కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సర్వశక్తిమంతుడే అయినా మనల్ని అర్థంచేసుకుంటాడు

సర్వశక్తిమంతుడే అయినా మనల్ని అర్థంచేసుకుంటాడు

“మనము నిర్మింపబడిన రీతి ఆయనకు [యెహోవాకు] తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”కీర్త. 103:14.

పాటలు: 30, 10

1, 2. (ఎ) అధికారంలో ఉన్న మనుషులు వ్యవహరించే తీరుకు, యెహోవా వ్యవహరించే తీరుకు తేడా ఏంటి? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

 సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లు ఇతరులమీద పెత్తనం చెలాయిస్తారు, కొన్నిసార్లు ప్రజల్ని అణచివేస్తారు కూడా. (మత్త. 20:25; ప్రసం. 8:9) కానీ యెహోవా ఎన్నడూ అలా చేయడు! ఆయన సర్వశక్తిమంతుడే అయినా అపరిపూర్ణ మనుషుల్ని బాగా అర్థంచేసుకుంటాడు. ఆయన దయ చూపిస్తాడు, మన భావాలను, అవసరాలను పట్టించుకుంటాడు. మనందరం “మంటివారమని ఆయన జ్ఞాపకము” ఉంచుకుంటాడు కాబట్టి మనం చేయలేనివాటిని చేయమని ఎన్నడూ అడగడు.—కీర్త. 103:13, 14.

2 యెహోవా తన ప్రజల్ని ఎంతగా అర్థంచేసుకుంటాడో తెలియజేసే మూడు బైబిలు ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మొదటిగా, ప్రధానయాజకుడైన ఏలీకి తీర్పు సందేశం చెప్పేలా యెహోవా బాలుడైన సమూయేలుకు దయతో ఎలా సహాయం చేశాడో చూస్తాం. రెండోదిగా, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటకు నడిపించలేనని అనుకున్న మోషేతో యెహోవా ఎలా ఓపిగ్గా వ్యవహరించాడో తెలుసుకుంటాం. మూడోదిగా, ఐగుప్తు నుండి బయటకు వస్తున్న ఇశ్రాయేలీయులకు యెహోవా ఎలా సహాయం చేశాడో తెలుసుకుంటాం. ఈ మూడు ఉదాహరణల ద్వారా యెహోవా గురించి మనమేం నేర్చుకోవచ్చు? ఆయన్ని ఎలా అనుకరించవచ్చు?

ఒక బాలుడిని అర్థంచేసుకున్నాడు

 3. ఒకరోజు రాత్రి సమూయేలు నిద్రపోతున్నప్పుడు ఏ అసాధారణ సంఘటన జరిగింది? మనకు ఏ ప్రశ్న రావచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 సమూయేలు బాలుడిగా ఉన్నప్పటి నుండే గుడారంలో సేవచేయడం మొదలుపెట్టాడు. (1 సమూ. 3:1) ఒకరోజు రాత్రి, అతను నిద్రపోతున్నప్పుడు ఓ అసాధారణ సంఘటన జరిగింది. a (1 సమూయేలు 3:2-10 చదవండి.) ఎవరో తనను పిలుస్తున్నట్లు సమూయేలుకు అనిపించింది. వృద్ధుడు, ప్రధానయాజకుడు అయిన ఏలీ పిలిచాడనుకొని సమూయేలు లేచి, పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరికి వెళ్లి ‘నీవు నన్ను పిలిచావు కదా నేను వచ్చాను’ అన్నాడు. కానీ ఏలీ, “నేను పిలువలేదు” అని చెప్పాడు. మళ్లీ రెండుసార్లు అలానే జరిగింది. అప్పుడు సమూయేలును పిలుస్తున్నది దేవుడని ఏలీకి అర్థమైంది. కాబట్టి ఈసారి అలా జరిగితే, ఏం చేయాలో ఏలీ సమూయేలుకు చెప్పాడు. అతను ఏలీ చెప్పినట్టే చేశాడు. సమూయేలును తానే పిలుస్తున్నానని యెహోవా ముందే ఎందుకు చెప్పలేదు? కారణం బైబిల్లో లేదు. కానీ, యెహోవా సమూయేలు భావాల్ని అర్థంచేసుకున్నాడు కాబట్టే ఆ విషయాన్ని ముందు చెప్పివుండకపోవచ్చు.

