అధ్యయన ఆర్టికల్ 37
యెహోవాకు ఎందుకు ఇష్టంగా లోబడాలి? ఎలా లోబడాలి?
“తండ్రికి మనం ఇంకెంత ఎక్కువగా లోబడాలి?”—హెబ్రీ. 12:9.
పాట 9 యెహోవా మన రాజు!
ఈ ఆర్టికల్‌లో . . . a
1. మనం యెహోవాకు ఎందుకు లోబడాలి?
యెహోవా మన సృష్టికర్త కాబట్టి మనం ఆయనకు లోబడాలి. b మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఆయనకు ఉంది. (ప్రక. 4:11) మనం ఆయనకు లోబడడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన పరిపాలనే శ్రేష్ఠమైనది. చరిత్రంతటిలో ఎంతోమంది మనుషులు పరిపాలించారు. కానీ వాళ్లందరి కన్నా ఎక్కువ తెలివి, ప్రేమ, కరుణ, కనికరం ఉన్న పరిపాలకుడు యెహోవాయే.—నిర్గ. 34:6; రోమా. 16:27; 1 యోహా. 4:8.
2. మనం యెహోవాకు లోబడడానికి హెబ్రీయులు 12:9-11 లో ఏ కారణాలు ఉన్నాయి?
2 మనం తనకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే, ఆయన మీద భయంతో కాదుగానీ ఆయన్ని తండ్రిగా భావిస్తూ ప్రేమతోనే లోబడాలని కోరుకుంటున్నాడు. ఆయన “మన ప్రయోజనం కోసమే” శిక్షణ ఇస్తున్నాడు కాబట్టి, మనం ‘తండ్రికి ఇంకా ఎక్కువగా లోబడాలి’ అని పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో చెప్పాడు.—హెబ్రీయులు 12:9-11 చదవండి.
3. (ఎ) మనం యెహోవాకు లోబడుతున్నామని ఎలా చూపిస్తాం? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
3 యెహోవాకు అన్నివిషయాల్లో విధేయత చూపించడానికి చేయగలిగినదంతా చేయడం ద్వారా, మన సొంత తెలివి మీద ఆధారపడాలనే కోరికతో పోరాడడం ద్వారా మనం ఆయనకు లోబడతాం. (సామె. 3:5) యెహోవా అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు, ఆయనకు లోబడడం ఇంకా తేలికౌతుంది. ఎందుకంటే ఆయన చేసే ప్రతీ పనిలో ఆ లక్షణాలు కనిపిస్తాయి. (కీర్త. 145:9) మనం యెహోవా గురించి ఎంతెక్కువ తెలుసుకుంటే, ఆయన్ని అంతెక్కువ ప్రేమిస్తాం. ఆయన మీద మనకు ప్రేమ ఉంటే, ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే పెద్ద నియమాల చిట్టా అవసరంలేదు. ఎందుకంటే మనం యెహోవాలా ఆలోచించడం, భావించడం, అలాగే చెడును అసహ్యించుకోవడం నేర్చుకుంటాం. (కీర్త. 97:10) అయినాసరే, యెహోవాకు లోబడడం మనకు కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? సంఘపెద్దలు, తండ్రులు, తల్లులు అధిపతియైన నెహెమ్యా నుండి, రాజైన దావీదు నుండి, యేసు తల్లియైన మరియ నుండి ఏం నేర్చుకోవచ్చు? అనే ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.
యెహోవాకు లోబడడం ఎందుకు కష్టం కావచ్చు?
4-5. రోమీయులు 7:21-23 ప్రకారం, యెహోవాకు లోబడడం ఎందుకు కష్టంగా ఉండవచ్చు?
4 యెహోవాకు లోబడడం కష్టంగా ఉండడానికి ఒక కారణమేమిటంటే, మనందరికి పాపం అలాగే అపరిపూర్ణత వారసత్వంగా వచ్చాయి. దానివల్ల మనలో తిరుగుబాటు స్వభావం ఉంటుంది. ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరిగి, దేవుడు తినొద్దని చెప్పిన పండును తిని సొంత ప్రమాణాల్ని ఏర్పర్చుకున్నారు. (ఆది. 3:22) వాళ్లలాగే నేడు చాలామంది యెహోవాను నిర్లక్ష్యం చేసి, తప్పొప్పులను సొంతగా నిర్ణయించుకుంటున్నారు.
