండ్రిని అనుకరిస్తూ ఇతరులతో ఎలా వ్యవహరించాడు?
2 యేసు తన తండ్రిని పరిపూర్ణంగా అనుకరించాడు. ఆయన ఇతరులతో ఎప్పుడూ దయగా వ్యవహరించాడు. “భారం మోస్తూ అలసిపోయిన మీరందరూ నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను” అని ఆయన అన్నాడు. (మత్త. 11:28, 29) మనం యేసులా దీనులను అర్థంచేసుకున్నప్పుడు, యెహోవా హృదయాన్ని సంతోషపెడతాం, మనం కూడా సంతోషంగా ఉంటాం. (కీర్త. 41:1) కుటుంబంలో, సంఘంలో, పరిచర్యలో మనం ఇతరుల్ని అర్థంచేసుకొని ఎలా వ్యవహరించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
కుటుంబంలో
3. భర్తలు తమ భార్యల్ని అర్థంచేసుకొని ఎలా వ్యవహరించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 భర్తలు చక్కని ఆదర్శం ఉంచుతూ, తమ కుటుంబంపట్ల ఎంతో శ్రద్ధ ఉందని చూపించాలి. (ఎఫె. 5:25; 6:4) భర్తలు తమ భార్యల్ని అర్థంచేసుకొని వ్యవహరించాలని బైబిలు చెప్తుంది. (1 పేతు. 3:7) భార్యని అర్థంచేసుకునే భర్త, చాలా విషయాల్లో ఆమెకన్నా వేరుగా ఉన్నప్పటికీ తానే గొప్ప అని భావించడు. (ఆది. 2:18) ఆమె భావాల్ని అర్థంచేసుకుంటాడు, గౌరవిస్తాడు. కెనడాలో ఉంటున్న ఒకావిడ తన భర్త గురించి ఇలా చెప్పింది, “మా ఆయన నా భావాల్ని పట్టించుకుంటాడు. ‘నువ్వు అలా ఆలోచించడం తప్పు’ అని ఎన్నడూ అనడు. నేను చెప్పేదంతా ఓపిగ్గా వింటాడు. నా ఆలోచనను సరిచేయాల్సి వచ్చినప్పుడు దయగా సరిదిద్దుతాడు.”
4. భార్య భావాల్ని అర్థంచేసుకునే భర్త వేరే స్త్రీలతో ఎలా వ్యవహరిస్తాడు?
4 భార్య భావాల్ని అర్థంచేసుకునే భర్త వేరే స్త్రీలతో నేరుగా గానీ, సోషల్ మీడియాలో గానీ సరసాలు ఆడడు. వేరే స్త్రీలను తప్పుడు దృష్టితో చూడడు, లేదా అశ్లీల వెబ్‌సైట్లు చూడడు. (యోబు 31:1) అవును, ఆయన తన భార్యని, యెహోవాను ప్రేమిస్తాడు. అంతేకాదు చెడును అసహ్యించుకుంటాడు కాబట్టి తన భార్యకు ఎన్నడూ ద్రోహం చేయడు.—కీర్తన 19:14; 97:10 చదవండి.
5. భార్య తన భర్తను అర్థంచేసుకుంటూ ఎలా వ్యవహరించవచ్చు?
5 భర్త తనకు శిరస్సైన యేసుక్రీస్తు ఆదర్శాన్ని పాటిస్తే, భార్య ‘ప్రగాఢ గౌరవాన్ని’ సంపాదించుకుంటాడు. (ఎఫె. 5:22-25, 33) భర్తను గౌరవించే భార్య, అతని భావాల్ని అర్థంచేసుకుంటుంది. అతను సంఘ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు లేదా ఇతర సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు దయగా ఉంటుంది. బ్రిటన్‌లో ఉంటున్న ఒక భర్త ఇలా చెప్తున్నాడు, “ఒక్కోసారి నా ప్రవర్తనలో కనిపించే మార్పును బట్టి నేను దేని గురించో ఆందోళన పడుతున్నానని నా భార్య గుర్తిస్తుంది. అలాంటప్పుడు ఆమె సామెతలు 20:5లో ఉన్న సూత్రాన్ని పాటిస్తుంది. ఒకవేళ అది తనతో పంచుకునే విషయమైతే, నా ఆలోచనల్ని ‘పైకి చేదడానికి’ సరైన సమయం కోసం వేచివుంటుంది.”