4, 5. (ఎ) ఏలీకి ఒక సందేశాన్ని తెలియజేయమని యెహోవా చెప్పినప్పుడు సమూయేలు ఏం చేశాడు? (బి) ఈ వృత్తాంతం ద్వారా యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?

4 మొదటి సమూయేలు 3:11-18 చదవండి. పిల్లలు వృద్ధుల్ని, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లను గౌరవించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. (నిర్గ. 22:28; లేవీ. 19:32) కాబట్టి, ఉదయాన్నే ఏలీ దగ్గరికి వెళ్లి, దేవుని తీర్పు సందేశాన్ని చెప్పడం బాలుడైన సమూయేలుకు కష్టమైవుంటుంది. తనకు కలిగిన దర్శనం గురించి ఏలీకి చెప్పడానికి సమూయేలు భయపడ్డాడని బైబిలు చెప్తుంది. అయితే సమూయేలును పిలిచింది తానేనని యెహోవా ఏలీకి స్పష్టం చేశాడు. అందుకే, దేవుడు చెప్పిందేదీ తన దగ్గర దాచిపెట్టొద్దని ఏలీ సమూయేలుతో అన్నాడు. ఏలీ మాటకు లోబడుతూ సమూయేలు “దేనిని మరుగుచేయక సంగతి అంతా” చెప్పాడు.

5 ఆ సందేశం విని ఏలీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, “దైవజనుడొకడు” అంతకుముందు కూడా ఇలాంటి సందేశాన్నే ఆయనకు చెప్పాడు. (1 సమూ. 2:27-36) యెహోవా మనల్ని అర్థంచేసుకునే దేవుడని, ఆయన తెలివిగలవాడని ఈ వృత్తాంతం ద్వారా నేర్చుకోవచ్చు.

 6. యెహోవా బాలుడైన సమూయేలుకు సహాయం చేసిన విధానం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

6 మీరు యౌవనులా? అలాగైతే యెహోవా మీ సమస్యల్ని, భావాల్ని అర్థంచేసుకుంటాడని బాలుడైన సమూయేలు వృత్తాంతం తెలియజేస్తుంది. బహుశా బిడియం వల్ల మీకన్నా పెద్దవాళ్లకు ప్రీచింగ్‌ చేయడం లేదా మీ తోటివాళ్లకు భిన్నంగా ఉండడం కష్టంగా అనిపించవచ్చు. కానీ, యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి. ఆయనకు ప్రార్థన చేయండి, మీ మనసులో ఉన్నదంతా చెప్పండి. (కీర్త. 62:8) బాలుడైన సమూయేలులాంటి బైబిలు ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించండి. మీలాంటి సమస్యల్నే విజయవంతంగా ఎదుర్కొన్న మీ వయసు సహోదరసహోదరీలతో గానీ, పెద్దవాళ్లతో గానీ మాట్లాడండి. బహుశా ఊహించని విధానాల్లో యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేశాడో మీకు చెప్పవచ్చు.

మోషేను అర్థంచేసుకున్నాడు

7, 8. యెహోవా మోషే భావాల్ని బాగా అర్థంచేసుకున్నాడని ఎలా చెప్పవచ్చు?

7 మోషేకు 80 ఏళ్లు ఉన్నప్పుడు, యెహోవా ఆయనకు చాలా కష్టమైన పని అప్పగించాడు. అదేంటంటే, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం. (నిర్గ. 3:10) దానిగురించి వినగానే మోషే అవాక్కయ్యుంటాడు. ఎందుకంటే, ఆయన 40 ఏళ్లుగా మిద్యానులో గొర్రెలు కాస్తున్నాడు. “నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను?” అని మోషే అన్నాడు. అప్పుడు యెహోవా, “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును” అని ఆయనకు అభయమిచ్చాడు. (నిర్గ. 3:11, 12) అంతేకాదు, ఇశ్రాయేలీయుల పెద్దలు మోషే మాట తప్పకుండా వింటారని కూడా దేవుడు చెప్పాడు. అయినప్పటికీ మోషే ఇలా అన్నాడు, “వారు నన్ను నమ్మరు నా మాట వినరు.” (నిర్గ. 3:18; 4:1) మోషే మాటలు యెహోవాను తప్పుబడుతున్నట్లు ఉన్నాయి! కానీ యెహోవా మోషేతో ఓర్పుగా వ్యవహరించాడు. ఆయనకు అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడు. నిజానికి, అలాంటి శక్తిని పొందినట్లు బైబిల్లో నమోదు చేయబడిన మొట్టమొదటి వ్యక్తి మోషేనే.—నిర్గ. 4:2-9, 21.

