కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 41

విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం

విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం

“మా పరిచర్య ద్వారా మేము రాసిన క్రీస్తు ఉత్తరం మీరే అని స్పష్టమౌతోంది.”—2 కొరిం. 3:3.

పాట 78 ‘దేవుని వాక్యాన్ని బోధించడం’

ఈ ఆర్టికల్‌లో. . . a

ఒక బైబిలు విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు సంఘంలోని వాళ్లందరూ ఎంతో ఆనందిస్తారు (1వ పేరా చూడండి)

1. రెండో కొరింథీయులు 3:1-3 ప్రకారం బైబిలు స్టడీ చేయడం, విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయడం మనకు దొరికిన గొప్ప అవకాశమని ఎలా చెప్పవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

 మీ సంఘంలోని ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీరు సంతోషిస్తారు. (మత్త. 28:19) ఒకవేళ ఆ విద్యార్థికి స్టడీ ఇచ్చింది మీరే అయితే, మీకు ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా! (1 థెస్స. 2:19, 20) బాప్తిస్మం తీసుకుని కొత్తగా శిష్యులైన వాళ్లు తమకు స్టడీ ఇచ్చినవాళ్లకు, అలాగే సంఘమంతటికీ మంచి ‘సిఫారసు ఉత్తరాలుగా’ ఉంటారు.—2 కొరింథీయులు 3:1-3 చదవండి.

2. (ఎ) మనం ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించాలి? ఎందుకు? (బి) బైబిలు స్టడీ అంటే ఏంటి? (అధస్సూచి చూడండి.)

2 సంతోషకరమైన విషయం ఏంటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నెల సగటున కోటి బైబిలు స్టడీలు b చేశాం. అంతేకాదు ఆ నాలుగు సంవత్సరాల్లో, ప్రతీ సంవత్సరం సగటున 2,80,000 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులయ్యారు, యేసుక్రీస్తు శిష్యులయ్యారు. మిగతా లక్షలాది విద్యార్థులు కూడా ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా మనమెలా సహాయం చేయవచ్చు? ప్రజలు క్రీస్తుకు శిష్యులయ్యే అవకాశాన్ని యెహోవా ఇప్పటికీ తెరిచే ఉంచాడు. కాబట్టి వీలైనంత త్వరగా బాప్తిస్మం తీసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం. ఎందుకంటే, కొంచెం సమయమే మిగిలివుంది!—1 కొరిం. 7:29ఎ; 1 పేతు. 4:7.

3. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

3 శిష్యుల్ని చేయడం అత్యవసరమైన పని. కాబట్టి ఎక్కువమంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా మనం ఎలా సహాయం చేయవచ్చు అని పరిపాలక సభ వేర్వేరు బ్రాంచి కార్యాలయాల్ని అడిగింది. ఈ ఆర్టికల్‌లో అలాగే తర్వాతి ఆర్టికల్‌లో అనుభవంగల పయినీర్లు, మిషనరీలు, ప్రాంతీయ పర్యవేక్షకుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూస్తాం. c (సామె. 11:14; 15:22) బైబిలు స్టడీ చక్కగా జరగాలంటే స్టడీ ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు ఏం చేస్తే బాగుంటుందో ఆ సహోదర సహోదరీలు చెప్పారు. బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించడానికి ప్రతీ విద్యార్థి చేయాల్సిన ఐదు పనుల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

ప్రతీవారం స్టడీ చేయండి

ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకోవచ్చా అని విద్యార్థిని అడగండి (4-6 పేరాలు చూడండి)

4. గుమ్మం దగ్గరే చేసే బైబిలు స్టడీల గురించి మనం ఏ విషయం గుర్తుంచుకోవాలి?