6. ఇతరుల గురించి ఆలోచించడం, దయగా వ్యవహరించడం పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? దానివల్ల పిల్లలు ఎలాంటి ప్రయోజనం పొందుతారు?
6 భార్యాభర్తలు ఒకరినొకరు అర్థంచేసుకుంటూ వ్యవహరించినప్పుడు, పిల్లలకు చక్కని ఆదర్శం ఉంచుతారు. ఇతరుల గురించి ఆలోచించాలని, దయ చూపించాలని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఉదాహరణకు, రాజ్యమందిరంలో పరిగెత్తకూడదని వాళ్లకు చెప్పవచ్చు. లేదా ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు, ముందు వృద్ధులు ఆహారం పెట్టుకునే వరకు ఆగమని పిల్లలకు చెప్పవచ్చు. నిజానికి సంఘంలో ఉన్న ప్రతీఒక్కరు తల్లిదండ్రులకు మద్దతివ్వవచ్చు. ఎలాగంటే, పిల్లలు ఏదైనా మంచిపని చేసినప్పుడు అంటే మనకోసం డోర్ తీసి పట్టుకోవడం వంటివి చేసినప్పుడు వాళ్లను మెచ్చుకోండి. అది పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తుంది, అప్పుడు “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది” అని వాళ్లు గ్రహించగలుగుతారు.—అపొ. 20:35.
సంఘంలో
7. యేసు చెవిటి వ్యక్తిని ఎలా అర్థంచేసుకున్నాడు? మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
7 ఒకరోజు యేసు దెకపొలి ప్రాంతంలో ఉన్నప్పుడు, ప్రజలు ఆయన దగ్గరికి “నత్తి ఉన్న ఓ చెవిటి వ్యక్తిని” తీసుకొచ్చారు. (మార్కు 7:31-35) యేసు అతన్ని బాగుచేశాడు, కానీ అందరిముందు కాదు. ఎందుకు? ఎందుకంటే ఆ వ్యక్తి చెవిటివాడు కాబట్టి గుంపుగా ఉన్న ప్రజల మధ్య ఇబ్బందిపడి ఉండవచ్చు. యేసు అతని భావాల్ని అర్థంచేసుకుని, అతన్ని “పక్కకు తీసుకెళ్లి” ఎవ్వరూ లేని చోట బాగుచేశాడు. నిజమే మనం అద్భుతాలు చేయలేం, కానీ మన సహోదరుల అవసరాల్ని, భావాల్ని పట్టించుకోవచ్చు, వాళ్లపట్ల దయ చూపించవచ్చు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ప్రేమ చూపించడానికి, మంచిపనులు చేయడానికి పురికొల్పుకునేలా మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం.” (హెబ్రీ. 10:24) యేసు చెవిటి వ్యక్తి భావాల్ని అర్థంచేసుకుని, అతనితో దయగా వ్యవహరించాడు. అది మనకెంత చక్కని ఆదర్శమో కదా!
8, 9. వృద్ధుల్ని, వైకల్యంతో ఉన్నవాళ్లను అర్థంచేసుకున్నామని ఎలా చూపించవచ్చు? ఉదాహరణలు చెప్పండి.
8 వృద్ధుల్ని, వైకల్యంతో ఉన్నవాళ్లను అర్థంచేసుకోండి. క్రైస్తవ సంఘంలో నైపుణ్యాలు కాదుగానీ ప్రేమే అన్నిటికన్నా ముఖ్యమైనది. (యోహా. 13:34, 35) మనకు ప్రేమ ఉంటే వృద్ధులు, వైకల్యంతో ఉన్న సహోదరసహోదరీలు మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లేలా సహాయం చేయడానికి వీలైనంత కృషి చేస్తాం. ఒకవేళ అది మనకు కాస్త కష్టమే అయినా లేదా వాళ్లు ఎక్కువసేపు ప్రీచింగ్ చేయలేకపోయినా సహాయం చేస్తాం. (మత్త. 13:23) చక్రాల కుర్చీకే పరిమితమైన మైఖేల్, తన కుటుంబం-సంఘం అందిస్తున్న సహాయానికి ఎంతో రుణపడి ఉన్నాడు. ఆయనిలా అంటున్నాడు, “వాళ్లందరి సహాయం వల్లే నేను చాలావరకు మీటింగ్స్‌కి వెళ్తున్నాను, పరిచర్యలో క్రమంగా పాల్గొంటున్నాను. నాకు అన్నిటికన్నా ఎక్కువగా బహిరంగ సాక్ష్యమంటే ఇష్టం.”