8 ఇంత జరిగిన తర్వాత కూడా, “నేను నోటి మాంద్యము గలవాడను” అని మోషే ఇంకో సాకు చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేకు, “నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను” అని చెప్పాడు. మరి ఇప్పటికైనా మోషే ధైర్యం తెచ్చుకున్నాడా? లేదు. తన బదులు ఇంకెవరినైనా పంపించమని అడిగాడు. దాంతో యెహోవాకు కోపం వచ్చింది! అయినా, యెహోవా మోషే భావాల్ని అర్థంచేసుకొని ఆయన తరఫున మాట్లాడడానికి అహరోనును పంపించాడు.—నిర్గ. 4:10-16.

 9. మోషే మంచి నాయకుడు అవ్వడానికి యెహోవా చూపించిన ఓర్పు, దయ ఎలా సహాయం చేశాయి?

9 ఈ వృత్తాంతం ద్వారా యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు? యెహోవా సర్వశక్తిమంతుడు కాబట్టి కావాలనుకుంటే తనకున్న శక్తితో మోషేను భయపెట్టి, తనకు లోబడేలా చేయగలడు. కానీ యెహోవా అలా చేయలేదు. బదులుగా ఓర్పును, దయను చూపిస్తూ అణకువ, వినయంగల తన సేవకునికి తోడుగా ఉంటానని చెప్పాడు. దాని ఫలితమేమిటి? మోషే దేవుని ప్రజలకు ఒక మంచి నాయకుడు అయ్యాడు. యెహోవా తనతో వ్యవహరించినట్లే మోషే ఇతరులను అర్థంచేసుకుంటూ, వాళ్లతో సౌమ్యంగా వ్యవహరించడానికి కృషిచేశాడు.—సంఖ్యా. 12:3.

మీరు ఇతరులతో యెహోవాలా వ్యవహరిస్తున్నారా? (10వ పేరా చూడండి)

10. యెహోవాలా ఇతరుల్ని అర్థంచేసుకున్నప్పుడు ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

10 నేడు మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? మీరు ఒక భర్త, తండ్రి లేదా సంఘపెద్ద అయితే, ఇతరుల మీద మీకు కొంత అధికారం ఉంటుంది. కాబట్టి మీరు మీ భార్యాపిల్లల్ని, సంఘంలోనివాళ్లను యెహోవాలా అర్థంచేసుకొని వాళ్లతో దయగా, ఓపిగ్గా వ్యవహరించడం చాలా ప్రాముఖ్యం. (కొలొ. 3:19-21; 1 పేతు. 5:1-3) మీరు యెహోవాను, గొప్ప మోషే అయిన యేసును అనుకరించినప్పుడు, ఇతరులు ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడగలుగుతారు. అప్పుడు వాళ్లను మీరు ప్రోత్సహించగలుగుతారు. (మత్త. 11:28, 29) అంతేకాదు, వాళ్లకు మీరు చక్కని ఆదర్శం ఉంచుతారు.—హెబ్రీ. 13:7.

శక్తిమంతుడే అయినా అర్థంచేసుకునే రక్షకుడు

11, 12. తన ప్రజలు సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని భావించేలా చేయడానికి యెహోవా ఏం చేశాడు?

11 క్రీ.పూ. 1513లో ముప్పై లక్షలకన్నా ఎక్కువమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు, బహుశా అనారోగ్యంతో లేదా అంగవైకల్యంతో బాధపడేవాళ్లు ఉండివుంటారు. అంత పెద్ద గుంపుకు శ్రద్ధ చూపించే, అర్థంచేసుకునే నాయకుడు అవసరం. మోషే ద్వారా యెహోవా అలాంటి నాయకుడని నిరూపించుకున్నాడు. ఫలితంగా, తమకు తెలిసిన ఆ ఒక్కగానొక్క ప్రాంతాన్ని విడిచి వచ్చేటప్పుడు వాళ్లు సురక్షితంగా ఉన్నట్లు భావించారు.—కీర్త. 78:52, 53.