5 యెహోవాను తెలుసుకొని, ఆయన్ని ప్రేమించేవాళ్లకు కూడా అన్ని విషయాల్లో ఆయనకు లోబడడం కష్టంగా ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలు కూడా ఆ సవాలును ఎదుర్కొన్నాడు. (రోమీయులు 7:21-23 చదవండి.) పౌలులాగే మనం కూడా యెహోవా దృష్టిలో సరైనదాన్ని చేయాలనుకుంటాం. కానీ తప్పు చేయాలనే మన సహజ కోరికతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి.
6-7. యెహోవాకు లోబడడం కష్టమవ్వడానికి మరో కారణం ఏంటి? ఒక ఉదాహరణ చెప్పండి.
6 యెహోవాకు లోబడడం కష్టమవ్వడానికి మరో కారణమేమిటంటే, మనం పెరిగిన ప్రాంతంలోని పద్ధతుల, ఆలోచనల ప్రభావం మనమీద ఉంటుంది. చాలావరకు మనుషుల ఆలోచనలు యెహోవా ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటాయి, కాబట్టి అలా ఆలోచించకుండా ఉండడానికి మనం ఎల్లప్పుడూ కృషిచేయాలి. ఒక్క ఉదాహరణ పరిశీలించండి.
7 కొన్ని ప్రాంతాల్లో, యౌవనులకు ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఒత్తిడి ఉంటుంది. మేరీ c అనే సహోదరి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఆమె యెహోవా గురించి నేర్చుకోకముందు, తన దేశంలోనే పేరుగాంచిన యూనివర్సిటీలో చదువుకుంది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఎక్కువ జీతం, మంచి గౌరవం తెచ్చిపెట్టే ఉద్యోగం చేయమని ఒత్తిడి చేశారు. ఆమె కూడా అలాంటి ఉద్యోగమే చేయాలని కోరుకుంది. కానీ యెహోవా గురించి నేర్చుకుని, ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాక తన లక్ష్యాల్ని మార్చుకుంది. అయినప్పటికీ ఆమె చాలా పోరాడాల్సి వచ్చింది. ఆమె ఇలా చెప్తుంది, “కొన్నిసార్లు బాగా డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చేవి. కానీ వాటివైపు వెళ్తే ఇప్పుడు చేస్తున్నట్టు యెహోవా సేవ చేయలేనని నాకు తెలుసు. నేను పెరిగిన విధానాన్నిబట్టి అలాంటి అవకాశాలను కాదనడం ఇప్పటికీ కష్టంగా అనిపిస్తుంది. యెహోవా సేవకు అడ్డుతగిలే ఏ ఉద్యోగాన్నీ ఒప్పుకోకుండా సహాయం చేయమని ఆయన్ని వేడుకోవాల్సి వస్తుంది.”—మత్త. 6:24.
8. ఇప్పుడు మనం ఏం పరిశీలిస్తాం?
8 యెహోవాకు లోబడడం వల్ల మనకే ప్రయోజనం అని తెలుసుకున్నాం. అయితే ఇతరులపై కొంత అధికారం ఉన్నవాళ్లు అంటే సంఘపెద్దలు, తండ్రులు, తల్లులు దేవునికి లోబడితే ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. మనకున్న అధికారాన్ని యెహోవాను సంతోషపెట్టేలా ఉపయోగించడం ఎలాగో తెలియజేసే కొన్ని బైబిలు ఉదాహరణల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
నెహెమ్యా నుండి సంఘపెద్దలు ఏం నేర్చుకోవచ్చు?
9. నెహెమ్యా ఏ సవాళ్లను ఎదుర్కొన్నాడు?