9 చాలా బెతెల్ కుటుంబాల్లో యెహోవాకు నమ్మకంగా సేవచేసిన వృద్ధులు, వైకల్యంతో బాధపడేవాళ్లు ఉన్నారు. ఆ సహోదరసహోదరీలు ఉత్తరాల ద్వారా, ఫోన్ ద్వారా పరిచర్యలో భాగంవహించేలా శ్రద్ధగల పర్యవేక్షకులు ప్రేమతో ఏర్పాట్లు చేస్తారు. బిల్ అనే 86 ఏళ్ల సహోదరుడు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్లకు ఉత్తరాలు రాస్తాడు. ఆయనిలా అంటున్నాడు, “ఉత్తరాలు రాసే అవకాశం ఉన్నందుకు మేం చాలా సంతోషిస్తున్నాం.” దాదాపు 90 ఏళ్ల వయసున్న నాన్సీ అనే సహోదరి ఇలా చెప్తుంది, “ఉత్తరాల ద్వారా సాక్ష్యమివ్వడం అంటే ఏదో కవర్లు నింపడానికి ఉత్తరాలు రాయడం కాదు. ఇది ఇంటింటి పరిచర్యతో సమానం. ప్రజలకు సత్యం తెలియాలి!” 1921లో పుట్టిన ఈతల్ అనే సహోదరి ఇలా చెప్తుంది, “నాకు నొప్పిలేని రోజే లేదు. కొన్నిసార్లయితే బట్టలు వేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది.” అయినప్పటికీ ఆ సహోదరి ఫోన్ ద్వారా ప్రీచింగ్ చేస్తూ, కొన్ని మంచి పునర్దర్శనాలు కూడా సంపాదించింది. బార్బరా అనే 85 ఏళ్ల సహోదరి ఇలా వివరిస్తుంది, “నాకున్న అనారోగ్యంవల్ల, క్రమంగా ప్రీచింగ్‌కి వెళ్లడం చాలా కష్టం. కానీ ఫోన్ సాక్ష్యం ద్వారా ప్రజలతో మాట్లాడగలుగుతున్నాను. దానికి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి!” ఒక్క సంవత్సరంలోపే, బెతెల్‌లోని కొంతమంది వృద్ధులు 1,228 గంటలు పరిచర్యలో గడిపారు; 6,265 ఉత్తరాలు రాశారు; 2,000 ఫోన్ కాల్స్ చేశారు; 6,315 ప్రచురణలు ఇచ్చారు! ప్రియమైన ఆ వృద్ధులు చేసిన కృషిని చూసి యెహోవా తప్పకుండా సంతోషించివుంటాడు!—సామె. 27:11.
10. మన సహోదరసహోదరీలు మీటింగ్స్ నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఎలా సహాయం చేయవచ్చు?
10 మీటింగ్స్‌లో ఇతరుల్ని అర్థంచేసుకోండి. మనం సహోదరసహోదరీల్ని అర్థం చేసుకున్నప్పుడు, వాళ్లు మీటింగ్స్ నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందేలా సహాయం చేస్తాం. ఎలా? ఒక మార్గమేమిటంటే, మనం మీటింగ్స్‌కి టైంకి రావడం. అప్పుడు మన సహోదరసహోదరీల అవధానం పక్కకు మళ్లకుండా ఉంటుంది. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల లేటు అవ్వవచ్చు. కానీ మనం ఎప్పుడూ లేటుగానే వస్తే? అది మన సహోదరసహోదరీల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి. అంతేకాదు, వాళ్లమీద మనకు శ్రద్ధ ఉందని చూపించడానికి ఎలాంటి మార్పులు చేసుకోవచ్చో ఆలోచించాలి. మనల్ని మీటింగ్స్‌కు ఆహ్వానించేది యెహోవా, యేసు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. (మత్త. 18:20) కాబట్టి మీటింగ్స్‌కి టైంకి వచ్చి, వాళ్లమీద మనకు గౌరవముందని చూపిద్దాం!
11. మీటింగ్స్‌లో నియామకాలు ఉన్న సహోదరులు 1 కొరింథీయులు 14:40లోని నిర్దేశాన్ని ఎందుకు పాటించాలి?
