అధ్యయన ఆర్టికల్ 32
వినయం, అణకువ కలిగి దేవునితో నడవండి
‘అణకువ కలిగి నీ దేవునితో నడువు.’—మీకా 6:8.
పాట 31 దేవునితో నడవండి!
ఈ ఆర్టికల్‌లో . . . a
1. యెహోవాకున్న వినయం గురించి దావీదు ఏమన్నాడు?
యెహోవాకు వినయం ఉందని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పగలం. దావీదు ఇలా అన్నాడు: “నువ్వు నీ రక్షణ డాలును నాకు ఇస్తావు, నీ వినయం నన్ను గొప్పవాణ్ణి చేస్తుంది.” (2 సమూ. 22:36; కీర్త. 18:35) బహుశా, ఇశ్రాయేలు తర్వాతి రాజును అభిషేకించడానికి తన తండ్రి ఇంటికి సమూయేలు ప్రవక్త రావడం దావీదు మనసులో ఉండివుంటుంది. ఎనిమిది మంది అబ్బాయిల్లో దావీదే చిన్నవాడు, అయినా సౌలు తర్వాతి రాజుగా యెహోవా ఆయన్నే ఎంచుకున్నాడు.—1 సమూ. 16:1, 10-13.
2. ఈ ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?
2 ఒక కీర్తనకర్త యెహోవా గురించి చెప్పిన ఈ మాటల్ని దావీదు ఖచ్చితంగా అంగీకరిస్తాడు: ‘ఆయన భూమ్యాకాశాల్ని వంగి చూస్తాడు. దీనుల్ని మట్టిలో నుండి పైకి ఎత్తుతాడు. పేదవాళ్లను పైకి లేపి ప్రముఖులతో పాటు కూర్చోబెడతాడు.’ (కీర్త. 113:6-8) ఈ ఆర్టికల్‌లో యెహోవా ఏయే విధాలుగా వినయం చూపించాడో పరిశీలించి, వినయం గురించి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాం. అంతేకాదు సౌలు రాజు, దానియేలు ప్రవక్త, యేసు ఉదాహరణల నుండి అణకువ గురించి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం.
యెహోవా నుండి ఏం నేర్చుకోవచ్చు?
3. యెహోవా మనతో ఎలా వ్యవహరిస్తాడు? అది ఏం నిరూపిస్తుంది?
3 యెహోవా అపరిపూర్ణ మనుషులతో వ్యవహరించే తీరు ఆయన వినయాన్ని నిరూపిస్తుంది. ఆయన మన ఆరాధనను అంగీకరించడమే కాదు, మనల్ని స్నేహితుల్లా చూస్తున్నాడు. (కీర్త. 25:14) మనం తనకు స్నేహితులవ్వడం కోసం యెహోవాయే చొరవ తీసుకున్నాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు. అలా మనమీద ఎంతో కరుణ, కనికరం చూపించాడు.
4. యెహోవా మనకు ఏం ఇచ్చాడు? ఎందుకు?
4 యెహోవా ఇంకా ఏవిధంగా వినయం చూపించాడో పరిశీలించండి. ఆయన సృష్టికర్త కాబట్టి, ఎలా జీవించాలో నిర్ణయించుకునే సామర్థ్యం లేకుండా మనల్ని సృష్టించగలిగేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు, మనకు స్వేచ్ఛాచిత్తాన్ని ఇచ్చాడు. అల్పులమైన మనం ఆయనకు లోబడడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని గుర్తించి, ఇష్టపూర్వకంగా ప్రేమతో ఆయన్ని సేవించాలన్నది యెహోవా కోరిక. (ద్వితీ. 10:12; యెష. 48:17, 18) యెహోవా ఈ విధంగా వినయం చూపిస్తున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం!
5. యెహోవా ఎలా మనకు వినయం నేర్పిస్తున్నాడు? (ముఖచిత్రం చూడండి.)