9 తన ప్రజల్ని కాసే ముఖ్యమైన బాధ్యతను యెహోవా సంఘపెద్దలకు ఇచ్చాడు. (1 పేతు. 5:2) నెహెమ్యా యెహోవా ప్రజలతో ఎలా వ్యవహరించాడో పరిశీలించడం ద్వారా సంఘపెద్దలు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. యూదా అధిపతిగా నెహెమ్యాకు ఎంతో అధికారం ఉండేది. (నెహె. 1:11; 2:7, 8; 5:14) నెహెమ్యాకు ఎదురైన కొన్ని సవాళ్లను ఊహించుకోండి. ప్రజలు యెహోవా ఆలయాన్ని కలుషితం చేశారని, ధర్మశాస్త్రం ప్రకారం లేవీయులకు ఇవ్వాల్సిన ఆర్థిక మద్దతు ఇవ్వట్లేదని నెహెమ్యా తెలుసుకున్నాడు. వీటికితోడు యూదులు విశ్రాంతి రోజును ఆచరించట్లేదు, కొంతమందైతే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ కష్టమైన పరిస్థితితో నెహెమ్యా వ్యవహరించాల్సి ఉంది.—నెహె. 13:4-30.
10. నెహెమ్యా తనకు ఎదురైన సవాళ్లతో ఎలా వ్యవహరించాడు?
10 నెహెమ్యా తనకున్న అధికారాన్ని ఉపయోగించి తన సొంత ప్రమాణాల్ని దేవుని ప్రజల మీద రుద్దలేదు. బదులుగా, నిర్దేశం కోసం యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు, ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాడు. (నెహె. 1:4-10; 13:1-3) అంతేకాదు, యెరూషలేము గోడల్ని తిరిగికట్టే పనిలో వాళ్లతో కలిసి వినయంగా పనిచేశాడు.—నెహె. 4:15.
11. మొదటి థెస్సలొనీకయులు 2:7, 8 ప్రకారం, పెద్దలు సహోదరసహోదరీలతో ఎలా వ్యవహరించాలి?
11 సంఘపెద్దలు నెహెమ్యా ఎదుర్కొన్న లాంటి సమస్యల్నే ఎదుర్కోకపోవచ్చు. కానీ వాళ్లు ఎన్నో విషయాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, తమ సహోదరసహోదరీల ప్రయోజనం కోసం సంఘపెద్దలు కష్టపడి పనిచేస్తారు. తమకున్న అధికారాన్ని బట్టి వాళ్లు గర్వం చూపించరు. బదులుగా, సహోదరసహోదరీలతో మృదువుగా వ్యవహరిస్తారు. (1 థెస్సలొనీకయులు 2:7, 8 చదవండి.) వాళ్లకున్న ప్రేమ, వినయం వాళ్ల మాటల్లో కనిపిస్తాయి. ఆండ్రూ అనే అనుభవంగల సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు, “ఒక సంఘపెద్ద దయగా, స్నేహపూర్వకంగా ఉంటే, ఆయన చెప్పే విషయాలు సహోదరసహోదరీల హృదయాల్ని చేరుకుంటాయి. ఆ లక్షణాల వల్ల సంఘంలోని వాళ్లు పెద్దలకు చక్కగా సహకరించగలుగుతారు.” అనుభవంగల ఇంకో సంఘపెద్ద టోనీ ఇలా చెప్పాడు, “నేను ఎల్లప్పుడూ ఫిలిప్పీయులు 2:3 లో ఉన్న సలహాను పాటిస్తూ, ఇతరుల్ని నా కన్నా గొప్పవాళ్లుగా చూడడానికి ప్రయత్నిస్తాను. దానివల్ల ఇతరుల మీద పెత్తనం చేయకుండా ఉండగలుగుతున్నాను.”
12. పెద్దలు వినయంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
12 యెహోవా వినయస్థుడు, కాబట్టి పెద్దలు కూడా ఆయనలాగే వినయంగా ఉండాలి. యెహోవా విశ్వసర్వాధిపతి అయినప్పటికీ, దీనులను ‘నేలనుండి లేవనెత్తడానికి వంగి చూస్తాడు.’ (కీర్త. 18:35; 113:6, 8) నిజానికి యెహోవా అహంకారుల్ని, గర్విష్ఠుల్ని అసహ్యించుకుంటాడు.—సామె. 16:5.