11 మనం మన సహోదరుల్ని అర్థంచేసుకుంటే, “అన్నీ మర్యాదగా, పద్ధతి ప్రకారం జరగనివ్వండి” అనే బైబిలు నిర్దేశాన్ని పాటించినట్లు అవుతుంది. (1 కొరిం. 14:40) మీటింగ్స్‌లో నియామకాలు ఉన్న సహోదరులు వాటిని సమయానికి ముగించినప్పుడు ఈ నిర్దేశాన్ని పాటించినవాళ్లు అవుతారు. ఇలా చేయడంవల్ల వాళ్లు కేవలం తర్వాతి ప్రసంగీకుని గురించే కాకుండా, పూర్తి సంఘం గురించి ఆలోచిస్తున్నారని చూపిస్తారు. ఒకవేళ మీటింగ్‌ని లేటుగా ముగిస్తే మన సహోదరసహోదరీలకు ఎలాంటి ఇబ్బంది కలగవచ్చో ఆలోచించండి. కొంతమంది తిరిగి ఇంటికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఇంకొంతమంది బస్సుని లేదా ట్రైన్‌ని సమయానికి అందుకోలేకపోవచ్చు. అంతేకాదు, కొంతమంది సహోదరసహోదరీల కోసం ఇంట్లో అవిశ్వాస భర్తలు లేదా భార్యలు ఎదురుచూస్తుండవచ్చు.
12. పెద్దలు మన గౌరవానికి, ప్రేమకు ఎందుకు అర్హులు? (“నాయకత్వం వహిస్తున్నవాళ్లను అర్థంచేసుకోండి” అనే బాక్సు చూడండి.)
12 పెద్దలు సంఘంలో అలాగే పరిచర్యలో కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్లు మన గౌరవానికి, ప్రేమకు అర్హులు. (1 థెస్సలొనీకయులు 5:12, 13 చదవండి.) వాళ్లు చేసే వాటన్నిటికీ మీరు తప్పకుండా కృతజ్ఞత కలిగివుంటారు. వాళ్లు చెప్పేది వినడం ద్వారా, వాళ్లకు మద్దతివ్వడం ద్వారా ఆ కృతజ్ఞతను చూపించవచ్చు. ఎందుకంటే, “వాళ్లు జవాబు చెప్పాల్సిన వాళ్లలా మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటున్నారు.”—హెబ్రీ. 13:7, 17.
పరిచర్యలో
13. యేసు ప్రజలతో వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
13 యేసు గురించి చెప్పిన ఒక ప్రవచనంలో యెషయా ఇలా అన్నాడు, “నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు.” (యెష. 42:3) ప్రజల మీదున్న ప్రేమతో యేసు సహానుభూతి చూపించాడు. ‘నలిగిన రెల్లులా’ లేదా ‘మకమకలాడుతున్న జనుపనార వత్తిలా’ ఉన్న బలహీనుల్ని, నిరుత్సాహంలో ఉన్నవాళ్లను యేసు అర్థంచేసుకున్నాడు. అందుకే వాళ్లతో దయగా, ఓపిగ్గా వ్యవహరించాడు. చిన్నపిల్లలు కూడా యేసు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు. (మార్కు 10:14) నిజమే, మనం యేసులా ప్రజల్ని అర్థంచేసుకోలేం, బోధించలేం! కానీ మన క్షేత్రంలో ఉన్న ప్రజలతో ఎలా, ఎప్పుడు, ఎంతసేపు మాట్లాడుతున్నాం అనేదాన్ని బట్టి వాళ్లను అర్థం చేసుకుంటున్నామని చూపించవచ్చు.
14. మనం ప్రజలతో ఎలా మాట్లాడుతున్నామో ఎందుకు ఆలోచించాలి?
14 ఎలా మాట్లాడాలి? అవినీతిపరులూ క్రూరులూ అయిన వ్యాపారస్థుల, రాజకీయ నాయకుల, మతనాయకుల చేతుల్లో నేడు లక్షలమంది ప్రజలు “చర్మం ఒలిచేయబడి, విసిరేయబడినట్లు” ఉన్నారు. (మత్త. 9:36) దానివల్ల చాలామంది ఎవ్వర్నీ నమ్మలేకపోతున్నారు, ఎలాంటి నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు. అందుకే అలాంటివాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మనం ఉపయోగించే పదాలు, స్వరం వాళ్లమీద మనకు దయ, శ్రద్ధ ఉన్నాయని చూపించాలి! మనం బైబిల్ని చక్కగా ఉపయోగించడంతో పాటు ప్రజలపట్ల నిజమైన శ్రద్ధ, గౌరవం చూపిస్తాం. అందుకే ఎక్కువమంది ప్రజలు మనం ప్రకటించే సందేశాన్ని వినాలనుకుంటారు.