5 యెహోవా తన ఆదర్శం ద్వారా మనకు వినయం నేర్పిస్తున్నాడు. ఈ విశ్వంలో అత్యంత తెలివిగల వ్యక్తి యెహోవాయే. అయినప్పటికీ ఆయన వేరేవాళ్ల సలహాల్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన అన్నిటినీ సృష్టించే పనిలో తన కుమారుణ్ణి ఉపయోగించుకున్నాడు. (సామె. 8:27-30; కొలొ. 1:15, 16) యెహోవా సర్వశక్తిమంతుడు, అయినప్పటికీ ఆయన వేరేవాళ్లకు కొంత అధికారం అప్పగించాడు. ఉదాహరణకు, దేవుని రాజ్యానికి రాజుగా ఆయన యేసును నియమించాడు. యేసుతోపాటు పరిపాలించబోయే 1,44,000 మంది మనుషులకు కూడా ఆయన కొంత అధికారం ఇస్తాడు. (లూకా 12:32) రాజుగా, ప్రధానయాజకునిగా సేవచేయడానికి యెహోవా యేసుకు శిక్షణ ఇచ్చాడు. (హెబ్రీ. 5:8, 9) యేసుతోపాటు పరిపాలించబోయే వాళ్లకు కూడా ఆయన శిక్షణ ఇస్తాడు. అయితే ఆయన వాళ్లకు పని అప్పగించినప్పుడు, ప్రతీ చిన్న దానిలో కలగజేసుకోడు. బదులుగా, వాళ్లు తన ఇష్టాన్ని చేస్తారనే నమ్మకం ఉంచుతాడు.—ప్రక. 5:10.
6-7. వేరేవాళ్లకు బాధ్యతలు అప్పగించే విషయంలో మన పరలోక తండ్రి నుండి ఏం నేర్చుకోవచ్చు?
6 ఎవ్వరి సహాయం అవసరం లేని మన పరలోక తండ్రే వేరేవాళ్లకు బాధ్యతల్ని అప్పగిస్తున్నప్పుడు, మనం ఇంకెంతగా అలా చేయాలో కదా! ఉదాహరణకు మీరు కుటుంబ శిరస్సు గానీ సంఘ పెద్ద గానీ అయ్యుంటే, వేరేవాళ్లకు బాధ్యతలు అప్పగించడం ద్వారా, వాళ్లు చేసే ప్రతీ చిన్న దానిలో కలగజేసుకోకుండా ఉండడం ద్వారా యెహోవాను అనుకరించవచ్చు. అలాచేస్తే పనులు ముందుకు సాగుతాయి, మీరు వేరేవాళ్లకు శిక్షణ ఇవ్వగలుగుతారు, వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతారు. (యెష. 41:10) కుటుంబ శిరస్సులు, సంఘ పెద్దలు యెహోవా నుండి ఇంకా ఏం నేర్చుకోవచ్చు?
7 యెహోవా తన కుమారులైన దేవదూతల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడని బైబిలు చెప్తోంది. (1 రాజు. 22:19-22) తల్లిదండ్రులారా, మీరు యెహోవాను ఎలా అనుకరించవచ్చు? సందర్భాన్ని బట్టి, ఏదైనా ఒక పని చేసే విషయంలో మీ పిల్లల అభిప్రాయం అడగండి. సరైనవి అనిపిస్తే, వాళ్ల సలహాల్ని పాటించండి.
8. యెహోవా అబ్రాహాము, శారాలతో ఎలా వ్యవహరించాడు?
8 యెహోవా చూపిస్తున్న ఓర్పును బట్టి కూడా ఆయనకు వినయం ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకు, తన సేవకులు తన నిర్ణయాల్ని గౌరవపూర్వకంగా ప్రశ్నించినప్పుడు ఆయన ఓర్పు చూపిస్తాడు. సొదొమ, గొమొర్రా నగరాల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రాహాము తన ఆందోళనలు తెలియజేస్తుంటే యెహోవా ఓపిగ్గా విన్నాడు. (ఆది. 18:22-33) అబ్రాహాము భార్య అయిన శారాతో యెహోవా ఎలా వ్యవహరించాడో గుర్తుతెచ్చుకోండి. శారా ముసలితనంలో గర్భవతి అవుతుందని యెహోవా వాగ్దానం చేసినప్పుడు ఆమె నవ్వింది. అయితే యెహోవా నొచ్చుకోలేదు, కోపం తెచ్చుకోలేదు. (ఆది. 18:10-14) బదులుగా ఆమెతో గౌరవంగా వ్యవహరించాడు.
9. తల్లిదండ్రులు, సంఘ పెద్దలు యెహోవా నుండి ఏం నేర్చుకోవచ్చు?