13. పెద్దలు ఎందుకు తమ “నాలుకను అదుపులో” పెట్టుకోవాలి?
13 యెహోవాకు లోబడే సంఘపెద్ద “నాలుకను అదుపులో” పెట్టుకోవాలి. లేదంటే, తనతో గౌరవం లేనట్టు ప్రవర్తించేవాళ్లతో దురుసుగా మాట్లాడే ప్రమాదం ఉంది. (యాకో. 1:26; గల. 5:14, 15) పైన ప్రస్తావించిన ఆండ్రూ ఇలా చెప్తున్నాడు, “ఒక సహోదరుడు గానీ సహోదరి గానీ నాతో గౌరవం లేనట్టు వ్యవహరిస్తే, వాళ్లతో దురుసుగా మాట్లాడాలనిపిస్తుంది. అయితే, బైబిల్లోని నమ్మకమైన పురుషుల ఉదాహరణల గురించి నేను లోతుగా ఆలోచించాను. దానివల్ల వినయంగా, సాత్వికంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోగలిగాను.” పెద్దలు సంఘంలోని వాళ్లతో అలాగే తోటి పెద్దలతో ప్రేమగా, మంచితనం ఉట్టిపడేలా మాట్లాడడం ద్వారా యెహోవాకు లోబడుతున్నామని చూపిస్తారు.—కొలొ. 4:6.
రాజైన దావీదు నుండి తండ్రులు ఏం నేర్చుకోవచ్చు?
14. తండ్రులకు యెహోవా ఏ బాధ్యతను ఇచ్చాడు? ఆయన వాళ్లనుండి ఏం కోరుకుంటున్నాడు?
14 కుటుంబానికి శిరస్సు తండ్రి అని యెహోవా చెప్తున్నాడు. కాబట్టి తండ్రి తన పిల్లలకు బోధించాలని, వాళ్లకు క్రమశిక్షణ ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 కొరిం. 11:3; ఎఫె. 6:4) కానీ తండ్రికి ఉన్న అధికారం పరిమితమైనది. కుటుంబాల్ని ఏర్పాటు చేసిన యెహోవాకు ఆయన లెక్క అప్పగించాలి. (ఎఫె. 3:14, 15) కాబట్టి తండ్రులు తమ అధికారాన్ని యెహోవాను సంతోషపెట్టేలా ఉపయోగించినప్పుడు ఆయనకు లోబడుతున్నామని చూపిస్తారు. రాజైన దావీదు జీవితాన్ని పరిశీలించడం ద్వారా తండ్రులు ఎంతో నేర్చుకోవచ్చు.
15. తండ్రులకు దావీదు రాజు ఎలా చక్కని ఆదర్శంగా ఉన్నాడు?
15 యెహోవా దావీదును కేవలం తన కుటుంబానికే కాదు పూర్తి ఇశ్రాయేలు జనానికి శిరస్సుగా నియమించాడు. ఒక రాజుగా దావీదుకు చాలా అధికారం ఉండేది. కొన్నిసార్లు ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఘోరమైన తప్పులు చేశాడు. (2 సమూ. 11:14, 15) కానీ దావీదు, యెహోవా ఇచ్చిన క్రమశిక్షణను అంగీకరించడం ద్వారా ఆయనకు లోబడుతున్నానని చూపించాడు. ఆయన ప్రార్థనలో యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించాడు. అంతేకాదు, యెహోవా ఇచ్చిన సలహాను పాటించడానికి శాయశక్తులా కృషిచేశాడు. (కీర్త. 51:1-4) దావీదు ఎంత వినయస్థుడంటే, మంచి సలహా ఎవరిచ్చినా పాటించేవాడు, ఆఖరికి స్త్రీలు ఇచ్చినా సరే. (1 సమూ. 19:11, 12; 25:32, 33) దావీదు తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నాడు, యెహోవా సేవకే తన జీవితంలో మొదటిస్థానం ఇచ్చాడు.