15. మన క్షేత్రంలోని ప్రజల్ని అర్థంచేసుకుంటున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?
15 మన క్షేత్రంలో ఉన్న ప్రజల్ని అర్థంచేసుకుంటున్నామని చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం అడిగే ప్రశ్నలు దయగా, గౌరవపూర్వకంగా ఉండాలి. ఒక పయినీరు సహోదరుడు అనుభవాన్ని పరిశీలించండి. ఆయన సేవచేసిన ఒక క్షేత్రంలో చాలామంది బిడియస్థులు ఉండేవాళ్లు. అందుకే ఆయన, వాళ్లకు తెలియని ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెట్టేవాడు కాదు. “మీకు దేవుని పేరు ఏంటో తెలుసా?” “దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా?” వంటి ప్రశ్నలు అడిగేవాడు కాదు. బదులుగా “దేవునికి ఒక పేరుందని బైబిలు చదివి తెలుసుకున్నాను, అదేంటో మీకు చూపించమంటారా?” అని అడిగేవాడు. ఈ పద్ధతి అన్ని ప్రాంతాల్లో పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రజలు ఉన్నారు, వేర్వేరు సంస్కృతులు ఉన్నాయి. కానీ మన క్షేత్రంలో ఉన్న ప్రజలతో మాత్రం ఎప్పుడూ దయగా, గౌరవపూర్వకంగా మాట్లాడాలి. అలా చేయాలంటే మనకు వాళ్లగురించి బాగా తెలుసుండాలి.
16, 17. మనకు ప్రజలపట్ల దయ ఉంటే (ఎ) వాళ్ల దగ్గరకు ఎప్పుడు వెళ్తాం? (బి) ఎంతసేపు మాట్లాడతాం?
16 ఎప్పుడు వెళ్లాలి? మనం ఇంటింటి పరిచర్యలో, ప్రజలు ఆహ్వానించకుండానే వాళ్లింటికి వెళ్తున్నాం. కాబట్టి వాళ్లకు అనుకూలమైన సమయాల్లో వెళ్లడం చాలా ప్రాముఖ్యం. (మత్త. 7:12) ఉదాహరణకు, మీ క్షేత్రంలోని ప్రజలు వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోతారా? అలాంటప్పుడు వాళ్లు నిద్రలేచే వరకు మీరు వీధి సాక్ష్యమో, బహిరంగ సాక్ష్యమో చేయవచ్చు, లేదా పునర్దర్శనాలకు వెళ్లవచ్చు.
17 ఎంతసేపు మాట్లాడాలి? ఈరోజుల్లో ప్రజలు బిజీగా ఉంటున్నారు, కాబట్టి మనం తక్కువసేపు మాట్లాడడం మంచిది. ముఖ్యంగా మొదటిసారి కలిసినప్పుడు మరీ ఎక్కువసేపు మాట్లాడకుండా సంభాషణను త్వరగా ముగించడం మంచిది. (1 కొరిం. 9:20-23) ఒకవేళ ఇంటివాళ్లు ఏదైనా పనిలో ఉంటే, వాళ్ల పరిస్థితిని మనం అర్థంచేసుకోవాలి. మనమలా అర్థంచేసుకున్నామని వాళ్లు గమనిస్తే, ఈసారి కలిసినప్పుడు వినడానికి ఇష్టపడతారు. మనం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించినప్పుడు, “దేవుని తోటి పనివాళ్లం” అవుతాం. అంతేకాదు మన ద్వారా ఒకవ్యక్తి సత్యం తెలుసుకునే అవకాశాన్ని యెహోవా ఇస్తాడు!—1 కొరిం. 3:6, 7, 9.
18. ఇతరుల్ని అర్థంచేసుకున్నప్పుడు మనకెలాంటి దీవెనలు వస్తాయి?
18 కాబట్టి మన కుటుంబ సభ్యుల్ని, సంఘంలోని సహోదరసహోదరీల్ని, పరిచర్యలో కలిసేవాళ్లను అర్థంచేసుకోవడానికి చేయగలిగినదంతా చేద్దాం. అలాచేస్తే ఇప్పుడు, భవిష్యత్తులో మనం ఎన్నో దీవెనలు పొందుతాం. కీర్తన 41:1, 2 చెప్తున్నట్లు, “బీదలను కటాక్షించువాడు [లేదా అర్థంచేసుకునేవాడు] ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును.”