4 చాలామంది సహోదర సహోదరీలు గుమ్మం దగ్గరే బైబిలు స్టడీలు చేస్తున్నారు. ఇంటివ్యక్తిలో బైబిలు పట్ల ఆసక్తి కలిగించడానికి అది మంచి ప్రయత్నమే అయినప్పటికీ, ఆ చర్చలు ఎక్కువసేపు ఉండకపోవచ్చు, పైగా ప్రతీవారం జరగకపోవచ్చు. కొంతమంది ప్రచారకులు ఇంటివాళ్ల ఆసక్తిని పెంచడానికి వాళ్ల ఫోన్‌ నంబర్‌ అడిగి, వాళ్లను మళ్లీ కలిసేలోపు ఫోన్‌ చేసి లేదా మెసేజ్‌ చేసి బైబిలు విషయాల్ని క్లుప్తంగా పంచుకుంటారు. అలా చిన్నచిన్న బైబిలు చర్చలు కొన్ని నెలలపాటు కొనసాగుతుండవచ్చు. విద్యార్థి స్టడీ కోసం ఎక్కువ కృషి చేయకుండా, కొంచెం సమయమే ఇస్తుంటే అతను d సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధిస్తాడా? బహుశా సాధించకపోవచ్చు.

5. లూకా 14:27-33 లో యేసు చెప్పిన ఏ విషయం బైబిలు విద్యార్థులకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది?

5 ఒకవ్యక్తి తన శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలో వివరించడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణలో భవనం కట్టాలనుకున్న వ్యక్తి గురించి, యుద్ధానికి వెళ్లాలనుకున్న రాజు గురించి యేసు మాట్లాడాడు. భవనం కట్టాలనుకునే వ్యక్తి దాన్ని పూర్తి చేయాలంటే ‘ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోవాలి.’ అలాగే యుద్ధానికి వెళ్లాలనుకునే రాజు తన సైన్యంతో శత్రువును ఎదుర్కోగలడో లేదో తెలుసుకోవాలంటే, ‘ముందు కూర్చొని సలహా తీసుకోవాలి.’ (లూకా 14:27-33 చదవండి.) అదేవిధంగా, యేసు శిష్యుడు అవ్వాలనుకునే వ్యక్తి ఆయన్ని అనుసరించాలంటే ఏమేం చేయాలో ముందే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతీవారం స్టడీ తీసుకోవడం, అలా ఆలోచించుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తుంది. ఈ విషయంలో మీరు వాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు?

6. గుమ్మం దగ్గర చేసే స్టడీలు ప్రగతి సాధించాలంటే మనం ఏం చేయవచ్చు?

6 గుమ్మం దగ్గర నిలబడి కొద్దిసేపే చేసే బైబిలు స్టడీల్ని కాస్త పొడిగించండి. బహుశా వాళ్లను కలిసిన ప్రతీసారి ఇంకో అదనపు లేఖనాన్ని మీరు చర్చించవచ్చు. అలా ఎక్కువసేపు మాట్లాడడానికి ఇంటివ్యక్తి ఇష్టం చూపించడం మొదలుపెట్టాక, ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకోవచ్చా అని అడగండి. ఇంటివ్యక్తి ఇచ్చే జవాబును బట్టి, బైబిలు స్టడీ అంటే అతనికి ఎంత ఆసక్తి ఉందో తెలిసిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, బైబిలు విషయాల్ని మరింత త్వరగా నేర్చుకునేలా వారానికి రెండుసార్లు స్టడీ తీసుకోవడం ఇష్టమేనా అని మీరు అడగవచ్చు. అయితే వాళ్లు ప్రగతి సాధించాలంటే ప్రతీవారం ఒకట్రెండు సార్లు స్టడీ చేయడం మాత్రమే సరిపోదు.

ప్రతీసారి స్టడీకి సిద్ధపడండి

స్టడీకి మీరు బాగా సిద్ధపడండి, ఎలా సిద్ధపడాలో విద్యార్థికి చూపించండి (7-9 పేరాలు చూడండి)

7. మీరు బైబిలు స్టడీకి వెళ్లే ప్రతీసారి ఎలా సిద్ధపడవచ్చు?