16. దావీదు నుండి తండ్రులు ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
16 రాజైన దావీదు నుండి తండ్రులు నేర్చుకునే కొన్ని పాఠాల్ని పరిశీలించండి: యెహోవా మీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మీ తప్పుల్ని ఒప్పుకొని, బైబిలు ఆధారంగా ఇతరులు ఇచ్చే సలహాను స్వీకరించండి. అలాచేస్తే, మీరు చూపించే వినయాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, యెహోవా ముందు మీ హృదయాన్ని కుమ్మరించండి, మీరు యెహోవా మీద ఎంతగా ఆధారపడుతున్నారో మీ కుటుంబానికి తెలియనివ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా సేవకే మీ జీవితంలో మొదటిస్థానం ఇవ్వండి. (ద్వితీ. 6:6-9) మీ మంచి ఆదర్శమే మీ కుటుంబానికి మీరిచ్చే విలువైన బహుమతి.
మరియ నుండి తల్లులు ఏం నేర్చుకోవచ్చు?
17. తల్లులకు యెహోవా ఏ బాధ్యత ఇచ్చాడు?
17 యెహోవా, కుటుంబంలో తల్లికి ముఖ్యమైన బాధ్యత ఇచ్చాడు. పిల్లల మీద ఆమెకు కూడా కొంత అధికారం ఉంటుంది. (సామె. 6:20) నిజానికి తల్లి మాటల, పనుల ప్రభావం పిల్లలపై జీవితాంతం ఉంటుంది. (సామె. 22:6) యేసు తల్లియైన మరియ నుండి తల్లులు ఏం నేర్చుకోవచ్చో పరిశీలించండి.
18-19. మరియ ఉదాహరణ నుండి తల్లులు ఏం నేర్చుకోవచ్చు?
18 మరియకు లేఖనాలు చాలా బాగా తెలుసు. ఆమె యెహోవాపట్ల ప్రగాఢ గౌరవాన్ని, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఆమె యెహోవాకు ఇష్టంగా లోబడింది, దానివల్ల తన జీవితం పూర్తిగా మారిపోతుందని తెలిసినా అలా లోబడింది.—లూకా 1:35-38, 46-55.
19 తల్లులారా, మీరు మరియను ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు. మొదటిగా, బైబిలు అధ్యయనం ద్వారా, ప్రార్థన ద్వారా యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోండి. రెండోదిగా, యెహోవాను సంతోషపెట్టేలా మీ జీవితంలో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలతో కోపంగా, దురుసుగా మాట్లాడే వాతావరణంలో మీరు పెరిగివుండవచ్చు. దానివల్ల మీరు కూడా మీ పిల్లలతో అలాగే వ్యవహరించడం తప్పేమీ కాదని అనిపించవచ్చు. మీరు యెహోవా ప్రమాణాలు తెలుసుకున్న తర్వాత కూడా మీ పిల్లలతో ప్రశాంతంగా, ఓపిగ్గా వ్యవహరించడం మీకు కష్టంగా ఉండవచ్చు. ముఖ్యంగా, మీరు బాగా అలసిపోయినప్పుడు పిల్లలు మీ మాట వినకపోతే చాలా కోపం రావచ్చు. (ఎఫె. 4:31) అలాంటి సందర్భాల్లో, ముందెప్పటికన్నా ఎక్కువగా ప్రార్థనలో యెహోవాపై ఆధారపడండి. లిడియా అనే తల్లి ఇలా చెప్తుంది, “కొన్నిసార్లు మా అబ్బాయి నా మాట విననప్పుడు, వాడితో కోపంగా మాట్లాడకుండా ఉండడానికి సహాయం చేయమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థించాల్సి వచ్చేది. నేను మాటల్ని మధ్యలోనే ఆపేసి సహాయం చేయమని మౌనంగా యెహోవాకు ప్రార్థించేదాన్ని. ప్రార్థన వల్ల నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.”—కీర్త. 37:5.
20. కొంతమంది తల్లులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటారు? దాన్నెలా అధిగమించవచ్చు?