9 తల్లిదండ్రులారా, సంఘ పెద్దలారా యెహోవా నుండి మీరేం నేర్చుకోవచ్చు? మీ అధికారం కిందున్న వాళ్లు మీ నిర్ణయాల్ని ప్రశ్నిస్తే మీరేం చేస్తారు? వెంటనే వాళ్లను సరిదిద్దాలని చూస్తారా? లేక వాళ్ల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? తల్లిదండ్రులు, సంఘ పెద్దలు యెహోవాను అనుకరిస్తే కుటుంబాలు, సంఘాలు తప్పకుండా ప్రయోజనం పొందుతాయి. ఇప్పటివరకు మనం యెహోవా నుండి వినయం ఎలా నేర్చుకోవచ్చో పరిశీలించాం. ఇప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని ఉదాహరణల నుండి అణకువ గురించి ఏం నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం.
బైబిల్లో ఉన్న ఉదాహరణల నుండి ఏం నేర్చుకోవచ్చు?
10. మనకు బోధించడానికి యెహోవా ఏం రాయించాడు?
10 “మహాగొప్ప ఉపదేశకుడు” అయిన యెహోవా మనకు బోధించడానికి తన వాక్యమైన బైబిల్లో కొన్ని ఉదాహరణల్ని రాయించాడు. (యెష. 30:20, 21) అణకువ లాంటి మంచి లక్షణాల్ని చూపించిన బైబిలు ఉదాహరణల్ని ధ్యానించడం ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అంతేకాదు ఆ లక్షణాల్ని చూపించని వాళ్లకు ఏం జరిగిందో పరిశీలించడం ద్వారా కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం.—కీర్త. 37:37; 1 కొరిం. 10:11.
11. సౌలు చెడ్డ ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
11 సౌలు రాజుకు ఏం జరిగిందో ఆలోచించండి. మొదట్లో యువకునిగా ఉన్నప్పుడు ఆయన అణకువ చూపించాడు. ఆయన తన పరిమితుల్ని గుర్తించాడు, బరువైన బాధ్యతను స్వీకరించడానికి వెనకాడాడు. (1 సమూ. 9:21; 10:20-22) కానీ రాజైన కొంతకాలానికే సౌలు అహంకారిగా మారాడు. ఒక సందర్భంలో ఆయన సమూయేలు ప్రవక్త కోసం ఎదురుచూస్తున్నప్పుడు సహనం కోల్పోయాడు. తన ప్రజల తరఫున యెహోవా చర్య తీసుకుంటాడని నమ్ముతూ అణకువ చూపించే బదులు, బలి అర్పించే అధికారం తనకు లేకపోయినా సౌలు దహనబలిని అర్పించాడు. దానివల్ల సౌలు దేవుని ఆమోదాన్ని, ఆ తర్వాత రాజరికాన్ని కోల్పోయాడు. (1 సమూ. 13:8-14) సౌలు ఉదాహరణను హెచ్చరికగా తీసుకుని, అహంకారం చూపించకుండా ఉండడం తెలివైన పని.
12. దానియేలు ఎలా అణకువ చూపించాడు?
12 సౌలుకు భిన్నంగా, దానియేలు ప్రవక్త ఎలాంటి మంచి ఆదర్శం ఉంచాడో పరిశీలించండి. దానియేలు జీవితాంతం వినయంగా, అణకువగా యెహోవాను సేవించాడు, ఎల్లప్పుడూ నిర్దేశం కోసం ఆయనపై ఆధారపడ్డాడు. ఉదాహరణకు, నెబుకద్నెజరుకు వచ్చిన కల భావాన్ని తెలియజేయడానికి యెహోవా తనను ఉపయోగించుకున్నప్పుడు, దానియేలు అణకువ చూపిస్తూ ఘనతంతా యెహోవాకే ఇచ్చాడు. అంతేగానీ ఆ ఘనత తనదేనని చెప్పుకోలేదు. (దాని. 2:26-28) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మనం ప్రసంగాలు చాలా బాగా ఇస్తుండవచ్చు లేదా పరిచర్య చాలా చక్కగా చేస్తుండవచ్చు, కానీ ఆ ఘనతంతా యెహోవాకే ఇవ్వడం మర్చిపోకూడదు. యెహోవా సహాయం లేకపోతే మనం ఇవేవీ చేయలేమని ఒప్పుకుంటూ అణకువ చూపించాలి. (ఫిలి. 4:13) అలా చేసినప్పుడు, మనం యేసును కూడా అనుకరించినట్టు అవుతుంది. ఎలా?
13. యోహాను 5:19, 30లో ఉన్న యేసు మాటల నుండి మనం అణకువ గురించి ఏం నేర్చుకోవచ్చు?