7 బోధకులైన మీరు బైబిలు స్టడీకి వెళ్లే ప్రతీసారి బాగా సిద్ధపడాలి. మీరు ముందుగా సమాచారాన్ని చదివి, లేఖనాల్ని తెరిచి చూడండి. ముఖ్యాంశాల్ని గుర్తించండి. ఆ పాఠం శీర్షిక (టైటిల్‌), ఉపశీర్షికలు (సబ్‌హెడింగ్స్‌), పేరాల ప్రశ్నలు, “చదవండి” అని రాసివున్న లేఖనాలు, చిత్రాలు పరిశీలించండి. ఆ సమాచారానికి సంబంధించిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. తర్వాత మీ విద్యార్థిని మనసులో ఉంచుకుని అతను తేలిగ్గా అర్థంచేసుకుని పాటించగలిగేలా సమాచారాన్ని ఎలా సరళంగా, స్పష్టంగా వివరించవచ్చో ఆలోచించండి.—నెహె. 8:8; సామె. 15:28ఎ.

8. బైబిలు విద్యార్థుల కోసం ప్రార్థించే విషయంలో, కొలొస్సయులు 1:9, 10 లో ఉన్న పౌలు మాటలు మనకెలా సహాయం చేస్తాయి?

8 మీరు సిద్ధపడుతున్నప్పుడు విద్యార్థి గురించి, అతని అవసరాల గురించి యెహోవాకు ప్రార్థించండి. బైబిలు ఉపయోగిస్తూ విద్యార్థి హృదయాన్ని చేరుకునేలా బోధించడానికి మీకు సహాయం చేయమని యెహోవాను అడగండి. (కొలొస్సయులు 1:9, 10 చదవండి.) ఏ విషయాన్ని అర్థంచేసుకోవడం లేదా అంగీకరించడం విద్యార్థికి కష్టంగా ఉండవచ్చో ఆలోచించండి. విద్యార్థి ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయాలన్నదే మీ లక్ష్యం అని గుర్తుంచుకోండి.

9. స్టడీ కోసం సిద్ధపడడాన్ని విద్యార్థికి ఎలా నేర్పించవచ్చు?

9 క్రమంగా చేసే బైబిలు స్టడీ వల్ల విద్యార్థి యెహోవా, యేసు చేసినవాటి పట్ల కృతజ్ఞత పెంచుకుని, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటే మనం సంతోషిస్తాం. (మత్త. 5:3, 6) స్టడీ నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, విద్యార్థి తను నేర్చుకుంటున్న విషయాల మీద మనసుపెట్టాలి. అంటే పాఠాన్ని ముందే చదవడం ద్వారా, అది తనకు ఎలా వర్తిస్తుందో ఆలోచించడం ద్వారా ప్రతీసారి స్టడీ కోసం సిద్ధపడాలి. అది ఎంత ప్రాముఖ్యమో గ్రహించేలా మీ విద్యార్థికి సహాయం చేయండి. స్టడీ కోసం సిద్ధపడడాన్ని విద్యార్థికి ఎలా నేర్పించవచ్చు? మీరు అతనితో కలిసి ఒక పాఠం సిద్ధపడవచ్చు. e ప్రశ్నకు జవాబును ఎలా కనుగొనాలో చెప్పండి, ముఖ్యమైన పదాలకు లేదా మాటలకు అండర్‌లైన్‌ చేసుకోవడం ద్వారా జవాబును ఎలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చో చూపించండి. తర్వాత సొంత మాటల్లో జవాబు చెప్పమనండి. అలా చెప్పినప్పుడు, సమాచారాన్ని అతను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో మీకు తెలుస్తుంది. అయితే ఇంకో పని చేయమని కూడా మీ విద్యార్థిని ప్రోత్సహించవచ్చు.

ప్రతీరోజు యెహోవాతో సంభాషించడం నేర్పించండి

యెహోవాతో ఎలా సంభాషించాలో మీ విద్యార్థికి నేర్పించండి (10-11 పేరాలు చూడండి)

10. ప్రతీరోజు బైబిలు చదవడం ఎందుకు ప్రాముఖ్యం? బైబిలు చదవడం నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి?