20 కొంతమంది తల్లులు మరో రకమైన సమస్యను ఎదుర్కోవచ్చు. అదేంటంటే, పిల్లల మీద తమకున్న ప్రేమను ఎలా చూపించాలో తెలియకపోవడం. (తీతు 2:3, 4) తల్లిదండ్రులు పిల్లలతో ఆప్యాయంగా వ్యవహరించని కుటుంబంలో కొంతమంది తల్లులు పెరిగివుండవచ్చు. ఒకవేళ మీరు అలాంటి కుటుంబంలో పెరిగివుంటే, మీ తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను మీరు చేయాల్సిన అవసరంలేదు. యెహోవా ఇష్టానికి లోబడే తల్లి, తన పిల్లల పట్ల ఎలా ప్రేమ చూపించాలో నేర్చుకోవాలి. తన ఆలోచనల్లో, భావాల్లో, ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం ఆమెకు కష్టంగా ఉండవచ్చు. కానీ అది సాధ్యమే. దానివల్ల ఆమె, ఆమె కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారు.
యెహోవాకు లోబడుతూ ఉండండి
21-22. యెషయా 65:13, 14 ప్రకారం, యెహోవాకు లోబడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?
21 యెహోవాకు లోబడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో రాజైన దావీదుకు తెలుసు. ఆయనిలా రాశాడు, “యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.” (కీర్త. 19:8, 11) యెహోవాకు లోబడేవాళ్లకూ, ఆయన ప్రేమపూర్వక సలహాల్ని పట్టించుకోనివాళ్లకూ మధ్య ఉన్న తేడాను నేడు మనం చూడవచ్చు. యెహోవాకు లోబడేవాళ్లు “హృదయానందముచేత కేకలు” వేస్తారు.—యెషయా 65:13, 14 చదవండి.
22 అయితే సంఘపెద్దలు, తండ్రులు, తల్లులు యెహోవాకు ఇష్టంగా లోబడితే, వాళ్ల జీవితాలు మెరుగౌతాయి, వాళ్ల కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి, సంఘం మరింత ఐక్యంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, వాళ్లు యెహోవా హృదయాన్ని సంతోషపెడతారు. (సామె. 27:11) అంతకన్నా ఆనందాన్నిచ్చే విషయం ఇంకేదైనా ఉందా?
పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం
a ఈ ఆర్టికల్‌లో మనం యెహోవాకు ఎందుకు లోబడాలో చర్చించుకుంటాం. అలాగే ఇతరులపై కొంత అధికారం ఉన్నవాళ్లు అంటే సంఘ పెద్దలు, తండ్రులు, తల్లులు అధిపతైన నెహెమ్యా నుండి, రాజైన దావీదు నుండి, యేసు తల్లియైన మరియ నుండి ఏం నేర్చుకోవచ్చో పరిశీలిస్తాం.
b పదాల వివరణ: బలవంతంగా లోబడేవాళ్లు, లోబడడం అనేదాన్ని తప్పుగా చూస్తారు. కానీ దేవుని ప్రజలు ఆయనకు ఇష్టంగా లోబడతారు, కాబట్టి లోబడడాన్ని తప్పుగా చూడరు.
c కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
d చిత్రాల వివరణ: యెరూషలేము గోడల్ని తిరిగి కట్టే పనిలో నెహెమ్యా స్వయంగా సహాయం చేసినట్టే, ఒక సంఘపెద్ద తన కొడుకుతో కలిసి రాజ్యమందిరంలో పనిచేస్తున్నాడు.
e చిత్రాల వివరణ: ఒక తండ్రి తన కుటుంబంతో కలిసి యెహోవాకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాడు.
f చిత్రాల వివరణ: ఒక పిల్లవాడు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుకుంటూ హోమ్‌వర్క్ చేయలేదు. వాళ్ల అమ్మ ఉద్యోగం నుండి అలసిపోయి వచ్చింది, ఆమె కోపం తెచ్చుకోకుండా లేదా దురుసుగా మాట్లాడకుండా ఆ అబ్బాయిని సరిదిద్దుతుంది.