12 తన ప్రజలు సురక్షితంగా, క్షేమంగా ఉన్నామని భావించేలా చేయడానికి యెహోవా ఏం చేశాడు? ‘ఇశ్రాయేలీయులు యుద్ధ పంక్తులు తీరి ఐగుప్తు దేశం నుండి బయటికి’ వచ్చేలా యెహోవా వాళ్లను చక్కగా సంస్థీకరించాడు. (నిర్గ. 13:18, NW) అలా సంస్థీకరించడం వల్ల, పరిస్థితి తమ దేవుని అధీనంలో ఉందని వాళ్లు స్పష్టంగా చూడగలిగారు. యెహోవా వాళ్లకు “పగటివేళ మేఘములోనుండియు, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములోనుండియు,” దారి చూపించాడు. ఆ విధంగా ఆయన వాళ్లకు తోడుగా ఉన్నాడని, వాళ్లను నడిపిస్తూ, కాపాడుతున్నాడని గుర్తుచేశాడు. (కీర్త. 78:14) కొంత సమయం తర్వాత నిజంగానే వాళ్లకు అలాంటి అభయం అవసరమైంది.

ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రం దాటిస్తున్నప్పుడు యెహోవా వాళ్లను అర్థంచేసుకున్నాడని ఎలా చూపించాడు? (13వ పేరా చూడండి )

13, 14. (ఎ) ఎర్ర సముద్రం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల పట్ల ఎలా శ్రద్ధ చూపించాడు? (బి) యెహోవా ఐగుప్తీయుల కన్నా శక్తిమంతుడని ఎలా చూపించాడు?

13 నిర్గమకాండము 14:19-22 చదవండి. మీరు ఇశ్రాయేలీయులతో ఉన్నట్లు ఊహించుకోండి. వెనకేమో ఐగుప్తీయుల సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, ఆ రెండింటి మధ్య మీరు చిక్కుకుపోయారు. అప్పుడే దేవుడు చర్య తీసుకున్నాడు. మీకు ముందుండి నడిపిస్తున్న మేఘస్తంభం ఇప్పుడు వెనక్కి వెళ్లి మీకూ, ఐగుప్తీయులకూ మధ్య నిలిచింది. దానివల్ల వాళ్లకంతా చీకటిగా ఉంది, కానీ మీకు అద్భుతరీతిలో వెలుగు ప్రకాశించింది! ఆ తర్వాత మోషే సముద్రం వైపు చేయి చాపడం, బలమైన తూర్పు గాలి రావడం, అవతలి ఒడ్డుకు వెళ్లేలా విశాలమైన మార్గం తెరుచుకోవడం మీరు చూశారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పశువులు మిగతా ప్రజలతో కలిసి సముద్రపు నేలమీద ఒక క్రమపద్ధతిలో నడుస్తున్నారు. ఆ నేల బురదగా, జారుతున్నట్లు లేకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోయారు. నేల పొడిగా, గట్టిగా ఉంది కాబట్టి నడవడానికి సౌకర్యంగా ఉంది. దానివల్ల, నిదానంగా నడిచేవాళ్లు కూడా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకోగలిగారు.

14 నిర్గమకాండము 14:23, 26-30 చదవండి. ఇదంతా జరుగుతుండగా గర్విష్ఠి, తెలివితక్కువవాడు అయిన ఫరో మిమ్మల్ని, తోటి ఇశ్రాయేలీయుల్ని తరమడం మొదలుపెట్టాడు. అప్పుడు, మోషే మళ్లీ సముద్రం వైపు చేయి చాపగానే, రెండు గోడల్లా నిలబడిన సముద్రం తిరిగి కలిసిపోయింది. ఆ నీళ్లలో ఫరో, అతని సైన్యం మొత్తం మునిగిపోయి చనిపోయారు.—నిర్గ. 15:8-10.

15. ఈ వృత్తాంతం ద్వారా యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?

15 ఈ వృత్తాంతం ద్వారా యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు? ఆయన క్రమపద్ధతిగల దేవుడు. అందుకే ఆయన ప్రజలముగా మనం సురక్షితంగా, క్షేమంగా ఉంటామని నమ్మవచ్చు. (1 కొరిం. 14:33) ఒక కాపరి ఎలాగైతే తన గొర్రెల్ని ప్రేమిస్తూ, వాటిని శ్రద్ధగా చూసుకుంటాడో, అలాగే యెహోవా కూడా తన ప్రజల్ని శ్రద్ధగా చూసుకుంటాడు. ఆయన వాళ్లను శత్రువుల నుండి కాపాడతాడు, సురక్షితంగా ఉంచుతాడు. ఈ వ్యవస్థకు అంతం సమీపిస్తుండగా అది మనకెంతో ధైర్యాన్ని, ఓదార్పును ఇస్తుంది.—సామె. 1:33.