10 ప్రగతి సాధించడం కోసం విద్యార్థి ప్రతీవారం స్టడీ తీసుకోవడంతో పాటు, ప్రతీరోజు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అతను యెహోవాతో సంభాషించాలి. ఎలా? యెహోవా చెప్పేది వినడం ద్వారా, యెహోవాతో మాట్లాడడం ద్వారా అతను సంభాషించవచ్చు. ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా అతను దేవుడు చెప్పేది వినవచ్చు. (యెహో. 1:8; కీర్త. 1:1-3) jw.org వెబ్‌సైట్‌లో ఉన్న “బైబిలు చదవడానికి పట్టిక f ఎలా ఉపయోగించాలో అతనికి చూపించండి, దాన్ని ప్రింట్‌ తీసుకోవచ్చు. బైబిలు యెహోవా గురించి ఏం చెప్తుందో, నేర్చుకున్నవాటిని ఎలా పాటించాలో ధ్యానిస్తూ చదివితే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని విద్యార్థిని ప్రోత్సహించండి.—అపొ. 17:11; యాకో. 1:25.

11. సరైన విధంగా ప్రార్థించడం విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు? అతను యెహోవాకు తరచూ ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యం?

11 ప్రతీరోజు ప్రార్థించడం ద్వారా యెహోవాతో మాట్లాడమని మీ విద్యార్థిని ప్రోత్సహించండి. స్టడీ మొదలుపెట్టే ముందు, పూర్తయిన తర్వాత ప్రతీసారి మనస్ఫూర్తిగా అతనితో కలిసి ప్రార్థించండి, అతని కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు విన్నప్పుడు, మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థించాలో అతను తెలుసుకుంటాడు, యేసుక్రీస్తు పేరున యెహోవాకు ప్రార్థించాలని అర్థం చేసుకుంటాడు. (మత్త. 6:9; యోహా. 15:16) ప్రతీరోజు బైబిలు చదవడం (యెహోవా చెప్పేది వినడం), ప్రార్థించడం (యెహోవాతో మాట్లాడడం) వల్ల మీ విద్యార్థి దేవునికి మరింత దగ్గరౌతాడు. (యాకో. 4:8) అంతేకాదు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధిస్తాడు. అయితే అతనికి ఇంకా ఏది సహాయం చేస్తుంది?

యెహోవాకు స్నేహితుడయ్యేలా విద్యార్థికి సహాయం చేయండి

12. విద్యార్థి యెహోవాకు స్నేహితుడయ్యేలా మనం ఎలా సహాయం చేయవచ్చు?

12 బైబిలు స్టడీలో నేర్చుకునే విషయాలు విద్యార్థి మనసునే కాదు హృదయాన్ని కూడా చేరుకోవాలి. ఎందుకంటే చర్య తీసుకునేలా అతన్ని కదిలించేది హృదయమే. ఒకవ్యక్తి కోరికలు, భావాలు, భావోద్వేగాలు హృదయంలోనే పుడతాయి. యేసు చాలా నైపుణ్యవంతంగా బోధించేవాడు. అయితే ఆయన, హృదయాన్ని చేరుకునే విధంగా బోధించాడు కాబట్టే ప్రజలు ఆయన్ని అనుసరించారు. (లూకా 24:15, 27, 32) మీ విద్యార్థి యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా చూడాలి, ఆయనకు దగ్గరవ్వడం సాధ్యమే అని గుర్తించాలి. అంతేకాదు ఆయన్ని తన తండ్రిలా, దేవునిలా, స్నేహితునిలా చూడాలి. (కీర్త. 25:4, 5) కాబట్టి మీరు స్టడీ చేస్తున్నప్పుడు దేవునికున్న చక్కని లక్షణాల్ని నొక్కిచెప్పండి. (నిర్గ. 34:5, 6; 1 పేతు. 5:6, 7) మీరు ఏ అంశం గురించి చర్చిస్తున్నా అలా చేయవచ్చు. యెహోవాకున్న ప్రేమ, దయ, కనికరం వంటి అద్భుతమైన లక్షణాల్ని గుర్తించేలా విద్యార్థికి సహాయం చేయండి. ‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’ అన్నదే “అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది” అని యేసు చెప్పాడు. (మత్త. 22:37, 38) కాబట్టి యెహోవాను ప్రేమించేలా మీ విద్యార్థికి సహాయం చేయండి.