13 దేవుని పరిపూర్ణ కుమారుడు అయినప్పటికీ, యేసు యెహోవాపై ఆధారపడ్డాడు. (యోహాను 5:19, 30 చదవండి.) తన పరలోక తండ్రి నుండి అధికారాన్ని లాక్కోవాలని యేసు ఎన్నడూ అనుకోలేదు. యేసు, “దేవుని స్థానాన్ని చేజిక్కించుకోవాలనే, ఆయనతో సమానంగా ఉండాలనే ఆలోచన కూడా రానివ్వలేదు” అని ఫిలిప్పీయులు 2:6 చెప్తుంది. యేసు తన పరిమితుల్ని గుర్తించాడు, తన తండ్రి అధికారాన్ని గౌరవించాడు.
14. యాకోబు యోహానులు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వమని అడిగినప్పుడు యేసు ఏం చెప్పాడు?
14 యాకోబు యోహానులు వాళ్ల అమ్మతో కలిసి, ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇవ్వమని అడిగినప్పుడు యేసు ఏమన్నాడో పరిశీలించండి. యేసు అస్సలు సంకోచించకుండా రాజ్యంలో తన కుడివైపు, ఎడమవైపు ఎవరు కూర్చోవాలో తన పరలోక తండ్రి మాత్రమే నిర్ణయిస్తాడని, అది తన చేతుల్లో లేదని చెప్పాడు. (మత్త. 20:20-23) తన పరిమితుల్ని గుర్తించానని యేసు చూపించాడు. ఆయన అణకువ గలవాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించని ఏ పనినీ ఆయన చేయలేదు. (యోహా. 12:49) యేసు ఉంచిన మంచి ఆదర్శాన్ని మనం ఎలా అనుకరించవచ్చు?
15-16. మొదటి కొరింథీయులు 4:6లో ఉన్న బైబిలు సూత్రాన్ని మనమెలా పాటించవచ్చు?
15 మొదటి కొరింథీయులు 4:6లో ఉన్న సూత్రాన్ని పాటించడం ద్వారా మనం యేసులా అణకువ చూపించవచ్చు. “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకండి” లేదా వాటికి మించి వెళ్లకండి అని ఆ వచనం చెప్తోంది. కాబట్టి, ఎవరైనా సలహా అడిగినప్పుడు మన సొంత అభిప్రాయాలు చెప్పడానికి ప్రయత్నించకూడదు లేదా మన మనసుకు ఏం తోచితే అది చెప్పకూడదు. బదులుగా బైబిల్లో, మన ప్రచురణల్లో ఉన్న సలహాల వైపు వాళ్ల దృష్టి మళ్లించాలి. ఆ విధంగా మన పరిమితుల్ని గుర్తిస్తున్నామని చూపిస్తాం. అంతేకాదు అణకువతో, మన సలహాల కన్నా యెహోవా ఇచ్చే సలహాలే శ్రేష్ఠమైనవని అర్థం చేసుకున్నట్లు చూపిస్తాం.—ప్రక. 15:3, 4.
16 యెహోవాను ఘనపర్చాలనే ఉద్దేశంతోనే కాదు, ఇంకా వేరే కారణాల్ని బట్టి కూడా మనం అణకువ చూపిస్తాం. వినయం, అణకువ వల్ల మనం ఎలా సంతోషంగా ఉండవచ్చో, ఇతరులతో ఎలా మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.
వినయం, అణకువ వల్ల వచ్చే ప్రయోజనాలు
17. వినయం, అణకువ గలవాళ్లు ఎందుకు సంతోషంగా ఉంటారు?
17 వినయం, అణకువ గలవాళ్లు మిగతావాళ్ల కన్నా సంతోషంగా ఉంటారు. ఎందుకు? వాళ్లు తమ పరిమితుల్ని గుర్తిస్తారు కాబట్టి ఇతరులు ఏ సహాయం చేసినా కృతజ్ఞత చూపిస్తారు, సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు, యేసు పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేసిన సందర్భం గురించి ఆలోచించండి. వాళ్లలో ఒకతను మాత్రమే తనను బాగుచేసిన యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగొచ్చాడు. ఈ భయంకరమైన వ్యాధి నుండి తనంతట తాను బయటపడలేనని అతను గుర్తించాడు. వినయం, అణకువ ఉన్న ఆ కుష్ఠురోగి తాను పొందిన సహాయాన్ని బట్టి కృతజ్ఞత చూపించాడు, దేవున్ని మహిమపర్చాడు.—లూకా 17:11-19.
18. ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండడానికి వినయం, అణకువ ఎలా సహాయం చేస్తాయి? (రోమీయులు 12:10)
18 సాధారణంగా వినయం, అణకువ గలవాళ్లు ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుంటారు, సన్నిహిత స్నేహితుల్ని సంపాదించుకుంటారు. ఎందుకు? అలాంటివాళ్లు ఇతరుల్లో మంచి లక్షణాలు ఉన్నాయని గుర్తించడానికి, వాళ్లను నమ్మడానికి ఇష్టపడతారు. వినయం, అణకువ గలవాళ్లు ఇతరులు తమ నియామకాల్లో విజయం సాధిస్తున్నప్పుడు సంతోషిస్తారు. అంతేకాదు వాళ్లను మెచ్చుకోవడానికి, ఘనపర్చడానికి ముందుంటారు.—రోమీయులు 12:10 చదవండి.
19. మనం గర్వాన్ని ఎందుకు తీసేసుకోవాలి?
19 గర్విష్ఠులు మాత్రం ఇతరుల్ని మెచ్చుకోవడానికి ఇష్టపడరు, అందరూ తమనే పొగడాలని కోరుకుంటారు. చాలావరకు వాళ్లు ఇతరులతో తమను పోల్చుకుంటూ, పోటీతత్వాన్ని కలిగిస్తారు. ఏదైనా పనిని వేరేవాళ్లకు ఇస్తే సరిగ్గా చేయలేరని, తామైతేనే సరిగ్గా చేయగలమని గర్విష్ఠులు తరచూ అనుకుంటారు. అంతేకాదు గొప్పవాళ్లం అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు, వేరేవాళ్లు ఏదైనా పనిని తమకన్నా బాగా చేసినప్పుడు అసూయపడతారు. (గల. 5:26) అలాంటివాళ్లు చిరకాల స్నేహితుల్ని సంపాదించుకోలేరు. ఒకవేళ మనలో గర్వం ఉందని గుర్తిస్తే, మన “ఆలోచనా తీరులో మార్పులు” చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థించాలి. అలాచేస్తే ఈ చెడు లక్షణం మనలో పాతుకుపోకుండా ఉంటుంది.—రోమా. 12:2.
20. మనం వినయం, అణకువ ఎందుకు చూపించాలి?
20 యెహోవా మనకు మంచి ఆదర్శం ఉంచుతున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా! తన సేవకులతో వ్యవహరించే విధానంలో ఆయన వినయం కనిపిస్తుంది, మనం ఆయన్ని అనుకరించాలని కోరుకుంటాం. అణకువ చూపిస్తూ దేవునితో నడిచిన బైబిలు ఉదాహరణల్ని అనుకరించాలని కూడా మనం కోరుకుంటాం. మనం యెహోవాకు చెందాల్సిన మహిమను, ఘనతను ఎప్పుడూ ఆయనకే ఇద్దాం. (ప్రక. 4:11) అలాచేస్తే వినయం, అణకువ గలవాళ్లను ఇష్టపడే మన పరలోక తండ్రితో నడవగలుగుతాం.
పాట 123 దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం
a వినయం గల వ్యక్తి ఇతరుల మీద కరుణ, కనికరం చూపిస్తాడు. కాబట్టి యెహోవాకు వినయం ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఆర్టికల్‌లో యెహోవా నుండి వినయం ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుంటాం. సౌలు రాజు, దానియేలు ప్రవక్త, యేసు ఉదాహరణల నుండి అణకువ గురించి ఏం నేర్చుకోవచ్చో కూడా తెలుసుకుంటాం.
b చిత్రాల వివరణ: ఒక సంఘ పెద్ద సమయం తీసుకుని, సంఘ టెరిటరీల్ని చూసుకునే విషయంలో యువ సహోదరునికి శిక్షణ ఇస్తున్నాడు. తర్వాత ఆ పెద్ద అతన్ని నియంత్రించకుండా అతన్ని సొంతగా ఆ పని చేసుకోనిస్తున్నాడు.
c చిత్రాల వివరణ: చర్చిలో జరిగే పెళ్లికి వెళ్లవచ్చా, వెళ్లకూడదా అని ఒక సహోదరి సంఘ పెద్దను సలహా అడుగుతోంది. ఆయన సొంత అభిప్రాయాన్ని చెప్పే బదులు కొన్ని బైబిలు సూత్రాల్ని చర్చిస్తున్నాడు.