16. యెహోవా ఇశ్రాయేలీయుల్ని కాపాడిన విధానాన్నిబట్టి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

16 ప్రాచీన కాలంలోలాగే ఈరోజుల్లో కూడా, యెహోవా తన ప్రజలపట్ల ఒక గుంపుగా శ్రద్ధ చూపిస్తున్నాడు. వాళ్లు తనతో ఎప్పటికీ మంచి సంబంధం కలిగివుండేలా ఆయన సహాయం చేస్తున్నాడు. అంతేకాదు వాళ్లను శత్రువుల నుండి కాపాడుతున్నాడు. అతిత్వరలో రాబోయే మహాశ్రమలో కూడా ఆయన ఇలాగే సహాయం చేస్తాడు, కాపాడతాడు. (ప్రక. 7:9, 10) కాబట్టి దేవుని ప్రజలు యౌవనులైనా-వృద్ధులైనా, ఆరోగ్యవంతులైనా-అనారోగ్యంతో బాధపడే వాళ్లయినా మహాశ్రమ కాలంలో భయపడరు. b బదులుగా చాలా ధైర్యంగా ఉంటారు! వాళ్లు యేసు చెప్పిన ఈ మాటల్ని గుర్తుచేసుకుంటారు, “మీరు స్థిరంగా నిలబడి మీ తలలు ఎత్తుకోండి; ఎందుకంటే మీ విడుదల దగ్గరపడుతోంది.” (లూకా 21:28) ఫరో కన్నా శక్తిమంతుడైన గోగు అంటే, దేశాల గుంపు దేవుని ప్రజలమీద దాడి చేసినప్పుడు, యెహోవా తమను కాపాడతాడనే నమ్మకంతో వాళ్లు ఉంటారు. (యెహె. 38:2, 14-16) ఎందుకంటే, యెహోవా మార్పు లేనివాడని వాళ్లకు తెలుసు. తన ప్రజల విషయంలో ఆయన ఒక ప్రేమగల, శ్రద్ధగల రక్షకుడిగా మళ్లీ నిరూపించుకుంటాడు.—యెష. 26:3, 21.

17. (ఎ) యెహోవా తన ప్రజలపట్ల శ్రద్ధ చూపించిన వృత్తాంతాల గురించి ఎందుకు లోతుగా ఆలోచించాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

17 ఈ ఆర్టికల్‌లో పరిశీలించిన కొన్ని ఉదాహరణల్ని బట్టి, యెహోవా తన ప్రజలపట్ల శ్రద్ధ చూపిస్తున్నప్పుడు, వాళ్లను నిర్దేశిస్తున్నప్పుడు, కాపాడుతున్నప్పుడు ఆయన వాళ్లను అర్థంచేసుకుంటాడని, దయ చూపిస్తాడని తెలుసుకున్నాం. ఇలాంటి వృత్తాంతాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు, బహుశా అంతకుముందు గమనించని కొత్త విషయాలేవైనా యెహోవా గురించి నేర్చుకోవచ్చేమో చూడండి. ఆయన అద్భుతమైన లక్షణాల గురించి ఎంతెక్కువగా నేర్చుకుంటే ఆయన మీద మీకున్న ప్రేమ, విశ్వాసం అంతెక్కువగా బలపడతాయి. మన కుటుంబ సభ్యులను, సంఘంలోనివాళ్లను, పరిచర్యలో కలిసేవాళ్లను అర్థంచేసుకోవడం ద్వారా మనం ఏయే విధాలుగా యెహోవాను అనుకరించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

a అప్పుడు సమూయేలుకు 12 ఏళ్లు ఉంటాయని యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ చెప్తున్నాడు.

b హార్‌మెగిద్దోనును తప్పించుకునే వాళ్లలో కొంతమంది అంగవైకల్యంతో, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు కూడా ఉంటారని చెప్పవచ్చు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, “అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని” బాగుచేశాడు. హార్‌మెగిద్దోనును తప్పించుకునే వాళ్లకు చేయబోయే స్వస్థతలకు అవి ముంగుర్తుగా ఉన్నాయి. (మత్త. 9:35) ఎందుకంటే, పునరుత్థానం అయ్యేవాళ్లు పూర్తి ఆరోగ్యంతో లేస్తారు.