13. యెహోవాకున్న చక్కని లక్షణాల్ని గుర్తించేలా విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చు?

13 యెహోవాను మీరు ఎందుకు ప్రేమిస్తున్నారో అవకాశం దొరికినప్పుడల్లా మీ విద్యార్థికి చెప్పండి. దానివల్ల విద్యార్థి కూడా యెహోవాకు స్నేహితుడవ్వాలని, ఆయన్ని ప్రేమించాలని కోరుకోవచ్చు. (కీర్త. 73:28) ఉదాహరణకు, మీరు చదువుతున్న పేరాలో గానీ లేఖనంలో గానీ యెహోవాకున్న ప్రేమను, తెలివిని, న్యాయాన్ని, లేదా శక్తిని వివరించే విషయం ఏదైనా ఉందా? అది మీ హృదయాన్ని తాకిందా? అయితే దాన్ని మీ విద్యార్థితో పంచుకోండి, మీ పరలోక తండ్రిని మీరు ప్రేమించడానికి గల ఎన్నో కారణాల్లో ఇది కూడా ఒకటని చెప్పండి. బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించడానికి ప్రతీ బైబిలు విద్యార్థి ఇంకా ఏం చేయాలి?

మీటింగ్స్‌కి రమ్మని విద్యార్థిని ప్రోత్సహించండి

వీలైనంత త్వరగా మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టమని విద్యార్థిని ప్రోత్సహించండి! (14-15 పేరాలు చూడండి)

14. మీటింగ్స్‌ గురించి హెబ్రీయులు 10:24, 25 లో ఉన్న ఏ విషయాలు విద్యార్థి ప్రగతి సాధించడానికి సహాయం చేస్తాయి?

14 మన విద్యార్థులు ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకోవాలని మనందరం కోరుకుంటాం. అలా ప్రగతి సాధించాలంటే వాళ్లను మీటింగ్స్‌కి రమ్మని ప్రోత్సహించడం చాలా ప్రాముఖ్యం. స్టడీ మొదలైనప్పటి నుండే మీటింగ్స్‌కి వచ్చే విద్యార్థులు త్వరగా ప్రగతి సాధిస్తారని అనుభవంగల బోధకులు చెప్తున్నారు. (కీర్త. 111:1) స్టడీలో నేర్చుకోలేని ఎన్నో విషయాల్ని మీటింగ్స్‌లో నేర్చుకోవచ్చు అని కొంతమంది బోధకులు తమ విద్యార్థులకు వివరిస్తారు. మీ విద్యార్థితో కలిసి హెబ్రీయులు 10:24, 25 చదవండి. మీటింగ్స్‌కి రావడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని తెలియజేయండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? g వీడియో చూపించండి. మీటింగ్స్‌కి మానకుండా రావాలని నిర్ణయించుకునేలా విద్యార్థికి సహాయం చేయండి.

15. మీటింగ్స్‌కి క్రమంగా వచ్చేలా విద్యార్థిని మనం ఎలా ప్రోత్సహించవచ్చు?

15 మీ విద్యార్థి మీటింగ్స్‌కి ఒక్కసారి కూడా రాకపోతే లేదా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటే మీరేం చేయవచ్చు? ఆ వారం మీటింగ్‌లో మీరు నేర్చుకున్న ఒక విషయాన్ని విద్యార్థితో ఉత్సాహంగా పంచుకోండి. కేవలం మీటింగ్స్‌కి రమ్మని చెప్పి ఊరుకునే బదులు అలాచేస్తే, మీటింగ్స్‌కి రావాలనే కోరిక అతనిలో కలుగుతుంది. ప్రస్తుతం మీటింగ్‌లో చర్చిస్తున్న కావలికోట గానీ, మీటింగ్‌ వర్క్‌బుక్‌ గానీ అతనికి ఇవ్వండి. తర్వాతి మీటింగ్‌లో ఏం చర్చిస్తారో చూపించి, అందులో ఏ విషయం అతనికి ఆసక్తిగా అనిపిస్తుందో అడగండి. అతను మొదటిసారి మీటింగ్‌కి వచ్చినప్పుడే, ఇంతకుముందు ఏ ఆరాధనా స్థలంలో చూడనివాటిని చూస్తాడు. (1 కొరిం. 14:24, 25) అక్కడ అతను తనకు ఆదర్శంగా ఉండేవాళ్లను, ప్రగతి సాధించడానికి సహాయం చేసేవాళ్లను కలుస్తాడు.

16. విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

16 విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు? ప్రతీవారం బైబిలు స్టడీ తీసుకోమని, ప్రతీసారి సిద్ధపడమని చెప్పడం ద్వారా స్టడీ ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తించేలా ప్రతీ విద్యార్థికి సహాయం చేయవచ్చు. యెహోవాతో ప్రతీరోజు సంభాషించమని, ఆయనకు స్నేహితుడవ్వమని, మీటింగ్స్‌కి రమ్మని విద్యార్థిని ప్రోత్సహించవచ్చు. (“ బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించాలంటే విద్యార్థులు ఏం చేయాలి?” బాక్సు చూడండి.) అయితే తర్వాతి ఆర్టికల్‌లో, విద్యార్థి బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధించడానికి బైబిలు బోధకులు చేయాల్సిన మరో ఐదు విషయాల్ని పరిశీలిస్తాం.

పాట 76 మీకు సంతోషంగా ఉంటుందా?

a బోధించడం అంటే “కొత్త పద్ధతిలో లేదా ఇంకో పద్ధతిలో ఆలోచించేలా, భావించేలా, ప్రవర్తించేలా” సహాయం చేయడం అని అర్థం. మన 2020 వార్షిక వచనమైన మత్తయి 28:19, ప్రజలకు బైబిలు స్టడీ చేయడం, అలాగే బాప్తిస్మం తీసుకుని యేసుక్రీస్తు శిష్యులయ్యేలా వాళ్లకు సహాయం చేయడం ఎంత ప్రాముఖ్యమో గుర్తుచేసింది. ఈ అత్యంత ప్రాముఖ్యమైన పనిని ఇంకా మెరుగ్గా ఎలా చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

b పదాల వివరణ: మీరు ఒక వ్యక్తితో క్రమంగా, పద్ధతి ప్రకారం బైబిలు విషయాలు చర్చిస్తుంటే బైబిలు స్టడీ చేస్తున్నట్టే. బైబిలు స్టడీ ఎలా చేస్తారో చూపించిన తర్వాత రెండుసార్లు వాళ్లతో స్టడీ చేసి, ఒకవేళ అది కొనసాగుతుందని నమ్మకం ఉంటే మీరు దాన్ని స్టడీగా రిపోర్టు చేయవచ్చు.

c జూలై 2004 నుండి మే 2005 మన రాజ్య పరిచర్య సంచికల్లో “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం” అనే ఆర్టికల్స్‌ వచ్చాయి. వాటిలోని సలహాలు కూడా ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌లో ఉన్నాయి.

d ఈ ఆర్టికల్‌లో అతను అనే పదం ఉపయోగించినప్పటికీ, అది స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది.

e ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పించడం అనే నాలుగు నిమిషాల వీడియో చూడండి. JW లైబ్రరీలో మీడియా > మా కూటాలు, పరిచర్య > మన నైపుణ్యాలు పెంచుకోవడం కింద చూడండి.

f బైబిలు బోధలు > బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి కింద చూడండి.

g JW లైబ్రరీలో మీడియా > మా కూటాలు, పరిచర్య > పరిచర్య కోసం పనిముట్లు కింద చూడండి.